పదినిమిషాలు గడిచాయి.
ఓ స్టేషన్ రూమ్ లోకి ఆదిత్యను పంపించాడు జైల్ సూపరింటెండెంట్!
ఆ రూమ్ లో వాళ్ళిద్దరే వున్నారు.
హోం మినిస్టర్ ని చూడగానే గుర్తుపట్టాడు ఆదిత్య.
ఆ రోజు. మెహదీపట్నం స్టేట్ బ్యాంక్ దగ్గర, తనకోసం పదిగంటలకు వెయిట్ చేసి, తనకు అయిదు లక్షలు బేరర్ చెక్ కేష్, కారుని డ్రైవర్ తోపాటు అప్పగించిన వ్యక్తి!
ఆ రోజు సూట్లో వున్నాడు, ఇవాళ ఖద్దరు డ్రెస్ లో వున్నాడు. అంతే తేడా!
మెల్లగా నవ్వాడు హోం మినిస్టర్.
అతన్ని చూడగానే ఆదిత్య నరాలన్నీ ఉవ్వెత్తున పొంగాయి. కళ్ళు చింతనిప్పుల్లా మారాయి. పిడికిలి బిగుసుకుంది. ఉద్రేకం కట్టలు తెంచుకుంది.
"బాస్టర్డ్..." అని చివరి వరకూ వచ్చి ఆగిపోయింది.
అతనిప్పుడు మామూలు వ్యక్తి కాదు.
హోం మినిస్టర్....
నిదానంగా ఆలోచించడం మొదలుపెట్టాడు ఆదిత్య.
"చీఫ్ మినిస్టర్ అహోబలపతిగారు పంపారు నీకు థాంక్స్ చెప్పమన్నారు. నిన్నెలాగయినా సేవ్ చేస్తానని చెప్పమన్నారు. నీ గురించి పేపర్లలో ఎక్కువ వార్తలు రాకుండా చేసింది ఎవరనుకున్నావ్...? నీ కేసు కోర్టుల చుట్టూ తిరక్కుండా... నీకు ఎక్కువ మానసికంగా బాధ కలగకుండా చేసిందెవరనుకున్నావ్? అహోబలపతిగారు... ప్రతిపక్ష సభ్యులు ముఖ్యంగా గుర్రం పెద్దబ్బాయి లాంటి వాళ్ళు, అసెంబ్లీలో ఎన్ని ప్రశ్నలు వేసినా, అధికార పార్టీ సభ్యులు నీకు అండగానే నిలిచారు. పేపర్లు చూస్తే నీకా విషయం తెలుస్తుంది. ఏదో మానసిక వత్తిడిలో, ఉన్మాదంతో చేసిన చర్యని కోర్టు తీర్పిచ్చింది. ఇదంతా ఎవరివల్ల జరిగిందనుకుంటున్నావ్? ఆహోబలతిగారి వల్లే..." నెమ్మదిగా చెప్పాడాయన.
"ఇన్నాళ్ళ నా మెరిట్స్ గాల్లో కలిసిపోయాయి. నా కాండక్ట్ నాశనమయి పోయింది. నన్ను నా తండ్రి ఎంత కష్టపడి చదివించాడో తెలుసా? ఈ వార్త నా కుటుంబంలో ఎంత అల్లకల్లోలాన్ని సృష్టించి వుంటుందో తెలుసా?" ఆదిత్య గొంతులో అంతులేని బాధ సుళ్ళుతిరుగుతోంది.
"దానికి నువ్వే కారణం... మిస్టర్ ఆదిత్యా? ఆహోబలతిగారు నీకు వుచితంగా యివ్వలేదు. మర్డర్ ని ప్లాన్ చేయటానికేకాదు... అందులోంచి తప్పించుకోడానిక్కూడా యిచ్చారు. నువ్వు ఫెయిలయ్యావ్. నువ్వు తప్పించుకుంటే మహారాజులా వుండేవాడివి."
"అంటే... మీరు హోంమంత్రి అయ్యాక రూల్స్ మార్చారా సార్? దొరికితేనే దొంగన్నమాట..." వ్యంగ్యంగా అన్నాడు ఆదిత్య.
ఆ ఎత్తిపొడుపుకి ఉలిక్కిపడ్డాడు హోం మినిస్టర్.
"తెలివైన వాడెప్పుడూ జరిగిందాన్ని గురించి బాధపడడు. జరగవలసిన దాని గురించి ఆలోచిస్తాడు. నువ్వు నీ గురించి గాని, నీ ఫ్యామిలీ గురించి గానీ బాధపడాల్సిన అవసరమే లేదు. నీ చెల్లెలుకి పెళ్ళయ్యింది! ప్రస్తుతం నీ చెల్లెలు అత్తవారింట్లో వుంది."
హోంమంత్రి చెబుతున్న మాటను నమ్మలేనట్లుగా వింటున్నాడు ఆదిత్య. అతని కళ్ళలో ఏదో మెరుపు!
"కళ్యాణికి... పెళ్ళయిందా" ఆనందోద్వేగంతో ప్రశ్నించాడు.
"అందుకు సాక్ష్యం కావాలా?" జేబులోంచి ఓ ఫోటోని తీసి చూపించాడు హోం మినిస్టర్.
గబుక్కున ఆ ఫోటోని తీసుకున్నాడు ఆదిత్య.
