Previous Page Next Page 
కన్నీటికి వెలువెంత? (కథలు) పేజి 16


    ఆస్పత్రిలో పోలిగాడి అవస్థ ఓ ఎత్తు, ఆ రెండు నెలలు ముత్యాలు ఇద్దరు పిల్లలని పెట్టుకుని పడ్డపాట్లు మరో ఎత్తు. వెంట తెచ్చుకున్న ఏభై రూపాయలతో ప్రయాణం ఖర్చులు పోగా మిగిలింది పదిరోజుల తిండికి కూడా సరిపోదు. అప్పటినించి ముత్యాలు అవస్థలు దేముడికెరిక. రోగిష్టి మొగుడ్ని వదిలి వెళ్ళలేక, వదిలి వెళ్ళి అక్కడా రెక్కల కష్టంతో తప్ప బ్రతకలేదు కనక ఆ రెక్కల కష్టం ఇక్కడే పడదాం అనుకొంది. కాని ఈ రోజుల్లో కూలి పని దొరకడము అంత సుళువు కాదని చాలా త్వరలోనే అర్థం అయిపోయింది. రెండిళ్ళ పాచి పనికి కుదురుకుంది ముత్యాలు. చంటి పిల్లలు ఆ చీదర అంతా మాకొద్దని నాలుగు రోజులలోనే స్వస్తి చెప్పారు ఇళ్ళవాళ్ళు. దొరికిననాడు కూలి పని చేసుకుంటూ, ఇంత గంజి త్రాగుతూ, మొగుడి రోగం తగ్గడం కోసం వెయ్యి దేముళ్ళకి దండాలు పెట్టుకుంటూ రోజులు దుర్భరంగా గడిపింది ముత్యాలు. పెళ్ళాం పిల్లల పస్తులు చూడలేక పోలిగాడు నిస్సహాయంగా కళ్ళ నీళ్ళు పెట్టుకునేవాడు. ముత్యాలే ధైర్యం చెప్పేది "వూరుకో మామా.... నీకు రోగం తగ్గాలే కాని, ఈ కట్టాలు కలకాలం వుండవులే అని ఓదార్చేది. భార్య బిడ్డల దీనావస్థను చూడలేక పోలిగాడు ఆస్పత్రిలో తనకిచ్చే రొట్టే పాలు ఒకపూట రొట్టె తిని పాలు దాచి, మరో పూట పాలు త్రాగి రొట్టె దాచి ముత్యాలు చూడడానికి వచ్చినపుడు ఇస్తూండేవాడు. రోగిష్టి వాడికి పెట్టేది లేకపోగా వాడిది తినడమా అని మధనపడ్డా, ఆకలికి తలొగ్గక తప్పేది కాదు ముత్యాలుకి. ఏ నర్సూ చుట్టుప్రక్కల లేనపుడు రొట్టెతీసి పెళ్ళం కిచ్చేవాడు. దాచిన పాలు త్రాగమనేవాడు. ముత్యాలు గబుక్కున ఇన్ని పాలు తన నోట్లో పోసుకుని మిగతావి పిల్లాడి నోట్లో పోసేది. రొట్టె రొంటిని భద్రంగా దోపుకునేది. 'మావా, నీకో' అనేది దైన్యంగా. వద్దే, తిని తిని నా నోరు సచ్చిపోనాది, రెండు పూటలా ఆ పాలు తాగితే అరాయించుకోలేనే అనేవాడు. నిజమే ఆ చిక్కటి పాలు త్రాగి హరాయించుకునే శక్తి కూడా లేదు పోలిగాడికి. వుంచేసిన పాలు రొట్టె చూసి ఏ నర్సన్నా కేకలేస్తే 'తాగుతానుండమ్మా కూసంత ఆగి. ఆకలిలేదు' అని అబద్ధాలాడి సాయంత్రం ముత్యాలు రాగానే ఆ పాలు ఇచ్చేవాడు. ఆ రొట్టె, ఆ చిక్కటి పాలే ముత్యాలుని పిల్లలని ఆకలి బాధ పడకుండా రక్షించాయి....
    రోగం ఎప్పుడు తగ్గుతుందా ఊరికెప్పుడు వెళతామా అని కళ్ళల్లో వత్తులు వేసుకుని రోజూ దేముడ్ని ప్రార్థించేది ముత్యాలు ఆరోజు కోసం.
