"డాక్టర్ ! ఇవన్నీ ఒకరికి చెప్పినా అర్ధం అయ్యేవి కావు. భర్త నిరాదరణ అన్నది స్త్రీని ఎంత హింసిస్తుందో అనుభవిస్తే గాని అర్ధంకాదు. పైకి అదృష్టవంతురాలు, మంచి ఇంట్లో పడింది, మొగుడు వెయ్యిరూపాయలు తెస్తాడు అనుకోవచ్చు అందరూ. అందరికి కావల్సింది, కనపడేది మొగుడి ఆర్జనే! కాని ఆ యిల్లాలు యేం సుఖపడుతూంది, ఆ భార్యాభర్తలు అనురాగంతో వున్నారా అన్నది ఎవరికీ పట్టదు! అదృష్టం అంటే మొగుడి హోదామాత్రమే! ఇలాంటి స్థితిలో ఏ ఆడపిల్ల అయినా భర్తగురించి ఏం చెప్పగలుగుతుంది? అసలు ఎలా చెప్పగలదు? కన్న తల్లిదండ్రులతోనైనా భర్త తిడ్తున్నాడు, కొడ్తున్నాడని చెప్పుకోడం పరువు తక్కువనిపిస్తుంది.
"అయితే నీ తల్లిదండ్రులకి తెలియదా నీ భర్త ప్రవర్తన....నీవు వాళ్ళతో, నీ అత్తవారితో చెపితే కాస్త మందలించి బుద్ది చెప్పి దారికి తెచ్చేవాళ్ళేమో?" విజయ అంది.
శారద అదోలా నవ్వింది.
"డాక్టర్! మీరు అమాయకుల్లా మాట్లాడుతున్నారు. ఈ దేశంలో ఒక ఆడపిల్లని కన్న తల్లిదండ్రులు అల్లుడికి వంగి నమస్కారాలు చేసేవాళ్ళే తప్ప, అతని ప్రవర్తనని వేలెత్తి చూపి నిలబెట్టి ప్రశ్నించే అధికారం వున్నవారా? ప్రశ్నించి అల్లుడిని ధిక్కరించే శక్తి, ధిక్కరించాక ఆ పరిణామాలని ఎదుర్కోగల నిబ్బరం వుందా!"
"అవుననుకో. పెద్దలకి తెలిస్తే కాస్త నచ్చచెప్పి కాపురం సరిచేసేవారేమో."
"అయింది డాక్టర్. అదీఅయింది డాక్టర్. ముందులో కొన్నాళ్ళు వాళ్ళకి తెలియదు. తరువాత నేను చెప్పనక్కరలేకుండా వాళ్ళకే తెలిసింది."
"ఎలా" కుతూహలంగా అడిగింది విజయ.
"ఒకసారి మా అన్నయ్య ఈయని పండక్కి పిలిచి తీసి కెళ్ళడానికి వచ్చాడు. పెళ్ళయింతర్వాత ఆయన ఎన్నిసార్లు పిలిచినా ఏ పండగకీ రాలేదు. సంవత్సరాదికి రాశారు, దసరాకి, దీపావళికి రాశారు. సంక్రాంతికి రాశారు. ఒక్క ఉత్తరానికీ యీయన జవాబన్నా యీయలేదు. మొదటి పండగకి ఉత్తరం రాగానే అప్పటికే నేను కాపురానికి వచ్చి ఐదు నెలలు అయిందేమో, అమ్మ నాన్నలని ఈ వంకనన్నా చూడచ్చన్న ఉత్సాహంతో "పండగకి ఎప్పుడు బయలు దేరివెడదామండీ" అన్నాను సంతోషంగా.
ఆయన చినచిర లాడుతూ "వెడ్తున్నామని ఎవరు చెప్పారు. నేను వెళ్ళను. చాలు, పెళ్ళి అంత బాగా చేశారు. యింక పండగకి పిలిచి తవ్వి తలకెత్తుతారా?" హేళనగా అన్నారు.
నేను నిరుత్తర నయ్యాను. నీళ్ళు కారిపోయాను.
పుట్టింటిమీద ఆశ ప్రతీ ఆడపిల్లకీ వుంటుంది. పెళ్ళయి వచ్చాక పుట్టింటికి మళ్ళీ వెళ్ళలేదు. ఐదు నెలలు అయింది. అందరినీ చూడాలనివుంది. ఒకవేళ ప్రేమానురాగాల్లో ముంచెత్తే భర్తయితే పుట్టింటిమీద ధ్యాస వుండనంత అన్యోన్యతలో కరిగిపోతూంటే అదోరకం. ఆ అదృష్టం లేదేమో పదేపదే అమ్మవాళ్ళని చూడాలనిపించేది. యీ పెళ్ళి చేసుకుని నేనెంత నష్టపోయానో అన్న ఆలోచన వచ్చినప్పుడల్లా మావాళ్ళు గుర్తువచ్చేవారు. అయినా అప్పుడే ఏం కొంప మునిగింది. యిప్పుడే వెళ్ళక్కరలేదంటారు అని అడగలేకపోయాను. ఈ పండగ వంకనైనా వెళ్ళచ్చన్న ఆశకూడా పోయాక పట్టరాని కోపం, దుఃఖం వచ్చింది. ఆ రాత్రంతా ఏడిచాను. ఆ మర్నాడు కనీసం నేనొక్కర్తినేనా వెడతానని అడిగాను ఆశగా.
