Previous Page Next Page 
హైజాక్ పేజి 14

బ్యాంకు దోపిడీవల్ల తన భవిష్యత్తుకూడా పాడయిపోయిందని భయపడింది గానీ ఇప్పుడు దేముడి దయవల్ల అంతా బాగానే జరుగుతోంది. బ్యాంకుని దోచుకున్న ఆ వెధవని ఇన్ స్పెక్టర్ రెడ్డి అరెస్టు చేస్తుంటాడు ఈ పాటికి. ఎంత కఠినంగా ఉంటాయి వాడి చూపులు!
హఠాత్తుగా ఏదో స్ఫురించినట్లు తలతిప్పి పక్కసీట్లో కూర్చున్న అతనివైపు చూసింది సుజాత.
అతనెవరో అప్పుడు గుర్తువచ్చింది ఆమెకి! భయంతో కళ్ళు పెద్దవయ్యాయి!
అరవడానికి నోరు తెరిచింది.
సుజాత కేక వెయ్యడానికి నోరు తెరిచింది గానీ, గొంతులో నుంచి శబ్దం బయటికి రాలేదు. భయభ్రాంతురాలయి, బిగుసుకుపోయి కూర్చుంది తను - అలవాటుగా!
ఊపిరి బిగపట్టి ఆమెనే చూస్తున్నాడు శతృఘ్న. తను ఒక్క కేక పెట్టిందంటే చాలు, తమ ప్లాన్ అంతా గాల్లో కలిసిపోతుంది.
రెండు నిమిషాలు గడిచినా ఆమె నోటివెంబడి మాట రాకపోవటం చూసి అతనికి ధైర్యం వచ్చింది.
"అరవనంతసేపూ నీకేం ప్రమాదంలేదు, కానీ అరిచి గోల చేశావంటే మాత్రం - ఇటు చూడు!"
మంత్రముగ్ధలా అతని చేతివైపు చూసింది సుజాత. కోటు చాటు నుంచి రివాల్వర్ తననే గురి చూస్తోంది.
"నౌ బీ ఏ గుడ్ గర్ల్! గొడవ చెయ్యకుండా కూర్చో!" అన్నాడు శతృఘ్న.
బలహీనంగా తల వెనక్కి వాల్చేసింది సుజాత. కనురెప్పలు బరువుగా అయి, మూసుకుపోతున్నాయి. కనుగుడ్లు రెప్పలలోకి వెళ్ళిపోతున్నాయి.
ఫెయింట్ అయిపోతుందా? అర్థం కాలేదు శతృఘ్నకి, ఆదుర్దాగా చూశాడు.
దాదాపు సుజాత ఉన్న స్థితిలోనే ఉన్నాడు విక్టర్. అతను కళ్ళప్పగించి శాలినినే చూస్తున్నాడు. ఆమెకి అంత దగ్గరగా కూర్చుని ఆమె వంటి మీదనుంచి సోకుతున్న పరిమళాన్ని ఆఘ్రాణిస్తూ, ఆమె వదిలే ఊపిరిని తను పీల్చే అదృష్టం కలగాలని అతను కలలు కన్నాడు. కానీ కలలో కూడా నమ్మలేదు.
ఇంకాసేపట్లో, ఈ శాలిని తాను ఎలా చెబితే అలా ఆడుతుంది. డాన్స్ చేయిస్తాడు తను. ఆ సినిమాలో - జలపాతం కింద చేసిన డాన్సు ఈసారి కోట్లాది ప్రేక్షకుల కోసం కాదు. తన కోసం. కేవలం తన కోసం మాత్రమే చేస్తుంది.  
విమానం నేలమీద ముందుకు కదిలి, కుడిచేతి వైపుకి టర్న్ అయి కొంతదూరం వెళ్ళి, మళ్ళీ ఎడమ చేతివైపుకి మళ్ళి, రన్ వే మీదికి వచ్చింది. బాలా నగర్ ప్రాంతం నుంచి, బోయిన్ పల్లిదాకా దాదాపు మూడు కిలోమీటర్ల పొడుగున, గ్రే కలర్ రిబ్బన్ పరిచినట్లుంది ఆ రన్ వే. మెల్లిగా చక్రాలమీదే పయనిస్తూ బోయిన్ పల్లిదాకా వెళ్ళి, అక్కడ వెనక్కి తిరిగి కొద్ది క్షణాలు ఆగింది విమానం.
