మనిషి ఖరీదు
జనరల్ ఆస్పత్రి ప్రహరీగోడకి ఆనుకుని వున్న ఆ పెద్ద మర్రిచెట్టు, ఊడలు దిగిన ఆ మహావృక్షం ఆ అమావాస్య చీకటి రాత్రిలో జుత్తు విరబోసుకున్న దెయ్యంలా వుంది. ఝాంమని కొమ్మలగుండా దూసుకువచ్చే గాలి శబ్దం వికటాట్టహాసం చేస్తున్నట్టుంది. ఎండుటాకులు చేసే గలగల శబ్దం దెయ్యాలు గుసగుసల్లా వుంది. ఆ చెట్టుక్రింద బీద బిక్కి పండుకోడానికి చేస్తున్న చితుకుల మంటలు కొరివిదెయ్యాల్లా అగుపిస్తున్నాయి. ఆ పొయ్యిలమీద ఉడుకుతున్న అన్నాల కుతకుతలు దెయ్యాలు నిట్టూరుస్తున్నట్టు వుంది.
ఆ చెట్టు కింద జుత్తు విరబోసుకుని కూర్చున్న ముత్యాలు నల్లని శరీరం ఆ మంటలు ఎరుపులో కాలిన ఇనుములా మెరుస్తూంది. ఏడ్చిఏడ్చి ఎర్రబడిన ఆమె కళ్లు రెండు నిప్పుకణికల్లా మెరుస్తున్నాయి. అక్కడ మండుతున్న పొయ్యిలు లాగే ఆమె గుండెలు మండుతున్నాయి. అక్కడుడుకుతున్న అన్నాల మాదిరి ఆమె హృదయం కుతకుతలాడుతూంది. ఆమె ప్రక్కన నల్లటి మాసిన గుడ్డపీలికల మీద నల్లటి బల్లి గోడని కరుచుకున్నట్టు బోర్లపడుకునుంది చంటిపిల్ల. ఆ పిల్లకి కాస్త దూరంలో చీకేసిన తాటిటెంకలాంటి తల, పుల్లలు తెచ్చి కాళ్ళు చేతులు అంటించినట్లున్న రెండేళ్ళ పిల్లాడు గీ అంటూ ఏడవడానికి కూడా ఓపిక లేనట్టు సన్నగా మూలుగుతున్నాడు. ముత్యాలు తన కళ్ళనించి జారే నీటిని తుడుచుకోడం లేదు. ఏడుస్తున్న పిల్లాడి కళ్ళనీళ్ళని తుడవడంలేదు. ఆమె ఎటూ చూడ్డంలేదు. ఎటో చూస్తూంది శూన్యంలోకి.
ఆ చెట్టుక్రింద మిగతావాళ్ళు ముత్యాలునే చూస్తూ గుసగుసలాడుకుంటున్నారు. ఏటొసే అప్పా.... ఆ ముత్యాలలా కూకుండిపోయింది పొద్దున్నకడనించి.... అప్పాయమ్మ నరసాయమ్మతో అంది.
"పెద్దదుఃఖం ఎల్లబోస్తంది సేసిన ఎదవపని సేసేసి ఏడుపెందుకో... వగలు పోతూంది. ఎవరికి తెలియదు దీని సంగతి మెటికలు విరిచింది సింహాచలం"
"అవునప్పా, నాకు తెలవక అడుగుతా దీని సేతులు ఎలా వచ్చాయప్పా మొగుడ్ని అమ్ముకోడానికి!.... ఎంత డబ్బు నేకపోయినా డబ్బుకి యింతపని సేస్తామా! ఓలమ్మో.... యిది ఆడ కూతురు గాదు, రాకాసి" అంటూ ఆశ్చర్యపోతూ గుండెలు పదోసారి బాదుకుంది నరసాయమ్మ.
"వల్లకొండే.... డబ్బే....డబ్బే.... దానిముందర మొగుడేంటి పెళ్ళామేంటి, కూతురేంటి, కొడుకేంటి" పొయ్యిలోంచి కొరకంచు తీసుకుని బీడీ ముట్టించుకుంటూ వేదాంతం, లోకధర్మం, ధర్మపన్నాలు చెప్పాడు వీరాయి.
