Previous Page Next Page 
నవ్వితే నవ్ రత్నాలు - 1 పేజి 14

    అంతే......
    డాక్టరు మొహం సీరియస్ గా మారిపోయింది.
    ఓసారి క్లినిక్ సీలింగ్ వంక సీరియస్ గా చూసి, ముక్కుపొంగించి "డ్రగ్ రియాక్షన్...మీ డిప్పకాయ్ డ్రగ్స్ రియాక్షన్ వల్ల వాచింది.మీరు వాడ్తున్న మాత్రల్లో ఏదో మీకు పడ్లేదు...ప్రస్తుతం అవన్ని మానేయండి...వేరే మాత్రలు రాసిస్తారు... రియాక్షన్ తగ్గడానికి ఇంజక్షన్ ఇస్తాను..." అలాగేనన్నట్టు డిప్పకాయ్ ని బరువుగా ఊపాడు జానకిరాం.
    డాక్టర్ చేత ఇంజక్షను చేయించుకుని అతను రాసిచ్చిన మాత్రలు కొనుక్కుని ఇంటికి వెళ్లాడు.
    రాత్రి మాత్రలు వేస్కుని పడుకున్నాడు.
    మర్నాడు ఉదయం...
    "ఏంటి?...చేతులకు గ్లవ్స్ వేస్కున్నారు.నాతో బాక్సింగ్ చేద్దామనా?... పిచ్చి కళలు పోయారంటే పీకి పాకం పట్టేస్తా..."అంది మాణిక్యం.
    జానకిరాం లబలబ నోరు కొట్టుకున్నాడు.
    "హయ్యోరాత!...నేను చేతులకి గ్లవ్స్ ఎక్కడ వేస్కున్ననే బాబూ?!"
    "హా!...మరి మీ అరచేతులేంటి అంతలావుగా ఉన్నాయ్?" కళ్లు పెద్దవి చేసి అడిగింది మాణిక్యం.
    జానకిరాం తన చేతుల వంక చూస్కుని ఘొల్లుమన్నాడు."ఓర్నాయనోవ్... నా వేళ్లేంటి రూళ్ల కర్రల్లా ఇట్టా లావుగా ఉన్నాయ్!!..."
    "ఏంపాడో ఏంటో...డిప్పవాపు తగ్గి చేతులు లావుగా వాచిపోయాయ్... మళ్లీ రియాక్షన్ ఏటో?..." అంది మాణిక్యం.
    జానకిరాం మళ్లీ డాక్టర్ దగ్గరికి పరుగు తీశాడు. కానీ ఆ క్లినిక్ మూసి ఉంది. డాక్టర్ ఎందుకనో ఆవేళ క్లినిక్ ఓపెన్ చెయ్యలేదు. అంచేత కాలనీలోనే మరోడాక్టర్ దగ్గరికి వెళ్లాడు జానకిరాం.
    "ఇది సెంట్ పర్సెంట్ డ్రగ్ రియాక్షనండీ...అయినా ఆ డాక్టర్ దగ్గరికి ఎందుకెళ్లారండీ బాబూ...అతనికేం చేతకాదు..." అన్నాడు మరో డాక్టరు.
    మళ్లీ రియాక్షన్ గురించి ఆ డాక్టరు దగ్గర ఇంజక్షన్ తీస్కుని అతను రాసిన మందులు కొనుక్కుని ఇంటికెళ్లాడు.
    ఆ మర్నాడు అతని చేతి వాపులు తగ్గాయిగానీ కాళ్లనుండీ, చేతులనుండీ పొలుసులాగా చర్మం ఊడిరాసాగింది.
    జానకిరాం లబలబమంటూ డాక్టర్ దగ్గరికి పరుగు తీశాడు.
    "ఏంటండోయ్...మీది నాగవంశమా?...పాములా కుబుసం విడుస్తున్నారు?..." చర్మాన్ని పరీక్షగా చూసి పకపకా నవ్వాడు డాక్టర్.
    "చాల్లెండి సార్ సరసం...నిన్న మీర్రాసిన మందులు వాడితే ఇట్టాగయింది... ఆ డాక్టర్ దగ్గరికెళ్లొద్దని అన్నారు.మీర్రాసిన మందుల వల్ల కూడా ఇలాగయ్యిందేం? అన్నాడు జానకిరాం ఏడుపు మొహం పెడ్తూ.
    దాంతో ఆ డాక్టర్ ఇంతెత్తున లేచాడు"నా వైద్యానికే వంకలు పెడ్తావా అని?..."నువ్వేం కల్తీ మందులు కొనుక్కుని మింగావో ఏమో!" అన్నాడు.
    జానకిరాం మందుల షాపులో ఎంక్వయిరీ చేశాడు..."సార్...సార్... మరేమో మీ షాపులో కల్తీ మందులు గానీ అమ్ముతారా?" అని.
    వెంటనే షాపువాడు జానకిరాం మెడపట్టి గెంటించేశాడు.
    "అయినా ప్రతి చిన్నదానికీ అడ్డమైన మందులూ మిమ్మల్ని ఎవడు మింగమన్నాడూ?"అంటూ అతను యింటికి వేళ్లింతర్వాత మాణిక్యం బుగ్గమీద పొడిచింది.
    అది మొదలు అతను చీటికీ మాటికీ, ప్రతి చిన్నదానికీ మందుల్ని మింగడం మానేశాడు.
                             *  *  *           

 Previous Page Next Page