ఆక్కడ్నించి సరస్వతీదేవి దగ్గిరకెళ్ళాం ఆమె తప్పుడు సాహిత్యాన్ని, తప్పుల సంగీతాన్ని సరిదిద్దలేక విజ్ఞానాన్ని సక్రమంగా పెట్టడానికి చేతికింద బోలెడుమంది పనివాళ్ళని పెట్టుకొని వాళ్ళతో సరిదిద్దిస్తున్నది.
"విజ్ఞానాన్ని పెంపొందించడమేమోగని ఇందరజ్ఞానులని చూసింతర్వాత నాకున్న జ్ఞానం పోయేట్టుంది" అంటూ ఆమె బాధలే బాధలు అనుకుందిగాని మా అగోడు వినిపించుకోలేదు. అందుకే మీ దగ్గరకొచ్చాం. మీ చేతిలో నలుగుపిండి తప్ప మీ దగ్గర ఒక్క అసిస్టెంటూలేదు. మాకెంత ఆనందంగా ఉందో మీరొక్కరే తీరుబడిగా కనిపించారు" అంటూ లీడర్ లీలారాణి అసలు విషయం నాలుగు మాటల్లో వివరించింది.
"తల మునకలయ్యేది తల్లకిందులయ్యేది వాళ్ళంతా అదృష్ట వంతులు మరొకళ్ళు లేరు. మీ భూలోకంలో ఎవరి నోరు కదిపినా వచ్చే మాటలు రెండు. ఒకటి ధనం రెండోది చదువు. ఇంక వాళ్ళకి ఏమీ అక్కరలేదు. అందువల్ల లక్ష్మి సరస్వతులు బిజీగా వున్నారు. నాదేముంది! పూర్వం ఏ రాక్షసుడ్నో వధించాలంటే నన్ను తలచుకొనేవాళ్ళు ఇప్పుడావసరం కూడా లేదు. రక రకాల ఆయుధాలు రకరకాల బాంబులు వాళ్ళే తయారుచేసి ఒకళ్ళమీద ఒకళ్ళు విసురుకొంటూ ప్రయోగాలు చేస్తున్నారు. ఇక్కడ మీట నొక్కితే అక్కడ బాంబు పేలుతున్నది. నా శూలంతో పనేముంది? నాతో పనేముంది? రోజు మొత్తంలో కొంతసేపు నాట్యానికి కేటాయిస్తాను. ఆ తర్వాత చేసే పనేముంది? ఇల్లు చిమ్మాలా! వాకిలి ఊడ్చాలా! ఇదిగో ఇలా నలుగుపిండి కలుపుకుని సరదాగా బొమ్మలు చేసుకుంటూ ఉంటాను" అంటూ తన విషయం చెప్పుకొచ్చింది పార్వతీదేవి ఒక్కసారి ఇంతమందిని చూసేసరికి ఆమె వాక్ప్రవాహం ఎక్కువైపోయింది.
"లాభంలేదు. డైరెక్టుగా అసలు విషయానికి రావడం మంచిది" అనుకున్న లీడర్ లీలారాణి "తమ కన్నీళ్ళు...కష్టాలు...కధలు...కావాల్సిన కోరికలు...పొందవలసిన వరాలు" అన్నీ టక టక చెప్పేసింది.
వాళ్ళ కోరికలు విని ఆ జగన్మాత ఆశ్చర్యంతో ముందు తెల్లబోయింది. "మనం తల్లులం. మనకిలాంటి కోరిక తగదు. ఈ సృష్టికి మూలం మహాశక్తి అంటే స్త్రీ. అదికూడా తెలీదా! నేను బిడ్డల్ని కన్నాను అయినా తోచక నా మాతృత్వం తీపి గురుతు తీరిక నలుగుపిండితో బొమ్మలుచేసి తమాషాగా వాటికి పేర్లు పెట్టుకుని వాటితో ఆడుకొంటూ ఆనందిస్తున్నాను. కాన్పు అయ్యే ఆ కాసేపు మరో బిడ్డను కననని లబ్బున గోలపెట్టే ఆ స్త్రీయే మళ్ళీ బిడ్డను కంటానికి ఆనందిస్తుంది. మాతృత్వం....మమకారం...స్త్రీల సొత్తు వీటిని కాదనే అధికారం ఎవరికీ లేదు ఏడేడు జన్మలు కాదుకదా వేల జన్మలు ఎత్తినా మగవాడికి మాతృత్వంలోని మధురిమ అర్ధం కాదు..."
