Previous Page Next Page 
అనురాగ జలధి పేజి 14

    సడన్ గా మంచి సినిమా చూస్తున్నప్పుడు పవర్ పోయినట్టుగా అయింది జ్యోతికి. 'అదేం?' అంది గాబరాగా.
    బరువుగా నిట్టూర్చాడు "జ్యోతీ! నాకు బరువు బాధ్యతలున్నాయి. నేను ఊరెళ్ళి త్వరగా ఉద్యోగం చేసుకోవాలి. డిగ్రీ వచ్చేవరకూ ఆగక్కర్లేదు. ఏదో ప్రయివేట్ కంపెనీలో జాబ్ వచ్చేస్తుంది. మా చెల్లెలి పెళ్ళి చేయాలి. నాన్నకి తోడుగా ఉండాలి. అయిపోయింది ఇక కులాసాగా, తమాషాగా గడిపే జీవితం...రేపటి నుంచి సంసారం - సాగరం. అంతే! నేను మధ్యతరగతి మనిషిని__నా బ్రతుకు సమస్యలమయం, కొందరిలా సుఖసంతోషాలకి ఆలవాలంకాదు."
    జలజలా కన్నీరు కార్చింది జ్యోతి.
    "క్షమించు జ్యోతీ...నీ మనస్సుకి బాధకలిగించాను!" నొచ్చుకుంటూ అన్నాడతను.
    కన్నీరు తుడుచుకుని "నథింగ్! అదేంలేదు__సరే ఊరెళుదువుగానీలే...కనీసం మనం రెండు రోజులయినా హాయిగా గడిపేద్దాం మళ్ళీ ఎప్పుడో, ఎక్కడో, ఎన్నడో" అంది.
    "అలాగే జ్యోతీ! రేపే వెళదాం!" అన్నాడు శ్రీకర్.
    మరో అయిదు నిమిషాల తర్వాత క్రిందికి దిగొచ్చి టిఫిన్ తీసుకుని బయటికి వచ్చారిద్దరూ. 
    హాల్లో ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతున్నాడు గోవర్ధనం. వీళ్ళ ఇద్దరినీ చూడగానే "రండి కూర్చోండి!" అన్నట్లు తలూపాడు.
    ఫోన్ కాల్ అయిపోయాక "ఆ. ఏంటమ్మా! ఎగ్జామ్స్ అయిపోయాయికదా? ఈ రోజునుంచీ మీరు ఫ్రీ బర్డ్స్...థాంక్యూ మైబాయ్! మీరిద్దరూ యెలా కష్టపడి చదివిందీ పరోక్షంగా నాకు తెలుస్తూనే వుంది!" అన్నాడు.
    శ్రీకర్ ఏమీ అనలేదు. ముఖాన్నే పొగిడేస్తే ఏం చేస్తాడు?
    "డాడీ!"
    "ఏం బేబీ!"
    "మేం రేపు పిక్నిక్ వెళ్ళొస్తాం డాడీ?"
    "వెరీగుడ్...అలాగేనమ్మా...కోటుజేబులో కారు తాళాలున్నాయి. అక్కడ వంకీకి మనబంగళా కీస్ వుంటాయి మీరిద్దరూ పొలాలు చూసి గార్డెన్ కి వెళ్ళండి."
    ఆమె మాట పూర్తికాకముందే వాలెట్ తెరచి బొత్తుగా వున్న నోట్లకట్టనుంచి లెక్కపెట్టకుండా యిచ్చేశాడు కొన్ని...నవ్వుతూ తీసుకుందామె.
                                      13
    "సారీ జ్యోతీ! నువ్వు ఆవేశపడ్డా నేను త్వరపడకుండా వుండవలసింది అక్కడికీ యెంతో నచ్చ చెప్పాను నీకు!" సిన్సియర్ గా అన్నాడు శ్రీకర్. భుజాలనిండుగా వేలాడుతున్న కేశరాశిని చేత్తో సర్దుకుని మెడ అటూ ఇటూ ఆనించి నెవ్లెజీ వేసుకుంది. ఒంటినిండా దుప్పటి కప్పుకుని పడుకుంది.
    మంచం దగ్గరే కుర్చీలో వున్నాడు శ్రీకర్.
    "మనం హద్దులు మీరం!"
    "శ్రీకర్ __" జ్యోతి కంఠం ఆ రాత్రి వేళలో ఆ చల్లని సమయంలో మధురంగా ధ్వనించింది.
    "నాకు ప్రపంచం తెలియదు. నా చుట్టూ నేను నిర్మించుకున్నది రంగుల ప్రపంచం! అందులో సంపద వుంది. సౌఖ్యము వుంది. లైఫ్ ఉంది. మిగతా ప్రపంచంలో బీదరికం ఉందని తెలియదు. కష్టాలున్నాయని తెలియదు. మా నాన్నగారిస్తే యధేచ్చగా ఖర్చు పెట్టేశాను.
