"అంటే... ఇంకో మర్డర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు."
"ఒక మర్డర్ చేసిన వాడికి, ఇంకో మర్డర్ చాలా ఈజీ మిస్టర్ ఆదిత్య. ప్రస్తుతం నువ్వు ప్రజల దృష్టిలో... పేపర్ల దృష్టిలో ఏ పరిస్థితుల్లో వున్నావో తెల్సా... క్రిమినల్ అబ్సెషన్ లో, మెంటల్ బ్యాలెన్స్ తప్పి వున్నావ్. అంచేత... నువ్వీ పరిస్థితిలో ఎన్ని మర్డర్లు చేసినా అన్నీ గాల్లోకి పోతాయ్. అయినా... నిన్ను మర్డర్ చెయ్యమనడం లేదు. సూసైడ్ చేసుకునేటట్టుగా చెయ్యి... దట్సాల్..."
"ధరణి... గూండానా... రౌడీనా..."
"ఏం కాదు. ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ మేన్..." చెప్పాడు హోంమినిస్టర్.
"జైల్లోకి ఎందుకొచ్చాడు?"
"నాకు తెలీదు...."
"మీ ఎనిమీ గురించి మీకు తెలీదంటే నమ్మాలా...?"
"అతను నా ఎనిమీ కాదు. అహోబలపతి ఎనిమీ..."
"ఇందులో కూడా వర్గాలున్నాయా... మీ శతృవులని, ఆయన శతృవులని..."
"ఆల్ ఇన్ ద పొలిటికల్ గేమ్..." నవ్వుతూ అన్నాడు హోంమినిస్టర్.
కనురెప్పల్ని పైకెత్తి, హోం మినిస్టర్ వేపు చూస్తూ-
"సారీ... హోంమినిస్టర్. రెండోసారి నేను మర్డరర్ ని కాలేను"
ఆ గదిలోంచి బయటకు వెళ్ళబోయాడు ఆదిత్య. గబుక్కున లేచి అతని చేతిని పట్టుకున్నాడు హోంమినిస్టర్.
"బాగా ఆలోచించుకో... ఎంత కావాలో అడుగు. మీ నాన్నకు ఆ డబ్బును పంపుతాం. అహోబలపతిగారికి మాత్రం ఆ పని కావాలి. ఆగష్టు 15న నువ్వు విడుదల కావాలనుకుంటే ఆ పనిచెయ్యి. లేకపోతే..."
"లేకపోతే...?"
"చాలా జరగడానికి అవకాశముంది. నువ్వే సూసైడ్ చేసుకుని జైల్లో చనిపోవచ్చు. నువ్విలా కిల్లర్ గా మారావని తెల్సి నీ పేరెంట్స్... సూసైడ్ చేసుకోవచ్చు... లేదా..."
ఆ మాటతో వేగంగా వెనక్కొచ్చి హోంమినిస్టర్ చొక్కా పట్టుకున్నాడు ఆదిత్య.
"మరొక్క మాట మాట్లాడితే మీరిక్కడనుంచి శవంగా వెళ్తారు."
ఆ కోపానికి భయపడిపోయాడు హోంమినిస్టర్. వాళ్ళిద్దరి మధ్యా చీఫ్ మినిస్టర్ ప్రసక్తి లేకపోతే ఆ క్షణంలోనే ఆదిత్యను షూట్ చేసి వుండేవాడు. అంత కోపం వచ్చిందతనికి.
తనని తను కూల్ డౌన్ చేసుకున్నాడు.
"ఫిఫ్టీస్ డేస్ టైమ్. ధరణి మర్డర్ కావాలి..." అంటూనే బయటకెళ్ళిపోయాడు హోంమినిస్టర్.
ఆ గదికి కొంచెం దూరంలో జైలు సూపరింటెండెంట్ మిగతా జైలు అధికారులు, హోంమినిస్టర్ సెక్యూరిటీ బృందం ఎటెన్షన్ లో నిలబడున్నారు.
కారెక్కాడు హోం మినిస్టర్.
కార్లు వరసగా ముందుకెళ్ళి పోయాయి. హోం మినిస్టర్ కారు వెళ్ళిపోగానే పరుగున వచ్చాడు జైలు సూపరింటెండెంట్.
