Previous Page Next Page 


    "అంటే... నా గురించి మీకు తెలుసా..." కొంచెం దూరంలో కూర్చుంటూ అన్నాడు ఆదిత్య.

 

    "నాకు ఎర్లీ మార్నింగ్... న్యూస్ పేపర్ వస్తుంది..." మళ్ళీ పేపర్ చదవడంలో మునిగిపోయాడు.

 

    ధరణికి ముఫ్పై యేళ్ళుంటాయి. స్వరం గంభీరంగా వుంది. మనిషి అయిదడుగుల ఎనిమిది అంగుళాలుంటాడు.

 

    "మిమ్మల్ని చూస్తే ఎవరూ ఖైదీ అనుకోరు. మీరేం చేశారు... మర్డరా..." తలెత్తి చూశాడు ధరణి. ఆ చూపుల్లో ఏ భావమూ లేదు.

 

    "ప్రపంచంలో మర్డర్, రేప్ లే నేరాలు కాదు. ఆర్ధిక నేరాలు కూడా నేరాలే."

 

    "బ్యాంక్ దోపిడీనా?"

 

    "కాదు... రియల్ ఎస్టేట్ బిజినెస్ గొడవలు..." ఆగి, ఆదిత్య పెదవి వేపు చూస్తూ.

 

    "తుపాకీ దెబ్బా?" అడిగాడు ధరణి.

 

    "అవును..." అన్నాడు ఆదిత్య.

 

    "డాక్టర్ వచ్చి చూస్తున్నాడా?"

 

    "రోజూ మొక్కుబడిగా ఓ ఇంజక్షన్ చేస్తున్నాడు."

 

    "నీ గురించి పేపర్లలో చదివాను. నువ్వు లైఫ్ లో చేసిన ఫస్ట్ క్రైమ్ సి.ఎం. మర్డరట గదా. ఎందుకు చేశావ్... ఆయన నీకు అన్యాయం చేశాడా?"

 

    "లేదు.. ముందురోజు వరకూ, నేను మర్డర్ చేస్తాననే నాకు తెలీదు. నేను సి.ఎం. ని మర్డర్ చేస్తున్నట్టు అంతకంటే తెలీదు."

 

    ఆశ్చర్యంగా చూశాడు ధరణి కుమార్.

 

    "అసలా మర్డర్ ఎందుకు చేశావ్...? ఏం ప్రయోజనం ఆశించి చేశావ్?" ఒక ఆత్మీయుడిలా అడుగుతున్న ధరణి కళ్ళలోకి సూటిగా చూడలేకపోయాడు ఆదిత్య.

 

    "నీకు తెలీకుండానే నువ్వు హత్య చేశావని చెప్పావనుకో... నవ్వుతారు ఎవరయినా. అందునా నువ్వో లా స్టూడెంటువీ... అసలేం జరిగిందో చెప్పు. అదీ నీకిష్టమైతేనే" తిరిగి అడిగాడు ధరణి.

 

    ఎందుకో తనలోని బాధని ధరణితో పంచుకోవాలనిపించింది అతనికి. అలాగయినా కొంత భారం దిగిపోతుందని కూడా అనిపించింది.

 

    అందుకే జరిగిందంతా చెప్పాడు ఆదిత్య.

 

    దిగ్భ్రాంతికి గురయ్యాడు ధరణి.

 

    "నేను నిజంగా సి.ఎమ్.ని చంపాలనుకోలేదు. బి లీవ్ మీ మైడియర్ ఫ్రెండ్" అన్నాడు ఆదిత్య మొహాన్ని అరచేతుల్లో దాచుకుంటూ.

 

    "క్లిస్టల్ క్లియర్ పవర్ గేమ్ ఇది. సి.ఎమ్.ని చంపమంటే నువ్వు చంపవని ఆహోబలపతే అలా ప్లాన్ చేసి నిన్ను ఒప్పించి వుంటాడు. మాజీ ఎమ్.ఎల్.ఏ. అయినా అహోబలపతి చాలా పవర్ ఫుల్... డ్రామాని తనకనుకూలంగా మార్చుకుని సి.ఎమ్. అయిపోయాడు. ఐదు లక్షలతో సి.ఎమ్. అయిపోయిన మేధావి అహోబలపతి. జాగ్రత్తగా వుండు. నువ్వు జర్నలిస్ట్స్ ముందు నోరు తెరిస్తే అతని పదవి వూడిపోతుంది. కనుక నువ్వు నోరు తెరిచే ప్రమాదం వుందని తెలిసినా, నీ కేసు కోర్టుకెళ్ళే అవకాశముందని నిన్ను బ్రతకనివ్వడు. అందుకే నీ మీద టాడా ప్రయోగించి వుంటాడు. నీతో అహోబలపతికి యింకా యేదో పనుంది. అందుకే నీకు మతిస్థిమితంలేదని కోర్ట్ లో ఫ్రూవ్ చేసి నిన్ను రక్షించాడు... లేదంటే యీపాటికి చంపించుండేవాడు. జాగ్రత్త" హెచ్చరించాడు ధరణి.

