Previous Page Next Page 
ముద్దుగుమ్మ పేజి 16

    ప్రస్తుత పరిస్థితి అక్కడలా వుంది.

    అచ్చమ్మ యెక్కడికెళ్ళటానికో తెలీదు చక్కగా తయారవుతోంది.

    అక్కడివారికి కొన్ని పద్ధతులు, కొన్ని పదాలు వున్నాయి. మాటకుముందు వాడకట్టు అంటూంటారు. ఓసారి ఆ మాటకు అర్ధం తెలీక "వాడకట్టు" అంటే ఏమిటని పద్మిని అడిగింది.

    "ఇంత చదువుకున్నారు అమ్మాయిగారు! వాడకట్టంటేనే తెలీదా?" అంటూ నవ్వి "వాడకట్టంటే ఈ పేటలో అందరం ఒకమాటమీద వుండటం. వాడకట్టు పెద్దమనుషులు చెప్పినమాటకి తలవొగ్గటం. అదన్నమాట వాడకట్టంటే" అంటూ వివరించింది అచ్చమ్మ.

    "అబ్బో! వీళ్ళంతా యెంత కలిసికట్టుగా వుంటారు. ఇలా దేశంలో అందరూ వుంటే ఈ దేశం యింకా ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందేనని" ఆనాడనుకొంది పద్మిని. కాని దానిలోని లోతుపాతులు కాని పద్మినికి తెలియవు. ఉరుమురిమి మంగలంమీద పడ్డట్టు ఇప్పుడు ఆ వాడకట్టు ఆచారం పద్మినిమీదకొచ్చి పడింది. అదేమిటో పద్మినికి తెలియదు.

    నిన్నటినుంచి అందరిలో కొట్టొచ్చినట్టు మార్పు కన్పిస్తున్నది. కాని ఆ మార్పు ఏమిటో పద్మినికి తెలియలేదు.

    ఒక కుర్రవాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. పద్మిని చూస్తూనే వుంది.

    "అచ్చమ్మక్కోయ్! అచ్చమ్మక్కొయ్! పెద్దలందరూ వచ్చేశారు. మిమ్మల్ని రమ్మంటున్నారు" అని చెప్పివచ్చినంత వేగంగానూ వెళ్ళిపోయాడు.

    "అమ్మాయిగారు మీరూ తయారవుతారా? కబురొచ్చింది మనం వెళ్ళాలి" అంది అచ్చమ్మ ఓణి సవరించుకుంటూ.

    తెల్లబోయింది పద్మిని. "ఎక్కడికెళ్ళాలి?" అనుమానంగ అడిగింది.

    "వాడకట్టు పెద్దమనుషులు తీర్పివ్వడానికి రచ్చబండ దగ్గర చేరారు. తొందరగా వెళదాం పదండి వాళ్ళ తీర్పు వినాలిగదా?" అంది అచ్చమ్మ.

    వాడకట్టు పెద్దమనుషులేమిటో? తీర్పు యేమిటో? పద్మినికి అర్ధం కాలేదు. అర్ధంకాని విషయాన్ని అడిగి తెలుసుకుకోవాలన్నంత ఓపికకూడా అప్పుడు లేకపోయింది. "నేను రాను నువ్వెళ్ళు అచ్చమ్మా" అంది.

    "భలే బాగుందమ్మాయిగారు! ఇప్పుడు మీకోసమే గదా పెద్దలంతా అక్కడ చేరింది. మీరు రాకపోతే ఎట్టాకుదురిద్ది?" రవ్వంత ఆశ్చర్యపోతూ అంది అచ్చమ్మ.

    "నాకోసం పెద్దలు చేరటమేమిటి? తీర్పేమిటి?" ఆశ్చర్యపోతూ అడిగింది పద్మిని.  