"అంతసేపు హోంమినిస్టర్ నీతో ఏం మాట్లాడాడు?" అడిగాడు ఆతృతగా.
జైలు సూపరింటెండెంట్ ని ఆపాదమస్తకం చూస్తూ-
"జైల్లో నన్ను సరిగ్గా చూసుకుంటున్నారో లేదోనని అడిగాడాయన" గబగబా నడుస్తూ, ఇనుప చువ్వల డోర్ ను తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు ఆదిత్య.
"అంటే" నోరెళ్ళబెట్టాడు జైలు సూపరింటెండెంట్!
వీడికి మతి స్థిమితం సరిగా లేదని డాక్టర్లు సర్టిఫై చేశారు. మరి వీడి దగ్గరకు హోం మినిస్టర్ స్వయంగా వచ్చి మాట్లాడి వెళ్ళాడు. తన యాభై ఏళ్ళ సర్వీసులో యిలాంటి ప్రిజనర్ ని ఆయనెప్పుడూ చూడలేదు? ఇందులో ఏదో మిస్టరీ వున్నట్టుగా అన్పించిందాయనకు.
అప్పటి నుంచి-
ఆదిత్య పట్ల ఆయన ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. అలాగే జైలు సిబ్బంది కూడా!
జైల్లో ఆదిత్య ఎక్కడ తిరిగినా, ఎవరూ అభ్యంతరం పెట్టడంలేదు.
* * * * *
12 గంటలు గడిచాయి.
జరిగిన సంఘటనలు ఒక్కొక్కటీ జ్ఞాపకం వస్తుంటే అహోబలపతి మీద కసి పెరిగిపోతోంది ఆదిత్యకు.
ధరణీ బయటకు రాగూడదు. పదిహేను రోజుల్లోపల ధరణి సూసైడ్ చేసుకోవాలి... సూసైడ్ చేసుకునేటట్లు చెయ్యాలి.
హోం మినిస్టర్ మాటలే జ్ఞాపకానికొస్తున్నాయి.
చెయ్యకపోతే?
ఆ తర్వాత ఏం జరుగుతుందో ఊహించడానికే భయంగా వుంది ఆదిత్యకు.
ఇంతకీ ధరణి ఎవడు?
ఎక్కడుంటాడు? ఎవర్ని అడగాలి? తను ప్రత్యేకంగా ధరణి గురించి ఎంక్వైరీ చేస్తే...
రేపు ధరణికి ఏమైనా జరిగితే... రకరకాలుగా ఆలోచిస్తున్నాడు ఆదిత్య.
ఆ రోజు-
సాయంత్రం అయిదు గంటలైంది.
జైలు కాంపౌండ్ లోని మొక్కలకు ఖైదీలందరూ నీళ్ళు పోస్తున్నారు. ఆదిత్య తన పని పూర్తి చేసి...
రావిచెట్టు మొదట్లో వున్న అరుగుమీద కూర్చున్నాడు. అతని కళ్ళు, ధరణి కోసం వెతుకుతున్నాయి.
దూరంగా చెట్టుకి చేరబడి ఏదో ఆకారం విలక్షణంగా కనబడితే, లేచి అటూ యిటూ చూసి-
ఆ వ్యక్తి వేపు నడిచాడు ఆదిత్య.
ఒకవ్యక్తి మర్రిచెట్టుకి చేరబడి పేపర్ చదువుకుంటున్నాడు.
తెల్లటి ఖైదీ డ్రెస్ లో అతను వింతగా వున్నాడు. ఖైదీ డ్రెస్ తీసేసి సూట్ వేస్తే ఆ వ్యక్తి తప్పనిసరిగా గొప్ప బిజినెస్ మాగ్నట్ లా కన్పిస్తాడు.
పక్కకు వెళ్ళి నుంచున్నాడు ఆదిత్య. ధరణి తన లోకంలో తనున్నాడు.
చిన్న పొడిదగ్గు దగ్గాడు ఆదిత్య.
ఆ శబ్దానికి తలెత్తి చూశాడు ధరణి. ఆ చూపులు అసాధారణంగా వున్నాయి.
"సాలిటరీ సెల్ లోంచి నిన్ను బయటికి వదిలారా?" ధరణి నోటంట వచ్చిన మొదటి మాట అది.