Previous Page Next Page 
డి.కామేశ్వరి కథలు పేజి 14


    'ఎక్కడికో చెప్పు. వీలవడానికేముంది? ఆదివారమేగా తప్పకుండా వెళదాం. ఎక్కడికి తీసికెళతావు' కుతూహలంగా చూశారు సాంబశివరావు.
    'రేపటి వరకు నన్నేం అడక్కు, మిగతా విషయాలుంటే చెప్పు' రామ్మూర్తి నవ్వుతూ అన్నారు. లోపల్నించి కమలమ్మ కాఫీ తెచ్చి ఇచ్చి 'బాగున్నారా.. చాలా రోజులైంది వచ్చి' అంటూ నవ్వుతూ పలకరించింది.
    'ఏవో పనులమ్మా ఇంకో నాలుగు నెలల్లో మావాడి జాబితాలోకి చేరతాను గదా. అప్పుడు ఇంక తీరికే అంతా. అవును ఏమిటి మీ ఆయన గారేదో గొప్ప నిర్ణయం తీసుకున్నారట. నీకు చెప్పే చేశాడా?' సాంబశివరావు నవ్వుతూ అడిగాడు.
    కమలమ్మ భర్త వంక అర్థవంతంగా చూసింది. ఆయన చిద్విలాసంగా నవ్వుతూ కూర్చున్నాడు.
    'గొప్ప నిర్ణయం అని మేం అనుకోలేదు, కానీ తెలివైన నిర్ణయం అని మాకనిపించింది' కమలమ్మ గడుసుగా అంది.
    'ఓహో.. అయితే ఇద్దరూ కలిసి చేసిన నిర్ణయమేనన్నమాట. మా వాడి సస్పెన్సు రేపటి దాకా పొడిగించాడు. సరే వేచి చూడక తప్పదు గదా' కాఫీ కప్పు కింద పెట్టి లేచి నిల్చున్నాడు సాంబశివరావు.

                                                                         *    *    *    *    *

    ఉదయం తొమ్మిది గంటలకు రామకృష్ణ మఠం నుంచి బస్సు బయలుదేరింది. బస్సు ఎక్కాక 'రామకృష్ణాశ్రమం' నడుపుతున్న ఓల్డ్ ఏజ్ హోమ్ కి తీసుకెళుతున్నావ్?' సాంబశివరావు అడిగాడు.
    'ఓ నీకు తెలుసన్నమాట. కీసర గుట్ట దగ్గర వీళ్ళదో ఆశ్రమం ఉంది. ప్రతి ఆదివారం ఇక్కడ నుంచి బస్సు వెళుతుంది. నీకు ఆ ప్రదేశం చూపిస్తేనే తీసుకున్న నిర్ణయం సరైందేనని అంగీకరిస్తావు. ఓసారి నీకు అదంతా చూపించాలి రమ్మని పిలుద్దామనుకునేలోగానే మావాడు ఈ కబురు నీకు చేరేసాడు'.
    'ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు?'
    'మాకు ప్రశాంతంగా, హాయిగా ఏ బాదర బంది లేకుండా ఉండాలనిపించింది. పిల్లల ఇళ్ళలో ఉండి వాళ్ళని ఇబ్బంది పెడుతూ మనం ఇబ్బందిగా ఎందుకు బతకడం. చూడు సాంబశివం ప్రతి వారికీ చిన్నో, పెద్దో ఏదో తలదాచుకునే కొంప ఉండాలి. నా దురదృష్టం కొద్దీ రిటైరయ్యేలోగా చిన్న ఇల్లైనా కొనలేకపోయాను'.
    'మన మధ్యతరగతి సంసారులకి సొంత ఇల్లూ అందని ఆశ అవుతుంది అనుకో, కానీ మరీ ఇలా ఎవరూ లేని వాళ్ళలా మీరిక్కడ ఉండడం మీ అబ్బాయికి ఇష్టం లేనట్టుంది నా దగ్గర బాధపడ్డాడు' అన్నాడు సాంబశివం.
