Previous Page Next Page 
వేసవి వెన్నెల పేజి 14


    శ్రీధర్ కు అమూల్య అమయాకత్వం చూసి జాలివేసింది. ఏమిటి అమ్మాయి? ఒకోసారి ఎంతోతెలివిగా మాట్లాడుతుంది. అమాయకంగా అనిపిస్తుంది. తెలివైందే కాని కష్టం సుఖం తెలియకుండా పెరిగింది.


    ప్రేమించడమంటే సినిమాల్లో లాగా. తను చదివే కథల్లో లాగా అనుకుంటుంది. జీవితంలోని కష్టాలు తెలియవు. అందరూ తనలాగే ఉంటారను కొంటున్నది. తనకూ ఆమె అంటే ఇష్టం ఏర్పడింది. కాని ఆమె అగ్నిజ్వాల అనీ, అది ముట్టుకుంటే చెయ్యి కాలుతుందని తనకు తెలుసు. అందుకే వాళ్ళింట్లో ఉండీ కన్నెత్తి చూడటానికీ, ఆమెతో మాట్లాడటానికీ కూడా తనకు భయమే.


    తను మనశ్శాంతిని కోల్పోవడం తప్ప ఆ అమ్మాయి మీద వ్యామోహం పెంచుకుంటే మరేమీ తనకు అందదని తెలుసు. ఆస్థులు మనిషికీ మనిషికీ మధ్య ఏర్పరచిన కంచుగోడలను తను బద్దలు కొట్టలేడు. ఆ అమ్మాయికి ఇవ్వన్నీ తెలీవు. అసలు అమూల్య తనతో తన ఊరు ఎందుకు వచ్చినట్టు? ఒక విధంగా మంచిదేనేమో అనుకున్నాడు. అమూల్యకు తనంటే ఇష్టమని తను ఆ ఇంటికి వెళ్ళిన రెండో రోజే అర్థం చేసుకున్నాడు. తన ఇల్లూ, తన ఇంట్లోని జీవితాన్ని చూసి మనసు మార్చుకుంటుందనుకున్నాడు. అయినా తనను ప్రేమిస్తున్నానంటుంది. ప్రేమించడం అంటే తేలికే. కాని పెళ్ళి అనే సరికే అన్ని కష్టాలు వస్తాయి.


    ఎలా ఈ పిల్లకు నచ్చచెప్పడం ఇంత సౌందర్యవతినీ, అల్లారుముద్దుగా ధనవంతుల ఇంట్లో పెరిగిన పిల్లనీ తను వివాహం చేసుకుంటే ఆమెను తను సుఖపెట్టగలడా? ఆమె కోర్కెల్ని తీర్చగలడా?


    "ఏమిటి ఆలోచిస్తున్నారు? మీకు నేనంటే ఇష్టం లేదు కదూ?"


    శ్రీధర్ చివ్వున తలతిప్పి చూశాడు. ఆ ముఖంలోకి చూస్తూనే ఉండిపోయాడు. ఎంత అందంగా వుంది? ఇంతటి సౌందర్యవతిని తీసుకెళ్ళి ఆ పల్లెటూర్లో తను చాలీ చాలని జీతంతో సుఖపెట్టగలడా? ఆమె తనకు ఇష్టం లేదని ఎలా చెప్పడం?


    "మాట్లాడరేం?"


    శ్రీధర్ చిరునవ్వు నవ్వాడు.

    
    "నన్ను చూస్తే మీకు నువ్వు వస్తుందా? నేను అంత అసహ్యంగా వున్నానా?"


    "కాదు కాదు"


    "నువ్వు చాలా అందంగా ఉంటావు. నన్ను చూసుకొని నేనే నవ్వుకొంటున్నాను."


    "ఎందుకు?"


    "ఆకాశం మీద ఉన్న తార నన్ను చేతులు చాచి ఆహ్వానిస్తోంది. కాని ఆ తారను చేరుకోలేని మరుగుజ్జువాణ్ని నేను"


    "మీకు కవిత్వం కూడా వచ్చే"


    "అది కవిత్వం కాదు, వాస్తవం. మీరంటే నాకు ఇష్టమే కాని దాన్ని నేను స్వంతం చేసుకోవాలని ఆశించడం పిచ్చితనం అవుతుంది. మీ అంతస్థు వేరు - నా అంతస్థు వేరు. నిప్పుతో చెలగాటం ఆడటం నాకు ఇష్టం లేదు."  


    "అబ్బబ్బ అంతస్థులు...అంతస్థులు...ప్రతివాళ్ళూ అదేమాట. ప్రేమకు అంతస్థులేమిటి?


