పైనున్న ఆయన స్వభావాలని, ఆయనని మార్చాలని చేసే నా ప్రయత్నాలు వ్యర్ధమయ్యాక ఆయనతో సరిపెట్టుకుంటూ, ఆయన అన్నదానికి కాదనకుండా, ఆయనే మన్నా ఎదురు చెప్పకుండా మౌనంగా ఊరుకోవడం క్రమంగా అలవరచుకున్నాను.
ఎంత సరిపెట్టుకున్నా మా వాళ్ళని ఆడిపోసుకునే ఆయన మనస్తత్వాన్ని క్షమించలేక పోయాను.
ఇంటికి కావల్సినవి ఏమన్నా ఒక్కొక్కటే వస్తువులు ఏర్పరచుకుందాం అని ముచ్చటపడి ఏది అడిగినా "నీ బాబు ఇస్తాడా" "మీ నాన్న నడిగి పట్రా" ఇలా హేళనగా మాట్లాడుతుంటే సహించలేక పోయేదాన్ని.
అలా నాలుగైదుసార్లు జరిగాక ఆఖరికి ఓ రోజు ఆవేశం అణుచుకోలేక "అన్నీ నా బాబు కొనిచ్చే మాట యితే మిమ్మల్ని ఎందుకు అడుగుతాను. ఇంటికి కావల్సినవి కొనుక్కోలేని వారు పెళ్ళి ఎందుకు చేసుకొన్నారు. పెళ్ళాన్ని సంసారాన్ని భరించలేని వారు పెళ్ళన్నా మానాలి. లేదా ఇల్లరికం వస్తాననేనా చెప్పాల్సింది. మీ రేదో ఉద్యోగం చేస్తున్నారని మా వాళ్ళు పదివేలు వదుల్చుకొని మీ కిచ్చారు. ఇంత ఉద్యోగం చేస్తూ అత్తవారిని అడగడానికి అభిమానం అయినా లేదా" కటువుగా అన్నాను.
అంతే, నా చెంప ఛెళ్ళుమంది.
ఆ సంఘటనకి దిమ్మెరపోయాను. ఈ శతాబ్దంలో చదువు సంస్కారం వున్న ఓ భర్త భార్యని కొట్టడం అన్నది నా ఊహకి అందని విషయం. అందుకే కోపం, అవమానం, ఆవేశం, దుఃఖం ముంచెత్తగా "కొట్తారా, మీకెవరిచ్చారు అధికారం!" రోషంగా ఎగసిపడుతున్న గొంతుతో అరిచాను.
"నోర్ముయ్ నన్నే ఎదిరిస్తున్నావా. నీ కెంత పొగరు" మరోసారి చెంప పగిలింది. "ఇది వరకల్లా నోటితో చెప్పాను. ఇకపై మాట్లాడితే చేత్తో చెప్తాను జాగ్రత్త" హుంకరించారు.
చెంప పట్టుకుని ఎగిరి పడుతున్న గుండెలతో రోషంగా చూశాను. అంతకంటే ఏం చెయ్యగలను" ప్రయత్నం లేకుండానే నా ఆవేశం దిగిపోయింది. ఆయనలా మాట్లాడుతూంటే ఇంక నేను అనగలిగింది ఏమీ కనపడక కన్నీళ్ళు జారేముందు గదిలోంచి వెళ్ళిపోయాను.
మొదటిసారి ఆ దెబ్బ నా ఆత్మాభిమానంమీద దెబ్బ తీసింది. అన్నం తినకుండా ఏడుస్తూ పడుకున్నా చీమకుట్టినట్లయినా ఆయన బాధపడలేదు. కనీసం పొరపాటయింది అంటారేమోనని ఎదురుచూసిన నా ఆశ నిరాశ అయింది.
