Previous Page Next Page 
జనవరి 5 పేజి 14

 

        మరెలా ఈ ధర్మసంకటం నుంచి బయటపడటం? అసలీ ఆర్గ్యుమెంట్ మొదలు కాకముందే ఏదో ఒక ట్రైన్ దొరికి వుంటే యీ పరిస్థితి యెదురయ్యేది కాదు.
   
    "చెప్పక్కా...ఏ విషయాన్నయినా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోగల విజ్ఞత నీకుంది.
   
    అలాగే ఇదీ ఆలోచించి చెప్పు.....నువ్వేది చేయమంటే అదే చేస్తాను" అన్నాడు అభిరామ్ వినయంగా.
   
    స్థిమితంగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకోగల ఏకాగ్రతను మేఖల కూడబెట్టుకోలేకపోతోంది.
   
                                   *    *    *    *    *
   
    అచ్యుత్ అనుచరులు జాగిల్లా నగరం మీద విరుచుకుపడ్డారు.
   
    ప్రతి అంగుళం క్షుణ్ణంగా గాలించే కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నమై పోయారు.
   
    సాధారణంగా రౌడీలుకాని, గూండాలుకానీ తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకొనేందుకు నగరంలో ఏదో ఒక గందరగోళాన్ని సృష్టించి అందులో తనదే పైచేయి అయ్యేలా చూసుకుంటుంటారు.
   
    అందుకు అవసరమైతే ఎవరో ఒక అనామకుణ్ణి పబ్లిగ్గా, పట్టపగలే హత్యచేసి నగర ప్రజల్లో భయోత్పాతాన్ని సృష్టిస్తారు.
   
    అనాగరిక సమాజపు లక్షణాలు, ఆది మానవుడి యుగంనాటి లక్షణాలు యిప్పుడు యీ నాగరిక సమాజంలో కూడా అప్పుడప్పుడు బయట పడుతుంటాయి.
   
    అప్రతిహతంగా సాగిపోతున్న తన అనువంశిక రౌడీ పాలనకు ఓ బుడతడు, మీసాలే సరిగ్గా రాణి యువకుడు అడ్డు తగులుతాడా....? ఇప్పుడు తలవంచి, తాత్సారం చేస్తే తనంటే ఈ నగర ప్రజలకు భయముంటుందా? అచ్యుత్ పరిపరి విధాలు ఆలోచిస్తూ జీప్ ని గంటకు తొంభై కిలోమీటర్ల వేగంతో ముందుకు దూకిస్తున్నాడు.
   
    పది బ్యేచెస్ గా చీలిపోయిన చ్యుత్ ముఠా ఇరవై నిముషాల్లోనే నగరాన్ని చుట్టుముట్టాయి.
   
    అందులో ఓ బ్యాచ్ రైల్వే స్టేషన్ కేసి దూసుకు వచ్చింది.
   
    జీప్ స్టేషన్ ముందు ఆగుతుండగానే బిలబిలమంటూ నలుగురు వ్యక్తులు అందులోంచి దూకి స్టేషన్ మెయిన్ గేట్ కేసి దూసుకు రావడాన్ని మేఖల పసిగట్టి ఉలిక్కిపడింది.
   
    వాళ్ళక్కడే ఆగి ఎవరినో ఏదో అడగటం కనిపించింది.
   
    ఏదో ఒక అద్భుతం జరిగి అప్పటికప్పుడు అభిరామ్ అక్కడి నుండి అదృశ్యమైతే తప్ప ముంచుకు వస్తూన్న ప్రమాదం నుండి బయటపడటం కష్టం.
   
    ఆమె మెదడు పాదరసం కన్నా వేగంగా పనిచేసిందో క్షణం.
   
    ఆ వెంటనే తమ్ముడి చేతిని పట్టుకుని బరబరా లాక్కొంటూ వెళ్ళి అప్పుడే ఆగిన లోకల్ ట్రైన్ ని కేచ్ చేసింది.
   
    అభిరామ్ కి ఆలోచించుకునే టైము కూడా ఇవ్వకుండా మెరుపు వేగంతో ఆ పని చేసింది.
   
    ట్రైన్ ఎక్కేకగాని మేఖల స్థిమిత పడలేకపోయింది.
   
