Previous Page Next Page 
కన్నీటికి వెలువెంత? (కథలు) పేజి 13


    అన్నిటికంటే కోడలు ఎదురుగా అలా అంటున్నా కొడుకు వింటూ వూరుకోవడం ఆయనకి కష్టం కలిగించింది. కోడలు అందని బాధ ఎందుకు మన బంగారం మంచిదయితేగా.... అనుకున్నాడు. నాలుగు నెలలుకూడా గడవకుండానే కొడుకు 'నాన్నా తమ్ముడు మా వూరికి నాన్నని పంపు అంటూ రాస్తున్నాడు, అని పదిసార్లు అన్నాడు. నిజమేననుకుని మూడో కొడుక్కి తనమీదవున్న ప్రేమకి మురిసిపోతూ వెంటనే మూట ముల్లెతో మూడో కొడుకింటికి ప్రయాణం కట్టాడు.
    తీరాచేసి మూడోకొడుకు గుమ్మంలో అడుగు పట్టాకగాని అక్కడ తనని ఎవరూ ఆహ్వానించలేదని, తనకోసం ఎవరూ కలవరించలేదని యిదంతా తనని వదుల్చుకోడానికి రెండో కొడుకు చేసిన దురాలోచన అని తెలుసుకుని కృంగిపోయాడు.
    మూడో కోడలు మామగారిని చూసి గుమ్మంలోంచే మూతి త్రిప్పుకుని లోపలికి వెళ్ళిపోయింది. కొడుకు కనీసం వచ్చారా అనేనా పలకరించలేదు. అప్పుడే ఆ యింట్లో తనకి జరగబోయే సత్కారాలు అర్థం అయ్యాయి. కాని తప్పేదేముంది! ఈ కోడలు రోగిష్టిదిట ఆయాసంట, నీరసంట! పిల్లలకే వండిపెట్టలేక చస్తుంటే ఈ తద్దినం ఒకటి వచ్చిపడింది అని విసుక్కుంది. "ఇంట్లో పిల్లలకు తలో అరగ్లాసుడు పాలు ఇచ్చుకుందామన్నా గతిలేదు. కాని.... ఈయనగారికి మాత్రం రెండుపూటలా రెండు గ్లాసులు పాలు నైవేద్యం పెట్టాలి" మొగుడి దగ్గిర అంటూంది.
    గ్లాసుకి మూడొంతులు నీళ్ళు ఒక వంతు పాలు ఇస్తూ కూడా ఏదో ఇంట్లో పాలన్నీ తనే త్రాగేసినట్టు ఎందుకలా సాధిస్తుందో కోడలు అనుకునేవాడు విశ్వనాథం. మరి తనేం చేస్తాడు! కాఫీ వద్దంటారు డాక్టర్లు.
    ఈ కొడుకు తన దగ్గిరనించి డబ్బులాగే తెలివి తేటలలో అన్నలని మించిపోయాడు. ప్రతినెలా తనింకా పెన్షన్ అందుకోకముందే ఏవేవోచెప్పి ఆ డబ్బులేకపోతే పీకలమీద ప్రమాదం కూర్చున్నట్టు మాట్లాడి మాయచేసి పట్టుకుపోయేవాడు. విశ్వనాథం చేతిలో దమ్మిడీలేక మందులు కూడా కొనుక్కోలేక నానా అవస్థ పడసాగాడు. ఇది చాలనట్లు 'నాన్నా, నీ ఫ్రావిడెంట్ ఫండ్ తాలూకు డబ్బంతా ఏంచేశావు! ఇన్సూరెన్సు డబ్బు వెయ్యిరూపాయలు వచ్చినట్లుంది. అదెక్కడ దాచావు!' అంటూ అడుగుతూంటే వళ్ళు మండేది విశ్వనాథానికి.