జగజ్జనని పార్వతీదేవి ఆవేశంగా ఆనందంగా ఆహ్లాదకరంగా కామా ఫుల్ స్టాప్ లు లేకుండా మాతృత్వం గురించి చెప్పుకు పోతూంటే అందరూ మరోసారి తెల్లబోయి ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు.
"....కాబట్టి చెప్పేదేమిటంటే మీరిలాంటి పనికి మాలిన కోర్కెలు కోరవద్దని మాత్రమే క్రొత్త ప్రయోగాలవల్ల కన్నీళ్ళు పోవాలి అంటే మీలో ఒక్కొక్కళ్ళు కాళియై....మహంకాళియై...భద్రకాళియై రుద్రకాళియై...చండికయై... రణ చండికయై...మొండికై..."
"అమ్మా!" అంటూ అందరూ ఒక్కసారిగ అరిచారు.
పార్వతీదేవి ఠకీమని ఆపుజేసింది.
"తల్లీ! మీరు మా కష్టాలని సరీగా అర్ధం చేసుకోవడం లేదు. మాతృత్వం వరమే కాదనం వంద బాధలు పడితే ఒక వరం తీరుతున్నది గుర్తింపూలేదు పాడూలేదు మా కోర్కెలు విన్నవించుకుని మేము వరాలు పొంది కాని భూలోకానికి తిరిగి వెళ్ళము" అందరి తరపున గట్టిగా చెప్పేసింది లీడర్ లీలారాణి.
"నేను జగజ్జననిని. నానుంచే మాతృత్వం బయల్దేరింది. ఈ వరాన్ని మార్చడం నా తరం కాదు. పైగా మీరు కోరింది నాకు నచ్చని విషయం మీరు ఎంత వేడుకున్నా మీ కోరికల్ని మాత్రం నేను తీర్చజాలను. ఇంతదూరం కష్టపడి వచ్చారు కాబట్టి ఈ కోర్కెలు తప్ప మరేదైనా కోర్కెలు కోరుకోండి ఇస్తాను" అభయ ప్రదాయని పార్వతీదేవి చిరునవ్వుతో శెలవిచ్చింది.
ఒకసారి వాళ్ళంతా పార్వతీదేవివైపు ఆమె చేసిన నలుగు పిండి బొమ్మలవైపు చూశారు. ఆ బొమ్మలన్నీ ఆడ, మగ ఆ బొమ్మలన్నీ రక రకాల సైజుల్లో రకరకాల దుస్తులు ధరించి అందంగా వున్నాయ్. ఈ జగత్తంతా ఆమె పిల్లలే వాళ్ళుగాక విఘ్న నాయకుడు వినాయకుడు, కుమారస్వామి ఉండనే ఉన్నారు ఉన్నావాళ్ళు చాలక చిన్న పిల్లలు లక్కపిడతలతో ఆడుకుంటున్నట్టు నలుగుపిండితో అమ్మాయి, అబ్బాయి బొమ్మలను చేసి వాటిని చూసి ఆనందిస్తున్నది నోరు తెరచి బాధల్ని చెప్పుకుంటే లాభం లేకపోగా భారీ భారీ డైలాగులతో పెద్ద స్పీచ్ వినాల్సి వస్తున్నది. ఇక్కడ తమపని కాదు. అంతా రూఢీ చేసుకున్నారు. తెలివిగా ఆలోచించింది లీడర్ లీలారాణీయే.
