Previous Page Next Page 
కన్నీటికి వెలువెంత? (కథలు) పేజి 14


    విదేశాలదాకా ఎందుకు? మనదేశం మాత్రం అంతకంటే ఏం తీసిపోయింది. ఇంకా అక్కడ తనలాంటివారిని ఆదుకోడానికి ఓల్డ్ హోమ్స్ వున్నాయి. ఇక్కడ అలాంటివి లేకుండానే తల్లిదండ్రులని ఇంట్లోంచి తరిమేస్తున్నారు. తేడా అంతే!
    హుఁ. ఏం పిల్లలు? ఎందుకొచ్చిన వ్యర్థమైన ఆశలు వాళ్ళమీద! రెక్కలు రాగానే ఎవరికివారే అయ్యే పశు పక్ష్యాదులకి, బుద్దెరిగిన మనుష్యులకి ఏం తేడావుంది?.... తేడా లేక ఏం .... రెక్కలొచ్చిన పక్షుల గురించి తల్లి తండ్రి బాధపడవు. వాటిగురించి యావ వుండదు! కానీ.... మనుష్యులు అంత తేలిగ్గా కన్న సంతానం మీద వాళ్ళెలాంటి వారైనా మమతానురాగాలు వదులుకోలేరు. అదే తేడా- మనిషికి పశువుకి అనుకున్నాడు విశ్వనాథం.
    ఆరుగురు కొడుకులూ అయ్యారు! ఆరుగురు కొడుకుల ఇళ్ళలో పుచ్చుకోవలసిన మర్యాదలూ అందాయి. కలో గంజో ఒకపూట త్రాగి పస్తులుండడం, ఏ చెట్టు క్రిందో పడుకోడం యీ బ్రతుకు కంటే నయం కాదా! కొడుకుల యింట్లో హీనాతి హీనంగా పడుండడం కంటే ఎవరి పంచలోనైనా పడుంటే వచ్చే అవమానం ఏముంది! ఆ వచ్చే పెన్షన్ డబ్బులతో, నాలుగిళ్లలో నలుగురు పిల్లలకి చదువు చెప్పుకుంటే యీ మాత్రం బ్రతకలేకపోడు!
    ఈమాటే ముందు అంటే కొడుకులందరూ అప్పుడు ఏమన్నారు? తలో కొడుకు తలో పదో ఇరవయ్యో పంపితే పెన్షన్ డబ్బు అది కలిపి ఏదో జీవితం వెళ్ళబుచ్చచ్చని కొడుకుల చెవిని ఆమాట వేశాడు. "నాన్నా మీరు పెద్దవారయ్యారు. ఎలాగో రిటైరయ్యారు. మళ్ళీ ఇక్కడ కాపరం ఎందుకు? కలో గంజో అందరం ఒకచోటవుండే త్రాగుదాం. ఇక్కడ ఇంటద్దె అదీ దండుగ కదా! తలొకళ్ళయింట్లో తలో ఆరు నెలలు వుంటే నిక్షేపంలా మీ రోజులు వెళ్ళిపోతాయి. మాతో వుందురుగాని "అంటే నిజమనుకున్నాడు. కొడుకుల అభిమానానికి మురిసిపోయాడు. అంతేకాని, తలో పదో ఇరవయ్యో ఎత్తిపంపడం కంటే తండ్రిని ఇంట్లో ఉంచుకుంటే తండ్రి పెన్షన్ డబ్బు అదీ కలసి వస్తుందని.... అంతదూరం ఆలోచించారని గుర్తించలేకపోయాడు.
    కొడుకులన్నట్టు తన పెన్షన్ లో ముఫ్పై రూపాయలు ఇంటద్దె పోతుంది. కొడుకులు కాస్తోకూస్తో పంపినా ఈ కరువు కాలంలో ఎలా సరిపోతుంది? పదిమంది పిల్లల ఇల్లు! ఇల్లంటూ తల్లి తండ్రి అంటూ వున్నాక ఎవరో ఒకరు వచ్చి పోతూనే వుంటారు; సరే, ఆడపిల్లలు రావడం, పోవడం, అల్లుళ్ళు కోడళ్ళు మనవలు ముద్దుముచ్చట్లు వున్నంతలో ఎవరివేళకి వాళ్ళకి జరపాల్సిందే గదా! వీటన్నింటికి డబ్బెక్కడనించి వస్తుంది; తనకా బ్లడ్ ప్రషర్, గుండెదడ. నాలుగిళ్ళలో పిల్లలకి చదువు చెపుదామన్నా ఇవన్నీ అలోచించి కొడుకులు చెప్పిన దానికి ఆమోదించాడు.