అప్పుడు ఎక్కువయింది ఇంజన్ల హోరు. విమానం మళ్ళీ కదిలింది. ఈసారి బస్సులా మెల్లిగా వెళ్ళలేదు. గాలిలోకి ఎగరాలనే కృతనిశ్చయంతో క్షణక్షణానికీ, వేగం పుంజుకుంటూ పరిగెత్తి, ఆ వేగం గంటకి దాదాపు నూటయాభై నాట్స్ అందుకున్న తర్వాత, ఒక్కసారిగా ముక్కు పైకెత్తి గాల్లోకి లేచింది. ఏటవాలుగా ఎగురుతూ క్రమక్రమంగా ఎత్తుకుపోయి, గాల్లోనే కుడిచేతి వైపు టర్న్ అయింది.
విమానాన్ని భూమిమీద నుంచి గాల్లోకి తీసుకువెళ్ళడమూ, గాల్లోనుంచి భూమి మీదకు దింపడమూ - టేకాఫ్, లాండింగ్- ఈ రెండూ పైలట్లకి ఎప్పటికప్పుడు పరీక్షలాంటివే! విమానం ఒకసారి గాల్లోకి వెళ్ళి, తనకు నిర్ణయించబడిన ఆల్టిట్యూడ్ (ఎత్తు)లో నేరుగా పయనించడం మొదలెట్టిన పైలట్లకి ఇంక అంత శ్రమ ఉండదు. రొటీన్ గానే ఉంటుంది.
రొటీన్ పరిస్థితులలో అయితే!
విమానం గాలిలోకి వెళ్ళిన తర్వాత చక్రాలు అనవసరం గనక, అవి విమానం కడుపులోకి ముడుచుకు పోయాయి.
డయల్స్ అన్నీ ఒకసారి జాగ్రత్తగా పరికించి చూసి, తర్వాత విండ్ స్క్రీన్ లోనుంచి బయటికి చూశాడు సవ్యసాచి.
వెంటనే అతని మొహం వివర్ణమయింది. తక్షణం కంట్రోల్స్ ని అందుకోవడానికి చెయ్యి జాపాడు.
ఆ లోపలే జరిగింది అది!
"ఠప్!" మని పగిలింది విండ్ స్క్రీను. చచ్చిన ఒక కొంగ బుల్లెట్ లా దూసుకొచ్చి కాక్ పిట్ లో పడింది.
"బర్డు స్ట్రెయిక్!" అన్నాడు సవ్యసాచి.
ఆదుర్దాగా చూశాడు కో పైలట్ వినోద్ రవి.
"వినోద్! కంట్రోల్ టవరుకి రిపోర్టు చెయ్యి! లాండింగ్ కి పర్మిషన్ అడుగు! క్విక్!" అన్నాడు సవ్యసాచి, విమానాన్ని తిరిగి నేలమీదకు దింపే ప్రయత్నాలు మొదలెడుతూ.
"యస్సర్!" అని కంట్రోల్ టవర్ తో రేడియోలో మాట్లాడటం మొదలెట్టాడు వినోద్ రవి.
గ్రౌండ్ మీద అప్పుడే బయల్దేరడానికి సిద్ధంగా ఉండి, ఇంజన్లు స్టార్టు చేసివున్న మరో విమానానికి పర్మిషన్ కాన్సిల్ చేసి, రన్ వేని ఫ్రీగా వుంచి, ఎయిర్ బస్ మళ్ళీ లాండ్ అవడానికి పర్మిషన్ ఓకే చేశారు కంట్రోల్ టవర్ వాళ్ళు.
ఎమర్జెన్సీ అదీ!
ఫైరు ఇంజన్లు రెడీగా నిలబడ్డాయి.
ఎలాంటి అవాంతర పరిస్థితినయినా ఎదుర్కోవడానికి!!
అది తీవ్రమయిన పరిస్థితే అయినా కంగారు పడలేదు సవ్యసాచి. అతను ఎక్స్ పర్ట్ పైలట్. విమానాన్ని పూర్తిగా కంట్రోలులో వుంచుకుని, కిందికి దింపే ప్రయత్నం మొదలెట్టాడు. విమానం కడుపులోకి ముడుచుకుపోయిన చక్రాలు మళ్ళీ బయటికి వచ్చాయి. రన్ వే మీదికి దిగడానికి గాల్లో ఏటవాలుగా జారడం మొదలెట్టింది విమానం. చక్రాలు రన్ వేని తాకగానే కొద్దిగా కుదుపు. ఆ రాపిడికి వేడిమి పుట్టి పొగలు లేచాయి. స్పీడు రన్ వే కొస చేరేదాకా తగ్గలేదు. అక్కడ వేగం అదుపులోకి వచ్చాక, బ్రేకు వేశాడు సవ్యసాచి. విమానం ఆగి నెమ్మదిగా టాక్సీ చేసుకుంటూ తిరిగివచ్చి 'బే'లో నిలబడింది.

 Previous Page Next Page