Previous Page Next Page 
ఒక జంట కలిసిన తరుణాన పేజి 14

    అంతవరకూ సిగరెట్ పొగతో మేఘాలు సృష్టిస్తున్న కధానాయకుడు సిగరెట్ కింద పడేసి కాశిగా కాలితో నలిపి కథానాయిక దగ్గరకు వచ్చి "ఆహా ఏం సిగ్గు ఏం నటన?" అంటాడు.
    "తెలియక నేనేదైనా తప్పు చేస్తే క్షమించండి" అని కథానాయకుడి కాళ్ళమీద పడుతుంది కథానాయిక.
    కధానాయకుడు విలన్ నవ్వు నవ్వి "నువ్వు మంచిదానివి కాదు. పెళ్ళికి ముందె నాతో పార్కులకి తిరిగావు. ఇలా ఎంతమందితో తిరిగావో, పెళ్ళికానంత వరకూ నేను పరాయి వాడినే కదా, నాతో తిరిగినా పరాయి పురుషుడితో తిరిగినట్లే లెక్క" అంటూ నానామాటలు వదులుతూ కుప్పిగంతులు వేస్తాడు.
    కధానాయిక మరోసారి కళ్ళకి లప్పెడు గ్లిజరిన్ పూసుకుంటుంది.
    ఫస్ట్ నైట్ కార్యక్రమం జరగకపోతే ప్రేక్షకులు భరించలేరేమోనని దర్శకుడు కాసేపు తర్వాత ఆ కార్యక్రమం కూడా చూపించాడు.
    ఇహ ఆ తర్వాత కధ కధానాయికని కధానాయకుడు కొట్టడం అనుమానించడం చేస్తుంటాడు. కధానాయిక తప్పు తనదే అయినట్లు పెళ్ళిచూపుల తర్వాత పెళ్ళిలోపల ఆడపిల్ల తిరగరాదనే తిరుగులేని సూత్రం ప్రేక్షకులకి మధ్య మధ్య చెపుతూ, మొగుడి బూట్లు పాలీష్ చేస్తూ గుడ్డలు ధగధగలాడే సోపుతో వుతుకుతు, అతగాడి పదాలు వత్తుతూ, దేముడి మీద పాటతో యధాశక్తి ఎంత కష్టపడాలో అంత కష్టమూ పడుతుంది.
    హాలులోవున్న ఆడవాళ్ళపైట చెంగులు హాండ్ కర్ చీఫ్ లు తడిసిపోయాయి. నీళ్లు పూర్తిగా ఓడేలా గట్టిగా ఆరుమాళ్ళని పిండి ఆ తడివాటితోనే మళ్ళీ మళ్ళీ కళ్ళు తుడుచుకున్నారు. ఆ దెబ్బతో చాలామందికి చాలాకాలంగా వేధిస్తున్న జలుబు వదిలింది.
    కధానాయిక దేముడిమీద పాట పాడంగానే గాలికి పటం కదిలి పటానికి పెట్టిన పువ్వు రాలి కధానాయిక చేతిలో పడుతుంది. "దేవా! కళ్ళు తెరిచావా! కరుణించావా!" అంటూ ఆ దెబ్బతో మరో పాట ఎత్తుకుంటుంది.
    "నా భార్య మంచిదికాదు. నిన్ను పెళ్ళాడి పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని చెప్పి వేరే పిల్లని ఇంటికి తీసుకువస్తాడు కధానాయకుడు.
    రిబ్బెను ముక్కలు కట్టుకువచ్చిన ఆ రెండో పిల్లక కాలుమీద కాలు వేసుకుని "ఏమే చెడిపోయిందానా! కాఫీ తీసుకురావే" అంటుంది. కట్టు బొట్టూ అన్నిటా అంతా నిండుగా వున్న కధానాయిక కాఫీ కప్పుతో వచ్చి "నేను చెడిపోయిన దాన్ని కాను చెల్లీ! దైవం దయలేక భర్తచేత అనుమానించబడ్డ అబలను" అని పరమ సుత్తి డైలాగ్ వదిలి జరిగిన కథ చెపుతుంది.
    అంతే__
    వీరావేశంతో లేచింది రిబ్బెన్ల సుందరి. "ఛీ నీవింకా మంచివాడివనుకున్నాను. అనుమానం మొగుడివా, నేను ఏదైనా భరిస్తానుగాని అనుమానం మొగుడిని భరించను, సహించను. నా మొదటిభర్త నన్ను అనుమానించబట్టే ఇల్లు విడిచి వచ్చాను. ఆపై నీతో వచ్చాను. నీకన్నా నా మొదటి మొగుడే నయం. ఇంత పతివ్రతని కష్టపెడుతున్న నీవూ ఓ మగాడివేనా? మొగుడివేనా?" అని కాఫీ కప్పు విసిరి నేలకేసి కొట్టి విసవిస వెళ్ళిపోతుంది.  
