"నీ దోవ నీవే చూసుకో అన్నప్పుడే మీ పార్వతి మరణించింది" అని చెప్పాలా! "ఇప్పటికియినా భార్యా పిల్లలు గుర్తొచ్చారు. నా పూర్వజన్మ సుకృతం" అని సంతోషపడాలా?
"ఆయన్ని యింటోకి రానిస్తే యీగుమ్మంతొక్కను-ఆయన భార్యాబిడ్డలమీద ఆపేక్షతో రాలేదు. తనకి జరుగుబాటు చూచుకోటానికి వచ్చాడు." శాంతంగా వుండే రఘు రౌద్రమూర్తి అయి అన్నమాట యిది.
"నీకు చెప్పవలసినంతటి వాడినికాదమ్మా! నీవేం చేసినా తగిన కారణం వుండే చేస్తావు. నీ యిష్టమే నా యిష్టం,"అన్నాడు కృష్ణ, ఆవేశానికి ప్రతినిధి అణుకువగా మారి.
నేను మరో విధంగా ఆలోచించాను.
భార్యాభర్తలమధ్య బంధం తెంచుకుంటే తెగేదా? పైపై బంధంకన్నా...అంతర్భంధం బలీయమైంది కదా? నువ్వు నా పిల్లల తండ్రివికాదని అనగలనా! వారి శరీరంలో ప్రవహిస్తున్నది ఎవరిరక్తం? రక్తసంబంధం తెంపినా తెగుతుందా! పిచ్చో, మంచో యిలాంటి ప్రశ్నలు ఎన్నో వేధించాయి. భార్యాభర్తల గురించి మరొకటి ఆలోచించాను. భార్యాభర్తలు విధివల్లకాని, సమాజం వలనగాని, వారిలోవారికి పొరపొచ్చాలొచ్చిగాని, విడిపోతారు. అలావుండగా భార్య చనిపోయిందని కబురు భర్త అందుకుంటే, ఓ కన్నీటిబొట్టు రాల్చవచ్చు. పోతేపోయిందిలే అది ఏనాడో చచ్చింది నా దృష్టిలో __ అనుకోవచ్చు. కాని __భర్త మరణించినట్లు వార్తవస్తే ఆమె చింతించినా చింతించకపోయినా వారిరువురి పెళ్ళినాటి బంధం విడదీసి విధవను చేస్తారు.
భార్యాభర్తలంటే పెళ్ళినాటి బంధంకాదు. అదిజన్మ జన్మల అనుబంధం. అన్నింటికన్నా అంతరబంధం బలీయమైనది. అందుకే మీ నాన్నగారిని వెళ్ళమనలేకపోయాను.
"ఓ ప్రయోజనం ఆశించి మిమ్మల్ని వుండమనటం లేదు. నే జీవించి వున్నంతవరకూ మీరు ఆకలితో అలమటించే పని లేదు. పార్వతి పిచ్చిది అని నమ్మి వచ్చారు. మీ నమ్మకాన్ని వమ్ము కానీయను" అని చెప్పాను.
మురికి ఓడుతూ చిరిగిన బట్టలతో గడ్డం పెరిగి లోతుకు పోయిన కళ్ళు, పీక్కు పోయిన దవడలు, మీ నాన్నగారిని చూచి యీ పిచ్చి పార్వతి కళ్ళల్లో అప్రయత్నంగా నీళ్ళు వచ్చాయి శకూ! నీకు మీ అమ్మ తెలుసుగాని ఆమెలో వుండే పిచ్చిపార్వతి తెలియదు.
నాన్నగారిని యింట్లోకి రానిచ్చినందుకు రఘుకి కోపం వచ్చి తన మకాం అత్తవారింట్లో పెట్టాడు. నామీద కాదు కోపం, నాన్నగారి మీదట__కోపం చల్లారాక రఘు వస్తాడని నమ్మకం వుంది. రఘు కోపం చితుకులమంటలాంటిది. కృష్ణమటుకు నాన్నగారు పలకరించబోతే కయ్యిమని ఇంతెత్తున లేస్తున్నాడు. మొన్నటికి మొన్న__
"చీటికీమాటికీ నన్ను పలకరించకండి. అమ్మకు మీరు చేసిన అన్యాయం, అమ్మ మీవల్ల ఏం పోగొట్టుకుంది, గతం ముళ్ళకంపలాంటి గతం తానయితే మరచిపోయిందిగాని, నేను మరవటం అసాధ్యం. యీ మాట గుర్తుంచుకొని మరోసారి నన్ను పలకరించే ప్రయత్నం చేయకండి. "నీ భర్త ఎక్కడ?" అమ్మ ప్రతిక్షణం చుట్టుపట్లవారికి జవాబు చెప్పలేక నవనీతంలాంటి తన మనసుని కఠినంగా మార్చుకుని కాకులు లాంటి యీ సమాహంలో కఠినహృదయురాలిగా ఇంకా ఘోరమైన మాటలు పడుతూ బ్రతికింది, మిమ్మల్ని బ్రతికించింది.