    రామ్మూర్తిగారు అదోలా నవ్వారు. 'లోకం ఏమనుకుంటోందన్న బాధ ఓవైపు, మరో వైపు మేం ఇంట్లోంచి వెళితే ఎదుర్కోవలసిన ఇబ్బందులు తల్చుకుని భయపడుతున్నాడులే. తల్లిదండ్రుల మీద ప్రేమ, భక్తి కంటే స్వార్థం ఎక్కువైంది ఈనాటి పిల్లల్లో. ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయడం ఆరంభించాక ఇంట్లో పెద్దవాళ్ళకి ఇంపార్టెన్స్ పెరిగిందీమధ్య. ఇల్లు కాపలా, పిల్లల సంరక్షణ, అమ్మమ్మలు, నాయనమ్మలుంటే ఇంటిపని బాధ్యత, తాత ఊరికే ఉన్నాడని పిల్లల చదువుల బాధ్యత ఇన్ని లాభాలున్నాయి గదా - అన్నింటినీ మించి పిల్లలని వదిలి నిశ్చింతగా ఉద్యోగాలు చేసుకోవచ్చు ఆడ, మగా. అంచేత మనవాళ్ళకి పెద్దవాళ్ళ విలువ తెలిసి వచ్చిందిలే' నవ్వుతూ అన్నారు రామ్మూర్తి.
    'మరి మన విలువ గుర్తించి నిర్లక్ష్యం చేయనప్పుడు మరి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు.'
    'చూడు సాంబశివరావూ... మాకూ ఈ రెండు గదుల కొంప జైలు ఖానాలా అనిపిస్తుందయ్యా వాళ్ళకో గది, పిల్లలకో గది పోతే హాలు మాకు. కూర్చున్నా, చదువుకున్నా, పడుకున్నా ఆ గది ఒక్కటే, అపార్ట్ మెంట్ లైఫ్ లో ఇమడలేక పోతున్నా. ఇదివరకు రోజుల్లో వయసు పైబడ్డ వాళ్ళు కాస్త కాళ్ళు చాపుకుని వీధి వరండాలో పడక కుర్చీలో కూర్చుని వచ్చి పోయే వాళ్ళతో కబుర్లు, పేపరు చదవడం, మొక్కల పని చేస్తూ, నీళ్ళు పోస్తూ ఇటు అటూ తిరిగి కాలక్షేపం చేసేవారు. ఆడవాళ్ళంటే మండువాలు, వెనక వరండాలుండేవి. నలుగురూ కలిసి కబుర్లాడుకుంటూ పనులు చేసుకునేవారు. అప్పడాలు ఒత్తుకుంటూ, పప్పులు బాగు చేసుకుంటూ, ఏం లేకపోతే వామన గుంటలు ఆడుతూ, నారాయణ, భాగవతాలు చదువుకునే వారు. మా చిన్నప్పుడు ఇంటి నిండా జనం ఉండేవారు. ఆ జనం ఫ్రీగా తిరిగే ఇళ్ళు, పెరళ్ళు వుండేవి. మనవలతో ఆడుకుంటూ, కోడళ్ళు పని చేసుకుంటే చంటి పిల్లలని ఆడించేవారు అమ్మమ్మలు, మామ్మలు, తాతలు పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పేవారు.