    ఆ దెబ్బతో కధానాయకుడు ఒక కన్ను కొద్దిగా తెరుచుకుంటుంది. సరిగ్గా అప్పుడే కధానాయకుని తల్లి, తండ్రి వస్తారు. "గోడపక్కనుండి అంతా విన్నాం నాయనా! మీ ఆవిడ మహా పతివ్రత. అరుంధతి, అహల్య, సుమతి, సావిత్రి. ఎవరికీ తీసిపోదు. నీవు పార్కులకీ, అక్కడకీ, యిక్కడికీ రమ్మనమనిఒ రాశిన లెటర్సు మాకు చూపి మా అనుమతితోనే నీతో తిరిగింది. కోడలు తప్పు యిసుమంత అయినా లేదు" అంటారు.
    ఆశ్చర్యంతో రేమ్డుక్ కళ్ళూ తెరుచుకుని "నిజమా?" అన్నట్లు చూస్తాడు కధానాయకుడు.
    కధానాయిక బోలెడు సిగ్గుతో తల తాటిస్తుంది. ఆ తర్వాత "క్షమించండి" అని కధానాయకుని కాళ్ళమీద పడుతుంది.
    "ఇహపై నీ స్థానం యిక్కడ" అని చెప్పి కధానాయకుడు తన విశాలహృదయానికి హత్తుకుంటాడు కధానాయకని.
    ఆ తర్వాత వాళ్ళ ముఖాన శుభం పడుతుంది.
    "దీనికేం పోయేకాలం వచ్చింది. తప్పు చేయకపోయినా క్షమించండని అఘోరిస్తుంది" వాసంతి లేచొస్తూ అంది.
    ఆ మాటకి సమాధానం యివ్వకుండా "సినిమా మార్వలెస్" అంది దేవి.
    "చాలారోజుల తర్వాత మంచి సినిమా చూశాం" అంది రాధామనోహరి.
    "మీ యిద్దరినీ నరికి చంపి పోగులుతీసి ఉప్పు పాతరలో వేస్తే సరిపోతుంది. వెధవ సినిమా ముష్టి సినిమా, పాడు సినిమా, పాపిష్టి సినిమా, పేరు చూడబోతే పిల్లదాని పెళ్ళిచూపులు. కథ చూడబోతే పదేళ్ళనాటి పాత చింతకాయ పచ్చడి. అర్ధంలేని అనుమానం వాడిది. దొంగముండ పతివ్రత వేషాలు దీనివి. సినిమా తీసినవాడిననాలి. అసలీ కథ రాశిన వాడిననాలి__" వాసంతో దోవలో ఆ సినిమా గురించి తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంటే అప్పుడు నెమ్మదిగా పెదవి కదిపింది రాధామనోహరి.
    ఈ కథ రాసింది మగవాడు కాదు ఆడది."
    "నే చస్తేనమ్మను పెళ్లాంపేరు పెట్టుకురాసే ముత్తయ్యలు ఈ రైటర్లలో మూడువందలమంది వున్నారు. ఓ వెధవ రాశిన కథ యిది." గట్టిగా అంది వాసంతి.
    రాధామనోహరి దేవి ఆ దెబ్బతో నోరు మూసుకుని మరో నాలుగు అక్షింతలు వాసంతిచేత వేయించుకుని ఎవరింటికి వారు బైలుదేరారు.
    పిల్లదాని పెళ్ళిచూపులు సినిమా వాసంతికి బొత్తిగా నచ్చలేదు గాని సినిమాలో హీరో హీరోయిన్ ని కలుసుకున్నట్లు పెళ్ళిచూపుల తర్వాత శ్యామ్ సుందర్ తను కల్సుకోటం గురించి తీవ్రంగా ఆలోచించింది.
    "ఈ కధానాయకుడు లాంటి వాడేనా శ్యామ్, అదే నిజమైతే శ్యామ్ ప్యాంట్లు షర్టులు తను వుతకదు. చించి పోగులన్నా పెడుతుంది గాని. బూట్లు తుడవదు వీధిలో గిరాటు వేస్తుంది గాని, ఆడదంటే అందరికీ అలుసే, అసలా సినిమా ఎలా చూశారు ఈ జనం! హాలుకి నిప్పుపెట్టక. ఆ అయినా అది సినిమా. నిజజీవితం వేరు." ఆలోచిస్తూ యింటికి వచ్చింది వాసంతి.
    "ఏ సినిమా కెళ్ళారె, ఆదిలక్ష్మమ్మ అడిగింది.
    "పిల్లదాని పెళ్ళిచూపులు, నిష్టదరిద్రపు సినిమా."
    "అదేమిటే చాలా బాగుందని సుందరమ్మ చెప్పింది. రేపు మీ నాన్న, నేను వెళదామనుకుంటున్నాము!" అంది ఆదిలక్ష్మమ్మ.
    "మీలాంటి వాళ్ళకోసమే వెళ్ళండి," అని వాసంతి గదిలోకెళ్ళి తలుపేసుకుంది...ఏమిటి దీనితీరు!" అనుకుంది ఆదిలక్ష్మమ్మ.

 Previous Page Next Page