వీళ్ళ మంచిచెడ్డలు గురించి తను ఇంత ఆలోచిస్తున్నది. తనని గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారా! రెండు రోజులబట్టి చూస్తున్నది తను. కొందరు మగవాళ్ళు తనవేపు అదో యిదిగ చూడ్డం. మాట కలపాలని చూడ్డం. ఏంటేంతో వెర్రివేషాలు వేస్తున్నారు. వాళ్ళలా ప్రవర్తిస్తుంటే తన ఒంటిమీద గొంగళి పురుగులు పాకినట్టుంది.
పద్మిని ప్రియదర్శిని వాళ్ళ జీవితాల గురించి అంతగా ఆలోచిస్తున్నదిగాని రేపటి రోజు కోసం జాగ్రత్తనేది తనకు మాత్రం తెలుసా? ఆ ఆలోచన పద్మినికి రాలేదు.
ఇలా యెన్నాళ్ళు? దీనికి పరిష్కారం యేమిటి? పద్మిని ఆలోచిస్తూ వుండగా అచ్చమ్మ యింటి వెనుక వుండే జమాలయ్య అక్కడికొచ్చాడు.
జమాలయ్య పిల్లిలాగ నడచిరావడం పద్మిని చూడలేదు.
పద్మిని కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నది. జమాలయ్య చెయ్యి సుతిమెత్తగా పద్మిని ఒంటిమీద పడింది. ఆ చెయ్యి అలా నెమ్మదిగా తడుముతూ వేయరాని చోటుకి చేయి వెళుతున్నది.
అచ్చమ్మ చెయ్యేమోనని అనుకున్న పద్మిని నెమ్మదిగ కళ్ళు విప్పి చూసింది. ఫలాన అని గుర్తు తెలియటం లేదు గాని యెదురుగా వున్నది మగవాడు అని గుర్తించింది. గుర్తిస్తూనే పైకి లేస్తూ గట్టిగా అరవబోయింది.
పద్మినీకి ఆ అవకాశం యివ్వకుండా జమాలయ్య పందిలాగా పద్మినిమీద పడ్డాడు. ఆమె ఒక్క విదిలింపుతో వాడ్ని తోసేస్తూ "హెల్ప్...హెల్ప్" అని గట్టిగా అరిచింది.
"హెల్ప్ అనేదానికి అర్ధం తెలీకపోయినా అరుస్తున్నది అమ్మాయిగారని తెలిసి ఒక్క వుదుటు అందరూ లేచి వచ్చారు. అందరూ కలిసి జమాలయ్యని "యెదవచచ్చినోడా! యేం పనిరా యిది! తాగి చచ్చావా?" అని మందలింపుగ వాడిమీద అరిచారుగాని గట్టిగా కొట్టి తట్టినవాళ్లు లేరు.
"అమ్మాయిగార్ని పెళ్ళాడినట్టు కలవచ్చింది. దాంతో నాకేమీ తెలీలేదు. నేనిలా పడివచ్చేశాను. ఇప్పుడేం జరిగింది? ఇప్పుడేం పోయింది?" అంటూ నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు జమాలయ్య.
ఆ తర్వాత యెవరి దారిన వాళ్ళు మామూలుగా మాట్లాడుకొని పడుకోటానికి వెళ్ళిపోయారు.
ఒక ఆడపిల్లకి...ఒక గొప్పింటి ఆడపిల్లకి...అది యెంత అవమానమో? యెంత పరాభవమో? యెంత మానసిక బాధో? అర్ధం కాని విషయం అక్కడి వాళ్ళకి.
అచ్చమ్మ రెండు మాటలు మాట్లాడి తనూ వెళ్ళి మళ్ళీ పడుకొంది.
కొద్దిసేపటికి అంతక్రితం అనలక్కడేమీ జరగనట్టు మామూలుగ వుండిపోయింది ఆ ప్రదేశమంతా.
ఒంటరిగా మిగిలిపోయిన పద్మిని ప్రియదర్శిని చాలా అవమానంతో భరించరాని బాధతో అంతులేని దుఃఖం వచ్చింది. మోకాళ్ళలో తల దూర్చుకొని రెండు చేతులని కాళ్ళకి బంధం వేసి బరువెక్కిన హృదయపు బాధ తీరేలాగ వెక్కి వెక్కి యేడుస్తూ వుండిపోయింది.
పద్మిని ప్రియదర్శిని ఓదార్చేవాళ్ళు అక్కడెవరూ లేరు.
పద్మిని ప్రియదర్శిని జీవితంలో మొదటిసారి అంతులేని దుఃఖాన్ని చవిచూసింది. ఇల్లు విడిచి వచ్చింతర్వాత కొన్ని అయిష్టంగ భరించింది. కొన్ని బాధలూ పడింది. ఐనా ఇంత దుఃఖకరమైన సంఘటన జరగటం ఇదే మొదటిసారి.
