"ముందు చెప్పు"
"నన్ను నమ్మవూ? నా మాట నమ్మలేవూ?" అని గడ్డం పట్టుకు పూయించాను. కరిగిపోయినాడు. ఆలోచించాడు. వెనక్కిమళ్ళాడు. పాపం అనిపించింది. మీరాని అన్యాయం చేస్తున్నానా? నా పనికోసం నా స్వలాభం కోసం అతన్నీ, అతని రమ్య స్వభావాన్నీ నిర్భయంగా వుపయోగించుకుంటున్నానా? కాని ఆలోచించటానికి వ్యవధి లేదు.
ఆ వూళ్ళోకి వెళ్ళడం, మళ్ళా ప్రజల్ని చూడడం అదే మొదటిసారి. కాళ్ళు వొణికాయి. అందరూ నన్ను చూసి నవ్వుతున్నట్టే వుంది నా మనసుకి. కుమ్మరి యిల్లుదాటి, కోమటి అంగడి ముందునుంచి, మొరిగే కుక్కల్ని తప్పించుకుంటూ వెళ్ళాను.
వూళ్ళే, ప్రజలే, రోడ్లే కొత్తగా వున్నాయి నాకు.
ఆమె అందమయింది. అందం కంటె గాంభీర్యమెక్కువ, భారీ. ఆమె ముందు నేను చిన్నపిల్లలా గున్నాను. ఆ పెద్ద కళ్ళల్లో బలుపు బుగ్గల్లో రాజఠీవి వుంది. మాట్లాడాను. బతిమాలాను. ఆశ్చర్యపడ్డది. మొదట నన్ను నమ్మలేదు. నమ్మించాను. ఆమెకి అమీర్ మీద ప్రేమలేదు గాని అభ్యంతరం లేనట్టు తెలుసుకున్నాను. తన మర్యాద కెక్కడ నష్టం వొస్తుందో ననేదే మొదటి భయం.... "బికారివాడు. వాడితో నాకెందుకు?" అని విసుక్కుంది.
"డబ్బు కావాలా?"
"అది కాదు. అట్లాడివాడితో- దరిద్రుడితో నాకు సావాసమని తెలిస్తే నలుగురు నవ్వుతారు. చులకనైపోతాను."
ముఖ్యంగా యిదివరకంతా నేను గోల చేస్తాననే భయపడ్డది. నేనే బతిమాలేప్పటికి ఆమె అభ్యంతరం చాలా వరకూ పోయింది.
మర్నాడు సంజ మసకలో అమీర్ని ఆమె యింటికి తీసుకెళ్ళాను. నేనూ ఆ గదిలోనే వొకమూల తల తిప్పేసుకు కూచున్నాను. తలుపులూ, కిటికీలు అన్నీ బిగించాము.
ఎంత ప్రయత్నించినా చెవులు మూసుకోలేకపోయినాను. మొదట బాధపడ్డాను. నా వశం కాకుండా యీర్ష్యపడ్డాను. దాన్ని అమీర్ ముద్దు చెయ్యడమూ, నన్ను పిలిచిన రహస్యపు మాటలు దాంతో పలకడమూ, అట్లాంటి కాంక్షతో బరువెక్కిన కంఠమే మళ్ళీ వినడమూ, నాకు మరణ బాధని కలిగించింది. కాని నాకు త్వరలోనే తెలిసిపోయింది అ వ్యవహారం అట్టేకాలం సాగదని. మొదట్లో మొత్తానికి మోహంతో అతనిని చూస్తూ కూచుంది. అమీరంత రసికుడు కోరి దగ్గిరికి చేరితే, కరగని దాని హృదయం రాయా, లోహమా అని ఆశ్చర్యపడ్డాను. అది నన్ను తృణీకరించినట్టే కోపమొచ్చింది నాకు.
ఇంటికి వెళ్ళేటప్పుడు అమీర్ ఆ సంగతే యెత్తలేదు. నేను చేసిన త్యాగానికి ఒక్కరవ్వ కృతజ్ఞతా చూపలేదే అని నాకు చాలా బాధ కలిగింది. మీరా మాత్రం మర్నాడు పొద్దున్నే వొచ్చి, నా చేతులు పట్టుకుని,
"ఎంత గొప్పదానివి!" అని కళ్ళ కద్దుకున్నాడు.
