Previous Page Next Page 
కొత్తనీరు పేజి 13


    ఉష సామాను సర్దుకుని, స్నానంచేసి, జడ వేసుకువచ్చి తాతగారితోపాటు భోజనానికి కూర్చుంది.
    "అయితే, నాన్నా వాళ్ళూ దసరాకి వద్దామని ఏమన్నా అనుకుంటున్నారా?" ఔపోసనపడుతూ అడుగారు జగన్నాథంగారు.
    "ఏమో! తెలియదు. బహుశా రారు. అమ్మ నవరాత్రులు చేస్తుంది కదా, ఎలా వస్తారు? బొమ్మలకొలువూ అదీ వుంటుందిగా!" ఉష అన్నం కలుపుకుంటూ అంది.
    "ఇంకా బొమ్మలకొలువు పెట్టుకునే చంటిపాపాయి వేమిటి యింట్లో నువ్వు!" అని మనవరాలిని వేళాకోళం చేశారు.
    "ఆ....మా యింట్లో మా అమ్మకి నే నింకా చంటిపాపాయి గానే కనిపిస్తున్నాను. నాకో, మా సీనుకో పిల్లలుపుట్టి వాళ్ళు బొమ్మలు పెట్టుకునేవరకు ఆ గొడవ నాకు తప్పదుట!" ఉష నవ్వుతూ అంది.
    "బాగుంది.నలభై ఏళ్ళు దాటిన మనపిల్లలే మనకు చంటి పిల్లలుగా కనబడుతూంటే, ఇరవై ఏళ్ళది వాళ్ళకి చంటిదిగాదుటండీ!" మనవరాలిని వెనకేసుకు వస్తూ, మరింత నెయ్యి వేసి అంది పార్వతమ్మ.
    "బాబోయ్! ఇంత నెయ్యే! ఈ నెయ్యి తింటే నా ఒళ్ళు నా అదుపులో ఉంటుందా! ఇక్కడ నాలుగురోజు లుంటే నా నాలుగేళ్ళ డైటింగూ వేస్ట్ అయిపోతుంది!"
    "ఏం చోద్యమే నా తల్లీ! ఇదెక్కడి డైటింగు పిచ్చి పట్టుకుంది మీ అందరికి! ఓ నేతిచుక్క రాలనీయరు! పిడికెడు అన్నం విస్తట్లో పెట్టనీరు.....మొన్న అనూరాధ వచ్చిందా! అదీ యిదే వరస. ఓ నెయ్యి వేసుకోదు. ఏ తీపి పిండివంటలు చేసిపెట్టినా వద్దో అని గోల? ఇంక ఆ సుజాతసరేసరి. విస్తట్లో అన్నమే పెట్టనీయదు. ఏమిటో యీ గోల! ఇదెక్కడి ప్రారబ్ధమో! కడుపునిండా తిండి తినకుండా ఉన్నారు యీపిల్లలు. లేనివాళ్ళ కెలాగూ లేదు. ఉన్నవాళ్ళయినా కమ్మగా యింత తినకపోవడ మేమిటి? పప్పు కలుపుకుని నెయ్యి వేసుకుని కమ్మకమ్మగా తినడమే ఎరగరు. అందుకే ఎండునక్కల్లా తయారవుతున్నారు యీ కాలం పిల్లలు. ఈ పస్తులకు తోడు కాలేజీ చదువు లొకటి వచ్చిపడ్డాయి! మరింత ఆర్చుకుపోతున్నారు! హాయిగా నాలుగూ తింటేగదా కాస్త నవనవలాడుతూ వుంటారు!" చిన్న ఉపన్యాసం యిచ్చింది పార్వతమ్మ, మనవరాలిని కేకలువేస్తూ.
    "బాగుందే!......ఈ రోజుల్లో కరువు ఎలా మండిపోతూందో దాన్నిబట్టి యీ బుద్దులన్నీ పుడుతున్నాయి యీకాలపు వాళ్ళకి!"
    "అదీ నిజమేలెండి తాతగారూ!...... మీకాలంలోలాగ పూట కో గిన్నెడు నెయ్యి ఖాళీచేస్తే, దివాలా తీస్తారు ఎలాంటివాళ్ళయినా యీ రోజుల్లో!" నవ్వింది ఉష.
    "అలా అని కడుపు మాడ్చుకుంటారుటే! తిండికోసమేకదా యీ పాట్లన్నీ! లేనివాళ్ళ కెలాగూ లేదు. ఉన్నవాళ్ళు కేం, శుభ్రంగా కడుపునిండా తినడానికి!"
    "ఇంత అన్నం తింటే శుభ్రంగా తిన్నట్టు లెక్కా బామ్మా! నీకు తెలియదు. కంచెడు అన్నం తినడంవల్ల లాభంలేదు!......బాలంస్డ్ డైట్-అంటే మనం తినే ఆహారంలో అన్ని పోషక పదార్ధాలు వుండేట్లు చూసుకుని తినాలి....."