    నువ్వు నా అంతరంగానికి దగ్గరగా వచ్చావు. నా మనస్సునిండా ఆక్రమించుకున్నావు. నువ్వే నేను నేనే నువ్వు అన్నంత సన్నిహితంగా వచ్చాం. అప్పుడు పెళ్ళి సమస్య అయింది నీకు.
    కానీ అది సమస్యగా అనిపించలేదు. అనిపించదు కూడా. అందుకే నీ అడ్డంకులు లెక్కచేయలేదు."
    శ్రీకర్ మౌనంగా విన్నాడు. "జ్యోతీ! నీకు అర్ధం కాదు. నేను దానిని అధిగమిస్తాను కాని మీ ఫాదరు..."
    అతని మాటలకి అడ్డొస్తూ "అదో మళ్ళీ అదే ప్రశ్న వేస్తున్నావు. గంటక్రితం ఏం సమాధానం చెప్పానో యిప్పుడూ అదే జవాబు. మా డాడీ విషయం నీకు బాగా తెలియదు. 
    నేను కోరుకోవాలేగానీ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ని తెచ్చికట్టబెడతాడు. ప్రైం మినిష్టర్ కోడల్ని చేస్తాడు. ఛీఫ్ మినిష్టరుతో వియ్యంపొందగలడు. ఆయనకి నేనంటే అంత ప్రేమ" అంది.
    ఒక్కక్షణం ఆగి అన్నాడు. "కానీ దారిద్ర నారాయణుడికి యివ్వడు. ఓ సామాన్యగుమాస్తాకోడల్ని చేయడు. బీదరికానికి కాళ్ళు కడిగి కన్యాదానం చేయడు. నీవంటే ఎంత ప్రేమ వున్నా."
    "డోంట్ టాక్ రబ్బిష్. నేను మా నాన్నని గిరిగీచి నిలబెట్టగలను టాప్ రాంక్ చెప్పిలో తేలో రాంక్ కూడా లిస్టులో వస్తుంది. అంతెందుకు రేపీపాటికి మన మేరేజ్ సెటిల్ అయి వుంటుంది చాలా?"
    శ్రీకర్ తృప్తిగా నవ్వాడు. 
    చేయి చాచింది జ్యోతి తామరతూడులా వున్న ఆ వ్రేళ్ళు అందుకుని పెదాలదగ్గర చేర్చుకున్నాడు.
    అబ్బ మీ మీసాలు గుచ్చుకుంటున్నాయ్? అయినా ఏమిటి మిలటరీ వాళ్ళ లాగా యీ మీసాలు...రేపు తీసెయ్" అంది అతన్ని దగ్గరికి లాక్కుని.
    "యువరాణిగారి ఆజ్ఞల్ని రేపటినుంచి. ఈ రోజు పరిపాలన అంతా మనదే!"
    "యువరాణికాదు సామ్రాజ్ఞి!" కరెక్ట్ చేసింది జ్యోతి కరెక్ట్ క్రిందికిదిగింది. 
                                         14
    తన గదిలో సీరియస్ గా పచార్లు చేస్తున్నాడు గోవర్ధనం. గోడకున్న గడియారం లాగే ఆయన గుండెకూడా లయబద్ధంగా టక్ టక్ మని ధ్వనిస్తుంది. ఆరాటంతో...కూతురా? గౌరవమా? కూతురా? ఐశ్వర్యమా? జ్యోతా? పరువూ మర్యాదలా?" అన్నట్టుగా వున్నాయి ఆ ధ్వనులు.
    అదే గదిలో ఒకవైపు కుర్చీలో కూర్చుంది జ్యోతీ, తల్లి విశాల. మరోవార పడకకుర్చీలో కూర్చునుంది జ్యోతి నాయనమ్మ పద్మావతి.
    కానీ జ్యోతి నిర్వికారంగా, నిర్వికల్పంగా నిరామయంగా, నిశ్చలంగా తండ్రి ఎదుట నుంచుంది. వార్ డిక్లేర్ చేసి ముఖద్వారంవద్ద పొంచేసుకున్న ఛీఫ్ కెమేండర్ లా వుందామె.
    ఆందోళనగానీ, ఆరాటంగానీ లేవు ఆమెలో! రిజల్ట్ ముందే తెలిసి పేపరు చూస్తున్న కుర్రాడిలాగా వుందామె. క్లయిమాక్స్ తెలిసిపోయిన ప్రేక్షకుడు థ్రిల్లింగ్ సినిమా చూస్తున్నట్టుగా ఉందామె. తాళం చెవులు దొరికిన దొంగ ఒంటరిగా బాంక్ చెస్టుముందు నుంచున్నట్టుగా వుందామె.
    ఎర్రజండా ఎగరేసే విప్లవవీరుడిలా నిలబడ్డాడు గోవర్ధనం. అతని ముఖంలో ఆవేశం, ఆరాటం...
    "జ్యోతీ!" పిడుగులా ధ్వనించాయి మాటలు.
    "యస్ డాడీ!"
    "నువ్వతన్ని పెళ్ళాడటానికి వీల్లేదు!"

 Previous Page Next Page