    "ఇప్పుడు చెబుతూ కూకుంటే అలీశం అయిపోతుంది. పెద్దలు నన్ను కోప్పడతారు రండి వెళదాం. మీరు తప్పకుండా రావాలి. మీరు రావటంలేదని నేనెళ్ళి చెప్పాననుకోండి అది తప్పుకింద కడతారాళ్ళు. అందరూ వచ్చి పిలుచుకెళతారు. దానికన్నా మీరు వస్తేనే మంచిది" అంది అచ్చమ్మ.

    పద్మిని ప్రియదర్శినికి అక్కడ నుంచి కదలాలని కొద్దిగా కూడా లేదు. అలా అని కూర్చున్నా లాభం లేదని గ్రహించింది. "ఇదేమిటో? ఈ వ్యవహారమేమిటో? వెళ్ళి తేల్చుకోవడమే మంచిది. ఆ పెద్దమనుషుల ముఖాలు చూడటం కూడా అవసరమే" అనుకొంది పద్మిని.

    అచ్చమ్మతో కలసి అలాగే బయల్దేరింది పద్మిని.

    అయిదు నిముషాలు నడిచిన తర్వాత అక్కడకు చేరారు యిరువురు. ఇందాక అల్లరిచేస్తూ పాటలు పాడిన మగపిల్లకాయలు ఎప్పుడొచ్చారో మరి అక్కడ కూర్చున్నారు.

    అక్కడ రచ్చబండమీద కూర్చున్న పెద్దమనుషులెవరూ స్పెషల్ గ ఏమీలేరు. కాస్త వయసులో పెద్ద ఒళ్లు బలుపు, తలగుడ్డలూ తప్పించి.

    పేటలోని జనం మాత్రం యాభై అరవైమంది అక్కడ పోగై వున్నారు. వాళ్ళల్లో యెవరో "అమ్మాయిగారు వస్తున్నారు తొలగండి...తొలగండి అడ్డు లెగండి యెహే!" అన్నారు.    

    ఇది అపూర్వ గౌరవమో! అద్దాన్నపు గౌరవమో! పద్మిని ప్రియదర్శినికి ఆ క్షణాన అర్ధం కాలేదు. కూర్చోమని ఎవరూ మర్యాద చెయ్యలేదు. ఎక్కడ కూర్చోవాలో తెలీక, యేం చేయాలో తెలీక పద్మిని అలా నుంచుండి పోయింది. ఒకరో ఇద్దరో తప్ప అక్కడందరూ నుంచోనే వున్నారు. "గుంపులో గోవిందా" లాగ పద్మిని కూడా వాళ్ళతో పాటు నుంచుంది.

    "ఇంక మొదలుపెడదామా!" వాళ్ళల్లో ఎవడో అడిగాడు. "అలాగే" అంటూ పెద్దమనుషులు తల వూపారు.

    "చూడమ్మాయీ! నీకు మా పద్ధతులు కొత్తగా వుండొచ్చు. ఐనా ఈ వాడకట్టులో చేరింతర్వాత ఎవరైనా సరే మా పద్ధతులు పాటించాలి. నీవలా పాటించటానికి సిద్ధమేనా! అలా ఐతేనే వాడకట్టులో వుండొచ్చు. లేకపోతే మానుంచి వెళ్ళిపోవచ్చు" అన్నాడు ఓ పెద్దమనిషి.

