Previous Page Next Page 
కొత్తనీరు పేజి 14


    
    "అయితే, ఉషా, ఎమ్.యే అయిపోయిందికదా! ఏం చేద్దామని నీ ఉద్దేశం? ఇంకా పైకి చదువుతావా? నీ ప్లాన్స్ ఏమిటి?" కాసేపు పడుకుని లేచి మూడు గంటలకి వీధి వరండాలో పడక కుర్చీలో కూర్చుని సావకాశంగా మనవరాలితో సంభాషణ కుపక్రమించారు జగన్నాథంగారు.
    ఉష కూడా అప్పుడే నిద్రలేచి, బద్దకంగా ఆవులిస్తూ ఓ కుర్చీలో కూర్చుంది పార్వతమ్మ కూడా వత్తులు చేసుకుంటూ గడపదగ్గిర కూర్చుంది.
    "ఇంకో ఎమ్.యే చేద్దామనుకున్నానుగాని, అమ్మ యింక చాల్లే అనేసింది. నాకూ అంత యింటరెస్ట్ లేకపోయింది. పోనీ సరదాకి ఏదన్నా ఉద్యోగం చేస్తానంటే, నీ కెందుకు ఉద్యోగం వద్దనేశారు నాన్న...."
    "అవునే, ఆడపిల్లవు నీ కెందుకు ఉద్యోగాలు, సద్యోగాలు? పని, పాట లేకపోతే సరి!" పార్వతమ్మ అంది.
    "అయితే కాలక్షేపం ఏమిటి నీకు?"
    "ఏముంది? మూడు పూటలా తినడం, కనిపించిన పుస్తక మల్లా చదవడం. వచ్చిన సినిమా లన్నింటికి మహారాజ పోషకురాలి నవడం, లేటెస్ట్ ఫాషన్ చీరలు వెతికి, కొని కట్టుకుని షికార్లు తిరగడం, అమ్మానాన్నల దగ్గిర ముద్దులు గునవడం-యిదీ మనం ప్రస్తుతం చేసేపని. బొత్తిగా విసుగెత్తుతూంది యీ లైఫ్ తాతగారూ!" అంది నిట్టూరుస్తూ.
    "విసుగు కాదుటే! యే వయసులో జరగవలసినవి ఆ వయసులో జరగాలి. లేకపోతే అలాగే అనిపిస్తుంది. ఇరవై యేళ్ళు నిండిన పిల్లవికదా, ఏదో సంబంధం చూసి పెళ్ళి చేయకుండా మీ నాన్న యేం చేస్తున్నాడు యింకా" పార్వతమ్మ అడిగింది.
    "పో బామ్మా! నేనేదో అంటే యింక పెళ్ళి కోసరమే కలవరిస్తున్నట్లు మాట్లాడుతున్నావు!" ఉష బుంగమూతి పెట్టి అంది.
    "బామ్మ అనడం కాదు కాని, అసలు పెళ్ళి ప్రయత్నాలు యేమన్నా చేస్తున్నాడా మీ నాన్న?" మనవరాలిని నెమ్మదిగా అసలు తోవకి మళ్ళిస్తూ యధాలాపంగా అడిగినట్లు అడిగారు జగన్నాథంగారు.
    ఉష కాస్త సిగ్గుతో తల తిప్పుకుని జవాబియ్యలేదు.
    "బాగుందండీ! ఆడపిల్లని పట్టుకుని అలాంటి ప్రశ్నవేస్తే యేం జవాబు చెపుతుంది?"
    "ఆఁ.....నీ మనవరాలు నీలాగ సిగ్గుపడే ఆడపిల్ల కాదులే! దానికి తెలియకుండా, దానితో చెప్పకుండా వాళ్ళ నాన్న సంబంధాలు చూస్తాడా?..... ఉషా, మొన్న మీనాన్న ఏవోసంబంధాలు చూస్తున్నానని రాశాడు. యే మయింది? ఎవరైనా చూసుకోడానికి వచ్చారా?" యేం తెలియనట్లు అడిగారు.
    "ఆ....ఇద్దరు ముగ్గురు వచ్చారెవరో.....రావడం, వెళ్ళడం అయింది అంతే!"
