వాణి వెళ్ళిపోతోందంటే అతనికి జీవితమంతా శూన్యమే అనిపించసాగింది. వాణి తన ప్రియతముడయిన భర్త వంకా, ప్రేవు తెంచుకుని పుట్టిన బిడ్డవంకా మార్చి మార్చి చూచింది. చివరిసారిగా కన్నీరు తుడుచుకుంది.
"డియర్, స్వప్న ఒకప్పుడు ప్రొఫెసర్ కృష్ణస్వామి ఆదేశాన్ని అనుసరించి ప్రాణాలకు రిస్క్ చేశాను. కాని ఒక బాబుకి తల్లిగా ఇప్పుడా పని చేయలేను. నా బాబు కోసం బతకాలనుకుంటున్నాను బతుకు మీది ఆశతోనే నిన్నూ, బాబునీ వదలి వెళ్ళిపోతున్నాను. గండాలన్ని గడిచాయి అనుకున్న తరవాతనే తిరిగి వస్తాను. అప్పుడు నా బిడ్డను నాకు క్షేమంగా తిరిగి ఇవ్వగలవని ఆశిస్తాను. జీవితం మీద దురాశను పెంచుకున్న ఈ దీనురాలిని మన్నించు, స్వప్నా!" అంటూ కటినాత్మురాలివలె భర్తనూ, బిడ్డనూ వదలి తిరిగి చూడనైనా చూడకుండా గడప దాటి వెళ్ళిపోయింది వాణి.
ఎప్పటిలా ఆమె నిర్ణయాన్ని గౌరవించుతూ ఆమెను అనుసరించారు కేశవరావుగారు.
స్వప్న తన గుండెలో సగభాగాన్ని ఎవరో దొంగిలించుకుని పోతున్నట్లుగా నిస్సహాయుడై చూడసాగాడు.
చిన్నారి కృష్ణుడు తిరిగి ఏడవటం ప్రారంభించాడు.
6
"ఏడ్చే బిడ్డను కూడా వదలి వచ్చావు, బేబీ! నీ నిర్ణయాన్ని నేను ఎన్నడూ కాదనలేదు. కాని ఈసారి నా గుండె కోతను దాచుకోలేకపోతున్నాను. ఎందుకిలా చేస్తున్నావమ్మా?" అని అడిగారు కేశవరావుగారు.
వాణి చివ్వున తల ఎత్తి చూచింది.
ఎన్నడూ ఆయన అలా ప్రశ్నించలేదు. చిన్నతనం నించి ఆడింది ఆటగా, పాడింది పాటగా జరిగిపోయింది. ఎప్పుడే పని చేసినా 'ఎందుకు' అన్న ప్రశ్న తండ్రి నోటివెంట రాలేదు. అలాగని వారిచ్చిన చనువును తాను దుర్వినియోగ పరచుకున్నది కూడా లేదు. తాను స్వతంత్రించి చేసిన ప్రతి పనిలోనూ తండ్రి నించి ప్రశంసలే పొందగలిగిందామె.
ప్రప్రధమంగా అందుకు భిన్నంగా జరిగింది ఇప్పుడు. అంటే, పెళ్లి అయాక, బిడ్డ కలిగాక కూడా తాను ఇలా సమస్యల వలయంలో చిక్కి కనిపించినందువల్ల వారి హృదయం ఎంతగా క్షోభ పడిందో ఆమెకు అర్ధమైంది.
ఒకప్పుడయితే ఒక ఆశయంతో, ఉత్సాహంతో, ప్రొఫెసర్ కృష్ణస్వామి ఇచ్చిన ప్రోత్సాహంతో అంతా కావాలని చేసింది తాను కావాలనే కల్పించుకుంది. ఆ సమస్యలు అప్పుడు సమస్యలుగా తనకు కనిపించలేదు. కర్తవ్యదీక్ష ఒక్కటే కనుల ముందు నిలిచింది.
ఇప్పుడు అలా కాదు. చిన్నికృష్ణుడు జ్ఞాపకాలూ, అతడిని పెంచి పెద్దగా, ప్రయోజకునిగా తీర్చిదిద్దాలన్న తాపత్రయం తాలూకు ఆలోచనలూ గుండె కోత విధిస్తున్నాయి. మనసుని పట్టి లాగుతున్నాయి.
ఇలాంటి సమస్యలలో అప్పుడయితే కావాలని తాను తల దూర్చింది. కాని ఇప్పుడలా చేయాలని లేదు. ఈ సమస్యలన్నింటికీ దూరంగా పారిపోయి బిడ్డను చూచుకోవాలన్న ఆరాటమే కలుగుతూంది.