    "వీళ్ళల్లోంచి మధ్యలోనే సమ్మె విరమించుకొని తను వెళ్ళిపోతానేమోనని వాళ్ళంతా భయపడుతున్నట్టున్నారు. అది తేల్చుకుంటానికే ఇక్కడ సమావేశమయ్యుంటారు. వీళ్ళెంత అమాయకులు! వీళ్ళెంత పిచ్చివాళ్ళు! తను దేనికీ పట్టుపట్టదు. పంతం పట్టిందంటే అది నెగ్గి తీరాల్సిందే అందుకనేకదా తను ఇంట్లోంచి వచ్చేసింది. వీళ్ళు ఆమాత్రం కూడా గ్రహించలేని పిచ్చివాళ్ళు! అనుకొంది పద్మిని ప్రియదర్శిని. ఒకమాట ఇచ్చేముందు క్రొత్త ప్రదేశాల్లో తెలీని మనుషులున్నచోట చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎంతో దూరదృష్టితో ఆలోచించాలి. ఇదేమీ తెలియని పద్మిని ధీమాగ తలయెత్తి "మీ కోర్కెలు తీరందే నేను వెళతానని యెలా అనుకున్నారు? మీకోసమేకదా నేనిక్కడకు వచ్చింది. చెప్పండి యేం చేయాలో? నేను కూడా కొంచెం ఆలోచించి చేస్తాను" అంది పద్మిని.

    "ఆలోచించి చేస్తాను" అనేమాట అనుకోకుండా పద్మిని నోట్లోనుంచి వచ్చింది ఒక్కోసారి అంతే. మనకు తెలీకుండానే కొన్ని మాటలు నోట్లోంచి వస్తూ వుంటాయ్. ఆ మాటలే ఒక్కోసారి మంచికి, ఒక్కోసారి చెడ్డకి రామబాణంలాగ పనిచేస్తూ ఉంటాయ్.

    "అమ్మాయిగారు ఒప్పుకున్నారు ఇహ తీర్పు చెప్పవచ్చు" వాళ్ళలో ఒకాయన అన్నాడు.

    వాళ్ళల్లో ఒక పెద్దమనిషి గొంతు సవరించుకుని పెద్ద కంఠం వేసుకొని చెప్పసాగాడు.

    "మా వాడకట్టులో వుండాలంటే ఇక్కడ కొన్ని పద్దతులున్నాయ్. ఆ పద్ధతులకందరూ తల వొగ్గాల్సిందే. ఇంతవరకూ వాడకట్టు పెద్దమనుషుల మాట కాదని ఎవరూ యేమీ చెయ్యలేదు. కాబట్టి ఇక్కడ అందరం చల్లగా వున్నాము ఈ రోజు. మా అందరికీ అమ్మాయిగారైన మీరు మా వాడకట్టు పద్ధతులకి, మా వాడకట్టు ఆచారాలకి తలవొగ్గటానికి ఇష్టపడుతున్నారంటే మాకు చాలా సంతోషంగా వుంది. మా కూడూ గుడ్డా ఇష్టంతో స్వీకరించారు. అలానే మా ఆచారాలను కూడా ఇష్టంగా ఒప్పుకోవాలి. మా ఇళ్ళల్లో ఆడపిల్లలకి పెద్దమనిషి కాకముందే మనువు సిద్ధంచేసి వుంచుతాము. కొందరికి అప్పుడే పెళ్ళిచేస్తాము. కొందరికి తరువాత పెళ్ళి చేస్తాము. కాని ఏ పిల్లకి ఎవరు మొగుడన్నది అప్పుడే తెలిసిపోవాలి. వాళ్ళా మనువు కిష్టపడుతూ గూడెం పెద్దలకి కానుకలు సమర్పించుకోవాలి. ఇప్పుడు నీవు వుంటున్న ఇంటాయన యలమందయ్య కూతురు అచ్చమ్మకి కూడా పెద్దమనిషి అయిననాడే మనువు నిశ్చయమైంది. ఓలి ఇచ్చే డబ్బుల్లేక పెళ్ళి ఆగింది. అంతేకాని మరోటికాదు. అచ్చమ్మ పెళ్ళి ఓలి యిచ్చింతర్వాత పోతురాజుగాడితోనే జరుగుతుంది. మా ఇళ్ళల్లో ఆడకూతుళ్ళు, వయసొచ్చినవాళ్ళు పెళ్ళికాకుండా వుండకూడదు. కనీసం పెళ్ళి నిశ్చయమైనా అయివుండాలి...     

 Previous Page Next Page