Previous Page Next Page 
శరతల్పం పేజి 14


    నారాయణస్వామి ఊరి బయట కొంత స్థలం కొన్నారు-మంచినీళ్ళ బావి ఉందని. కాని అక్కడ బావి తప్ప ఇల్లు లేదు. గురువయ్య ఆ స్థలంలో గుడిసె వేశాడు. గోడలు పెట్టటానికి లచ్చమ్మ మట్టి ముద్దలు అందించింది. ఇల్లు పూర్తి అయిన తరువాత నాంచారమ్మ గోడలు అలికి పట్టెలు పెట్టింది. నెల అలికి ముగ్గులు పెట్టింది. ముహూర్తం చూచుకొని తెల్లవారుజామున భువనేశ్వరం నెత్తిన పెట్టుకొని నారాయణస్వామి, పంచపాత్రలు సెమ్మెలు పట్టుకొని నాంచారమ్మ గృహప్రవేశం చేశారు.
    నాంచారమ్మ ఆ రోజు పేరంటం పిలిచింది-కాని ఎవ్వరూ రాలేదు. అది ఆమెకు ఎంతో బాధ కలిగించింది.
    ఇప్పుడు నారాయణస్వామి ఇల్లు గురువయ్య ఇంటికి దగ్గరకు వచ్చింది.
    సాయంకాలాలు నారాయణస్వామి వ్యాసపీఠం ముందు కూర్చుంటూనే వున్నారు-కాని వినేవారు నాంచారమ్మ, లచ్చమ్మ మాత్రమే-గురువయ్యకది తాటివనపు సమయం!
    