    "అదేం, నచ్చలేదన్నారేమిటి? నీ కంటే అందగత్తెలు కావాలన్న మహానుభావులు ఎవరు? నిన్నే కాదనడానికి ఎన్ని గుండెలున్నాయి వాళ్ళకి?" చమత్కారంగా అన్నట్టు అన్నారు జగన్నాథం గారు. ఉష కూడా కొంచెం నవ్వింది.
    "అందం చూసి తిరిగిపోలేదు లెండి వాళ్ళు!"
    "మరి?"
    "అమ్మా నాన్నలలో ఒకరు తెలుగు వాళ్ళు, ఇంకోరు అరవ వాళ్ళు అవడంచేత నేను ఏతెగకి చెందుతానో తేల్చుకోలేక వాళ్ళు మానుకున్నారు! ఇదో న్యూసెన్సు అయిపోయింది తాతగారూ! ప్రతివాళ్ళు మీరు తెలుగువాళ్ళా, తమిళులా అనడిగితే ఏం చెప్పాలో తెలియక తికమక పడడం చెడ్డ చికాకుగా వుందనుకోండి!"
    "కాదు మరీ......ఇలాంటి గొడవలు వస్తాయనే సంబంధాలు కులం, మతం, సంప్రదాయం వగైరా చూసి కుదుర్చుకోవాలన్నారు పెద్దవాళ్ళు."
    "అప్పుడు మామాట కాదని 'ప్రేమ, ప్రేమ' అని పెళ్ళి చేసుకున్నాడు. చేసుకోగానే సరా, యిలాంటివన్నీ ఎదురవుతాయన్న ఆలోచన ఉండవద్దూ!" పార్వతమ్మ అంటించింది.
    "ఏమో, అదంతా నాకు తెలియదుకాని-ఎవరితోనూ తెగేసి చెప్పడానికి లేకుండావుంది. తెలుగువాళ్ళం అంటే అమ్మకి కోపం, అరవవాళ్ళంటే నాన్నకికోపం! ఇంట్లో అమ్మతో అరవం మాట్లాడాలి, నాన్నతో తెలుగు మాట్లాడాలి! తెలుగు మాట్లాడితే అమ్మ మూతి ముడుచుకుంటుంది, అరవం మాట్లాడితే నాన్న కేకలు వేస్తారు. ఎలా? ఒక్కసారి నాకు, సీనూకి ఒళ్ళు మండిపోతూంటుంది - ఆ యిద్దరి వరస చూసి, అంచేత మేం యిద్దరం కూడబలుకుకుని ఇంగ్లీషే మాట్లాడుతున్నాం యింట్లో."
    "బాగుంది. అయినా నాకు తెలియాక అడుగుతా-తెలుగు వాడిని చేసుకున్నాక తెలుగుది కాకపోతుందా? ఏమి టా పంతం మీనాక్షికి?" పార్వతమ్మ నిష్టూరంగా అంది.
    "అమ్మకి తెలుగువాళ్ళంటే కాస్త చిన్నచూపు! తమకున్నంతగా సభ్యతాసంస్కృతులు తెలుగువారికి లేవని. తాము పురోగమించినంతగా వారు పురోగమించలేదని అమ్మ నమ్మకం. పెద్ద పెద్ద చదువులు చదివి, ఉన్నతోద్యోగాలలో ఉన్నవారు చాలామంది తమిళులే కాబట్టి తెలుగు వారు తమ కంటే వెనుకబడి వున్నారంటుంది. దాంతో నాన్నకి కోపం వస్తుంది. ఇద్దరూ వాదించుకుంటారు."
    "తెలుగువాళ్ళంటే అంత చిన్నచూపున్నప్పుడు తెలుగువాడిని ఎందుకు చేసుకుందో పాపం. మీనాక్షి!"జగన్నాథంగారు వ్యంగ్యంగా అన్నాడు.
    "అసలు నాన్నకి యీ జాతులు, కులాలు, మతాల పట్టింపులు లేవు. అమ్మే నాన్నతో అనవసరంగా యీ భేదాభిప్రాయలు కలిగిస్తూంది."
    "అవునమ్మా, నేనూ చాలాసార్లు గమనించాను. మా ఎదురుగానే ఎన్నోసార్లు ఆంధ్రులను గురించి హేళనగా, తక్కువగా మాట్లాడేది మీ అమ్మ. ఏదో నాలుగురోజు లుండిపోయేవాళ్ళతో అనవసరమయిన మనస్పర్ధలు ఎందుకని వూరుకున్నాను."

 Previous Page Next Page