"లక్ష్మి....సరస్వతి...పార్వతి....మా తల్లులు మీరు ముగ్గురూ మా కోర్కెలు తీర్చలేకపోయారు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి. ఏం చేయాలి? పరాజయంతో మేము వెనక్కి మరలిపోయేది లేదు. దక్ష యజ్ఞంలో మీరు ఆత్మాహుతి చేసుకొన్నట్లు మేమంతా ఇక్కడ నీ ముందే ఆత్మహత్యలు చేసుకుని ఈ తనువులు చాలిస్తాం. మీరు మా కోర్కె చెల్లించలేకపోయినా కనీసం మాకు మరో మార్గం ఏదైనా ఉపదేశించండి. లేకపోతే ఎలాగూ పరిష్కారం ఉందనే ఉంది ఆ...త్మ....హ...త్య..." అంటూ లీడర్ లీలారాణి ఆఖరి అస్త్రం ప్రయోగించింది.
"నాది తల్లి హృదయం నా బిడ్డల్ని చేతులారా నేను చంపుకో లేను. అలా అని మీ కోర్కెల్ని నేను తీర్చలేను. ఒక ఉపాయం మాత్రం చెప్పగలను. ఆ తర్వాత మీ అదృష్టం" భారంగా నిట్టూర్పు విడుస్తూ అంది పార్వతీదేవి.
"ఏమిటా ఉపాయం? చెప్పు తల్లీ!" అంటూ అందరూ ఏక కంఠంతో అరిచారు.
"ఈ సృష్టికి మూల కారకుడు బ్రహ్మదేవుడు మట్టి బొమ్మల్ని తయారుచేసి వాటిని అడ....మగ...గ విభజించి వాటికి ప్రాణంపోసి నుదుట రాతలు గీతలూ గీసి సృష్టిని పెంపొందిస్తున్నది ఆ పరబ్రహ్మ మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి. మీ గోడు ఆయనతో విన్నవించుకోండి" అంది పార్వతీదేవి.
"మగవారు...మగవాడు" అంది లీడర్ లీలారాణి.
"మీకు కావాల్సింది మీ కోరికలు తీరడం....వరాలు పొందడం ఈ విషయంలో కోరికలు తీరడమే చూసుకోవాలిగాని వరాలిచ్చేది ఆడ, మగ అన్న మీమాంస దేనికి? ఆలోచించండి" అంది పార్వతీదేవి.
పార్వతీదేవి ఇచ్చిన సలహా వాళ్ళెవరికీ నచ్చలేదు. అంతా అవతలకి వెళ్ళి కాసేపు గుసగుస లాడుకొన్నారు. "యమ బిజీగావున్నా లక్ష్మీ సరస్వతులవల్ల లాభం లేకపోయింది. ఖాళీగావున్నా పార్వతీదేవి వల్లా లాభం లేకపోయింది. తమ కోర్కెల్ని పరమేశ్వరేకాదు అన్నప్పుడు ఇంక ఎవరు తీరుస్తారు? లక్ష్మి....సరస్వతి...పార్వతీ...లను మించిన ఆడదేవుళ్ళు ఇంకెవరూ లేరుకదా! కొంతలో కొంతనయం. పార్వతీదేవి ఉచిత సలహాయైనా ఇచ్చింది. కోర్కెలు తీరిందాకా తగ్గి ఉండటంలో తప్పులేదు. తర తరాలుగా యుగ యుగాలుగ ఎన్ని అవమానాలు జరిగినా ఆడది తగ్గే ఉంది. తలవంచుకునే ఉంది. తాము ఇప్పుడు తల ఎత్తుకొని ధీమాగా తిరగాలంటే తమ కోర్కెలు తీరటం ఒక్కటే సాధనం తప్పేముంది (తప్పేదేముంది!) మగ దేముళ్ళ దగ్గరకే పోదాం. సృష్టికర్త బ్రహ్మదేముడు కాబట్టి ఆయన దగ్గరకే వెళ్ళటం బెటర్."