                                     8
    
    సాయంకాలం అయింది. తాటివనంలో పొద్దుకుంకుతూంది. ఆకాశపు పడమటి పక్కన ఎర్రడాలు వేసింది. పక్షులు గుంపులు గుంపులుగా గూళ్ళకు చేరుకుంటున్నాయి. కొంగలు ఆకాశంలో మల్లెల దండలా సాగిపోతున్నాయి. చింతచెట్టు కిందికి వచ్చి గురువయ్య మోదుగాకు అందుకొని దొంతు కూర్చొన్నాడు. పక్కనుంచి కాలువ గలగలా పారుతూంది. మెల్లని చల్లనిగాలి వీస్తూంది.
    "పట్టు" ధ్వని వినిపించింది గురువయ్యకు. నోటికి ఆకు పట్టుకున్నాడు, కల్లు ముంతలోంచి పడుతూంది. తాగుతున్నాడు, అమాంతంగా అతని కళ్ళ పైకి చూచాయి.
    పోస్తున్నది ముసలి బుచ్చమ్మ కాదు పడుచు పిల్ల.
    ఆమెను చూస్తూన్నాడు గురువయ్య.
    నల్లగా నీలామణిలా ఉంది ముఖం.
    ఆ ముఖంలో పడుచుదనం పడగ విప్పింది. నిగనిగలాడుతూంది. చెంపలు నున్నగా ఉన్నాయి. చిన్న ముక్కుకు పెద్ద ముక్కెర-దానికి ఎర్రరాయి! చెవులకు గంటీలు. ముఖాన పొద్దుపొడుపులాంటి కుంకుమ. జుట్టు చక్కగా దువ్వి అణిగి ఉంది. పెదవులు ఎర్రగా మందారం మొగ్గల్లా ఉన్నాయి. అన్నింటినీ తలదన్నినవి కళ్ళు-వెడల్పుగా ఉన్నాయి - ఎర్రగా ఉన్నాయి - అందంగా ఉన్నాయి. ఆకర్షణ ఉంది వాటిల్లో-ఆహ్వానమూ ఉంది.
    ఆమె ముగ్ధంగా ఉంది. ముఖం ముద్దు వచ్చేట్లుంది - ముచ్చటగా ఉంది.
    గురువయ్య కల్లుకాదు-ఆమె సోయగాన్ని తాగుతున్నాడు.
    ఒక ముంత అయిపోయింది. అతడు చాలుననలేదు.
    ఆమె మరో ముంత అందుకుంది.
    గురువయ్య తాగుతున్నాడు - ఆమె మెడ అందంగా ఉంది. కురచగా నల్లగా ఉన్న మెడకు బంగారు పట్టెడ! దానిపై కంటె. ఎడమచేతికి బంగారపుదండ కడియం. ఎత్తుగా ఉన్న రొమ్ములు! అంతే ఇక అక్కడ నిలిచాడు గురువయ్య.
    చూస్తున్నాడు. తాగుతున్నాడు. మూడో ముంత.
    అదీ అయిపోయింది. బుచ్చమ్మ చూసింది. కోడల్ని అడిగింది ఎన్ని పోశావని మూడని ముచ్చటగా చెప్పింది.
    "గురువనికి పొయ్యాల్సింది ఒక్కటే ముంత - అంతే వాడికి - ఎరికెనా?" అన్నది.
    తల ఊపింది కోడలు.
    "అదేంది బుచ్చమ్మా! నా ఇష్టం-ఇంకోటి తాగుత వద్దంటవా?" గురువయ్య.
    "అరే. పైకమెవడిస్తడ్రా! కాల్వలో నీళ్ళమ్ముతాన్న మనుకున్నవా?"
    "ఏంది! ఎట్లనో మాట్లాడ్తవు! ఎన్నడన్న ఎక్కోట్టిన్నా! ఊళ్ళ సావుకారున్నడు-ఊరుబయట జమీనున్నది. బుగులెందుకు పడ్తవు! తాగెడిదే కుషీగ్గద! పోయిపిల్లా!" అని "ఎవరు బుచ్చమ్మా ఈ పిల్ల?" అడిగాడు.
    "ఓరి నీ కెర్కనే లేదుర! కొడుక్కు లగ్గమయింది గద-కోడలు" అని "పొయ్యి పిల్లా" అని కోడలుకు పురమాయించింది వెళ్ళిపోయింది బుచ్చమ్మ.
    గురవయ్య తాగుతున్నాడు- కాదు కళ్ళను చూస్తున్నాడు - ఆ కళ్ళల్లో ఏదో ఉద్రేకం కనిపించింది. ఉడుకుదనం కనిపించింది - తనకేదో పిలుపు కనిపించింది - ఏదో కవ్వింపు అనిపించింది.
    ముంత కాళీ అయింది. ఆమె జరిగింది.
    మోదుగాకు నేలక్కొట్టి లేచి నుంచున్నాడు గురువయ్య.
    ఆమె సాగిపోతూంది.
    వెనుక నుంచి చూచాడు గురువయ్య. జుట్టు బిగుతుగా ముడివేసి ఉంది. పొట్టి మెడ- పట్టెడ-కంటె-నడుముకు వడ్డాణం-కదులుతూంది.
    ఆమె సాగిపోయింది.
    చీర కాసేపోసి కట్టింది. పిక్కలు నిగనిగలాడుతున్నాయి. కాళ్ళకు కడియాలున్నాయి-తోడాలున్నాయి-గొలుసులున్నాయి-వెండివి.
    ఆమె సాగిపోతూంది.
    ఊపిరి ఆమెతో పోతున్నట్లనిపించింది గురువయ్యకు.
    ఆమె ఆగింది. గురువయ్య గుండె ఆగింది.
    ఆమె కడవలు చేతబట్టుకొని వెళ్ళిపోయింది.
    మసక చీకటి కమ్మింది, గురువయ్య గుండె కదిలింది.
    గురువయ్య చూస్తున్నాడు-ఆమె లేదు-ఆమెపోయిన దిక్కుంది-దిక్కునే చూస్తున్నాడు గురువయ్య-అదే తనకు దిక్కనుకున్నాడు గురువయ్య.
    గురువయ్య చూచిన దిక్కున చీకటి వుంది.
    చీకటిని తిట్టాడు గురువయ్య. చింతనీడ నుంచి కదిలాడు. కాలవదరిన బండ మీద కూర్చున్నాడు. మనసులో ఏదో సన్నని మంటలా అనిపించింది. పిచ్చిపిచ్చిగా ఉంది. ఈల వేశాడు-గునిశాడు. ఆకాశం చూచాడు. చుక్కలు మిలమిల మెరుస్తున్నాయి. కిందకి చూచాడు.
    కాలువ పారుతూంది. నీళ్ళల్లో చుక్కలు మెరుస్తున్నాయి.
    నల్లపిల్ల కళ్ళల్లో చుక్కలు మెరిసినట్లనిపించింది.
    కాలువలో నల్లపిల్ల కనిపించింది-నల్లకలువ కళ్ళు కనిపించాయి-గిలిగింతలు పెట్టినట్లయింది గురువయ్యకు.
    మత్తుగా ఉంది-మస్తుగా ఉంది-మగువ కనిపిస్తూంది-గుండెలో గానం బయలుదేరింది-గొంతు దాటింది-పెదవులు పాడాయి.
    చెలిని చూచిన కాడ
    గుండె వదిలేసిన్ను
    రొమ్ములో మసలేది
    బిసరోరి అన్నయ్య-బిసరోరి చిన్నయ్య    
    పడతి చూచినకాడ
    అవును వదిలేసిన్ను
    తనువులో మసలేది    
    గాలిరో రన్నయ్య-గాలిలో చిన్నయ్య.
    పదం గొంతెత్తి పాడుతూ బయలుదేరాడు-మత్తుబాగా తలకెక్కింది. రాత్రి అట్టే కాలేదు. కాని పల్లె-వీధులు ణోఈఱాఁఊఃఆఆఆ ఉన్నాయి. పాడుతూ సాగిపోతున్నాడు గురువయ్య.

 Previous Page Next Page