ఒటేలు బెడ్తుందిట ఒటేలు, ఆ డబ్బుతో ఒటేలెట్టి లచ్చలు సంపాదిస్తుంది గాబోలు ఆ డబ్బుతో.... ఇంత కాపీన్నం తగదు....ఛీ....ఎదవ బతుకు.... ఇలాంటోళ్ళ మొగంచూస్తే పాపం వస్తుంది. మాణిక్యం తుపుక్కున ఊసింది"
"నిజమేనప్పా....ఆడకూతురు కష్టంలో వుంది అని జాలి కూడా సూపబుద్దేయడం లేదు దాని మొగం సూస్తే.... సూడే ఎలా పొర్రిపొర్రి సూస్తుందో...." నరసాయమ్మ అంది అసహ్యంగా చూస్తూ.
'ఆ....ఏసకాలు, పెద్దదుఃఖం వొలకబోస్తంది. దీని కల్లబొల్లి ఏడ్పులకేంలే, నిజంగా అంత ఏడుపుంటే అంతపని సేయనేసేయదు' మెటికలు మరోసారి విరిచింది సింహాచలం.
"దీనికి వత్తాసు ఆ ఈరమ్మముండ. తప్పేటి అంటుంది పైగా.... ముసలినంజ టీకొట్టెట్టిస్తుందట దానిసేత" కోపంగా అంది అప్పాయమ్మ.
"పోన్లెండే....దాని వూసు మనకెందుకు.... దాని పాపం దానిదే...." జోగులు తలగుడ్డ దులిపి క్రింద పరుచుకు పాడుకుంటూ అన్నాడు.
'మనకేటి అని వూరుకోబుద్ధి పుట్టదన్నా.... యిది సేసిన ఎదవపని తలుచుకుంటే....' సింహాచలం మహా ఇదిగా బాధపడ్తూ అంది.
"వూరుకోక నీవేటి సేస్తావు అన్నా, ఎవురిగోల ఆళ్ళది యీ లోకంలో.... దానికట్టం దానిది మనకేల" అన్నాడు పైడయ్య. మన అప్పా, సెల్లా, ఎవురికెవరం? ఏదో యీ చెట్టునీడన అందరం ఒకే ఇంట్లోలా వున్నాం గనక దాని సంగతి మనకెంక. నేకపోతే రోజుకి ఇలాంటివెన్నో.... ఎవరి సంగతి ఎవరికెరిక ఈ పెపంచకంలో!.... అన్నాడు మహా ఉదారంగా ధర్మంగా.... వూడిపోతున్న కాలివేళ్ళకి, చేతులో గుడ్డపీలికలు బిగించి కట్టుకుంటూ. అందరూ కాసేపు గొణుక్కుని, గొణుక్కుని వూరుకున్నారు.
ఆ చెట్టు.... ఆ మహావృక్షం.... తన నీడన ఎందరికో ఆశ్రయం ఇచ్చింది. ఇస్తూంది.... అడుక్కుతినేవాళ్ళు కొంప గోడులేని కూలి నాలి చేసుకునేవాళ్ళే కాక ఆస్పత్రికి వచ్చే బీదజనం తమవాళ్ళని ఆస్పత్రిలో జాయిన్ చేసి ఆ చెట్టుక్రింద వండుకుతింటూ రోగిని చూసుకుంటూ పడివుంటారు. ఏ తల్లికో, కొడుక్కో, భార్యకో జబ్బు చేస్తే ఆ ఆస్పత్రిలో జాయిన్ చేసి వాళ్ళ రోగం తగ్గేవరకు ఆ చెట్టుక్రిందే వండుకుంటూంటారు. అలా ఎప్పుడూ కనీసం నలుగురైదుగురుంటారు. ముష్టిపాళ్ళు సరేసరి! రోజంతా ఎక్కడో అడుక్కుని సాయంత్రం అయ్యేసరికి ఇన్ని చితుకులు పోగుచేసుకుని ఆ చెట్టుక్రింద ఇంత గంజి కాచుకు త్రాగి, గుడ్డ పరుచుకుని పడుకుంటారు. మరీ నిలవలేని వర్షంవస్తే ఏ అరుగుమీదో తలదాచుకుంటారు. అలా నిలవనీడలేని నిర్భాగ్యులకి ఎందరికో ఆ చెట్టు ఆశ్రయం ఇస్తూంది.
