ఆనాడు దురదృష్టవశాత్తూ మోడి ఆట సమయంలో జరగరానిది జరిగిపోయింది. సముద్రాలు సృష్టిలోని జలరాసులన్నింటిని ఆకర్షించిన విధంగా భూమి మీది విజ్ఞానాన్ని సమీకరించుకున్న కృష్ణస్వామి తన ప్రతీకారానికి గురి అయినారు. ఆ తరువాత నాగమణిని ధరించి ఆమె ఇల్లాలు అయింది. తల్లీ అయింది. కానీ తన జీవిత భాగస్వామిని అయిన కృష్ణ సర్పాన్ని పాకనించి పారదోలి తాళపత్రాలను చేజిక్కించుకున్న ముద్దాయి అయిన ఈ వాణి మాత్రం తన ప్రతీకారంనించి తప్పుకు తప్పుకు తిరుగుతూంది. ఇంత కాలానికి తిరిగి అవకాశం వచ్చింది. తాళపత్రాలను చుట్టి ఉన్న శ్వేతనాగు శరీరం నిటారుగా అయింది. నాలుకల చీలికలు యమధర్మరాజు ఆహ్వానంలా పదే పదే బయటపడుతున్నాయి.
వంకీలు తిరిగిన ధవళ దంతాలు వాణి అనే ముద్దాయి శరీరంలోకి కసిగా దిగిపోవాలని తహతహపడుతున్నాయి. ఉన్న చోటునించి ముందుకు సాగుతోంది శ్వేతనాగు. మరికొద్ది క్షణాలలో దాని కోరలు కసిగా వాణి శరీరంలోకి కసిగా దిగుతాయి.
సృష్టిలోని ఏ శక్తీ కాపాడలేని విధంగా కోరల వెనక ఉన్న విషపు తిత్తుల్లోంచి గరళం ఆమె శరీరంలోకి పిచికారి చేయబడుతుంది. రక్తాన్ని విషకలుషితం చేసి, శరీరంలోని ప్రతి అణువునూ చిత్రహింసపెట్టి, ఆమె ఉసురులను ఆసాంతం చేస్తుంది.
అంతటితో శ్వేతనాగు ప్రతీకారం ముగిసిపోతుంది. రెండు సంవత్సరాలుగా తన శరీరంలోని ప్రతి అణువులోనూ పగను నింపుకున్న దాని ఆరాటం తీరుతుంది. ఆపైన తలను నేలకు తాటించి ప్రాణాలను విడుస్తుంది శ్వేతనాగు. ఇదంతా జరిగేందుకు మరికొద్ది నిముషాలయినా పట్టదు.
శ్వేతనాగు తుదిసారి సువ్వున గాలి పీల్చింది. దాని శరీరమంతా గాలితో నిండి ఉబ్బిపోయింది. పొంగిన శరీరాన్ని పడగ విప్పిన ముద్రలో కాటువేసెందుకు ఓరగా పడగవంచి యాంగిల్ తీసుకుంది శ్వేతనాగు.
మరి ఒక్క క్షణం మాత్రమే వాణి బతుకుతుంది.
ఆమె పడిపోతూ చేసిన ఆర్తనాదాన్ని విన్న స్వప్నకుమార్ బాబుని ఎత్తుకుని ఉన్నవాడు అలానే పరుగు తీశాడు. వాకిలి దగ్గర నిలిచి దృశ్యాన్ని చూచినాడు.
ఏం చేసేందుకూ సమయం చాలదు. అతనికి అంతా అయోమయం అయిపోయింది. ఏం చేయాలో నిర్ణయించుకునేందుకు సమయం లేక పిచ్చి ఎత్తినవానిలా అయినాడు స్వప్నకుమార్..
వాణిని శ్వేతనాగు లక్ష్యం నించి రవంత తప్పించాలన్న ఆరాటంతో అతడు వాణి పాదాలను పట్టుకున్నాడు. ఆకంగారులో చేతులనించి జారిపోయిన చిన్నారి కృష్ణుడు శ్వేతనాగు పడగ నీడను పడిపోయినాడు.
అది అప్పటికే పడగను ఓరగా వంచి కాటు వేసేందుకు యాంగిల్ తీసుకుంది. అనుకోకుండా ఎదురయిన ఈ అవాంతరం దానికి చికాకు అనిపించింది. అయినా తాను తీసుకున్న యాంగిల్ కి అభ్యంతరంగా పడిపోయినాడు చిన్నికృష్ణుడు. అది చేయగలిగింది మరింకేమీ లేకపోయింది.
రెండు క్షణాలు బొమ్మలా నిలిచిపోయింది.
ఆ కొద్ది సమయంలో వాణిని చేతులమీదికి ఎత్తేశాడు స్వప్నకుమార్. తప్పిజారిన అవకాశాన్ని తలపోస్తూ అక్కడ నించి నెమ్మదిగా అంతర్దానమయింది శ్వేతనాగు.
