డప్పుల శబ్దం మళ్ళీ ప్రారంభమైంది.
పూజారి గుడి లోపల నుంచి బయటికి వచ్చి, చీటీల పళ్ళాన్ని లోపలికి తీసుకెళ్ళాడు.
అంతకు ముందు తెగిన పొట్టేళ్లు, కోళ్ళు నిస్తేజంగా పడున్నాయి.
ఆ రోజు బసిలిగా ఎవరొస్తారోనన్న కుతూహలం జనాన్ని ముందుకు తోసింది. జనం ముందుకు వురుకుతున్నారు. కొందరు వాళ్ళను వెనక్కు నెడుతున్నారు.
యానాది స్త్రీలు ఎక్కువ మందే వున్నారు. రైతు కుటుంబాల స్త్రీలు గుడికి కాస్త దూరంలో గుంపుగా నిలుచున్నారు.
పూజారి మంత్రాలు డప్పుల శబ్దంలో విన్పించడంలేదు.
కాగడాలు ఆ ప్రదేశాన్నంతా రక్తం మడుగులా చేస్తున్నాయి.
పూజారి లోనుంచి చీటీల పళ్ళెంతో వచ్చాడు.
డప్పుల శబ్దం ఒక్కసారిగా ఒళ్ళు విరుచుకుంది.
స్త్రీలంతా కళ్ళు సాగాదీసుకుని చూస్తున్నారు.
పురుషులు బసిలిగా రాబోయే అమ్మాయి గురించి ఆలోచిస్తూ, ఆవేశానికి గురవుతున్నారు. ఆ రాత్రి భుజంగంతో గడిపిన బసిలి మీద రేపటి నుంచి అందరికీ హక్కు వుంటుంది.
"బసలిని పిలిచి చీటీ ఎత్తమనండి" అన్నాడు భుజంగం యానాది పెద్దతో.
పెద్ద లేచి గుంపువైపు చూసి "రా! మంగమ్మా!" అని పిలిచాడు.
ఓ ఆకారం జనాన్ని తోసుకుని ముందుకొచ్చింది.
ఆమెను చూస్తేనే నా గుండె ఝల్లుమంది. ఎముకల మీద చర్మాన్ని చుట్టబెట్టుకున్నట్టు వుందా అమ్మాయి. ఆమె తన వయసును ఎక్కడో పోగొట్టుకున్నట్టుంది. సొగసును చెదపురుగులు కొట్టేసినట్టుంది. ఆ కళ్ళు గాజుగోళీల్లా వున్నాయి, చెంపలు లోపలికెళ్ళి చీకటి గుహల్లా వున్నాయి. ఎండిపోయిన గుండెలమీద పైట నిలబడక, కిందకు జారిపోతూ వుంది. పొట్ట లోపలికెళ్ళి, పక్కటెముకలు వికారంగా కనిపిస్తున్నాయి. ఆమె ముఖంమీద పడిన ఎర్రటి వెలుగు కూడా జిలుగు కోల్పోయింది.
బసిలి కాకముందు ఆ అమ్మాయి అందంగా వుండేదనిపించింది.
ఆమె ముందుకు వచ్చి, పళ్ళానికి నమస్కరించి, ఆ తరువాత గంగమ్మకు నమస్కరించింది.
డప్పులు లేని ఆవేశాన్ని తెచ్చుకుని అరుస్తున్నాయి.
అందరూ చూపులను అటే నిలబెట్టారు. ఏదో తెలియని కుతూహలం అందర్నీ వణికిస్తోంది.
భుజంగం ఓసారి మీసాలను దువ్వుకున్నాడు.
యానాది పెద్ద నడుం వంచి, గంగమ్మకు దండంపెట్టి, మళ్ళీ నిటారుగా నిలబడ్డాడు. బొల్లి మచ్చలతో ఆయన కట్ల పాముకూ, మనిషికీ పుట్టినట్లు కనిపిస్తున్నాడు. ఆ చీకటిలో, ఆ ఎర్రటి వెలుగుల్లో ఆయన ఎందుకో భయంకరంగా కనిపిస్తున్నాడు.
పాలేరు చీటీలను కలియబెట్టాడు.
మంగమ్మ చేయి ముందుకు చాచి, పళ్ళెంలోంచి ఓ చీటీ ఎత్తుకుంది. దాన్ని ఆమె గుప్పెట మూసింది.
పూజారి ఒకడుగు ముందుకేసి చీటీ తీసుకున్నాడు.
డప్పులు నోళ్ళు మూశాయి.
నిశ్శబ్దం. సూదిపడినా వినపడేంత నిశ్శబ్దం.
