Previous Page Next Page 
రివర్స్ గేర్ పేజి 13

    "అందుకే నాకు చిరాకొస్తుంది. పొద్దున్న ఇంటికి ఫోన్ చేస్తే, ఆఫీస్ కెళ్ళిపోయానని చెప్పారు. ఆఫీస్ కు ఫోన్ చేస్తే, ఎవరూ నీ గురించి సరైన సమాధానం ఇవ్వలేదు. ఈలోపు జపాన్ నుంచి మీ అన్నయ్య ఫోన్ చేసేసరికి, నాక్కూడా కంగారొచ్చి మీ ఆఫీస్ కెళ్ళాను. ఒక మూర్తికి తప్ప మీ ఆఫీస్ లో పనిచేసే మిగతా స్టాఫ్ కి నేనెవరో తెలియదు. అందుకే వాళ్ళు మాట్లాడుకున్నది వినగలిగాను. అది విన్న దగ్గర్నుంచి నాకొకటే టెన్షన్."
   
    "నీకు టెన్షన్ లేనిదెప్పుడు? ఈ మధ్య చాలామంది చీటికీమాటికీ టెన్షన్ పడిపోవడం అలవాటైపోయింది. పాలపాకెట్ లేటుగా వచ్చినా, దినపత్రిక ఆలస్యంగా అందినా, టిఫిన్ లో ఉప్పు తక్కువైనా, కూరలో కారమెక్కువైనా, మొగుడు విసుక్కున్నా, విసుక్కోకపోయినా, ఫ్రెండ్ ఫోన్ చేసి పలకరించినా, పలకరించకపోయినా, టెన్షన్ పడిపోవడం ఒక మానసిక రుగ్మతలా మారిపోయింది.
   
    అకారణంగా సహేతుకమైన కారణం లేకుండా టెన్షన్ పడిపోవడం నిజంగా మానసిక రుగ్మతే..." వెక్కిరింతగా అంది మాయాదేవి.
   
    "అసలు విషయం చెప్పకుండా ఇలా ఏదేదో మాట్లాడిస్తే టెన్షన్ రాకుండా ఎలాగుంటుంది? నన్నర్ధం చేసుకోవే బాబూ..." ఆవేదనగా అంది ప్రియ.
   
    "మాటిమాటికి నన్నర్ధం చేసుకోవే బాబూ అంటూ నన్ను టెన్షన్ పెడుతున్నావేంటే? నువ్వు కూడా నన్నర్ధం చేసుకుంటే బాగుంటుందే బాబూ" నాటకీయంగా అంది మాయాదేవి.
   
    దాంతో  చిర్రెత్తుకొచ్చిన ప్రియ పక్కనే వున్న పూలకుండీ తీసుకుని మాయాదేవి వెంటపడింది. ఆమె తప్పించుకుంటూ తిరుగుతూ, ప్రియకు ఆయాసం వచ్చేవరకు చూసి, అప్పుడెళ్ళి బాల్కనీలోని హేంగింగ్ చైర్ లో కూర్చుంది.
   
    ఆయాసంతో రొప్పుతున్న ప్రియ కూడా వెళ్ళి అక్కడే వున్న మరో చైర్ లో కూర్చుంది.
   
    "ఇంతకూ నువ్వు చేసిందేమిటి? ఏ ఆడపిల్లా ఇంత బరితెగించడం నేనెప్పుడూ చూడలేదు" బుగ్గన చూపుడువేలు పెట్టుకొని, బుగ్గను నొక్కుకుంటూ అమాయకంగా అడుగుతున్న ప్రియను చూసి గలగల నవ్వేసింది మాయాదేవి.
   
    "నేనడిగినదానికి ముందు సమాధానం చెప్పు. ఎందుకిలా చేశావ్? ఏమైంది నీకు?"
   
    "ముందు బుగ్గ మీదున్న ఆ చూపుడు వేలు తీసెయ్యవే. చూడలేక చస్తున్నాను. ప్రతిదానికి నన్నర్ధం చేసుకోవే బాబూ....అనడం, బుగ్గన చూపుడువేలు పెట్టుకుని, బుగ్గన నొక్కుకుంటూ, ఏది ఆసరాగా దొరికితే దానికి చేరగిలబడి, అవునా....? అంటూ అడగడం నీ రక్తంలో పోయాయి.
   
    మనోభావాలను, మానవ సంబంధాలతో ముడిపెట్టుకోగలిగే జీవితం సృజనాత్మకంగా ఆనందదాయకంగా వుంటుంది" విలాసంగా కాళ్ళూపుకుంటూ అంది మాయాదేవి.
   
