Previous Page Next Page 
కొత్తనీరు పేజి 16


    అమ్మ చూపిన సంబంధాలు మంచివాయినా, నాన్న పంతం కొద్దీ నాకు నచ్చలేదని తోసిపుచ్చారు. అమ్మ యేడ్చింది. పంథలకి పోయి కూతురి పెళ్ళి చెడగొడుతున్నారని విరుచుకు పడింది. ఇద్దరూ ఓ వారం రోజులు మాట్లాడుకోవడం మానేశారు. ఇదంతా చూస్తూంటే నాకు ఒళ్ళు మండు కొచ్చింది. ఏడుపొచ్చింది. నా పెళ్ళిగురించి యింత గొడవ యేమిటి? వీళ్ళిద్దరి పంతలతో, పట్టుదలలతో నీ కసలు పెళ్ళే కాదు ఎప్పటికీ, అని సీను అన్నాడు. ఏగొడవాలేకుండా, నీకు నచ్చిన వాడిని చూసుకుని పెళ్ళాడేయ్ అని నా ఆప్తమిత్రురాలు సలహా యిచ్చింది.
    "కొంపదీసి అంతపనీ చేస్తావేమిటి!" పార్వతమ్మ అంది.
    "అంతే చెయ్యదలచుకున్నాను. ఆలోచిస్తే అదే మంచిదని పిస్తూంది. ఇద్దరిలో ఒకరిమాట వింటే రెందోవాళ్ళకి కోపం వస్తుంది కాబట్టి, ఇద్దరి మాటా వినకపోవడం మంచిది. ఇటు అరవ, అటు తెలుగు కాకుండా-ఇంకెవరినో పెళ్ళాడటం యీసమస్యకి పరిష్కారం! ......లేకపోతే అసలు పెళ్ళిచేసుకోకపోతే ఏ సమస్యా ఉండదు. కాదంటారా, తాతగారూ?" అంది నవ్వుతూ.
    ఆలోచిస్తూ వింటున్న ఆయన మనవరాలి ముఖంలోకి తదేకంగా చూసి నిట్టూర్చారు. "బాగానే వుంది......ఓ ఆలోచనా, పాడూ లేకుండా చేసే పనులకు పర్యవసానం యిలాగే వుంటుంది!"
    "అంత స్వజాత్యభిమానం ఉన్న ఆ యిద్దరు పెళ్ళి యెలా చేసుకున్నారా అని ఆశ్చర్యంగా వుంటుంది నాకు!" ఉష ఆలోచనగా అంది.
    "ఆ.....ప్రేమించుకున్న వేడిలో ముందు వెనుకల ఆలోచన ఉంటుందా!"
    "పోనీ, ఇష్టపడి చేసుకున్నారు. ఇప్పుడీ తగవులాట ఎందుకు, యీ పంతాలు ఎందుకు? ఎవరో ఒకరయినా సర్దుకోరు!"
    "హుఁ! ఎన్ని కబుర్లు చెప్పినా, ఎన్ని ఆదర్శాలు వల్లించినా-ఈ కులాంతర, భాషాంతర వివాహాలలో ఒడుదొడుకులు తప్పవమ్మా ఉషా! ఈ సంగతి మీనాన్నకి యిప్పటికి అర్ధం అయింది. అందుకే నీ విషయంలో ముందే జాగ్రత్త పడాలానుకుంటున్నట్లున్నాడు!"
    "అవునుగాని, ఆడపిల్లని నీ పెళ్ళి నువ్వే చేసుకుంటానని అనడం యేమిటే!" బుగ్గలు నొక్కుకుంటూ అంది పార్వతమ్మ.
    "ఏం, తప్పేముంది బామ్మా? ఇంట్లో యీ గొడవలు పడేకంటే అదే నయం కదా!"
    "ఉషా!" గంభీరంగా అన్నారు జగన్నాథంగారు. "ఎవరో ఒకరంటే నీ ఉద్దేశం యేమిటమ్మా? ఎవరినయినా చేసుకుందామనుకుంటున్నావా? ఎవరినయినా నిశ్చయించుకుని ఆమాట అంటున్నావా?"
    ఉష ముఖం ఎర్రబడింది. కళ్ళు వాల్చుకుంది.
    "నువ్వూ మీ నాన్నలా ఎవరినయినా ప్రేమించా వేఁమిటి?" అని సాగదీసింది పార్వతమ్మ.
    "చెప్పమ్మా, ఫరవాలేదు. తాతయ్య దగ్గిర సిగ్గెందుకు?" ప్రోత్సహించారు జగన్నాథంగారు.
    "ఇంకా నిశ్చయించుకోలేదనుకోండి!" నసిగింది ఉష.
    "ఎవరేమిటి అతను?"
    "అతను మా ఫ్రెండు రాజేశ్వరి కజిన్ బ్రదర్. కన్నడం వాళ్ళు. అతను మద్రాసులో డాక్టరు...." నెమ్మదిగా అంది ఉష. పార్వతమ్మ ఆదుర్దాగా భర్తవైపు చూసింది.
    "అతనూ, నువ్వూ పెళ్ళి చేసుకుందామని నిశ్చయించుకున్నారా? ఇద్దరిమధ్య ప్రేమ వ్యవహారం నడిచిందా యేమిటి?" కొంటెగా అడిగాడాయన, మనవరాలినుంచి అసలు విషయం రాబట్టడానికి. ఉష నవ్వి వూరుకుంది.
