పద్మినికి ఎంతసేపటికీ నిద్రపట్టలేదు.
మొదటి రెండు మూడు రోజులు ఆవేశంతో ఆలోచించి ఆలోచించి ఎప్పటికో నిద్రపోయేది. ఆ తర్వాత సమ్మె చేస్తున్న వర్కర్స్ దగ్గర కూర్చొని రావడం వల్ల పగలు నిద్ర లేనందువల్ల అలసి సొలసిపోయి నిద్రపోయేది.
ఈ పూట కూడా చాలా అలసటతో పగలంతా సమ్మెలో పాల్గొని ఇంటికి వచ్చింది. ఒంట్లో ఏదోగ అనిపించిందిగాని అదేమిటో అర్ధంకాలేదు. అన్నం సరీగ ఎక్కలేదు. ఏదో తిన్నాననిపించి లేచొచ్చి పడుకుంది. వెంటనే నిద్రపోయింది. ఆ నిద్రపోవటం మళ్ళీ ఇప్పుడు లేచింది. అంతే ఇంక నిద్రపట్టలేదు.
పద్మిని ప్రియదర్శిని ఆలోచనలు తల్లీ దండ్రీ మీదకి పోయాయి. మంచంలో అనీజీగా అటూ ఇటూ కదులుతూ ఆలోచించసాగింది.
"మమ్మీ ఒక్కరోజు కూడా తనని చూడకుండా వుండలేదు. కాలేజీ నుంచి రావడం కాస్త ఆలస్యమయితే చాలు పోర్టికోలోకొచ్చి నిలబడి తన రాకకోసం ఎదురుతెన్నులు చూస్తూ వుండేది."
"ఈ రోజేంటి ఇంత ఆలస్యమైంది? నాకెంత కంగారు వేసిందో తెలుసా! కాలేజీకి ఫోన్ చేద్దామనుకున్నాను. లేకపోతే యాదయ్యని పంపిద్దామనుకొన్నాను. ఎప్పుడయినా కాలేజీనించి ఏ ఫ్రెండింటికయినా వెళ్ళి ఇంటికి ఆలస్యంగా వచ్చేటట్లయితే నాకు ఫోన్ చెయ్యి పప్పీ! అలా చేస్తే నాకు భయం వుండదు" అనే మమ్మీ ఇన్నాళ్ళు తనని చూడకుండా ఎలా వుండగలిగింది?
"మమ్మీకి తనమీద ప్రేమలేదా?"
"ఉహు మమ్మీకి తనమీద బోలెడు ప్రేమ వుంది. డాడీయే పడనిచ్చి వుండరు. డాడీకి తనమీద అసలు ప్రేమేలేదు...
పద్మిని ఆలోచనలు టక్కున ఆగిపోయాయ్.
"డాడీకి తనమీద ప్రేమలేదా? వుంది. ఏది కోరితే అది క్షణాలలో అమర్చిపెట్టే డాడీకి తనమీద ప్రేమలేదా! వుంది. కేవలం పంతానికి మనసు బిగపట్టుకుని దూరంగా వున్నారు. నిజంగా తనమీద అంత ప్రేమ వుంటే ప్రేమని మించిన పట్టుదల దేనికి? తనకిమాత్రం డాడీమీద, మమ్మీ మీద ప్రేమలేదా? తనూ పట్టుదలకుపోయి ఇంటిలోంచి బయటికొచ్చేసింది"
"పాపం ఈ వర్కర్స్, వర్కర్స్ కుటుంబాలు తగిన సౌకర్యాలు లేక, డబ్బు లేక ఎంత బాధపడుతున్నాయ్. ఈ ఒక్కసారికి అటు వర్కర్స్ కోరిక, ఇటు తన కోరిక తీరుస్తూ డాడీ వాళ్ళ కోర్కెల్ని మన్నించినట్లయితే యెంత బాగుండేది"
"నీకు తెలియదు పప్పీ! ఏదీ అలవాటు చేయకూడదు ఒకసారి మరిగితే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. వాళ్ళ కోర్కెలకి మనం మొదటే ఆనకట్ట వేయాలి. లేకపోతే అది పోను పోను మహా ప్రవాహంగా మారి మన్నే ముంచేస్తుంది. బిజినెస్ వ్యవహారాలు నీకు తెలియవు" అని డాడీ మందలించారు.
దీనిలో బిజినెస్ ఏముంది? వ్యవహారమేముంది? వాళ్ళ కోర్కెలు మన్నించకుండా వుండటానికి అదో వంక అంతే.
"ఈ దేశంలో ధనవంతులు వేళ్ళమీద, బీదవాళ్ళు వేలమీద వున్నారు. ఇది బీద దేశం. పేరుకి మాత్రం రత్నగర్భ జనాభా పెరుగుదల వల్ల ఈ హెచ్చుతగ్గులు తప్పవ్. నీవు కొన్నాళ్ళపాటు నా పక్కనే వుండి కంపెనీ వ్యవహారాలు చూస్తూ వుండు. దానిలోని లోతుపాతులు తెలుస్తుంటాయ్. లోటుపాట్లు తెలీకుండా ఒక నిర్ణయానికి రావడం మంచిదికాదు" అంటూ డాడీ బిజినెస్ రహస్యాలంటూ ఏమిటేమిటో చెప్పారు .డాడీ చెప్పిన ఒక్క ముక్కా తనకర్ధమయి చావలేదు.
