"ఇంక యింట్లో చూడాలి ఫార్సు. అన్నింటికి గొడవే. వంటలు, పండగలు. ఆచార వ్యవహారాలు అన్నీ ఆదేశం అలవాట్ల ప్రకారం చేస్తుంది అమ్మ. నాన్న ఒక్కోరోజు ఊరుకుంటారు, మూడ్ లో వుంటే లేకపోతే యిద్దరూ వాదించుకుంటారు. అమ్మ అందరితో తమిళులం అని చెప్పుతుంది. నాన్న వెంటనే దాన్ని ఖండిస్తూ 'మద్రాసులో చాలారోజులు వుండిపోవడంచేత అరవం మాట్లాడుతున్నాంగాని తెలుగువారమే' అంటారు.
"బాగానే వుంది. కావాలని చేసుకుని యిప్పుడు యిద్దరూ యిలా తగవులాడుకోవడం ఎందుకు?"
"ఆలు మనవాడు మొదట్లో భార్యని, ఆ దేశాన్ని సమర్ధిస్తూనే మాట్లాడేవాడే......మరి యిప్పుడు మళ్ళీ యిలా ఎందుకు మారాడోగాని" అంది పార్వతమ్మ.
"ఆ....అదంతా కొత్త మోజు!.....ఎంతయినా, ఎలాంటివాడికైనా తన జాతి, తన దేశం, తన మతం మీద అభిమానం వుండదూ" ...." అన్నారు జగన్నాథంగారు.
"నాన్న యిలా తయారవడానికి కారణం అమ్మే అని నా ఉద్దేశం! అమ్మ అస్తమానం దెప్పడంవల్లనే నాన్నకి యిప్పుడు పంతం, పట్టింపు వచ్చాయి!" ఉష అంది.
"ఇంతకీ, నేను నీ పెళ్ళి సంగతి అడిగితే యిదంతా ఏదో చెపుతావేమిటి?" తాతగారు మళ్ళీ మొదటికి వచ్చారు.
"డానికీ యిదే వరస యింట్లో నాన్న పెళ్ళి సంబంధాలు చూడడం ఆరంభించినదగ్గిర నుంచి అమ్మ అరవసంబంధమే చెయ్యాలని పోరు మొదలు పెట్టింది. పిల్ల సుఖపడుతుంది యిక్కడి సంబంధం చేస్తే అని ఆరంభించింది. మా వాళ్ళలో మంచిమంచి ఉద్యోగాలలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఉష సుఖపడాలంటే మా దేశ సంబంధమే చెయ్యా"లంటూ పంతం పట్టింది అమ్మ. ఆ పట్టు చూసి నాన్నకి విసుగు, కోపం వచ్చాయి.
"నీ కెందుకు ఆ బెంగ? ఆమాత్రం హోదాలో ఉన్న తెలుగువాడినే తెచ్చి నా కూతురికి పెళ్ళి చేస్తాను" అని నాన్న మొండి అన్నారు.
"ఆమాత్రం చేవ ఉంటే ఫరవాలేదు" అంది పార్వతమ్మ.
"అప్పటినుంచి చూడాలి యింట్లో అమ్మ గొడవ! నాన్నకి చెప్పి లాభంలేదనుకుని నన్ను రోజూ గంటలకొద్ది కూర్చోపెట్టి తమిళుల గొప్పతనం గురించి బోధించడం ఆరంభించింది. మీ నాన్న తెలుగు సంబంధం తెస్తే "నువ్వు ఒప్పుకోవద్దు. నీకు నేను మంచి సంబంధాలు చూసి ఉంచాను అని నాకు నూరిపోసింది. నాన్న ఆ సంగతి గ్రహించారు. ఓరోజు యిద్దరూ రాజీకి వచ్చి-"మనలోమనం దెబ్బలాడుకోడం ఎందుకు? ఉషానే అడుగుదాం. అది ఎవరిని చేసుకుంటానంటే వాళ్ళనే చేద్దాం" అనుకున్నారు. ఎదురుగా నన్ను కూర్చోపెట్టుకుని నా అభిప్రాయం అడిగారు.
"ఏమన్నావు నువ్వు?" కుతూహలంగా అడిగారు జగన్నాథంగారు.
"ఏమంటాను?" ఉష నవ్వింది. అలా యిద్దరూ నావైపు చూస్తూ అడిగితే ఏం జవాబు చెప్పను! ఏదో సామెతలా అయింది నా పని! అమ్మ నావైపే చూస్తూ సంజ్ఞలు చేస్తూంది. నాన్న నావంక ఆత్రుతగా చూశారు. నేనెటు చెప్పినా ఇద్దరిలో ఎవరో ఒకరికి కోపం రాక తప్పదు! ఇటు అమ్మ, అటు నాన్న.....ఎవరిని కాదనను! అక్కడికీ ఏదో చెప్పి తప్పించుకుందామని చూశాను. నాన్న వదలలేదు. నా అభిప్రాయం చెప్పాలని బలవంతం చేశారు. ఏం చెప్పాలో నాకు తెలియలేదు."