    ఓ రోజు....ఆ రోజు వచ్చింది. అయితే రోగం తగ్గింది తీసుకుపొమ్మని చెప్పలేదు డాక్టర్లు. నీ మొగుడి రోగం తగ్గదు.... లాభం లేదు తీసుకుపో, ఇంకేదన్నా పెద్ద పట్టణం ఆస్పత్రికి పట్టుకెళ్ళు అని చెప్పేశారు.... ముత్యాలు గుండె ఆగిపోయింది. బాబూ దిక్కు మొక్కు లేనిదాన్ని, చేతిలో కానీ లేనిదాన్ని, ఈ కదల్చలేని రోగిని ఎక్కడికి తీసికెళ్ళను, ఏంచెయ్యను, మీరే దయచూడాలి. మీరే దిక్కు నాకు అంటూ పెద్ద డాక్టరు కాళ్ళు పట్టుకుని వల వల ఏడ్చింది డాక్టరు జాలిపడ్డాడు, నీ మొగుడి ప్రాణానికి హామీ యీయలేం-కానీ మా చేతనయింది మేము చేస్తాం.... ఆపైన నీ అదృష్టం. చివరివరకు మా చేతిలో ఉన్నది చేస్తాం వుంచు' అన్నాడు. ఆ మాత్రం చాలనుకుంది ముత్యాలు.... తన అదృష్టం ఎలా వుంటే అలా జరుగుతుంది అని గుండె దిటవు పరుచుకుంది.... ధైర్యం చెప్పుకుంది.
    ఆ కష్ట సమయంలో ముత్యాలుకి ధైర్యం చెపుతూ తల్లీ తోడులా ఆదుకుంది వీరమ్మ ఒక్కతే. ఆ చెట్టు క్రిందే వీరమ్మ నివాసం! వీరమ్మ ఒక్కగాని ఒక్క కొడుక్కి క్షయ. వీరమ్మ కొడుకుని ఆస్పత్రిలో చేర్చి రెండిళ్ళలో పాచిపని చేస్తూ కొడుకు కోసం ఆ చెట్టుక్రిందే పడుంటూంది మూడు నెలలుగా. వీరమ్మ కొడుకు రోగం తగ్గుతూ, హెచ్చుతూ హెచ్చుతూ తగ్గుతూ అతనితో ఆటలాడుతూంది. వీరమ్మ వంటరిది, వెనకాముందు లేనిది. ఎక్కడున్నా ఏం చేసినా అడిగేవారు లేరు. ఆ చెట్టు క్రింద వుంటూ రెండిళ్ళలో పని చేసిన డబ్బుతో తన పొట్ట నిపుకుంటుంది. పసి పిల్లలతో ఆ చెట్టుక్రింద చేరిన ముత్యాలు అవస్థలు చూస్తూ బాధపడేది. ముత్యాలు పిల్లల పస్థులు చూడలేక తను తినే ముద్దలో రెండు ముద్దలు పెడ్తుండేది. చల్ది అన్నం తెచ్చుకుని తింటూ పిల్లాడికి రెండు ముద్దలు పెట్టేది. ఏడ్చే ముత్యాలుని ఓదార్చి ధైర్యం చెప్పేది. ఆ కష్ట సమయంలో తల్లిలా ఆదుకున్న వీరమ్మని చూసి మనుష్యుల్లో దేవత అనుకుంటూ దండంపెట్టేది ముత్యాలు.
    ఆ చెట్టుక్రింద ఇవాళ్ళున్న వాళ్ళు రేపు కనపడరు. రేపు మరొకరు! అంతా రెండు రోజులుండి పోయేవాళ్ళే! అలా కాక రెండేసి మూడేసి నెలలు వుండేవారు ముత్యాలు వీరమ్మల లాంటివాళ్ళు ఇద్దరు ముగ్గురు, ఆ చెట్టే శాశ్వత నివాసంగా ఏర్పరుచుకున్న ముష్టివాళ్ళు ముగ్గురు నలుగురున్నారు. అలాంటి వాళ్ళందరికి ముత్యాలు ఇప్పటి స్థితి లోకువ అయింది.నోటి కొచ్చినట్లు చెప్పుకున్నారు.
    ఆ మాటలన్నీ ముత్యాలు చెవులో దూరుతూనే వున్నాయి వింటూ భరించలేక ఏమనలేక కుళ్ళి కుళ్ళి ఏడుస్తూంది. అసలే దెబ్బతిన్న ఆమెకి ఆమాటలు భరించే శక్తి మిగలలేదు. నిస్సహాయంగా ఏడవడం మినహా ఏం చెయ్యలేక పోయింది.