    ఇప్పుడు ఇల్లు చిన్నది. హాలులో మా ఇద్దరికీ రెండు దివాన్లు రాత్రికి పడకలవుతాయి. పిల్లలు చదువుకోవాలి అంటూ వాళ్ళకి గది ఇచ్చారు. రోజంతా హాలులో కాస్త కాలు చాపుకు కింద కూర్చునే చోటు లేదు. వాళ్ళ స్నేహితులొస్తే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. అన్నింటి కంటే మా ఆవిడ పాపం చాకిరీకి తట్టుకోలేకపోతుందయ్యా. పెళ్ళయిన కొత్తలో అత్త, ఆడబిడ్డలు, మరుదులకి చాకిరీ, పిల్లలు పుట్టాక వాళ్ళకి, ఇప్పుడు మనవలకి, పాపం అనిపిస్తుంది. కోడలు 8 గంటలకల్లా వెళ్ళాలి. ఉదయం ఆ అమ్మాయి కాస్త సాయం చేస్తుందనుకో కానీ మొత్తం బాధ్యత, భారం ఈవిడ మీద పడుతుంది. పనిమనిషి చేత పనులు చేయించడం, అది రాకపోతే తను చేసుకోవడం, వంట - వార్పు, మధ్యాహ్నం కాస్త నడుం వాల్చేసరికి స్కూలు నుండి పిల్లలు వస్తారు. ఏడైతే గానీ కోడలు రాదు. మళ్లీ సాయంత్రం వంట.. ఇది ఆవిడ సంసారంలా బాధ్యత నెత్తినపడింది. పాపం ఆవిడకింకెప్పుడు విశ్రాంతి...?'
    'అవుననుకో... పిల్లలకి మన ఆసరా. వాళ్ళు మనకు అండ గదా.'
    'ఆ.. వినడానికి బాగానే ఉంటుందయ్యా. మన పిల్లలని మనం పెంచుకున్నాం అంటే అప్పుడు ఓపిక వేరు. అంతేకాక కొట్టుకున్నా తిట్టుకున్నా మనిష్టం. అంతేకాక రిటైరయ్యాక బాధ్యతలుండవు. హాయిగా సినిమాలకి, షికార్లకి తిరగొచ్చు. మంచి పాట కచేరీకో, డ్యాన్సు పోగ్రాంకో, గుళ్ళు గోపురాలు చూడడానికి ఊర్లు వెళ్ళాలని ప్లాన్లు. ఏదీ కుదరడమే లేదు. ఇల్లు బంధిఖానా అయింది. పొద్దుట పని, సాయంత్రం పిల్లలొచ్చే వేళ, పిల్లలొచ్చాక వంటరిగా వదిలి ఎలా వెడతాం. కొడుకు కోడలు వచ్చేసరికి రాత్రవుతుంది. అంత రాత్రి ఇంకెక్కడికి వెళ్ళేది. పిల్లలకి సెలవులప్పుడు వెళ్ళండి అంటాడు మావాడు. ఆ రోజు మాకంటే వాళ్ళే ముందే ఏదో ప్లాన్ చేసుకుంటారు తిరగడానికి. పోనీ అప్పుడైనా మమ్మల్ని కలుపుకోరు. నేనేం నేరంగా అనడం లేదు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళాలనుకుంటారు. అయ్యో, అమ్మా, నాన్న అనుకోరుగా. ఎంతకని పుస్తకాలు... ఎంతకని టీవి.. ఆ టీవీ కూడా పిల్లలున్నంత సేపు పిల్లల చదువుకుంటున్నారు డిస్ట్రబెన్స్ అంటారు. ఉదయం ఎవరు లేనప్పుడు చూడాలి. మంచి సీరియల్స్ మధ్యాహ్నం, రాత్రుళ్ళు గదా వస్తాయి. మా ఆవిడ పాపం కొట్టుకుంటుంది టీవీ కోసం. పెట్టే సరికల్లా 'సౌండన్నా తీసేయండి పిల్లలు చదవరు' అంటుంది కోడలు. శని, ఆదివారాలొచ్చాయి అంటే పిల్లల కార్టూన్లు పెట్టుకుంటూ మమ్మల్ని అసలు చూడనివ్వరు గదా. చూడు, ఇవన్నీ చెబితే చిన్న విషయాల్లాగే ఉంటాయి. అనుభవించిన వారికే అర్థం అవుతాయి.

 Previous Page Next Page