Previous Page Next Page 
డి.కామేశ్వరి కథలు పేజి 13


                                             మాబతుకుమాది

    'మంచినీళ్ళ సీసా మర్చిపోయాను' అనుకుంటూ తలుపు తీసుకువెళ్లిన సుజాత మంచినీళ్ల సీసాతో తిరిగి వచ్చి తలుపు దఢాలున వేసింది.
    ఎర్రబడ్డ ఆమె ముఖం, ఆ విసురు చూసి 'ఏమిటి ఏమైంది?' అన్నాడు ఆశ్చర్యంగా ప్రసాద్.
    సుజాత తిరస్కారంగా చూసి తల తిప్పుకుంది జవాబివ్వకుండా.
    'ఏమిటీ' అన్నాడు మళ్లీ.
    'ఛ.. వయసుకి తగ్గట్టు ఉండరు అనవసరంగా వెళ్ళాను' అంది కోపంగా.
    'ఏమైంది సరిగా చెప్పు' విసుగ్గా అన్నాడు.
    'వెళ్లి చూడండి, ముసలాళ్ల సరసాలు. పచ్చిగా అలా హాల్లో..' తిరస్కారంగా అంది.
    సంగతి విని ప్రసాద్ తేలిగ్గా నవ్వేవాడు. 'అదా ఇంకా ఏమిటో అనుకున్నాను. ఏమిటోయ్ పాపం మా నాన్న, అమ్మలని మరీ ముసలాళ్ళని చేసి మాట్టాడకు. ఆయన మొన్నేగా రిటైర్ అయింది. ఏభై ఎనిమిది అంటే ఈ రోజుల్లో నడి వయసు కింద లెక్క. పాపం వాళ్ళకి ప్రత్యేకించి ఓ గది లేదు. ఏదో అవకాశం చూసి సరసాలాడుకుంటే పానకంలో పుడకలా నువ్వు వెళ్ళావు' హాస్యంగా అన్నాడు.
    'ఛీ.. ఊరుకోండి పెద్దవాళ్ళు కాస్త డిగ్నిఫైడ్ గా ప్రవర్తించాలి. ఇలా చీప్ గా..'
    'ఏయ్ సుజా, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. కాని పని ఏం చేస్తున్నారు. ప్రతీదానికి పెడర్థాలు తీస్తే ఎలా? అసలు మనం పిల్లల గది వాళ్ళకిచ్చి పిల్లల్ని హాల్లో పడుకోమనాలి, మనదే తప్పు.'
    'అవును పాపం ఈ వయసులో వాళ్లకీ గదులివ్వాలి. మరి చదువుకునే పిల్లలకి ప్రైవసీ లేకుండా ఎలా?' దురుసుగా అంది సుజాత.
    'సర్లే పడుకో, వాళ్ళ పాట్లు ఏవో వాళ్ళే పడతారు నీకేం బాధ' అంటూ లైటార్పేశాడు ప్రసాద్.
    అవతల హాలులో కమలమ్మ 'ఛ... కోడలేమనుకుందో మనల్ని చూసి' సిగ్గుగా అంది.
    'అంటే..'
    'మీరు మరీను. వయసుతో పాటు సరసాలు ఎక్కువవుతున్నాయి. నలుగురూ తిరిగే హాలులో..' భర్త వంక కోపంగా చూసింది.
    'ఏం చేశాం... నీవు పడుకుంటే, నీ మంచం మీద కూర్చుని నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్నాం అదీ తప్పేనా, అయినా సరసాలాడే వయసింకా దాటిపోలేదు మనకు. మనిష్టం మనది. ఎవరో ఏదో అనుకోవడానికి ఏం వుంది ఇందులో. అసలు ఇలా హాల్లో పడుకోవడం ఎంతో ఇబ్బందిగా ఉంది ఖర్మ, మన ఖర్మ కొద్దీ మనకో ఇల్లంటూ లేకుండా పోయి కొడుకింట్లో ఉండాల్సి వచ్చింది' రామ్మూర్తి గారు చాలా అసహాయంగా, అసంతృప్తిగా అన్నారు. 'సరేలే, లైటార్పి పడుకోండి' అందావిడ అటు తిరిగి పడుకుంటూ.