    "ఇప్పుడేదో ట్రైన్ బయలుదేరబోతోంది. అందులో పారిపోతున్నారేమో...?"
   
    అచ్యుత్ అనుచరుల్లోని ఒక వ్యక్తి అన్నాడు అనుమానంగా.
   
    "అది లోకల్ ట్రెయిన్ అదెక్కడికి పోదు. ఎటు వెళ్ళినా నగరం వరకే పరిమితం. అవుట్ స్టేషన్ కెళ్ళే ట్రెయిన్ అయితే ఆ అవకాశం వుంటుంది. ముందు స్టేషనంతా గాలిస్తే సరిపోతుంది. కమాన్ క్విక్ సెర్చ్..."
   
    అంటూ మరొక అనుచరుడు పెద్దగా అరవటం మిగతా ముగ్గురూ మూడువేపులకు దూసుకు వెళ్ళటం స్పష్టంగా గమనించింది మేఖల.
   
    ట్రెయిన్ కదిలింది.
   
    మేఖల ఒక్కసారి వూపిరి తీసుకుంది. సమయానికి లోకల్ ట్రైన్ రాకుండా వుంటే....? తృటిలో ఎంత ప్రమాదం తప్పిపోయింది....? ఆ ట్రెయిన్ ని ఎందుకు చెక్ చేసే ప్రయత్నం చేయలేదు? బహుశా లోకల్ ట్రైన్ గనుక ఎంతో దూరం ప్రయాణించే అవకాశం వుండదని భావించి వుండవచ్చేమో....?
   
    ట్రైన్ అవుటర్ సిగ్నల్ దాటి వేగం పుంజుకుంది.

                    *    *    *    *    *
   

    అంతా వెళ్ళిపోయారని నిర్ధారణ అయ్యాక అరుణాచలం, ఆదిలక్ష్మి తమ యింటి ముందుకొస్తూనే ఒక్కసారి బావురుమన్నారు. రాత్రింబవళ్ళు శ్రమించి నిర్మించుకున్న పొదరిల్లులాంటి తమ నివాసం గూండాల ఘాతు కత్వానికి చెల్లాచెదురయిన విధానాన్ని చూసి కుళ్ళి కుళ్ళి ఏడ్చారు.
   
                    *    *    *    *    *

   
    రైల్వేస్టేషన్ కేసి వచ్చారంటే....బహుశా తాము పారిపోయి ప్రాణాలను దక్కించుకునే స్థితిలో వున్నట్లు అచ్యుత్ అనుమానించి వుంటాడు.
   
    ఈ ట్రైన్ ప్రక్క స్టేషన్ లో ఆగినప్పుడు దిగాలా లేదా? అక్కడిక్కూడా వాళ్ళు చేరుకొని వుండరనే నమ్మకం లేదు.
   
    మరిప్పుడెలా తన తమ్ముడ్ని రక్షించుకునేది....? జీవితంలో ఆమె ఎప్పుడూ అంత టెన్షన్ ని అనుభవించలేదు. అంతగా భయపడలేదు.
   
    ఓసారి అభిరామ్ కేసి చూసింది వేటగాడిలా, దెబ్బతిన్న పులిలా అతని కళ్ళు సవరించటాన్ని గమనించింది.
   
    ఆ కేబిన్ లో మరో యిద్దరే ప్యాసింజర్స్ వున్నారు. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ పరిసరాల్ని గమనించే స్థితిలో లేరు.
   
    అంతే.... ఆమె మరుక్షణం ఓ అడుగు కుడివేపుకి వేసి చెయిన్ ని బలంగా లాగింది. అక్క చర్యను అభిరామ్ గమనించాడు. అతనికేదో అడగాలనే వుంది. కాని ధైర్యం చాలక వూరుకుండి పోయాడు. ఒక కిలో మీటర్ భారంగా కదిలిన ట్రైన్ ఆగిపోయింది.
   
    మరొక్క క్షణం ఆలస్యం చేయలేదు మేఖల. తమ్ముడి చేతిని దొరక బుచ్చుకుని తలుపువేపు లాక్కెళ్ళి దిగమన్నట్లుగా చూస్తూ తనూ దిగేసింది.
   
    ఆ ప్రాంతంలో రైల్వే ట్రాక్ కి జన నివాసాలకు మధ్య యే అడ్డూ లేదు.
   