    "చీమ చిటుక్కుమంటే తెలిసిపోయేది నీ విషయంలో. ఈ విషయం మాత్రం ఈ రోజుకి కానీ నాకు తెలియలేదు. నేను ఈ టెన్షన్ తట్టుకోలేనే బాబూ! ప్లీజ్ నన్నర్ధం చేసుకోవే. అది కాదులే...అలా ఎలా చేశావ్.....నేను నీకు చిన్ననాటి స్నేహితురాలిని. ఒకరి విషయాలు ఒకరం ఎప్పుడైనా తెలియకుండా దాచుకున్నామా?"
   
    "తుమ్మెదపువ్వుపై వాలి మకరందాన్ని ఆస్వాదించేటప్పుడు మౌనాన్ని ఆశ్రయిస్తుందే తప్ప ధ్వని చేయదు. నన్నర్ధం చేసుకోవే బాబూ.....అతనంటే నాకు చాలా ఇష్టం. పంచప్రాణాలని ఫణంగా పెట్టేంత ఇష్టం."
   
    "అదికాదే!"
   
    "అలా దీర్ఘాలు తీసి మాట్లాడకు. చేసింది తప్పో, ఒప్పో అది చేసింది నేను.....ఇప్పుడు అర్ధం చేసుకోవలసింది నేను కాదు నువ్వు."
   
    "అది కాదు....అలా ఎలా చేశావే? ఆడది మగాణ్ణి రేప్ చేయడమంటే...." కళ్ళు అంతంత చేసుకొని ప్రపంచ వింతల్ని ఒకచోట చూస్తున్న భ్రాంతికి లోనవుతూ అంది ప్రియ. మాయాదేవి ఏమీ మాట్లాడలేదు ప్రియకేసి గుడ్లు అప్పగించి చూస్తుండిపోయింది.
   
    మాయాదేవికి కోపం వచ్చిందని గ్రహించింది ప్రియ.
   
    "నువ్వంటే నాకు చాలా ఇష్టమే. ప్రాణమిచ్చేంత ఇష్టం. రేపు నీకేదన్నా జరిగితే తట్టుకోలేనంత ఇష్టం. అందుకే బాధపడుతున్నాను" అంది ప్రియ నెమ్మదిగా.
   
    తనంటే ప్రియకెంతిష్టమో తెలుసుకున్న మిస్ మాయ లేచి వెళ్ళి ప్రియని గుండెలకు హత్తుకుంది. అప్పుడు ఆమె కళ్ళు చెమర్చాయి.
   
    "మార్కెట్లో మన దగ్గరున్న డబ్బులు పెట్టి వస్తువులు ఎలా కొనుక్కోగలమో, మొగుణ్ణి అలా కొనుక్కోవడం నాకు అసహ్యం. ప్రస్థుతం మన సమాజంలో పెళ్ళిళ్ళు అలానే జరుగుతున్నాయి. పెళ్ళి అనే వ్యవస్థకి మన సమాజం తరతరాలుగా ఇస్తున్న విలువే అందుకు కారణం కావచ్చు. వివాహం అంటే పెద్దల నిర్ణయం. వాళ్ళ అనుమతితో జరిగేది. తమ బిడ్డల భవిష్యత్తు, సుఖశాంతులకు, లాభనష్టాలకు తామే బాధ్యులుగా, హక్కుదారులుగా భావించే నేటి పరిస్థితులంటే నాకు చిరాకు.
   
    ఇంతకాలం పురుషుల అబీష్టం మేరకు, అవసరాల మేరకు, అభిరుచుల మేరకు, నడుస్తున్న నేటి వివాహ వ్యవస్థంటే నాకు అయిష్టం. పెద్దలు ఎన్నో ఆలోచించి, అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు శోధించి చేస్తున్న పెళ్ళిళ్ళు జీవితం కడదాకా నిలుస్తున్నాయా? అలాంటప్పుడు నాకు నచ్చిన వ్యక్తిని నేను సొంతం చేసుకోవడంలో తప్పేముంది?" గుండెలకు హత్తుకొని వున్న ప్రియను ఒకింత దూరంగా జరిపి, ఆమె భుజాలమీద చేతులువేసి, సూటిగా చూస్తూ ప్రశ్నించింది మాయాదేవి.
   
    అంతలేసి ఆలోచనలు చేసే ఆడపిల్లలు కూడా వుంటారా.....! అన్నట్లుగా చూసింది ప్రియ.
   
    "అవునా! అన్నట్లు చూడకు. నీకు ప్రతిదీ ఆశ్చర్యమే! ఎలా బతుకుతావో ఏమిటో....?" ప్రియ బుగ్గమీద చిటికేస్తూ నవ్వుతూ అంది మాయాదేవి.

 Previous Page Next Page