ఆ సంఘటన తర్వాత ఆయన కోపం, సాధింపు ఎక్కువైంది. నా విరక్తి హెచ్చయింది. అప్పటినుంచి ఏ కాస్త సందు దొరికినా మా వాళ్ళని ఆడిపోసుకోడం ఆయన కొక హాబీగా తయారైంది. ఆయనలా అంటూంటే నేను బాధ పడ్తానని తెలిసి నా మీద కక్ష తీర్చుకుంటున్నట్టు మాటలతో హింసించి సంతృప్తిపడే వారు. ఆయనలా అంటున్నప్పుడు అతి ప్రయత్నంమీద ఆ మాటలు విననట్టు నిగ్రహం చూపసాగాను. నేను ఎదురు తిరిగి జవాబు ఇస్తే నా మీద ఎగరవచ్చు. అనే అవకాశం ఆయన కివ్వకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించసాగాను. ఆ ఎత్తు పారక పోయేసరికి నాకు మొగుడంటే లెక్కలేదని, ఆయనమాట అంటే నిర్లక్ష్యమని, పొగరని ప్రతిచిన్నదానికి సాధింపు, తిట్లు తిన సాగాను. మరీ శ్రుతి మించిన నాడు కొట్టి పగ సాధించినట్టు తృప్తి పడసాగారు.
ఆరు నెలల వైవాహిక జీవితంలో ఇన్ని అనుభవాలు కలిగాయి. నేను కలలుకన్న ముచ్చటైన సంసారం, ఆలుమగల అన్యోన్యత, సరదాలు, సినిమాలు, షికార్లు వగైరాలన్నీ కలలుగా మిగిలిపోయాయి. కాని ఎన్నడూ కలలో కూడా అనుకోని తిరస్కారాలు, చివాట్లు, చెంప దెబ్బలు అవమానాలు మాత్రం అనుభవంలోకి వచ్చాయి. నా జీవితం ఇలా వక్రించడానికి కారణం యేమిటి అని ఆత్మ విమర్శ చేసుకొనేదాన్ని అప్పుడు. మా సంసారం ఇలా మారడానికి నేనెంతవరకూ బాధ్యురాలిని? ఆయన ఏమన్నా నోరుమూసుకుని సహించలేక పోవడం ఒక్కటే నా తప్పుగా కనిపించేది.
ఈ జీవితం ఇంతేనని విరక్తిలో పడిపోయి ఇంట్లో యాంత్రికంగా బతకడానికి అలవాటుపడ్డాను. లేవడం, ఇంట్లో పని చూసుకోడం, ఆయన ఆఫీసు కెళ్ళాక కొనుక్కున్న రెండు పత్రికలు, ఇక్కడ అక్కడనించి తెచ్చిన పుస్తకాలు, పేపరు చదవడం, ఎంతసేపు వీలయితే అంతవరకు మొద్దులా పడి నిద్రపోవడం, మళ్ళీ మధ్యాహ్నం పని, ఎవరైనా ఇరుగమ్మ, పోరుగమ్మ వస్తే పలకరించడం - రాత్రివంట-తిండి-పడుకోడం- ఒకటే దినచర్య. ఆయనతో ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడటం, ఆయన తిట్టే తిట్లకి మనసు మొద్దుబారింది. కొడితే మొదట్లో మాదిరి రోషం అవమానం అనిపించని స్థాయికి చేరాను. ఆయన కాస్త సౌమ్యంగా వున్నరోజు తేలిగ్గా ఊపిరి తీసుకోడం, లేనినాడు బిక్కుబిక్కుమంటూ యింట్లో వుండడం. యిదీ నా బతుకు.
సినిమాకి వెడదాం అంటే ముందురోజుల్లో నీవు వెళ్ళు నాకు ఇంటరెస్టు లేదు అనేవారు. ఒక్కర్తినీ వెళ్ళడానికి మనస్కరించక, వెడితే యిరుగు పొరుగు అడిగే ప్రశ్నలకి జవాబు చెప్పాల్సి వచ్చిన పరిస్థితిని అర్ధం చేసుకుని సినిమా క్కూడా మానుకున్నాను. వీళ్ళు వాళ్ళు మహిళా మండలి అనేవారు. మహిళా మండలిలో సాధించే కార్యాలు యేం లేవని తెల్సినా కనీసం ఆ విధంగానైనా కొంతకాలం గడపొచ్చునని ఆయనగారి నడిగాను.
"నోర్మూసుకుని ఇంట్లో పడివుండు. ఏం లేకుండానే నీ కింత పొగరు, అహంకారం. ఇంక ఈ అమ్మలక్కలతో కలిసి స్త్రీ స్వాతంత్ర్యాలు, హక్కులు అంటూ మరింత నేర్చుకోనక్కరలేదు" అన్నారు కటువుగా.