 

    బహుశా జీవితంలో ఎప్పుడూ తిననంత షాక్ తిన్నాడు ఆదిత్య.  

 

    క్రమంగా అహోబలపతి స్ట్రాటజీ అర్ధం కాసాగింది. తన అనుమానాలు నిజమేననిపించి పళ్ళు పటపటా కొరికాడు ఆదిత్య. ఆవేశంతో నరాలు వుప్పొంగాయి.

 

    "గుర్రం పెద్దబ్బాయి పిస్టల్ నీకెలా వచ్చింది?" ధరణి అడిగాడు తిరిగి.

 

    "ఆ పిస్టల్... అతనే నాకిచ్చాడు."

 

    "ఇట్స్ నాట్ బిలీవబుల్... పెద్ద క్రిమినల్ బ్రెయిన్ అని రాశారే నీ గురించి... ఆ మాత్రం ఆలోచించలేకపోయావా?"

 

    "దట్స్ మై ఫేట్" తలొంచుకుని అన్నాడు ఆదిత్య.

 

    "గుర్రం పెద్దబ్బాయి ప్రోద్బలంతో నువ్వీ హత్య చేశావని... రూమర్స్ వున్నాయి. నువ్వేమో అహోబలపతి ఈ మర్డర్ చేయించాడంటున్నావు అహోబలపతి గురించి వదిలెయ్. అతనే చేయిస్తే అతని పర్పస్ కి నువ్వు వుపయోగపడవ్. అంత మాత్రం చేత గుర్రం పెద్దబ్బాయి నిన్ను వదుల్తాడా?"

 

    "గుర్రం పెద్దబ్బాయి" ఆదిత్య అంతవరకూ ఈ విషయం గురించి ఆలోచించనేలేదు.

 

    "ఏం చేస్తాడు?" నిర్లక్ష్యంగా అడిగాడు ఆదిత్య.

 

    "ఏమైనా చేయగల సమర్థుడు. ఇదే జైల్లో నిన్ను మర్డర్ చేయించగల కెపాసిటీ వున్న వ్యక్తి. హి ఈజ్ నాటీ ఆర్డినరీ... పొలిటికల్ లీడర్. నీ జాగ్రత్తలో నువ్వుండటం మంచిది."

 

    జైలు సూపరింటెండెంట్ అటువైపు రావడంతో ధరణి లేచి నిలబడ్డాడు.

 

    ధరణితోపాటు ఆదిత్య కూడా నిలబడ్డాడు.

 

    వాళ్ళిద్దరివైపూ అనుమానంగా చూశాడు జైలు సూపరింటెండెంట్. ఒకింత ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కొచ్చి "ఆదిత్యా... గొ టూ యువర్ వర్క్" అని అన్నాడు.

 

    మరో మాట మాట్లాడకుండా ఆదిత్య వెళ్ళిపోయాడు.

 

    "చూడు ధరణి... నువ్వెవరో నాకు తెలుసు... నీ పలుకుబడి ఎలాంటిదో నాకు తెల్సు... నువ్వు నేరం చేయలేదని కూడా నాకు తెలుసు... పదిహేను రోజుల్లో బయటికెళ్ళి పోతున్నవాడివి... అలాంటి ప్రొఫెషనల్ కిల్లర్స్ తో మాట్లాడటం మంచిది కాదు" అని ముందు కెళ్ళిపోయాడు సూపరింటెండెంటు.

 

    ఆదిత్య ప్రొఫెషనల్ కిల్లరా? ఆదిత్య మాటల్ని నెమరువేసుకుంటున్నాడతను.

 

    ఆదిత్య ప్రొఫెషనల్ కిల్లర్ కాదు...

 

    ఎమ్.బి.ఏ. చదివిన ధరణికుమార్... అహోబలపతి రైవల్... డి గ్రేట్ పొలిటీషియన్ గుర్రం పెద్దబ్బాయి పెద్ద కొడుకు అని ఆదిత్యకు అప్పుడు తెలీలేదు.


                            *    *    *    *    *


    రెండు గంటలు గడిచాయి.

 

    సెల్ లో కటిక నేలమీద పడుకున్న ఆదిత్య మనసు రకరకాలుగా ఆలోచిస్తోంది. ఇదే టైమ్ లో యూనివర్సిటీ హాస్టల్ లో ఏదొక బుక్ చదువుకుంటూండేవాడు. పదిరోజుల క్రితం తనొక ఇంటిలిజేంట్ స్టూడెంట్. ఈవేళ... ఇంటెలిజెంట్ క్రిమినల్ గా ముద్ర పడ్డవాడు.

 

    ధరణికుమార్ గురించి... అహోబలపతి హోంమినిస్టర్ ద్వారా పంపిన కొత్త ప్రపోజల్ గురించి ఆలోచిస్తున్నాడు.

 Previous Page Next Page