అది కళ్యాణి పెళ్ళి ఫోటో.
"నా చెల్లి పెళ్ళి ఆగిపోలేదా సర్... నిజంగా జరిగిందా సార్" తడారిపోయిన గొంతుతో అడిగాడు ఆదిత్య.
"నీ వెనక వున్నది అహోబలపతిగారు. నిన్నటి వరకూ ఆయన మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం... చీఫ్ మినిస్టర్... నీగ్గానీ, నీ కుటుంబానిగ్గానీ... ఏమీ జరక్కుండా చూసుకునే బాధ్యత మాది. నీ చెల్లెల్ని, నీ పేరెంట్స్ ని కలుసుకుంటావా... చెప్పు. ఏర్పాటు చేస్తాను."
హోంమంత్రి సిగరెట్ తీసి వెలిగించుకుంటూ అన్నాడు.
"నా తండ్రికి ఒక లాయర్ గా కనిపించాలనుకున్నాను. ప్రిజనర్ గా కాదు" తలొంచుకుని అన్నాడు ఆదిత్య.
సరిగ్గా ఆ సమయంలో ఆదిత్య మెదడు పని చేయడం ప్రారంభించింది. తను భయంకరమైన పొలిటికల్ ట్రాప్ లో యిరుక్కున్నాడు... మర్డరర్ గా, ప్రిజనర్ గా మారాడు.
బయట ప్రజల దృష్టిలో తనో భయంకరమైన క్రిమినల్... అలాంటి వాడితో రాష్ట్ర హోంమినిస్టర్ ద్వారా... చీఫ్ మినిస్టర్ అహోబలపతి... మళ్ళీ ఎందుకు మంతనాలు సాగిస్తున్నట్టు?
అంటే... తనవసరం... ఇంకా అహోబలపతికి వుందన్నమాట.
నో... డౌట్... సమ్ థింగ్ బిహైండ్ ఇట్...
"నువ్వు మా మనిషివి... మా మనిషిని ఎలా రక్షించుకోవాలో మాకు తెలుసు.
ఆగష్టు 15న నిన్ను రిలీజ్ చేయించే పూచీ నాది. ఇది నా మాటేకాదు. చీఫ్ మినిస్టర్ గారి మాట."
హోంమినిస్టర్ కళ్ళవేపు సూటిగా చూస్తున్నాడు ఆదిత్య, అస్పష్టంగా ఏదో అర్ధమౌతోందతనికి.
"అంటే... ఇంకా నేనేమైనా చేయాలా... చెప్పండి"
ఆదిత్య మాటకు రేబాస్ గ్లాసెస్ సర్దుకుని ముందుకు వంగి-
"యూ ఆర్ టూ క్లవర్ మిస్టర్ ఆదిత్యా! టూ షార్ప్ బ్రెయిన్. నువ్వు ఏ ఫీల్డులోకి అడుగుపెడితే ఆ ఫీల్డులో నువ్వు సూపర్ మేన్ వి అయ్యేవాడివి... అందుకే నిన్ను అహోబలపతి... వదులుకోలేకపోతున్నారు."
"చెప్పండి... నేనేం చేయాలి?" కరుకుగా అసహనంగా వుంది ఆదిత్య గొంతు.
"చెప్తాను... నేనొచ్చిందందుకే" అంటూ ముందుకి వంగాడు.
అదే సమయంలో...
టక్ మంటూ రూమ్ డోర్ తెరచుకుంది.
ఒక వార్డర్ కూల్ డ్రింక్ బాటిల్ తో లోనికి ప్రవేశించబోయాడు... తనేదో చెప్తున్నా సమయంలో వాడు రావడంతో చిర్రెత్తుకొచ్చింది హోంమినిస్టర్ కి.
"గెటవుట్... ఎవడ్రా నిన్ను రమ్మన్నాడు. డోర్ క్లోజ్ చేసి పో. ఇడియట్."
కోపంగా అరిచాడు హోంమినిస్టర్.
ఆ దెబ్బతో ముందు తెల్లబోయి, టక్కున తలుపేసేసి బయటికెళ్ళిపోయాడు ఆ వార్డర్.
ఆ ఘడియలో హోంమినిస్టర్ ముఖంలో కనిపించిన కోపాన్ని బట్టి ఆయన చెప్పబోయే విషయం సీరియస్ నెస్ ను అర్ధం చేసుకున్నాడు ఆదిత్య.
సగం కాలిన సిగరెట్ ను యాష్ ట్రేలో కుక్కి-
"ఇది టాప్ సీక్రెట్... ఇదే జైల్లో... ధరణికుమార్ అనే ఖైదీ వున్నాడు. వాడు పదిహేను రోజుల్లో బయటికొస్తాడు. వాడు బయటికి రాకూడదు. వాడితో నువ్వు ముందుగా ఫ్రెండ్ షిప్ చేసుకో... తర్వాత నెమ్మదిగా... ఎవడికి అనుమానం రాకుండా చంపెయ్. అది మర్డర్ కాకూడదు. సూసైడ్ కావాలి... ఎలా ప్లాన్ చేస్తావో... నీ యిష్టం. ఎంత కావాలో చెప్పు. ఇది నా మాట కాదు... నీకు తెలుసుకదూ" అటూ ఇటూ చూస్తూ చెప్పాడు హోంమినిస్టర్.