"నీకు నాన్న వున్నాడా?" "మీ అమ్మ గయ్యాళి అయితే మీ నాన్న సన్యాసుల్లో కలిసిపోయాడా?" "ఎప్పుడూ రారా మీ నాన్నగారు మీవద్దకు?" నన్ను నిలబెట్టి ఆరాలు తీసేవాళ్ళు కాస్త నాకన్నా పెద్దదగ్గర నుంచి ముసలి ముతకవరకు.
ఈబాధ మీకు తెలియదు. అదృష్టవంతులు, అలాగే గడిపేయండి, మాగురించి ఆరాలెందుకు? మంచికా? చెడ్డకా? విచారించటానికి? నవ్వటానికా? అంతావిని ఏంచేస్తారు?"
ఆవేశంతో గబగబ నాలుగు అని అవతలకి వెళ్ళిపోయాడు కృష్ణ.
మీ నాన్నగారి కళ్ళల్లో తడిగమనించకపోలేదు. అక్కడేవున్న నేను చేసేది ఏముంది?
ఇప్పుడిప్పుడే కృష్ణలో ఏదో మార్పు చూస్తున్నాను. ఆయనపట్ల "పాపం" అనే జాలికావచ్చు.
"ఇన్నేళ్ళ తరువాత ఆయన తిరిగిరావటం లోకులకు విడ్డూరంగా వుంది. అనేకన్నా, నేనెట్లా ఇంట్లోకి రానిచ్చానా అని అంటే వాళ్ళ విడ్డూరానికి అర్ధం వుంటుందేమో?"
జరిగిందంతా రాశాను. మిగిలింది అర్ధంచేసుకో శకూ! ఆలోచించలేదు జరగబోయే మంచీచెడూ గురించి. ఆ నిమిషాన మనసుకి తోచింది చేశాను.
నన్నర్ధం చేసుకోగల శక్తి నీకుంది. అందుకే వివరంగా ఇంత కథ రాశాను.
పండక్కి పిలవటానికి కృష్ణ బయలుదేరి వస్తున్నాడు. నీవూ, శ్రీపతి తప్పక రావలసింది. శ్రీపతిని అడిగానని చెప్పు.
ఇట్లు
పార్వతి.
సుదీర్ఘమైన లేఖ రాయటం ముగించి సంతకం పెట్టింది పార్వతి.
రెండు నిమిషాలక్రితం వచ్చి గుమ్మంలో నిలిచిపోయిన కృష్ణ "అమ్మా!" అన్నాడు.
పార్వతి తలఎత్తి చూచింది. కృష్ణ తనవైపు రాసిన కాగితాలవైపు మార్చి, మార్చి, చూడటం గమనించింది. "ఎంతసేపయిందిరా కృష్ణా! నీవొచ్చి" అంది, చేతిలోవున్న కాగితాలు మడుస్తూ.
"రెండు నిమిషాలు కూడా అయివుండదు. మనిషివచ్చిన అలికిడే గమనించకుండా అంతగా రాసింది ఏమిటమ్మా? కథ కాదుకదా! ఇప్పుడు ఇంటింటా ఓ రచయిత్రి వెలుస్తున్నది. మనింట్లో మటుకు ఆ లోటు ఎందుకుండాలని రచనలు చేస్తున్నావా ఏమిటి? మా అమ్మే ఓ రచయిత్రి అయితే యీ రచయిత్రులంతా....."
"ఆపరా! వేళాకోళం. ఏంనేమటుకు రచయిత్రి కాకూడదా? రాయతగనా!" కృష్ణమాటలకు అడ్డువచ్చి నవ్వుతూ అంది పార్వతి.
"నువ్వు రచయిత్రివయితే కథలగురించి ఆలోచించే పనిలేదు, ముందుగా మనకధ" రాయొచ్చు.
పార్వతి పేలవంగా నవ్వి వూరుకుంది.
"ఏమిటమ్మా! అన్ని కాగితాలు రాసావు?" కాసేపాగి అడిగాడు.
"ఇక్కడ జరిగినదంతా శకుంతలకు రాశాను. జరిగింది నీకు తెలుసు, నాకు తెలుసు, రఘుకి తెలుసు. మన శకుకేగా తెలియంది, అందుకే వివరంగా అంతా రాసి పండక్కి పిలవటానికి నీవొస్తున్నట్లు కూడా రాశాను."