వచ్చేముందు-
"పిచ్చిమొద్దూ...అలా బెంగపెట్టుకోకు...ఆరోగ్యం జాగ్రత్త...రోజూ ట్రీట్ మెంట్ తీసుకో-మనకు పుట్టబోయే బాబు ఎలా ఉండాలి. తెల్సా ఆపిల్ పండులా ఉండాలి...తెల్సా...బై దిబై నేను మళ్ళీ ఓ నాల్రోజులు తర్వాత కలుస్తాను...మధ్యలో వీలైతే వస్తాను...డోన్ట్ వర్రీ..."
హాస్టల్ బయటికొచ్చాడు.
అక్కడ ఆటో ఎక్కి తన కాలేజీ కెళ్ళాడు. కానీ ఒంట్లో బాగులేదని క్లాసులు తీసుకోలేదు.
మధ్యాహ్నం మూడున్నర వరకూ కాలేజీలో ఎలాగోలా గడిపి బయటికొచ్చాడు?
దార్లో పబ్లిక్ టెలిఫోన్ బూత్ దగ్గర్నించి రోష్ణీకి ఫోన్ చేశాడు.
క్లాసులు కేన్సిల్ అయితే ఇంటికెళ్ళిపోయిందట.
ఇంటికి ఫోన్ చేద్దామనుకున్నాడు. కానీ మళ్ళీ రోష్ణీకి కోపం వస్తే...
ఆ ప్రయత్నం విరమించుకున్నాడు.
నేరుగా జగదంబా జంక్షన్ వరకూ నడిచొచ్చి...స్కైలైన్ బార్లో కూర్చున్నాడు.
బార్లో ఎవరూ లేరు.
గదిలో ఓ కార్నర్లో కూర్చుని క్వార్టర్ ఓల్ట్ మాంక్ రమ్ ఆర్డర్ చేశాడు.
అయిదు నిమిషాల్లో డ్రింక్ వచ్చింది. దాంతోపాటు జీడిపప్పు చిప్స్, ఆనియన్స్ కూడా తెప్పించాడు.
నెమ్మదిగా తాగుతూ ఆలోచిస్తున్నాడు.
గౌతమిని మాయమాటలతో ఎన్నాళ్ళో తను మోసం చేయలేడు. ఏదో రోజు తనని రోష్ణీతో పాటు చూస్తుంది.
గౌతమే చూడక్కర్లేదు. లేడి డాక్టర్ చూసినా చాలు, గౌతమీ తన ద్వారా గర్భవతి అయిందన్న విషయం నిన్నటివరకూ లేడీ డాక్టర్ కి ఒక్కరికే తెల్సు. కానీ ప్రస్తుతం ఆమె చెల్లి...శ్వేతక్కూడా తెల్సిపోయింది...శ్వేతకి తన ఫోటో కూడా చూపించి ఉంటుంది...గౌతమీ శ్వేత తనని ఎలాగైనా గుర్తుపడుతుంది...
అంచేత ప్రమాదమేమీ రాకుండా తను ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి...తమ పెళ్ళి విషయాన్ని రోష్ణీ సెటిల్ చేసిన వెంటనే...తను చాలా జాగ్రత్తగా...చాలా చాలా జాగ్రత్తగా...
అప్పుడెప్పుడో....
ముంతాజ్ ని చంపినట్టు....
ఏ సాక్ష్యాధారాలూ దొరక్కుండా....
ఎవరికీ తెలీకుండా....
చంపాలి....
అవును-
చంపాలి-
అవును-
ఎలా-?
పావుగంటలో పావు సీసా రమ్ ఖాళీ అయిపొయింది. మళ్ళీ క్వార్టర్ కి ఆర్డరిచ్చాడు. సర్వర్ తీసికొచ్చాడు. సీసాలోని డ్రింక్ ని గ్లాసులో పోసి, ఐస్ క్యూబ్స్ వేసి, థమ్స్ అప్ కలిపి ఎదురుగా పెట్టి వెళ్ళిపోయాడు.
చేతిలోని గ్లాసుని తీసుకొని, గడగడా ఎత్తి ఒకే గుక్కలో మొత్తం తాగేసాడు.
అతని నరాల్లోకి మెల్లగా మత్తు ప్రవేశిస్తోంది.
అతని ఒంట్లోకి ఏదో తియ్యని హాయి ప్రవేశిస్తోంది.
అప్పుడా సమయంలో-
అతని కళ్ళకు ఒ రెండు కళ్ళు కన్పించాయి.
ఆ రెండు కళ్ళు రోష్ణివి.
రోష్ణి.
రోష్ణి అతని కళ్ళకిపుడు దిగంబరంగా కన్పిస్తోంది.
కరెన్సీ నోట్ల కట్టల పరుపు మీద ఒంటిమీద ఏ ఒక్క ఆచ్చాదనా లేకుండా అవినాష్ ని ఊరిస్తూ కూర్చుంది రోష్ణి.
వత్తైన రోష్ణి జుత్తు-పొడవాటి రోష్ణి జడ-సంపెంగ పువ్వులాంటి ముక్కు- ఆముక్కు చివర నీలపు పొడి- శంఖంలాంటి కంఠం- తెల్లటి శరీరం-ఆ శరీరంలో వెన్నలా మెరుస్తున్న వయసు-గుండెల మీద నిండుగా వయసుకి గుర్తుల్లా కోవా రంగులో మెరుస్తున్న ఎద...ముడతలు పడి నడుం...ఆ క్రింద నునుపైన...
ఆ అందం తనది. రోష్ణి ఐశ్వర్యం తనది.
రోష్ణి కోసం తనేవైనా చేస్తాడు.
'రోష్ణి' మైకం తలకెక్కిన అవినాష్ గట్టిగా బయటకే కేక వేశాడు.
ఆ కేకకు చుట్టు పక్కల కూర్చున్న వ్యక్తులు కంగారుగా అవినాష్ వేపు చూశారు.
అవినాష్ వాళ్ళ నెవర్నీ పట్టించుకోలేదు.
తన గొడవలో తను, తన లోకంలో తను, అవినాష్ తన చుట్టూ తను తిరుగుతూ రోష్ణి చుట్టూ, డబ్బు చుట్టూ తిరుగుతున్నాడు.
ఆ రోష్ణి గౌతమిని చంపేయమని చెప్తోంది.
ఆ డబ్బు ప్రపంచాన్నే చంపేయమని, తనని స్వాధీనం చేసుకోమని చెప్తోంది.
ఆ డబ్బు నువ్వు నరరూప రాక్షసుడివి కమ్మని చెప్తోంది. దయా, ధర్మం, న్యాయం, చట్టం వేటికి దొరక్కుండా తనకోసం కలలు కనేవాడి కోసమే తనున్నానంటూ ఆ డబ్బు ధర్మ రహస్యం అవినాష్ చెవిలో చెప్తోంది.
ఆ డబ్బు చెప్తున్న 'భగవద్గీత' వింటున్నాడు అవినాష్.
అతనిలో ఇప్పుడు మనిషి అన్నవాడు ఏ కోశానా లేడు.
అతనిలో ఒక మృగం ఇప్పుడే మొలిచింది. ఆ మృగానికి కళ్ళు లేవు మెదడుంది. ఆ మృగం నెత్తిమీద కొమ్ములు లేవు. రక్తంతో తడిసిన వాడి ఖడ్గాలున్నాయి. ఆ మృగానికి కాళ్ళు లేవు గోళ్ళు మాత్రమే ఉన్నాయి.