    "నీ సైన్సు పరిజ్ఞానం మీ బామ్మకేం బోధపడుతుందిగాని....అన్నం తిను ముందు...." అన్నారు తాతగారు నవ్వుతూ.
    "ఏమోనమ్మా! యీ సైన్సులు, చదువులు మాకేం తెలుస్తాయి?మీరిలా ఉన్నారు. ఇంక ఆ శంకర్ యింటికి వస్తాడా? వాడు ఆ ఉద్యోగంలో చేరిన దగ్గిరనుంచీ పూర్తిగా మారిపోయాడులే -యిక్కడున్న నాలుగు రోజులూ 'ఇదేం తిండి, ఉత్త గడ్డితింటున్నాం మనం!' అని విసుక్కుంటాడు. 'అన్నం వార్చి గంజి పారబోస్తారు. కూరలు ఉడికించి ఆ నీళ్ళు వంపేస్తారు. యింతనూనె వేసి ముక్కలు వేయిస్తారు. ఈ తిండిలో ఏంవుంది, చెత్త' అంటాడు. కంచం అంతా కోడి కెక్కరించినట్లు కెలికి కెలికి లేచి పోతాడు ఆ కూర కాస్తా తిని పిల్లా డింటికి వచ్చాడు కదా అని ఏ మైసూరు పాకో, పకోడీలో చేసి పెడితే వేలేసి ముట్టుకోడు! బజారునుంచి ఆ కల్లు రొట్టి తెప్పించమంటాడు. దాని కింత వెన్న పాముకుని రోగిష్టి వాడిలా అది తింటాడు! రాత్రి అన్నం తింటే అరగని ముసలివాడిలా రొట్టెలు చేయమంటాడు! శుభ్రంగా యింత కందిపొడి, ఆవకాయ వేసుకుతినేవాడు యిదివరకు. అన్నీ మానేసుకున్నాడు ఆ ఉద్యోగంలో చేరాక. ఏమిటో, యీ కాలం పిల్లల తీరు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ పోకిళ్ళు మా కాలంలో లేవు బాబూ!
    "ఎప్పుడైనా యీ కాఫీలు ఎరుగుదుమా, యీ టిఫిన్లు ఎరుగుదుమా! ఈ పూట భోజనం చేస్తే మళ్ళీ రాత్రివరకు ఆకలన్న మాటేఉండేదికాదు. ఇలాగంటకోసారి. రెండుగంటలకోసారి టిఫిన్లు తినడం మేం ఎరగం బాబూ! ఇంటెడు పని గొడ్డులా చేసేవాళ్ళం, అలుపూ, సొలుపూ లేకుండా! పదిమంది పిల్లల్ని కన్నా, గుమ్మడి పళ్ళలా వుండేవారు. అయ్యో రాత! ఆ బలాలు, ఆ చాకిరీలు, ఆ పిల్లల్ని కనడాలు యీనాటి ఆడవాళ్ళకి సాధ్యమా! పిండం కడుపున పడినదగ్గిరనుంచి నిలవడానికి మందులు. కనడానికి మందులు, గండం గడిచి పిండం బయట పడడానికి నలుగురు డాక్టర్లు కావాలి. ఇంకసరే, బిడ్డ భూమ్మీద పడినది లగాయితు పాలడబ్బాలకోసం బజార్లు పరుగెత్తడం!.....మరి, యిలాంటి షోకు తిళ్ళు మరిగితే బలాలెక్కడినుంచి వస్తాయంట!...."
    "బలే మంచి ఉపన్యాసం యిచ్చావు బామ్మా! ఇదంతా చక్కగా ఏ పత్రికకో వ్రాసి పంపగూడదూ!" వేళాకోళం చేసింది ఉష.
    "అవునే, అమ్మా! మీలా నేను బియ్యేలు, ఎమ్.యేలు సతికానా పుస్తకాలు రాయడానికి?"
    "మీ బామ్మ చదువుకోకపోతేనేం, ఒక్కొక్క ఉపన్యాసం యిచ్చిందంటే ఏ ఎమ్మేలు పనికిరారు ఆవిడ ముందు!" భార్యని ఆటపట్టించాడు జగన్నాథంగారు.
    "నన్ను చూస్తే మీ యిద్దరికీ అంత వేళాకోళంగా ఉందన్న మాట. పోనీ లెండిగాని యింక లేవండి. పన్నెండు గంటలయింది. నా ప్రాణం కడగడుతూంది! పాపం, వెంకమ్మగారు మీ రెప్పుడు లేస్తారా అని చూస్తూంది. భోజనాలయాక సావకాశంగా మాట్లాడుకోవచ్చు...." అంటూ ఇద్దరినీ హెచ్చరించి పార్వతమ్మ విస్తరిముందు చతికిలబడింది.
    
                                  *    *    *

 Previous Page Next Page