    కాని తన డబ్బుకోసం.... తమ తల్లి చాకిరీకోసం ఆశపడ్డారు తప్ప తల్లి తండ్రి అన్న అభిమానం ఎక్కడుంది! బాగా తెలిసి వచ్చింది ఆయనకి.
    భార్య గుర్తురాగానే ఆయన మనసు బాధగా మూలిగింది. తన భార్య.... వాళ్ల తల్లిని.... ప్రతివాళ్ళూ వంటలక్కకంటే కనాకష్టంగా వుపయోగించుకొంటున్నారు. పాపం.... అది నోరెత్తకుండా కొడుకుల ఇళ్ళలో చాకిరీ చేస్తూంది. ఎన్నాళ్ళయింది భార్యని చూసి! ఒకనెల ఏమన్నా కలసి వున్నారేమో పెద్దకొడుకు యింటికి వెళ్ళాక! అంతే, అప్పటినించి ఒక కోడలికి పురిటిరోజులని, ఇంకో మనవడి అన్నప్రాసన అని, ఇంకొక కోడలికి వేవిళ్ళని, ఇంకో మనవరాలు సమర్తాడిందని, ఇంకో పిల్లాడికి బారసాలని మనవరాలి పెళ్లని.... యిలా ఎవరికి కావలసినపుడు వాళ్ళు తల్లిని పిలిపించుకుని ఆవిడ శక్తిని పూర్తిగా వినియోగించుకొంటున్నారు. వాళ్ళ అవసరాలకోసం! వాళ్ళ దృష్టిలో ఆవిడ ఒక పనిమనిషి! అంతేకాక తల్లి తండ్రి ఇద్దరిని ఒకరే భరించడం కష్టం అని చెరొకరిని తలొకరు వంతుల ప్రకారం పంచుకున్నారు అదేదో సినిమాలోలాగ!
    తను, తన భార్య నలుగురి ఇళ్లలో ముష్టెత్తుకునైనా ఇంతకన్నా బాగా బ్రతకచ్చు! కనీసం ఒకేచోట పడుండి ఒకరికొకరు తోడునీడగా వుండచ్చు!
    ఆ ఆలోచన రాగానే ఇంక ఆయన ఆలస్యం చేయకుండా మూడో కొడుకింట్లో వున్న భార్యకి వెంటనే తమ ఊరికి వచ్చేయమని ఉత్తరం రాసిపడేసి ప్రయాణం అయ్యాడు.
    భార్యని చూస్తూనే ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి.... "పార్వతీ! నీకు నేను నాకు నీవు తప్ప మనకెవరూ లేరు. ఈ పిల్లలు, ఈ ఆశలు, మమకారాలు అన్నీ ఉత్తవే పార్వతీ.... ఈనాటినుంచి మనం ఎవరికీలేం. మళ్ళీ మన ఇద్దరమే క్రొత్తజీవితం ఆరంభించాలి పార్వతీ.... ముందులాగ మనకి ఎవరూ లేరు పార్వతీ.... ఎవ్వరూ లేరు" భార్య చెయ్యి పట్టుకుని ఏదో గొణిగాడు ఆయన.
    భార్యని సత్రంలోవుంచి గృహాన్వేషణార్థం బయలుదేరేముందు మళ్ళీ అన్నారు. 'పార్వతీ, నీకు నేను నాకు నీవు తప్ప, ఎవరున్నారు మనకు?' పార్వతమ్మకి ఆయన అన్నది అర్థం కాకపోయినా కొడుకుల యింట్లో విసిగిన ఆమె మనసు ఆ మాటలు నిజమంది.
    ఈ లోకంలో ఎవరికి ఎవరు ఉండరు, ఎవరికివారే అన్న సత్యం విశ్వనాధానికి తెలియదా! ఆయన ఇల్లు వెతుక్కుని వచ్చేసరికి నిద్రపోతున్న పార్వతమ్మ మరి ఆ నిద్రనించి లేవలేదని ఆయనకి ముందు తెలుసుంటే ఆమాట అంత నిబ్బరంగా అనివుండేవాడు కాదేమో!....

                                                                                          (1969 జయశ్రీ పత్రిక నుండి)

                                                                                     *  *  *  *

 Previous Page Next Page