ఆ గారాల బొమ్మ ఆ ముద్దుగుమ్మకి తప్పలేదు కన్నీళ్ళు.
9
"చూడు బుల్లెమ్మా! పాడు పిల్లడు పైన పైన పడతనున్నడు..."
"ఎక్కడా! యింకా పడందే!"
టవల్ ని పమిటలా వేసుకొని గార్ధభ స్వరంతో పాపారావు పాడుతుంటే, పక్కనే వున్న సూరీడు తనూ రాగయుక్తంగా మాటలని పాటలా పాడాడు. దాంతో అంతా ఫక్కున నవ్వారు.
అక్కడ కుర్రమూక అరడజను మందిదాకా చేరారు .వాళ్లు అక్కడ చేరినందుకు కాదు. వాళ్లు తనని చూసి వల్గర్ గ ప్రవర్తిస్తూ అలా పాడటం పద్మిని ప్రియదర్శినికి ఒళ్ళు మండింది.
ఒళ్ళు మండిన కళ్ళు మండిన చేసేదేమీలేదు మరో చోటికెళ్ళి తలదాచుకునే మార్గం లేదు. గుడిశెలో దూరి కూర్చుందామంటే అది అసలే చిన్న గది. లోపలున్నంతసేపు నీళ్ళల్లో నిలువులోతు మునిగినట్టు ఉక్కిరిబిక్కిరిగా అనిపిస్తుంది పద్మినికి. అదీ భరించలేదు. పోనీ వేరే ఇంటిలో కెళ్ళి ఉందామంటే అవేవీ హోటల్స్ కావు అన్నీ ఒకేరకం ఇళ్ళు. దాదాపు అందరివీ ఒకేరకం జీవితాలు. ఇక్కడ కాదని మరో చోటకి వెళ్ళితే అక్కడెలా వుంటుందో? ఇక్కడయితే యలమందయ్య, అచ్చమ్మ మంచివాళ్ళు కనీసం తనని అమ్మాయిగారు అనే గౌరవాన్ని అణుమాత్రమైనా తగ్గించకుండ చూస్తున్నారు.
వాళ్ళ దగ్గరికి తను వచ్చినప్పటికి ఇప్పటికి చాలా మార్పు కన్పిస్తున్నది. ఆ మార్పు నిజమో! తన భ్రమో! తెలీటం లేదు.
రెండురోజులబట్టి తను బాగా గమనిస్తున్నది. కుర్రకారంతా ఇక్కడే చేరి ఆటలు, పాటలు వల్గర్ మాటలు విసురుతున్నారు. తను ఇంట్లోకీ పోలేదు వాళ్ళను పొమ్మనీ చెప్పలేదు. ఇప్పుడు తనేం చెయ్యాలి?
పద్మిని ప్రియదర్శిని వేపచెట్టుకింద వున్న అరుగుమీద కూర్చొని దీర్ఘాలోచనలో వుండిపోయింది.
కుర్రకారు వాళ్ళ మానాన వాళ్ళు అల్లరి చేస్తూనే వున్నారు.
అప్పుడు సాయంత్రం ఆరు కావస్తున్నది.
సమ్మె చేస్తున్నచోట రిలే నిరాహారదీక్షలు ఎక్కువయ్యాయి. పగలు కొందరు, రాత్రికి కొందరు షిఫ్ట్ డ్యూటీలు వేసుకుని మరీ నిరాహారదీక్షలు చేస్తున్నారు.
సమ్మెలో మొగవాళ్ళు తప్ప ఆడవారు పాల్గొనటం లేదు. కారణం మానేసిన కంపెనీలో పని చేసినవాళ్ళంతా మగవాళ్ళు కావటమే. వాళ్ళకోసం పద్మిని ప్రియదర్శిని ఇల్లు విడిచి బయటికి వచ్చింది కాబట్టి పగలు సమ్మెలో పాల్గొంటున్నది.
ఈ కష్టం తమ ఇంట్లో మగవాళ్ళకి వచ్చిందని...వర్కర్స్ తాలూకా స్త్రీలుగాని, పిల్లలుగాని సమ్మెలో పాల్గొనటం లేదు. పాచిపనులు, కూరలు అమ్మటం, వీధివీధికి తిరిగి పళ్ళు అమ్మటం...ఎవరి పని వాళ్ళు మానకుండా చేస్తూనే వున్నారు. సంసారం గడుపుతూనే వున్నారు. కలోగంజో తాగుతూనే వున్నారు. ముఖ్యంగా సినిమాలు చూడటం మటుకు మానలేదు. అన్నం నీళ్ళు లేకపోయినా ఫరవాలేదు. సినిమాలు చూడకపోతే మాత్రం వాళ్ళ ప్రాణం పోతుంది.