కాని ఆ నాడు వైజ్ఞానికపు వెలుగు లోకానికి రహదారులు నిర్మించాలన్న తాపత్రయంలో తాను చేసిన సాహసాల తాలూకు ఫలితాంశాలు ఇప్పటికీ తనను వెన్నాడుతున్నాయి. భవిష్యత్తులోకి సైతం నీడలా అనుసరించి వస్తున్నాయి. ఇప్పుడీ స్థితి అనివార్యం!
శ్వేతనాగు పగ ఇంకా చల్లారలేదు. తన అంతం చూడనిదే చల్లారుతుందన్న ఆశ కూడా లేదు. అందునించి బయటపడవేయగలిగిన ఏకైక వ్యక్తి యోగి ఇచ్చాపూర్వకంగా తనువు చాలించినాడు. వాసుకి తిరిగి అటువంటి శక్తుల్ని పొందేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అవి ఆమెకు ఎప్పటికి లభిస్తాయో తెలియదు. "అంతదాకా నిన్ను నీవే రక్షించుకోవాలి" అని ఆదేశించిందామె.
తాళపత్రాలున్న వెండి పేటికలోకి శ్వేతనాగు ఎలా రాగలిగిందో ఎంత ఆలోచించినా అర్ధం కాదు. ఫలితాంశం ఏమైనా కావచ్చు!
అందుకోసం తాను పారిపోయి రాలేదు. భర్త, బిడ్డ తన కర్తవ్య నిష్టను సడలిస్తున్నారు. వారితో ఉంటూ, అనుక్షణం వారిని చూస్తూ, వారి గురించి అనవరతం ఆలోచిస్తూ ఉంటే, కర్తవ్యాన్ని అనుసరించి పరుగులు తీసే శక్తి తనకు ఉండదు.
అందుకే మనస్సుని రాయిగా మార్చుకుని దూరంగా వచ్చింది తాను. ఈ మాత్రంగా కల్పించుకున్న కనుచాటు తన మనో నిబ్బరాన్ని కాపాడగలిగితే చాలు!
ఇంక అనుక్షణం శ్వేతనాగుతో పోరాటం అనివార్యం! అందుకు ఇప్పుడు భర్తకు, బిడ్డకు దూరంగా తాను సంసిద్దురాలు అయి ఉంది.
కాని ఈ విషయం తండ్రికి తెలిస్తే ఆయన తట్టుకోలేరు. మరి వచ్చిన కారణం అంతగా ఆవేదన పడుతున్న ఆయనకు ఎలా వివరించాలి?
"డాడి! నా చిన్నతనం నించీ ఇది ఎందుకు చేస్తున్నావని ఏ విషయంలోనూ మీరు ప్రశ్నించలేదు. ఈ వేళ అలా అడిగారంటే మీ హృదయం ఎంతగా గాయపడిందో నాకు అర్ధమైంది. నా నించి మీరు ఆశించింది నేను ఆనందంగా ఉన్నట్లు కనిపించటమే! కాని అతి స్వల్పమైన ఆ కోరిక కూడా సఫలం చేయకుండా మిమ్మల్ని బాధపెడుతున్న మీ బేబీ ఇప్పుడు అతి దీనురాలు!
"మీరు మరొకలా భావించకండి ఇదంతా సుఖాంతమవుతుందనే అనుకుంటున్నాను. నేను కూడా ఇప్పుడు బిడ్డ తల్లిని అయాను కాబట్టి, బిడ్డల యోగక్షేమాలపట్ల కన్నవారి కడుపుకోత ఎలాంటిదో అర్ధం చేసుకోగలుగుతున్నాను.
"అయితే ఆలోచించకుండా నేనీ పని చేయలేదు. కర్తవ్యం కోసం గుండెను రాయిలా మార్చుకున్నాను. నన్ను క్షమించి ఆ కర్తవ్యం ఏమిటని మాత్రం అడగకండి. కొద్దిరోజులు గడిస్తే అన్నీ మీకే విశదమవుతాయి. మీరు రెండుపూటలా వెళ్ళి బాబును చూచి వస్తూ ఉండండి.
"నేను అడిగేంతవరకూ నా బాబును గురించి నాకేమి తెలియనివ్వకండి. అతడు నా కంటపడకుండా మీరే చూచుకోవాలి" అన్నదామె కఠినంగా.