అట్లా పదిరోజులు గడిచింది. దాని యింటినించి యిద్దరమూ ఒకరి పక్కన ఒకరం చీకట్లో నడుస్తూ వూరివీధులకీ, దీపాలకీ దూరమౌతూ తుమ్మల్లోంచి మెల్లిగా ఒక్కమాట లేకుండా నడిచి వొచ్చేవాళ్ళం. ఊరు దాటగానే, తాత్కాలికంగా అతను లోకంలో యితరులతో కలిసినా; ఆ మైదానంలో, వొంటరితనంలో అమీరిప్పటికీ నావాడేనని ధైర్యం కలిగేది. ఒకరోజు యింటికి చేరగానే అమీర్ నా మీద యెంతో ప్రేమా, కృతజ్ఞతా చూపాడు. అప్పుడు నాకెట్లా అనిపించిందంటే-అతన్ని చూడగానే యెట్లా అయిపోయిందంటే నా మనసు 'అతని కోసం, అతని సంతుష్టి కోసం ఏం చెయ్యగలను. ఇంకా ఏం చెయ్యగలను? ఏ త్యాగం నావల్లనౌతుంది? ఏ స్త్రీలని అతనికోసం తీసుకురాగలను? నా ప్రాణాన్ని, మౌనాన్ని దేన్ని అర్పించను? నే నెటువంటి బాధపుపడి అతనికి ఆనందం కలిగించను?" అని ఊరికే తపన పడేదాన్ని. నా హృదయంలో మండే ప్రేమాధికారాన్నీ యెట్లాగో అతనికి అర్థమయ్యేట్టు చెయ్యాలనిపించేది. వూరికే కావలింతల వల్ల వ్యక్తమౌతుందా ప్రేమ? అంతా సర్వమూ త్యాగంచేసి యేమీ అతనినించి నేను అనేది లేకుండా నా అహాన్ని చంపుకుంటేనే గాని?
నేననుకున్నట్టే పన్నెండోరోజు సాయంత్రం నేను అతన్ని ఆమె దగ్గిరికి రమ్మంటే,
"రాను....ధూ....ధాం...." అన్నాడు.
ఆలోచించాను-అమీర్ దాన్ని యెట్లాకోరాడా? యింత స్వల్పంలో విసుక్కునేవాడు అంత తీవ్రమైన బాధ యెందుకు పడ్డాడా అని. మొగవాళ్ళు యెంత యెదిగినా పసిపిల్లలే యీ విషయంలో అనిపించింది. వాళ్ళకి కలిగిన బాధ యేమిటో, యెందుకో, వాళ్ళ వాంఛల కర్థమేమిటో తెలుసుకోలేరు. వారిని ప్రేమించే స్త్రీలు వారి తల్లులై వారినర్థం చేసుకోవాలి. మొగవాళ్ళకి అట్లాంటి మార్పులు సహజంగా కావాలనిపిస్తాయి గావును- స్త్రీ నెంత ప్రేమించినా, ప్రేమ యెక్కువైన కొద్దీ దాన్ని భరించలేక.... అనుకున్నాను. కొందరు స్త్రీలు మొదట్లో నావలె మూఢులై తమపైని మొగవారి మనసు పోయిందని యేడుస్తారు. అమీర్ హృదయం నాదైనప్పుడు అతనెందరు స్త్రీలతో వుంటే నాకేం? అతని కానందం కలిగిస్తున్నాననే ఆనందం కన్న వున్నతమైన దేమున్నది నాకు? అమీర్ నాకంత సౌఖ్యమిచ్చాడే నేనీ చిన్న సౌఖ్యాలతనికి సమకూర్చలేనా?
తరవాత నాలుగు రోజులకి ఒకరాత్రి చీకట్లో పడుకుని అమీర్ తన మోచేతి మీద ఆనుకుని నా మొహం వెతుక్కుంటున్నాడు. కొండల్లో నక్కలు కూస్తున్నాయి. మిణుగురులు యెగురుతున్నాయి. గడ్డిలో అప్పటిదాకా వెలిగిన కొండమంటలు చల్లారి చీకటి నెక్కువ చేశాయి. ఆ చీకట్లో నల్లని ఆకారం మావేపు నడిచి వొచ్చింది. అమీర్ చెయ్యి కింద నా భుజం వొణికింది.
"అమీర్".