    ఎత్తయిన బిల్డింగ్స్ మీద వెలుగుతున్న లైట్ల కాంతి ఆ ప్రాంతమంతా అస్పష్టంగా పరుచుకొని వుండటంతో పరిసరాల్ని స్పష్టంగా గమనించగలిగారు ఇద్దరు.
   
    తను నాలుగడుగులు ముందుకేసినా, ఏమాత్రం కదలకుండా వున్నా చోటనే శిలాప్రతిమలా నిలిచిపోయిన తన తమ్ముడ్ని తల తిప్పి చూసింది మేఖల.
   
    ట్రైన్ తిరిగి వేగం పుంజుకుంది.
   
    "ఎందుకు? ఏమిటి? అనే ప్రశ్నలు వేయకుండా నా వెంటరా..... నా మీద నీకే మాత్రం గౌరవమున్నా నేను చెప్పినట్టు చేస్తావు. వివరాలేమీ అడగవు...." అంది మేఖల స్థిరంగా.
   
    అభిరామ్ అంతరంగంలో ఘర్షణ జరుగుతోందని అతని ముఖకవళికల్ని బట్టి మేఖల గ్రహించింది.
   
    కీచురాళ్ళ శబ్దం తప్ప ఆ ప్రాంతమంతా గాఢ సుషుప్తిలో మునిగి వుంది.
   
    ఎప్పుడూ చవిచూడని అనుభవం....
   
    మరెప్పుడూ వూహించని ప్రమాదం....
   
    ఒకప్పుడు పొదరిల్లులా పొందికగా వున్న కుటుంబం రెండుగా చీలిపోయింది.
   
    స్వీట్ హోమ్ అనుకున్న పదిలమైన తమ ఇల్లు బిక్కు బిక్కుమంటోంది.
   
    మేఖల ఆలోచిస్తూనే తమ్ముడ్ని తీసుకొని ఎదురుగా కనిపిస్తున్న కాలనీకి సాగిపోయింది.
   
    రెండు గంటల క్రితంవరకు అభిరామ్ అక్కలాగే ప్రవర్తించిన ఆమె ఇప్పుడు తల్లి పాత్రలోకి మారిపోయింది. న్యాయం, అన్యాయం, ధర్మం, అధర్మంలాంటి యక్తాయుక్తాలు ఆలోచించే స్థితిలో లేదామె. ఎలాగయినా ఆవేశపరుడయిన, ఆటంబాంబులాంటి తమ్ముడ్ని కాపాడుకోవాలి. బాధ్యత తీసుకున్న మొదటి దశలోనే రాక్షస మూకల అరాచకత్వానికి తన ప్రాణానికి ప్రాణంగా చూసుకునే తమ్ముణ్ణి బలిపెట్టలేదు.
   
    ఆమె మనసంతా చిరాగ్గా వుంది.
   
    డిప్రెసివ్ గా వుంది.
   
    నలుగురూ గర్వించేలా, ఈ వ్యవస్థకు ప్రయోజనకారిగా తమ్ముడ్ని తీర్చిదిద్దగలనా....? అనే సందేహాలు అంతర్లీనంగా ఆమె నరనరాల్లో పాకి బ్రతుకు భద్రతపట్ల భయాన్ని, సందేహాన్ని రేకెత్తించాయి.
   
    చల్లటి ఈదురుగాలులు క్రమంగా తన ప్రభావాన్ని చూపించటం మొదలయింది. చలికి భయపడి వీధిలో ఎవరూ తిరగటం లేదు. అప్పుడో ఆటో, అప్పుడో కారు తప్ప వీధంతా దాదాపు నిర్మానుష్యంగా వుంది.
   
    రోడ్డు వారగా నడుస్తున్న మేఖల పరిసరాల్ని అప్రమత్తంగా గమనిస్తూనే వుంది.
   
    మరి కొంత దూరం ముందుకు వెళ్ళాక కనిపించిందో టీ బంక్ కష్టమర్స్ ఎవరూ రాకపోవడంతో దాని యజమాని క్లోజ్ చేసే ఉద్దేశ్యంతో సరంజామాని ఇద్దరు కుర్రాళ్ళ సహాయంతో సర్దేస్తున్నాడు.

 Previous Page Next Page