"నీకు తెలియకపోవడమేమిటి!"
"అసలు నా మట్టుకు నాకు ఎవరిమీద ప్రత్యేకమైన అభిమానం లేదు. ఎవరైనా ఒకటే నాకు! నా దృష్టిలో జాతి, మతాల కంత చోటులేదు. ఎటొచ్చీ నేను శాకాహరిని కాబట్టి, ఆ కాబోయే మొగుడూ శాకాహారయితే చాలు. అ మాటే చెప్పాను నాన్నతో. ఎవరైనా నాకు నచ్చవలసింది వ్యక్తికాని, అతని కులమతాలు గావన్నాను. ఎవరైనా నాకు అభ్యంతరం లేదన్నాను....."
"మరి మీ నాన్న ఏం అలా రాశాడు? నీ పెళ్ళి కొడుకును నువ్వే వెతుక్కుంటూ నన్నావుట!"
ఉష ఆశ్చర్యంగా చూసింది. "నాన్న మీకు రాశారా!"
"ఆఁ......ఏదో మొన్న ఉత్తరం నీ పెళ్ళి గురించి రాస్తూ యిలా అన్నావని ప్రస్తావించాడు." అని సర్దుకున్నారాయన.
"మరేమంటాను? విసుగెత్తిపోయింది నాకు. ఈ ఆలోచన వచ్చినప్పటినుంచీ యిద్దరూ కలసి నామతి పోగొడుతున్నారు. నేను నా అభిప్రాయం చెప్పాక అమ్మ విజ్రుంభించింది. ఎక్కడివో మూడు సంబంధాలు చూసింది, తన బంధువులంటూ వచ్చి పిల్లని చూసుకోమని రాయమని నాన్నని ఊదరకొట్టింది. నాన్న రాయలేదు. ఆఖరికి అమ్మ మామయ్య తేత రాయించింది. నాకు తెలియకుండా నాకూతురి పెళ్ళి చూపులు ఎవరూ ఏర్పాటుచేయమన్నారని నాన్న అమ్మని చాలా కేకలు వేశారు. 'మీకే నాదు నాకూ కూతురే' అంది అమ్మ. ఎలాగైతే నేం నాన్న చూసిన పెళ్ళివారు, అమ్మ చెప్పిన పెళ్ళివారు చూపులకి వచ్చారు.....ఇంక అదోగోల అప్పుడు!" విసుగ్గా అంది ఉష.
"ఏమిటయింది!" పార్వతమ్మ ఆత్రుతగా అడిగింది.
"నాన్న తీసుకువచ్చిన అబ్బాయి లిద్దరిలో ఒకరు డాక్టరు, ఒకరు ఇంజనీరు. వాళ్ళు ఫస్టు ఆంధ్రదేశం నడిగడ్డ మీదనుంచి వచ్చిన వారు. సరే, యింటికి వచ్చాక అన్ని వివరాలు అడగక మానుతారా? అమ్మని 'మీ పుట్టింటి వారేవూరు. పేరేమిటి' అని ప్రశ్నించారు. అసలే నాన్న మీద కోపంగా వున్న అమ్మ కావాలని తను తమిళురాలినన్న సంగతి వివరించి మరీ చెప్పింది. వాళ్ళు ముఖాలు చూచుకున్నారు. ఇంక నన్ను 'తెలుగు చదవడం, మాట్లాడడం బాగా వచ్చునా" అని అడిగారు.
"మాట్లాడడం అయితే వచ్చును. చిన్నప్పటినించీ కాన్వెంటు స్కూలులో చదవడంవల్ల, కొన్నాళ్ళు యింటిలో నేర్పాం కాని- ఆ తర్వాత తన చదువుతో కుదరక మానేశాం." అని నాన్న ఏదో సర్ది చెప్పారు. మళ్ళీ ముఖాలు చూసుకున్నారు వాళ్ళు. ఇంటికి వెళ్ళాక-పిల్ల నచ్చినా, యిలాటి సంకర జాతి వివాహాలు తమ కిష్టంలేవని రాసిపడేశారు. నాన్న కోపం చూడాలి ఆరోజు. నీమూలంగానే సంబంధాలు తిరిగి పోయాయని అమ్మని కేక లేశారు. బాగుంది, అబద్దాలాడి కూతురి పెళ్ళి చేస్తారా అని అమ్మ హేళన చేసింది.