మహా తప్పుమాట అడిగినట్టు ఆశ్చర్యంగా చూసి "నీకు మొగుడి గౌరవంతో ఏం సంబంధం లేదనుకుంటే అలాగే వెళ్ళు. ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నావు..." అన్నారు కటువుగా.
పుట్టింటికివెళ్ళడానికి ఆయనగారి గౌరవానికి సంబంధం ఏమిటో అర్ధం కాలేదు.
"ఏం, అంత అపరాధం వాళ్ళేం చేశారు? వేలు యీయలేక పోవచ్చుగాని మీ గౌరవాలకి ఏ లోటు రాదు. బొత్తిగా అంత గతిలేని వాళ్ళనుకోకండి మా వాళ్ళు" పౌరుషంగా అన్నాను.
"ఇదిగో. నీవువెళ్ళాలంటే నిరభ్యంతరంగా వెళ్ళచ్చు. నామాట మీదలెక్కలేని పక్షంలో నిరభ్యంతరంగా వెళ్ళచ్చు కాని మరి తిరిగి రానక్కరలేదు." అనేసి వెళ్ళిపోయారు.
మరి తిరిగి రావద్దు! ఏమిటో ఆ బెదిరింపు! సరే! రాను, ఏమిటో యీయన బెదిరింపు నేనూ చూస్తాను. ఎగిరి పడుతున్న గుండెలతో ఆ క్షణంలోనే వెళ్ళిపోవాలన్నంత ఆవేశం ముంచెత్తింది.
ఒక్క రెండు నిమిషాలలో ఆవేశం చల్లారగానే తిరిగి రాకుండా ఎక్కడికి వెడతాను! తిరిగి వెళ్ళనంటే అమ్మ నాన్న వూరుకుంటారా? పెళ్ళయిన ఆడపిల్లని పుట్టింటివారు మాత్రం ఎన్నాళ్ళుంచుకుంటారు? లోకులకి జడిసి అయినా కాపురానికి రాకతప్పుతుందా! వెడితే తిరిగి రావద్దంటే ఏం చెయ్యాలి! అలా వెళ్ళి మళ్ళీ వస్తే మరింత లోకువవుతాను? ఆలోచిస్తుంటే ఈ దేశంలో ఓ ఆడపిల్లస్థితి ఎంత అధోగతిలో వుంది.
కాలం మారింది, రోజులు మారాయన్నారు. ఏం మారింది? ఈ నాటికీ భర్తదయాదాక్షిణ్యాలమీద ఆధారపడి బతకాల్సిందే గదా. ఆలోచిస్తూంటే ఏడుపొచ్చింది. అక్క, బావ వచ్చి వుంటారు. అంతా సరదాగా గడుపుతూంటే నేనిలా ... రాత్రంతా ఏడిచాను అందరినీ తలుస్తూ.
ఆ తర్వాత మరో మూడు సార్లు మావాళ్ళు పండగలకి రమ్మనడం, ఆయనకీ వీలులేదంటే కనీసం నన్నేనా పంపమంటూ ఎన్ని సార్లు రాసినా యీయన జవాబు రాయలేదు. నన్ను పంపలేదు. మా వాళ్ళని చూడాలన్న కోరిక పీడించినా గత్యంతరం లేక మనసు చంపుకున్నాను. ఈయన ఈ వైఖరితో నా మనసు మరింత విరక్తి చెందింది ఆయనపట్ల. నా కంటికి ఆయనొక నరరూప రాక్షసుడు! చదువుకున్న మూర్ఖుడు. సంస్కార హీనుడు! మానవత్వం మరచిన మనిషి! మనసులో ఈరకంగా తిట్టుకుంటూ పైకి భర్తే దైవం అన్నట్టు ఆయన మాట జవదాటకుండా కాపురం చేయడంకంటే ఆత్మవంచన మరేమిటి? నాలా బతికే ఆడవాళ్ళు ఎందరో! లోకందృష్టిలో మేమంతా పతివ్రతలం. నామనసులో నాభర్తకి సూదిమొనంత స్థానం అటుంచు-ఆయనంటే నాకు ద్వేషం-కక్ష-కసి-అసహ్యం!