అల్లరి కృష్ణుడు దాని వంక చూస్తూ ఆరున్నొక్క రాగం ఆలపిస్తున్నాడు. వాడి ఏడుపుకు గదిగోడలు వణుకుతున్నాయి. ఇంటి కప్పు ఎగిరిపోతోంది.
వాడు ప్రారంభించిన గాత్రకచేరి తరంగాల్లా ఇల్లంతా అలుముకుని స్మృతి విహినురాలయి పడివున్న వాణి కర్ణపుటాల్లో దూరింది.
ఆ మాతృమూర్తి పేగు రవంత కదిలింది.
అప్పటికే డాక్టరుకూ, కేశవరావుగారికి ఫోను చేసి విషయమంతా చెప్పేశాడు స్వప్నకుమార్. కలతపడిన గుండెతో కరిగి జారుతున్న కన్నీటితో హుటాహుటిన బయలుదేరి వచ్చేశారు కేశవరావుగారు.
డాక్టర్ క్షణాలమీద యాంటీ వీనమ్ ఇంజెక్షన్ తీసుకుని పరుగు పరుగున వచ్చాడు. వారంతా చేరుకునే సమయానికే నీరసంగా లేచికూచుంది వాణి.
స్వప్నకుమార్ తన గాత్ర కచేరిని అఖండంగా కొనసాగిస్తున్న చిన్నికృష్ణుడిని తీసుకువచ్చి ఆమె ఒడిలో కూర్చోపెట్టాడు. నూనె రాచిన వాడి తలకు పెదవులు ఆనించి దిగాలు పడి కూర్చుంది వాణి.
ఆమె అంతర్ లోకం క్షోభతో నిండిపోయి ఉంది. పేగు తెంచుకుని పుట్టిన ఈ బిడ్డతో మాతృబంధాన్ని ఎలా తెంచుకోగలను, భగవంతుడా?! అని మూగగా రోదిస్తోంది. వాడు మాతృమూర్తి వక్షోజాల మధ్య ముఖాన్ని ఆనించుకుని రవంత శాంతుడయినాడు.
కేశవరావుగారు వాణి చేతుల్లోంచి బిడ్డను తీసుకుని గుండెకు హత్తుకున్నారు. స్వప్నకుమార్ చెప్పిన దృశ్యాన్ని తలచుకుంటే ఆయనకు గుండె బేజారు అవుతూంది.
చేయవలసిన పరీక్షలు ముగించి, ఎవరికీ ఎటువంటి ప్రమాదమూ లేదని ప్రకటించి వెళ్ళిపోయినాడు డాక్టర్. వాణి ముఖంలో ఎన్నడూ చూడని దయనీయమయిన స్థితిని గమనించాడు స్వప్నకుమార్. ఎంతటి సాహసానికయినా సునాయాసంగా పూనుకుని, ఎటువంటి చాలెంజ్ అయినా సంతోషంగా స్వీకరించే వాణి ఇలా దిగజారిపోవటం అతనికి అర్ధంకాలేదు. మాతృత్వం తాలూకు మహనీయత ఇప్పుడామె హృదయ స్పందనలను శాసిస్తోందని అతడు గ్రహించలేకపోయినాడు.
"అమ్మా, వాణి! నీ జీవితంలో ఎటువంటి సమస్యలూ తల ఎత్తరాదని నేను కోట్లకొలది ఆస్తి సంపాదించి నీ కోసం దాచి ఉంచినాను. కానీ, తల్లీ! నన్ను చాలా నిర్భాగ్యునిగా చేశావు నువ్వు. డబ్బుతో తీర్చలేని సమస్యల్ని సృష్టించావు. నీ ముఖంలో ఎప్పుడూ ఆనందం పరవళ్ళు తొక్కాలని నేను నా జీవితమంతా అందుకోసం ఖర్చు పెట్టాను. కానీ ఇప్పటి ఈ దయనీయమయిన దుఃఖ స్థితిని చూస్తూ ఉంటే నా శ్రమ అంతా వృధా అయిందనిపిస్తోంది. ఎటువంటి దుర్వార్తలు వినకముందే నాకు ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తోంది" అంటూ శాలువాతో కన్నీరు తుడుచుకున్నారాయన.
అప్పటికే వాణి కృతనిశ్చయురాలు అయింది. కర్తవ్యాన్ని స్మరించి కటినాత్మురాలుగా మారిపోయింది.
"పదండి, నాన్నా! నేను కూడా మీతోపాటుగా వస్తాను" అంటూ లేచి నిలబడింది ఆమె. శ్రోతలిరువురూ దిగ్బ్రాంతులయినారు. స్వప్న ముఖం పాలిపోయింది.