వెనుక నిలుచున్న వాళ్ళు తలలను రిక్కరించారు. ముందున్న వాళ్ళు బలంకొద్దీ తమ మీద పడుతున్న వాళ్ళను వెనక్కు నెడుతున్నారు.
పూజారి చీటీ విప్పాడు.
కాగడాలు నింపాదిగా వెలుగుతున్నాయి. గాలి మనుషులను తప్పించుకుంటూ సాగిపోతూంది.
పూజారి ముఖంలో రంగులు మారాయి. ఆయన ముఖంలో ఎవరో ముళ్ల కంపపెట్టి లాగినట్టు ఎర్రగా తయారయింది. ఆయన అదురుతున్నాడు. ఆయన కళ్ళు ఏదో జరగరానిది జరిగిపోయినట్టు నిలబడిపోయాయి.
భుజంగం మాత్రం యథా ప్రకారం గాభీర్యాన్ని ముసుగులా కప్పుకుని చూస్తున్నాడు.
"పూజారి గారూ! ఎవరొచ్చారు?" భుజంగం అడిగాడు.
"అపచారం జరిగిపోయింది బాబూ" పూజారి కళ్ళల్లో నీళ్ళు ఊరాయి.
"అపచారమా?" భుజంగం తన ముసుగును తీసుకుని మామూలు మనిషిలా స్పందించాడు.
"అవును బాబూ! మీ కుమార్తె పేరు వచ్చింది" చెప్పవచ్చో, చెప్ప కూడదో నన్నట్టు ఒక్కో మాటను సాగదీసి పలికాడు పూజారి.
ఆ మాటలకు జనం ఒక్కసారి ముందుకు తూలారు. ముందున్న వాళ్ళు పట్టు తప్పి, మూడడుగులు ముందుకొచ్చారు.
కట్లపాము బుట్టలో కదిలినట్టు యానాది పెద్ద చిన్న జర్క్ ఇచ్చాడు.
భుజంగం స్ప్రింగ్ లా పైకి లేచి, పూజారి చేతిలో నుంచి చీటీ ఠక్కున లాక్కున్నాడు. అందులోని 'అనూరాధ' అనే అక్షరాలు ఆయనకు మసగ్గా కనిపించాయి.
అనూరాధ ఆయన కూతురు.
గాలి ఈ ఘోరాన్ని చూసి బిగదీసుకుపోయినట్టుంది. కాగడాలు చివరి శ్వాస వదులుతున్నట్టు రెపరెపలాడుతున్నాయి. ఆకాశం నల్లటి మబ్బులతో పొర్లుతూ వుంది. చీకటి నల్లగా కురుస్తోంది.
నిండా పద్దెనిమిదేళ్ళు కూడా లేని భుజంగం కూతురు బసిలి అవుతుందా? ఆచారం మేరకు అనూరాధ కన్నతండ్రి భుజంగంతో ఈ రాత్రి గడుపుతుందా? ఏం కాబోతోంది?
4
నాకు స్పృహ తప్పేటట్టుంది. మధ్యాహ్నం తాగిన కల్లు కడుపును తిప్పుతోంది.
చాలా సేపటివరకు ఎవరూ ఏమీ మాట్లాడలేదు. చివరకు యానాది పెద్ద ధైర్యంచేసి "ఇప్పుడేం చేద్దాం దొరా?" అని అడిగాడు.
"చేసేదేముంది జాతరా లేదు, గీతరా లేదు. అందరూ ఇళ్ళకు వెళ్లిపొండి" పిచ్చిపట్టినవాడిలా అరిచాడు భుజంగం. ఆయన కళ్లు కాగడాల్లా వున్నాయి.
పూజారి వణికిపోతున్నాడు. ఆయన ప్రతి నిముషానికోమారు తన నడుముకు వున్న ఉత్తరీయాన్ని విప్పి, మళ్ళీ కట్టుకుంటున్నాడు.
"జాతరను మధ్యలో ఆపుచేయడం అరిష్టం బాబూ! మరోసారి ఆలోచించండి" యానాది పెద్ద విన్నవించుకున్నాడు.
"అంటే నా కూతుర్ని బసిలిని చేయమనా నీ ఉద్దేశ్యం" అని దెయ్యం పూనిన వాడిలా భుజంగం ఒకడుగు ముందుకేసి యానాది పెద్దను చాచి లెంపకాయ కొట్టాడు.
యానాది పెద్ద తూలి పడబోయి నిలదొక్కుకున్నాడు.
అందరూ బొమ్మల్లా నిలబడిపోయారు. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో వూహకందడం లేదు. అయితే వాళ్ళు రకరకాల ఆవేశాలతో వంకర్లు తిరిగి పోతున్నారు.
రైతులు ఏంచేయాలో పాలుపోక గుడ్లప్పగించి చూస్తున్నారు.