                                                *    *    *    *

    ముత్యాలు.... ముత్యాలు.... ఏటలా సూత్తావు.... లే..... కూడొండాను రెండు ముద్దలు తిందువుగాని లేచిరా, పొద్దుటేలనించి పచ్చి మంచినీళ్ళు ముట్టనేదు, గొంతెండి పోతది! లే.... ఆ గుంటడిని కూడా నేపు. వీరమ్మ భుజం మీద చెయ్యి వేసి తట్టి పిలిచింది. వీరమ్మ బజారునుంచి ఎప్పుడొచ్చిందో, కూడు ఎప్పుడు వండిదో ప్రక్కన ఏడుస్తున్న కొడుకు ఏడ్చి ఏడ్చి ఎప్పుడు నిద్రపోయాడో.... అలా కూర్చునేవున్న ముత్యానికి తెలియలేదు.... వీరమ్మ పలకరిస్తే వెర్రిదానిలా చూసింది....
    "ఏటే....అలా సూస్తావు.... ఇందా కనగా వచ్చా....కూచుని జోగుతున్నావు నన్ను సూడనేదా.... లే.... బేగి రెండు ముద్దలు తిని పడుకుందువు గాని...."
    ఇప్పటికి తెలివివచ్చింది ముత్యాలుకి. వీరమ్మని పట్టుకుని 'అప్పా' అంటూ భోరుమంది. ఇందాకటినించి కడుపులో దాచుకున్న దుఃఖం అంతా బయటపడింది.
    "స్, వూరుకోయె.... ఎంత ఏడిసి ఏటి నాబం...." వీరమ్మ ఓదార్చింది.
    "అది కాదప్పా.... ఆల్లు! ఆల్లందరూ ఇందాకటి కాడనించి ఎన్నెన్ని మాటలంటన్నారో.... నాను మొగుడ్ని అమ్ముకున్నానంట, నే నాడదాన్ని కానంట, రాకాసినంట.... నాకు పుట్టగతి నేదంట.... నేనేం తప్పు సేసాను అప్పా...." వెక్కి వెక్కి ఏడ్చింది. సంగతి అర్థం అయి దూరంగా కూర్చుని అన్నాలు తింటున్న వాళ్ళందరిని నిర్లక్ష్యంగా చూసింది వీరమ్మ.
    "అనుకోనియ్యే.... అంటే నీకేటి పోయింది.... ఆల్ల మాటలకేంటి...."
    "అప్పా.... వద్దప్పా..... ఆడ్ని తెచ్చేస్తానప్పా.... నాకా డబ్బు వద్దప్పా...." ఏడుస్తూ అంది ముత్యాలు.
    "ఎర్రిమొగమా.... ఆల్ల మాటలకేటి, ఈ అన్నోళ్ళందరూ నీకు పూటన్నా కూడేత్తారా?.... యిన్ని గంజినీళ్ళన్నా పోస్తారా.... ఆ డబ్బెట్టి.... చిన్న టీ కొట్టెట్టుకొందువుగాని, నీ పిల్లలకింత గంజికాచి పోసుకుందువు గాని, నీ మొగుడు ఆలోచించే చెప్పాడు...."
    అవునప్పా, ఆడు పట్టుబట్టి బలవంత పెట్టాడు. వద్దు మావా అని ఏడ్చాను, తప్పు.... పాపం అని బ్రతిమలాడాను. ఇన్నాడు కాదు. ఏ తప్పు లేదు. ఎందరో ఇలా సేస్తారు. అని మాటిచ్చేవరకు ఒగ్గాడు కాడు. నేకపోతే డబ్బు కానపడలే దప్పా నేను" అంటూ మళ్ళీ ఏడ్చింది.
    "ఊరుకుంటవా నేదా, ఎక్కడో ఎర్రి మొగంలా వున్నావు. నీ మొగుడు చెప్పాడు, నీవు చేశావు. ఈల్లు ఆల్లు అనే మాటలకి నీవెందుకు ఏడుస్తావు? చాల్లే....లే ఇంక, ఇంత గంజి త్రాగుదువు గాని. మీరమ్మ కసిరి ముత్యాలుని లేవదీసి మూకుడు ముందు కూర్చోపెట్టింది.
    కాలి బూడిద అయినా, ఏ ముక్క కాముక్క కోయబడినా పోలిగాడి ఆత్మమాత్రం పెళ్ళాం పిల్లలు ఆకలికి మాడకుండా వుండడం కోరుకుంది! బ్రతికినన్నాళ్ళూ ఏనాడూ పెళ్ళాంచేతిలో రెండు రూపాయల కంటే పెట్టలేని పోలిగాడు చచ్చిపోయి ఒక్కసారిగా పాతిక రూపాయిలు సంపాదించి పెట్టగలిగినందుకు ఎక్కడున్నా సంతోషిస్తాడు!

                                                                                                      (జయశ్రీ పత్రిక నుండి)

                                                  *  *  *  *

 Previous Page Next Page