    "ఏం తెలీనట్టు క్రొత్తగా అడుగుతాడేం! ఫ్రావిడెంట్ ఫండ్ ఏం చేశాడు? ఆడపిల్లలిద్దరి పెళ్ళిళ్ళకి చేసిన అప్పులు ఎవరు తీర్చారు? తనీ స్కూలు మేష్టరు జీతంతో తొమ్మండుగులు పిల్లలని పెంచి పెద్దచేశాడు ఆ రోజుల్లో గాబట్టి! చదువులు, పెళ్ళిళ్ళు అన్నీ ఎన్ని ఇబ్బందులు పడి చేశాడో ఎరగరా యీ పిల్లలు? ఆడపిల్లల పెళ్ళిళ్ళకి అప్పులు తెచ్చి ఫ్రావిడెంట్ ఫండ్ రాగానే చెల్లబెట్టినట్లు తెలియకనేనా అడగడం! ఇన్సూరెన్సు డబ్బు గురించి అందరూ కలసి తనమీద కారాలు నూరిన సంగతి మరచే అడిగాడా! ఐదోవాడు అవిటివాడు. చదువు సంధ్య అబ్బలేదు. ఏదో పేపరు ఏజన్సీ తీసుకుంటాను ధరావతుకి వెయ్యి రూపాయలు కట్టాలంటే ఆ డబ్బు ఆ కొడుక్కి ఇచ్చాడని అందరూ మూతులు ముడుచుకున్న సంగతి జ్ఞాపకంలేకే అడిగాడా! అప్రయోజకుడయిన ఆ కొడుకు గతి తన తర్వాత ఏమిటని ఆలోచించి ఆ వెయ్యి వాడికి ఇచ్చాడు. ఇంకా ఇన్నాళ్ళు తనదగ్గిర కూర్చుందా? ఎంతసేపూ తన డబ్బుమీదేగాని తనమీద ఆపేక్ష ఎక్కడుంది వాడికి. ప్రతి నెలా ఏదో చెప్తాడు. మరి ఇన్నాళ్ళు ఎలా గడిపాడో! యీ డబ్బు లేకపోతే ఏం చేసేవాడో!
    రోజురోజుకీ కొడుకు డబ్బుకి పీడించడం, ఆ బాధ భరించలేక యీసారి ఎవరూ వెళ్ళమనకుండానే నాలుగో కొడుకింటికి ప్రయాణం కట్టాడు ఆయన.
    నాలుగో కోడలు మామగారు పెద్దవారు అని గౌరవించడం మాట దేముడెరుగు, తనని అవమానించింది. పురుగు కన్నా హీనంగా చూసింది. విసుక్కున్నా సణుక్కున్నా తనంత బాధపడకపోను. కాని.... తలుచుకుంటే మనసు దహించసాగింది ఆయనకి.
    "అబ్బబ్బ, మీ నాన్నగారేమిటండీ బొత్తిగా అంత ఎడ్డి మనిషి. ఆ బట్టలు ఆ వళ్ళు, ఆ పళ్ళు కంపు.... సరేసరి ముక్కుపొడుం వాసన పిల్లలకి కూడా తగిలిస్తున్నారు. ఆ వాసన డోకు వస్తూంది అంది. పిల్లలని కూడా తన దగ్గరికి రాకుండా కట్టడి చేసింది.
    ఇంకోసారి వర్షం వస్తూంటే ఎండేసుకున్న పంచ కోడలు ఎలాగూ తీయదని తెలిసి తనే వచ్చాడు తీసుకోడానికి. తను బట్టలు తీసుకుని మామగారి పంచ ఓ కర్రపుల్లతో తీస్తూంది. ఎంతో నొచ్చుకున్నాడు ఆయన. తనంత అంటరానివాడా! తన పంచ పుల్లతో తీస్తూంది. తన విస్తరి చేత్తో ఎత్తకుండా చీపెరుతో తోస్తుంది. అంత ఏహ్యంగా వున్నాడా తను!
    ఎంత అభిమానం చంపుకుని కొడుకు పంచ చేరినా అంత హీనస్థితిని భరించలేక మూడునెలలు కూడా నిండకుండానే ఐదో కొడుకింటికి బయలుదేరాడు.