ఆ దూదేకుల మనిషి! తురక!
అమీర్ నన్ను చప్పున వొదిలి, లేచి కూచున్నాడు. నేను దూరంగా జరిగి చీరె కోసం వెతుక్కున్నాను. ఆమె వొచ్చి అమీర్ దగ్గిరగా కూచుంది. నేను లేచి యేటి దగ్గిరికి వెళ్ళి, నీటి వొడ్డునే యిసకలో కూచున్నాను. ఏటి ప్రవాహంలో చుక్కలు పువ్వుల్లా కొట్టుకొని పోతున్నాయి. ఇసికలోంచి యీడ్చుకుంటూ పోయే గాలి చప్పుడూ, గులకరాళ్ళ మీద దొర్లే నీళ్ళ గలగలా వినబడుతున్నాయి. వొంటరిగా కూచున్న నన్ను రాత్రీ ఏరూ గుర్తుపట్టాయి. నా ముందరి పెద్ద ఆకాశం. విస్తీర్ణ మైదానం చీకట్లో ఆ మూల ప్రేమించుకునే వాళ్ళిద్దరూ-అంతా ఈశ్వరుడి సౌందర్యాన్ని నాకు దగ్గిరగా తీసుకొచ్చాయి. నా హృదయం ఆనందంతో నిండింది. అమీర్ కోసం నేను ఆ నిమిషాన చేసిన త్యాగం పరమేశ్వరుడి కరుణని నామీద వర్షింప చేసిందేమో అన్నంత ఔచిత్యాన్ని కలిగించింది. నా కింకేం కావాలి లోకంలో! నా ప్రేమని, నా గతిని, నా ఆనందాన్ని తలుచుకున్నన్నాళ్ళు నా హృదయం మండి అమీర్ని తలుచుకున్నప్పుడల్లా ద్వేషంతో వుడికి, బాధతో తపించాను. కాని ఎప్పుడు నా స్వంతసౌఖ్యాన్ని, స్వంత బాధ్యతని మరిచి అమీర్ ఆనందంతో నా జీవిత సమస్యల్ని ఐక్యం చేశానో, ఎప్పటినించి నా జీవితోద్దేశ్యం అతని ఆనందానికి త్యాగమేనని నిశ్చయించుకున్నానో ఆ నిముషాన్నించి ఆ కోపమే ద్వేషమే అమృతంగా, మాధుర్యంగా మారి నన్ను దివ్య ప్రేమానుభవంలో ఓలలాడించింది. ఆ యిద్దర్నీ అక్కడ, నాచోట, నా మైదానంలో నా భుజమానుకున్న చోటనే ఆమె భుజం. పెదవులు అతని పెదవుల మీద వొదిలి వొచ్చిన నా ప్రేమ రెక్కలు విచ్చి నన్ను నక్షత్ర మండలంలోకి తీసుకుపోయింది. మెల్లిగా నా దృష్టి, నా దృష్టి వెంట నా ఆత్మా, మైదానపు చీకట్లో ప్రసరించి, వ్యాపించి ఆక్రమించుకుని అంతా తానై కొండలమీదనుంచి కొండశిఖరాన మెరిసే నక్షత్ర కాంతిలో లీనమయింది. అమీర్నేకాదు- అమీర్ని, అతని ఔన్నత్యాన్నీ ప్రేమించి అతనికోసం విరహపడి ఆ అర్థరాత్రి వొచ్చిన ఔన్నత్యాన్నీ ప్రేమించి అతనికోసం విరహపడి ఆ అర్దరాత్రి వొచ్చిన ఆ తురకదానితో, దాని ప్రేమతో సానుభూతి కలిగింది, నా ఆత్మలో. నేనూ, యే స్వల్పత్వాన్నీ యెరగని ఆ రాత్రి సౌందర్యమూ వొకటేననిపించింది. నా వలనే ఆ నీలాంబరం, తనకింద కలుసుకునే ప్రియులకి చల్లని ఆనందాన్ని కల్పిస్తోంది. అమీర్నించి నా ప్రేమత్యాగపు పక్షాలమీద విస్తీర్ణమై, లోకాన్నంతా ఆవరించింది. మన బాధతో యింకొకరికి ఆనందాన్ని కల్పించామనే జ్ఞానంకాన్న గొప్ప ఆనందం లోకంలో లేదు అనిపించింది.