వాళ్ళల్లో ముత్యాలొకర్తి! ముత్యాలు బ్రతుకు యిప్పుడు బండలయింది. కాని నాలుగు నెలలుక్రిందట ముత్యాలు.... నిగనిగలాడుతూ నల్ల ముత్యంలా మెరుస్తూండేది. మొగుడు పాలేరు పని చేస్తూంటే ఇంట్లో గంజి కాచి ఇద్దరు చంటిబిడ్డలతో చీకూ చింతా లేకుండా వున్నంతలో హాయిగా బ్రతకడం దేముడు చూడలేకపోయాడు. అందుకే రోగం రూపంలో ముత్యాలు మొగుడిని వెంటాడాడు. పోలిగాడు మంచానపడితే గచ్చాకు, పుచ్చాకు వైద్యం, మంగలివైద్యం నెలరోజులు తనకు తెల్సినవాళ్లు వీళ్లు చెప్పిన వైద్యాలన్నీ చేయించింది. అమ్మోరికి మేకపోతును బలి ఇస్తానని మొక్కుకుంది. జాతరకి కోడిపెట్టనిచ్చింది. తాయెత్తులు కట్టింది. ఈ లోపల రెండోనెలా గడిచింది. ఈ రెండునెలల్లో నానాయాతన పడి, ఊడ్పులకెళ్ళి, కోతలకెళ్ళి, కామందు జాలిపడి ఇచ్చిన గింజలతో ఎలాగో రోజులు నెట్టింది. మరి ఈ రోగం యిక్కడతగ్గదు పట్నం తీసికెళ్ళాల్సిందే అన్నారు వూళ్ళో అందరూ....ముత్యాలు గుండె గుభీల్మంది. ఆడకూతురిని, సంటి పిల్లలతో, రోగిష్టి మొగుడ్ని పట్నం తీసికెళ్ళి ఎక్కడకెళ్ళను, ఏం చెయ్యను, ఏంపెట్టి వైద్యం చేయించను దేముడో అని బెంబేలుపడి పోయింది. వూరివాళ్ళు ఓదార్చారు. వైద్యం వూరికే చేసే ఆస్పత్రులున్నాయని ధైర్యం చెప్పారు. వివరాలు చెప్పారు. కామందు కాళ్ళ వేళ్ళపడి ఏభై రూపాయలు అప్పుతో రోగిష్టి మొగుడితో, ఇద్దరు చంటి పిల్లలతో పట్నం చేరింది ముత్యాలు.
పట్నం చేరాక ఆస్పత్రి గేటులోంచి లోపలికి వెళ్ళటానికి రెండు రోజులు. లోపలికెళ్ళాక ఇక్కడకాదు, అక్కడ, అక్కడ కాదు మరో డిపార్టుమెంటు అంటూ ఏవేవో పరీక్షలు చేసి వారంరోజులకి పోలిగాడ్ని ఆస్పత్రిలో జాయిన్ చేసుకున్నారు. ఆ వారంరోజులు ముత్యాలు పడిన అవస్థలు చెపితే అదో భారతం అవుతుంది. తిరగని వార్డు లేదు. చూడని నర్సు లేదు. కాళ్ళు పట్టని డాక్టరు లేడు; ఆఖరికి వారంరోజులకి బెడ్ దొరికింది. అప్పటినుండి పరీక్షలు ఆరంభించారు. గుండెలు చూశారు. కడుపు నొక్కారు ఫోటోలు తీశారు. రక్తం తీశారు. మలమూత్రాలు పరీక్షించారు. ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కోసారి రోగం పేరు చెప్పారు. కానీ అంతా కలిసి ఒకే పేరు చెప్పనందుకు పోలిగాడి రోగం ఏమిటో నెలరోజులు గడిచినా తేలలేదు. తేలకుండానే మందులు ఆరంభించారు. ఇంజక్షన్లు పొడిచారు. ఈ లోపల పోలిగాడు మరింత శుష్కించి పోసాగాడు. అతని శరీరంలో మిగిలిన రక్తం కాస్తా పరీక్షలకి సరిపోతూంది. ఇంజక్షన్లతో అతని శరీరం కన్నాలు పడిపోగా మిగిలింది ఏదీలేదు. డాక్టర్లు మరోసారి పరీక్షలు చేశారు. మందులు మార్చారు.... రోజురోజుకి పోలిగాడి స్థితి దిగజారి పోతూంది.