    ఆ ఇద్దరి ఇళ్ళలో మర్యాదలు రుచి చూస్తే అనుభవం పూర్తవుతుందనుకున్నాడు ఆయన.
    ఐదో కోడలు మామగారిని ఏదన్నా అనడానికి అశక్తురాలు కనక వూరుకుందో, లేక స్వతహాగా మంచిదోకాని మామగారిని అభిమానంగా చూసింది. ఐదో కొడుకు కూడా మిగతా వారికన్నా భిన్నంగా ఆప్యాయంగానే చూశాడు తండ్రిని. కొడుకు అవిటివాడు! కోడలు మూగది! అవును అవిటి వాడికి మంచిపిల్ల ఎక్కడ దొరుకుతుంది. ఏదో వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నారు. కోడలు ఇష్టం లేకపోతే మాటరాకపోయినా చేతలద్వారా చూపించచ్చు అయిష్టత. కానీ అలాంటిదేం కనపడలేదు విశ్వనాథానికి. అక్కడున్న ఆరు నెలలలోనూ, కాస్త ప్రశాంతిగా ఏ పోరు లేకుండా వున్నాననుకునేసరికి కోడలు నెలలు నిండి పుట్టింటికి వెళ్ళవలసి రావడంతో మళ్ళీ స్థానభ్రష్టత తప్పలేదు ఆయనకి.
    ఆరో కోడలు రిక్షా దిగుతూండగానే మొగం చిట్లించుకుంది.ఆవిడేనా అక్కగార్లకి తీసిపోయింది! తనూ ఏం తీసిపోదని నెలరోజులకే నిరూపించుకుంది.
    "అబ్బ.... ఇదోగొడవ వచ్చిపడింది నెత్తిమీదకి. ఎక్కడికీ ఫ్రీగా వెళ్ళడానికి లేకుండా ఈ ముసలాయన ఒకడు పీకల మీదికి" అంటూంది.
    తనేమన్నా వాళ్ళని సినిమాలకి వెళ్ళద్దన్నాడా, షికార్లకి వెళ్ళద్దన్నాడా? పిల్లల సరదాలని అర్థం చేసుకోలేని మూర్ఖుడా! అక్కడికీ కోడలు సినిమాలకి వెళ్ళినప్పుడు పాలుపోయించుకోమని, ఆ అన్నం దింపేయమని పురమాయించి వెడుతూంటే తను కాదన్నాడా! మరింకా ఎందుకో యీ నిష్టూరం?
    యీ మాత్రానికే అయితే ఆయన యింత బాధపడకపోను. ఒకరోజు కొడుకుతో తను వింటున్నాడని తెలిసినా అంటూంది కోడలు 'మన దేశంలోనే యిలా యీ ముసలాళ్ళు కొడుకుల ఇళ్ళు పట్టుకుని వ్రేలాడ్డం. అమ్మా నాన్న అంటూ ఎవరూ పై దేశాలలో ఇళ్ళలోకి చేరదీయరు. అక్కడ ఎవరిదారి వారిదే! హాయిగా వుంటారు చీకు చింతా లేకుండా. మనదేశంలోనే ఈ దిక్కుమాలిన అలవాట్లు, ఆచారాలునూ. పై దేశాలలో ఒకళ్ళ మీద ఒకరు ఆధారపడరు. అంతగా డబ్బులేనివాళ్ళయితే అలాంటివాళ్ళని చూడడానికి ఆశ్రమాలు లాంటివి వుంటాయిట....' చదువుకున్న కోడలుగదా- అంటే మిగతా వాళ్లకంటే స్కూలు ఫైనలు ప్యాసయి, ఉద్యోగం కూడా వెలిగిస్తూందిగా మరి, దేశదేశాల ఆచారాలు ఏమిటో తెలుసు ఆవిడకి. వింటున్న విశ్వనాథం నవ్వుకున్నాడు.

 Previous Page Next Page