వాల్మీకి సృష్టించిన రాముడు దేవుడుకాదు. మంచిగుణాలు గల ఒక నరుణ్ని గురించి తెల్సుకోదలిచాడు వాల్మీకి.
"బహవో దుర్లభాశ్చైవ యే త్వయా కీర్తితా గుణాః I
మునే వక్ష్యా మ్యహం బుద్ధ్వా తైరుక్త శ్శ్రూయతాన్నరః II"
నరుణ్ణి గురించే చెబుతున్నానని బ్రహ్మ అంటున్నాడు వాల్మీకి విన్నది నరుణ్ని గురించిన కథే - వాల్మీకి రాముని పాత్రను చిత్రించేప్పుడు చాల కష్టపడ్డాడు. మానవతీతునికి గల లక్షణాలు ఏవీ రామునికి ఆపాదించలేదు. రామునిలో మానవునికి గల దుఃఖాన్ని, దౌర్బల్యాన్ని శోకాన్ని విపులంగాను, వివరంగాను చిత్రీకరించాడు. రామాయణాన్ని లౌకిక దృష్టితో చదివితే రాముడు మనకు మహా పుఋషునిగా కనిపిస్తాడే తప్ప, పురుషోత్తమునిగా కన్పించడు. యుద్ధకాండలో రావణవధ తర్వాత ఇంద్రుడు, రామునికి.
"త్రయాణాం హి లోకానా మాదిక్తూ స్వయం, ప్రభుః" అని జ్ఞాపకం చేస్తాడు. అందురు రాముడు.
"ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజమ్" అంటాడు. నేను మనిషిని, రాముణ్ని. దశరథుని కొడుకును అంటాడు.
రాముడు స్వయంగా తనను మనిషిగా చెప్పుకున్నాడు. కృష్ణునివలె తననెక్కడ భగవంతునిలా చెప్పుకోలేదు. వేదాంతం ప్రవచించలేదు. గీత చెప్పలేదు. ఐనా మనం రాముణ్ని దేవునిగా చేశాం. అతనికి ఆలయాలు కట్టాం. పూజిస్తున్నాం. ఇది ఒక రాముని విషయంలోనే జరిగింది కాదు. గౌతమబుద్ధుడు, తన జీవితకాలంలో దేవుణ్ని గురించిన ఒక నిశ్చితమైన అభిప్రాయం చెప్పలేదు. ఐనా అతని విగ్రహాలను పూజిస్తున్నారు బౌద్ధులు. - అలాగే మహావిర వర్ధమానుడు. అతడు నాస్తికుడు - జైనులు అతన్ని దేవున్ని చేశారు. ఇలా దేవుళ్లను చేయడంలో మూల పురుషుని ప్రసక్తిలేదు. కాబట్టి వారిని నిందించి ప్రయోజనం లేదు. దేవుళ్లను ఎందుకు చేశారు, ఎలా చేశారు అనేదాన్ని గురించి ఆలోచించి, పరిష్కరించే అవసరమున్నది.
రామాయణ కథ జరిగిందా?
రామాయణ కథ వాల్మీకి రచనకు పూర్వం, వాస్తవంగా జరిగిందా అనేదాన్ని గురించి అనేక చర్చలు జరుగుతున్నాయి. ఋగ్వేదంలో రామకథ వుందని చెబుతున్నారు. "రామో నామ జనైశ్శ్రుతః" రాముడనే వాడిని గురించి జనం చెప్పుకుంటున్నారు అని అంటున్నాడు నారదుడు - అంటే వాల్మీకి రామాయణాన్ని వచించే కాలానికి రాముడు వుండివుండాలి. రాముని కథ జనం చెప్పుకుంటున్నారంటే అప్పటికే రాముడు సుప్రససిద్ధుడు. కాని, రాముని గురించిన కథ కావ్యంగా వినిపించడం జరగలేదు. ఆ పని చేసినవాడు వాల్మీకి. ఎక్కడో రేఖామాత్రంగా వున్న రాముని కథను తీసుకొని ఒక ఉదాత్తమైన కావ్యాన్ని సృష్టించాడు వాల్మీకి. రామకథ అంతకుముందు లేదంటే, వాల్మీకి ప్రభావం పెరుగుతుందే గాని తరగదు. ఏం చేతంటే లేని కథను అంత ఉత్తమమైన కావ్యంగా సృష్టించడం అతని గొప్పతనం అవుతుంది. కాక ఋగ్వేదాల్లో రామ కథ వుందంటే అది పరిశోధనకు పనికి వచ్చేదిగాని కావ్యంగాదు.