    "చెప్పవే, మీ నాన్నకీ, వాళ్ళకీ సంగతి తెలుసునా ఏమిటి?" ఆత్రుతగా అంది పార్వతమ్మ.
    "లేదు......ఇంకా ఎవరికీ తెలియదు."
    "పోనీ, మీ ఇద్దరూ నిశ్చయించుకున్నట్లేనా ఏమిటి?"
    "మేమూ యింకాసరిగా నిశ్చయించుకోలేదు. మీరనుకున్నట్టు మా యిద్దరిమధ్య ప్రేమ వ్యవహారమేదీ సాగలేదు."
    "మరి?" ఆసక్తిగా అడిగారు జగన్నాథంగారు.
    "నా స్నేహితురాలు రాజేశ్వరి ప్రోద్భలం యిది! వాళ్ళింటికీ వెళ్ళినప్పుడు అతన్ని నేను రెండుమూడుసార్లు చూశాను. అతనూ నా విషయంలో ఆసక్తి చూపుతూ, రాజేశ్వరిని చాలాసార్లు అడిగాడట. ఒకసారి రాజేశ్వరి అతనికి నన్ను పరిచయం చేసింది. అతను నాపట్ల చాలా ఆసక్తి కనబరుస్తున్నాడు అప్పటినుంచీ."
    "ఎలా ఉంటాడు? మంచివాడేనా?"
    "చూడడానికి బాగానే ఉంటాడు. మంచివాడేనా అంటే ఏం చెప్పను! మాటలనుబట్టి సభ్యతాసంస్కారాలు ఉన్నవాడిలాగే కనిపించాడు! ప్రాక్టీసు కూడా బాగానే ఉందంది రాజేశ్వరి. తనకి పినతండ్రి కొడుకు. అతనికి తల్లీ, తండ్రీ లేరట. రాజేశ్వరి నాన్నగారే అతని విషయం చూస్తారట......"
    "చాలా వివరాలే సేకరించావు!"
    ఉష సిగ్గుపడింది. "రాజేశ్వరి నా పెళ్ళిగొడవ అంతా విని, తను సలాహా చెప్పింది. "ఇద్దరి మాటా కాదని మా అన్నయ్యని చేసుకో, ఏ గొడవా వుండదు. మా అన్నయ్యకి నువ్వంటే చాలా ఇష్టంగా వుంది. నువ్వు 'ఊఁ!' అంటే అంతా సెటిల్ అయిపోతుంది" అంటూ నన్ను ప్రోత్సహిస్తూంది......కాని.....నేనే ఇంకా ఏదీ నిశ్చయించుకోలేకపోతున్నాను...." నెమ్మదిగా అంది ఉష.
    "ఉషా!......మీ అమ్మా నాన్నల వరస ఇంట్లో చూస్తూకూడా. మళ్ళీ నువ్వు మీ నాన్నచేసిన పొరపాటే చేస్తావా? ఈ విషయం గురించి బాగా ఆలోచించావా?" అని గంభీరంగా అడిగారు జగన్నాథంగారు.
    ఉష ఒక్కనిమిషం తబ్బిబ్బుపడింది. "నాకు మమలా జాతి, మతాల పట్టింపు లేదన్నానుగదా!"
    "ఆ.....ఆ......మీ అమ్మ, నాన్న ఇలా అన్నవాళ్ళే ముందు. పెళ్ళిఅయి, కొన్నాళ్ళు కాపరం చేశాక కదా అందులోఉన్న యిబ్బంది తెలిసింది. అయింది, ఏదో అయిపోయింది. మళ్ళీ నువ్వూ అదే వరసా?" పార్వతమ్మ నిష్టూరంగా అంది.
    "అమ్మా ఉషా! రోజులు ఎంత మారినా, మనం ఎంత పురోగమించినా మనలో ఇంకా యీ భేదాలు పూర్తిగా సమసి పోలేదమ్మా! అంత తేలికగా యీ జాతిమత భేదాలను విస్మరించలేం తల్లీ! మాకు భేదాలులేవు, పట్టింపులు లేవన్నమాట ఉత్తి ప్రగల్భమని నా ఉద్దేశం లేదా, ప్రేమ వ్యామోహంలో అనే తేలికమాట అయిఉండాలి! నిజంగా జాతి, మత భేదాలు లేనివాళ్ళు నూటికీ కోటికీ ఒక్కరుంటారేమో గాంధీజీలాటివాళ్ళు. అలాంటివాళ్ళు జరిగినదానికి చింతించరు. గొప్పగా ఏవో ఆశయాలు, ఆదర్శాలు అంటూ వల్లించి, పెళ్ళిళ్ళు చేసుకుని, ఆ మోజు తీరగానే ఒకరి అలవాట్లు, ఆచారాలు ఒకరికి సరిపడక ఇద్దరూ ఒకేగాడిలో నడవలేక తగవులతో ఇల్లు నరకం చేసుకుంటా, ఎందు కీ పెళ్ళి చేసుకున్నాం అని ఏడుస్తూ, చివరికి విడిపోయినవారెంతమంది లేరు! నా ఎరికనే ఇద్దరు ముగ్గురున్నారు. అంచేత ఉషా. ఇది నువ్వనుకున్నంత సులువైన విషయంకాదు. ఇప్పట్లో ఆ భేదాలు సమసిపోతాయని ఆశించలేం! మీ తరంవాళ్ళు యిటు పాతకాక,అటు కొత్తకాక మధ్య వ్రేలాడుతున్నారు!"

 Previous Page Next Page