                                         *    *    *    *    *

    'అంకుల్ సాయంత్రం మీ ఆఫీసు దగ్గరకి వస్తాను. మీతో కాస్త మాట్లాడాలి. ప్లీజ్ నా కోసం కాసేపు వెయిట్ చేస్తారా. మీతో అర్జంటుగా మాట్లాడాలి' అన్నాడు ప్రసాద్.
    'ఏమిటి సంగతి, ఏ విషయం మాట్లాడాలి? పోనీ మీ ఇంటికి రానా, మీ నాన్ననీ చూడచ్చు' అవతల నించి సాంబశివరావు అన్నాడు.
    'వద్దులేండి నేనే వస్తాను ఆఫీసుకి, వెయిట్ చేయండి.'
    సాయంత్రం ప్రసాద్ వచ్చాక ఇద్దరూ క్యాంటీన్లో కాఫీ తాగుతూండగా ప్రసాద్ చెప్పిన విషయం విన్న సాంబశివరావు ఆశ్చర్యంగా చూసాడు. 'ఎందుకు హఠాత్తుగా మీ నాన్న ఈ నిర్ణయం తీసుకున్నాడు. కారణం ఏదైనా ఉందా? ఇంట్లో ఏదన్న గొడవలా..'
    'అబ్బే చెప్పుకోవాల్సినంత ఏం గొడవలు లేవు. గత ఏడాదిగా కలిసే ఉంటున్నాంగా. అందుకే సడన్ గా నాన్నగారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం బాధనిపించింది. ఎన్ని రకాలుగా అడిగినా ఆయనేం చెప్పడం లేదు. నిర్ణయం తీసుకున్నాక చెప్పారు. నా మాట వినడం లేదు. మీకు బాగా ఫ్రెండ్ కదా. మీరు చెబితే వింటారేమోనన్న ఆశతో చెబుతున్నాను. కొడుకుండీ ఓల్డ్ ఏజ్ హోమ్ కి పంపేశాడు అన్న నింద నా మీద పడదా అంకుల్. అది ఆయనకెందుకు అర్థం కావడం లేదో మరో. అయినా అంత ఖర్మ ఏం వచ్చింది. మీరొకసారి మాట్లాడండి. మనసులో మాట చెబుతారేమో'
    'పద ఇప్పుడే వస్తాను, మాట్లాడడానికి వేరే ముహూర్తం కావాలా ఏంటి? నీ స్కూటరుందిగా వెళదాం రా' అన్నారు సాంబశివరావు.
    'ఏమిటోయ్ నల్లపోసవయ్యావు. ఎన్నాళ్ళైంది కనిపించి' మిత్రుడిని చూసి అన్నాడు రామ్మూర్తి. స్నేహితుడు కొడుకుతో కలిసి రావడం చూసిన రామ్మూర్తికి సంగతి అర్థమైంది.
    'నాయనా నీలా నేనింకా రిటైరవ్వలేదుగా ఎప్పుడు బడితే అప్పుడు రావడానికి. ఏదో మీవాడు నీమీద కంప్లైంట్ చేస్తే ఆఫీసు నుంచి ఇటే వచ్చాను. ఏమిటీ సంగతి ఏదో గొప్ప నిర్ణయం తీసుకున్నావట.'
    'ఓ మా వాడు రాయబారానికి పంపాడా నిన్ను' నవ్వుతూ కొడుకు వంక చూసారు రామ్మూర్తి.
    ప్రసాద్ ముఖం గంటు ఎట్టుకుని 'రాయబారం ఏముంది? మిత్రుడి మాటలైనా మీకు రుచించుతాయేమోనన్న ఆశతో చెప్పానంతే' అంటూ లోపలికి వెళ్ళిపోయాడు.
    'ఏమిటి రామ్మూర్తి ఏమైంది? నువ్విలాంటి నిర్ణయం తీసుకున్నందుకు పాపం మీ వాడు చాలా నొచ్చుకుంటున్నాడు.'
    'అది సరే, రేపు ఉదయం తొమ్మిది గంటలకు నిన్నో చోటికి తీసుకువెళతాను. వీలుంటుందా రావడానికి. వస్తే అక్కడ ఈ విషయం మనం మాట్లాడుకుందాం. నీ సందేహ నివృత్తి అప్పుడు చేస్తాను. ఎనిమిదిన్నరకల్లా వస్తాను, రెడీగా ఉండు'

 Previous Page Next Page