శకుంతల కథ భారతంలో వుంది. పద్మపురాణంలో వుంది. కాని కాళిదాసు అభిజ్ఞాన శాకుంతల వ్రాసిం తరువాత దానికి మూలకథ ఎక్కడవుంది? అని పరిశోధించడానికే భారత పద్మపురాణాలు పనికి వస్తాయి. కాని మనకు తెల్సిన శాకుంతల కథ కాళిదాసు వ్రాసిందే. ఎక్కడో వున్న బీజాన్ని తీసుకొని దాని అస్తిత్వాన్ని సైతం మరిపించేట్లు ఒక రసవత్తరమైన కావ్యసృష్టి చేశాడు కాళిదాసు. అలాగే ఎక్కడో కథవున్న రామాయణం, ఎక్కడో రేఖా మాత్రంగావున్న కథా వస్తువును తీసుకొని ఒక మహాకావ్యంగా, సుందరంగా చిత్రించాడు వాల్మీకి. కవిత నిరుపమానం అయింది. వాల్మీకికి వాల్మీకే ఉపమానం. కాళిదాసు భవభూతి, అశ్వఘోహుడు మున్నగు మహాకవులు, వాల్మీకి అడుగు జాడల్లో నడిచారు. వాల్మీకిని అనుసరించని కవి, రామాయణాన్ని పేర్కొనని రచయిత భారతదేశంలో లేరంటే అతిశయోక్తి మాత్రం కాదు.
వాల్మీకి రామాయణం వచించి భారతదేశ సమైక్యత సాధించాడు. ఇంత సాధన సంపత్తితో ఈనాడు మనం సాధించలేని పనిని వాల్మీకి ఆనాడు సాధించాడు. రామకథ అన్ని ప్రాంతాలకూ, అన్ని వర్గాలకూ వ్యాపించేంత బలమైన రచన చేశాడు.
రామాయణం సముద్రం లాంటిది. సముద్రంలోని ఉప్పు వస్తుంది. ఉప్పు సకల రుచులకూ కారణం. అలాగే రామాయణం సకల రసాలకూ మూలం.
రామాయణాన్ని అనేక దృక్పథాలతో పరిశీలించే అవకాశం ఉంది. పరిశీలిస్తున్నారు కూడా. నాకు తోచిన దృక్పథంలో నేనూ పరిశీలించాను. రామాయణ కుటుంబ పరిరక్షణకూ, తద్వారా సమాజ శ్రేయస్సుకూ రాయిపడిందని నా నమ్మకం.
రామాయణ కథ వాల్మీకిని అనుసరించి చెప్పాను. ఎక్కడా మార్పులుగానీ, చేర్పులుగానీ చేయలేదు. కథను సంక్షిప్తం చేశాను, అంతే.
బాలకాండ, ఉత్తరకాండ రెండూ ప్రక్షిప్తాలే. అది నాకు తెలుసు. అయినా వాటిని రామాయణంలో చేర్చాను. కథా గమనాన్ని బట్టి అవాల్మీకం అని మీరూ గ్రహించగలరు.
కొన్ని అధ్యాయాలకు నాకు తోచిన వ్యాఖ్య రాశాను. అంశం చదివిం తరువాత నా వ్యాఖ్య చదువుతారు. కాబట్టి మీరూ అందును గురించి ఆలోచించవచ్చు.
రామాయణంలో కొంత పరిశ్రమ చేశాను. మీ ముందుంచాను. నిర్ణయించాల్సింది మీరు.
మీ
దాశరథి రంగాచార్య