అక్కడికీ మమ్మీకూడా తన పక్కనే చేరి "ఈ ఒక్కసారికి పప్పీమాట వింటే ఏం పోయిందండి!" అంది. డాడీ వింటే కదా! అప్పుడుకదా డాడీమధ్య, తన మధ్య వాదన సాగింది .మాటా మాటా పెరిగింది. తనకి కోపం వచ్చి ఇంటిలోంచి వెళతానంటే "కబుర్లు కాదు ఒక్కసారి బయటికెళ్ళి చూడు పట్టుమని పదినిముషాలుండలేవు. మహా అయితే అరగంట రయ్ ణ తిరిగొచ్చేస్తావు. నీకెందుకొచ్చిన గోల పప్పీ!" అంటూ మందలించారు డాడీ.
డాడీ అలా వెక్కిరింతగా మాట్లాడుతుంటే తనకి నిజంగానే పట్టరానంత కోపం వచ్చింది. పట్టుదల పెరిగింది. తను ఏ పనీ చేయలేనంత అర్భకురాలా! ఇల్లు విడచి బయట వుండలేనంత డెలికేట్ గా గాజుబొమ్మలా వున్నానా! తను ఎవరి కూతురు? శ్రీ శ్రీ శ్రీ మధుసూదనరావుగారి కూతురు మాట వొస్తే మాటే. పంత మొస్తే పంతమే.
తను ఇంటిలోంచి బయటికొచ్చేసింది. వెళ్లొద్దని మమ్మీ అందిగాని డాడీ మాటమాత్రం కూడా అన్లేదు. "పప్పీని వెళ్ళనియ్యి. మళ్ళీ అదే వచ్చేస్తుంది" అంటూ నవ్వారు. తనకి ఉడుకుమోత్తనం వచ్చింది అది చూసి.
తను వచ్చేసి పదిరోజులయింది .డాడీ సంగతి వదిలేస్తే తనని చూడకుండా క్షణంకూడా వుండలేని మమ్మీ కూడా తనని చూడ్డానికి రాలేదు. కనీసం యెవరచేతయినా కబురు కూడా చెయ్యలేదు.
ఇంత నిర్ధయగా తనపట్ల తన మమ్మీ డాడీ ఎందుకున్నారు?
వాళ్ళలా యెందుకున్నారో ఆ క్షణాన పద్మిని ప్రియదర్శినికి అర్ధం కాలేదు. ఒక్కసారి వెనుతిరిగి చూసుకుంటే ఊహ తెలిసినప్పటినుంచీ తను పెద్దయిందాకా ఇంటిలో ప్రతిదీ తనమాటే చెల్లింది. డాడీ యెప్పుడన్నా తనమాట కాదంటే మమ్మీ కోపం నటించి తనమాట నెగ్గేలా చేసేది. "అంత గారాబం తగదు పూర్ణిమా!" అంటూ మమ్మీని చిన్నగా మందలించేవారు అంతే.
ఈనాడు వాళ్ళకేమయింది?
పద్మిని ప్రియదర్శిని కళ్ళల్లో పలుచటి నీటిపొర ఏర్పడింది.
"నేను చేసింది తప్పా! తొందరపడ్డానా!" అనుకొంది పద్మిని. "కాదు కాదు" అని మళ్ళీ తనకు తానే నచ్చజెప్పుకుంది.
ఇక్కడికొచ్చి తాను "సాధించిందేమిటి? పొందిందేమిటి? పోగొట్టుకున్నదేమిటి?" అలోచించసాగింది పద్మిని.
తానొచ్చిన మొదట్లో యెంత గౌరవంగ, యెంత మర్యాదగ చూశారు. ఆ తర్వాత వాళ్ళల్లో ఒక మనిషిగా కలుపుకొన్నారు. కాని ఇప్పుడిప్పుడే తనకి కొన్ని అర్ధమవుతున్నాయ్. తను చెప్పే మాట్లల్ని వాళ్ళు అర్ధంచేసుకొకపోగా నవ్వటం, రవ్వంత ఎగతాళి చేయడం చేస్తున్నారు. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? చదువులేదు. తగిన విజ్ఞానం లేదు. అందుకే అలా ప్రవర్తిస్తున్నారు. పెద్ద పెద్ద నవలలు రాసేవాళ్ళకి, భారీ భారీ సినిమాలు తీసేవాళ్ళకి ఇక్కడివాళ్ళు యెలా జీవిస్తున్నారో పాపం తెలీదు. బీదవాళ్ళు కూడా హాయిగా వున్నట్టు మంచి మంచి గుడ్డలు కట్టుకున్నట్టు అన్నీ చేసుకొని తింటున్నట్టు చాలా హాపీగా వున్నట్టు చూపిస్తారు. ఎక్కడో ఒకటో రెండో కుటుంబాలు పరమ దరిద్రం అనుభవిస్తున్నట్టు కనబడతాయ్ అంతే. ప్రత్యక్షంగా చూస్తే ఇక్కడివాళ్ళు అలా కాదు. నాలుగు డబ్బులు దొరికిన రోజున తెగ తినేస్తారు. ఖుషీగా గడిపేస్తారు. ఏమీ లేకపోతే డొక్కల్లో కాళ్ళు పెట్టుకొని ముడుచుకొని పడుకుంటారు. దిగులూ వుండదు చింతా వుండదు .బూతులు మాట్లాడుకుంటుంటే చాలు సగం కడుపు నిండిపోతుంది ఏం మనుషులో? ఏంటో?