    "ఈ డైలాగ్ సినిమా హీరోయిన్ చెబితే తండ్రి నిప్పులు కక్కుతాడు. కాని ప్రేక్షకులు చప్పట్లు కొడతారు."


    "శ్రీధర్..." గొంతులో ఏదో గరగరలాడింది.


    "అమూల్యగారూ మా ఇంటి పరిస్థితి ఇప్పుడే చూశారు. ఆ ఇంట్లో, ఆ ఊళ్ళో, ఆ వాతావరణంలో మీరు ఉండగలరా?"


    "మీరుంటే ఎక్కడయినా వుండగలను."


    "మీరు ప్రేమంటే అందమయిన కలగా ఊహించుకుంటున్నారు. ఆ ప్రేమలన్నీ అనుకూలంగా ఉన్నంతవరకే ఉంటుంది. కఠోర వాస్తవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఆ ప్రేమా గీమా ఎటు పోతుందో మీకే తెలియదు. అప్పుడు మీరు పశ్చాత్తాప పడతారు. అయినా మీకు నాలో ఏం కనిపించింది. పైపై అందమేగా? నా స్వభావం మీకు తెలియదు. పరిపక్వం చెందిన మనసు ఉండి ఒకర్ని ఒకరు అర్థం చేసుకోగలిగినప్పుడు ఏర్పడే ప్రేమే శాశ్వతంగా నిలుస్తుంది.


    "శ్రీధర్ ప్లీజ్ మాట్లాడకండి."


    "నన్ను చెప్పనివ్వండి."


    "మీరు మీరు అంటూ నన్ను మన్నించక్కర్లేదు. నువ్వు అంటే సంతోషిస్తాను."


    "నాకు కొత్తవాళ్ళను నువ్వు అనే అలవాటు లేదు."


    "నేను ఆడపిల్లను. అయినా సిగ్గు విడిచి మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పాను. అయినా పరాయిదాన్ని సంబోధించినట్టు మీరు అనడం నాకు బాధను కలిగిస్తుంది."


    "ఆల్ రైట్ నువ్వు అనే అంటాను. అలా అన్నందువల్ల మీకు సంతోషం...."


    "అదుగో మళ్ళీ మీరు"


    "సరే నువ్వు" సంతోషంగా ఉందా?


    అమూల్య కిలకిల నవ్వింది.


    "నేను మీ యింటికి ఉద్యోగం కోసం, మీ నాన్నగారి దయాధర్మాలను అర్థించడం కోసం వచ్చాను."


    "అలా అనకండి. మీ నాన్నగారూ, మా నాన్నగారూ చిన్ననాటి స్నేహితులు. ఒక స్నేహితుడి కొడుకుగా మా నాన్న దగ్గిర సహాయం పొందటం మీ అధికారం అని ఎందుకు భావించారు?"


    "అయినా మీలోకం వేరు మా లోకం వేరు. మీ ఇంట్లో నేను ఒక మూల ఒదిగి ఒదిగి ఉంటున్నాను. ఆ వాతావరణంలో నేను ఇమడలేను. మీ యింటికి వచ్చేవాళ్ళు గానీ, మీ అమ్మగారూ, మీ చెల్లెలూ నన్ను యాచకుడిగానే చూస్తారు. చూస్తున్నారు. వారి దృష్టిలో మీరు వయసులో వున్నారు. లేనిపోనివి ఊహించుకుంటారు. ఊహాలోకం చాలా అందంగా, ఆకర్షణీయంగా వుంటుంది. వాస్తవం ఎంతో కఠోరంగా ఉంటుందో మీకు తెలియనివి అనుభవంలోకి వస్తేగాని నేను చెప్పినా మీకు అర్థం కాదు.


    "మీరు అనుకుంటున్నది. ప్రేమకాదు. కేవలం వ్యామోహం. వయసులో ఉండే ఉన్మాదం.


    "శ్రీధర్" దాదాపు అరిచినట్టే అన్నది.


    "ఈ పిచ్చిపిచ్చి ఆలోచనలు మాని మీ అంతస్తుకు తగినవాణ్ని చూసి పెళ్ళిచేసుకోండి."


    "మీరు నన్ను అవమానిస్తున్నారు."


    "లేదు అమూల్యా ఈ అనుభవం, నీతో ఈ కొద్దినాళ్ళ పరిచయం నేను మర్చిపోలేనివి. ఈ అనుభూతిని మనసులో పదిలంగా దాచుకుంటాను. ఇంతకంటే ఎక్కువ కోరుకోవడం అత్యాశే అవుతుంది."


    "శ్రీధర్" అమూల్య శ్రీధర్ చేతిని తన చేతిలోకి తీసుకుంది.

 Previous Page Next Page