Previous Page Next Page 
ఫాలాక్షుడు పేజి 13


    "రేపు మిమ్మల్ని జైలుకు తరలిస్తున్నారు."

 

    అంటే... ఆరోజు జడ్జీ తనతో మాట్లాడిందే విచారణన్న మాట. కోర్ట్ కి తీసుకెళితే నిజాలు తెలుస్తాయని తనని టాడా క్రింద బుక్ చేసుంటారు. టాడా క్రింద బుక్ చేస్తే కోర్ట్ కి తనని తీసుకెళ్ళనఖ్ఖర్లేదు... ఇదొక పథకమా...!?

 

    "అన్యాయం... అన్యాయం..."

 

    ఆదిత్యలోని లా స్టూడెంట్ అరిచాడు ఎలుగెత్తి.

 

    "నాకు క్రైం స్టోరీస్ చాలా యిష్టం. మా అక్కక్కూడా చాలా యిష్టం. మేమిద్దరం ఎన్ని సినిమాలు చూసేవాళ్ళమో. మీరు యిక్కడ్నించి వెళ్ళేలోపు ఒక క్రైమ్ స్టోరీ చెప్పరూ..." అంది చిన్నపిల్లలా.


    
    నవ్వాడు ఆదిత్య ఆ అమాయకత్వానికి.

 

    మరో గంటలో ఉరికి గురయ్యే వ్యక్తి ఆఖరు ముద్ద తింటుంటే, కూర టేస్ట్ ని అడిగినట్టుంది.

 

    "మీ అక్క వుందన్నావ్ గా... ఆవిడ్ని అడుగు..." నిస్తేజంగా అన్నాడు ఆదిత్య.

 

    "ఇప్పుడు లేదు మా అక్క. మమ్మల్నందర్నీ వదిలేసి తనకు నచ్చిన వాడ్ని ప్రేమించి వెళ్ళిపోయింది... ఎక్కడుందో తెలీదు..." బాధగా చెప్పింది ట్రెస్సా.

 

    అవేమీ వినిపించటంలేదు ఆదిత్యకు.

 

    తానిప్పుడు ఒకటే ఆలోచిస్తున్నాడు... ఎలాగైనా అహోబలపతిని కలవాలని.

 

    అదే అడిగాడు ట్రెస్సాని.

 

    షాక్ తిన్నది ట్రెస్సా.

 

    "ఉన్న సి.ఎమ్ ని చంపి ఆయన స్థానంలో వచ్చిన కొత్త సి.ఎమ్ ని కలుస్తారా? ఆయనేమన్నా మీకు పిల్లనిచ్చిన మావా...? దట్సింఫాజిబుల్ మిస్టర్ ఆదిత్యా. మీరింకా పేపర్స్ చూడలేదు గదా... ఉండండి వస్తా" అంటూ బయటకు వెళ్ళి రెండు నిమిషాల్లో చేతినిండా దినపత్రికలతో తిరిగొచ్చింది ట్రెస్సా.

 

    తనే ఆసరా అయి ఆదిత్యను లేపి కూర్చోబెట్టి పేపర్స్ అందించింది.

 

    ఒక్కొక్క పేపర్ తీసి చూస్తున్నాడు ఆదిత్య.

 

    "రాష్ట్రం ఒక గొప్ప నాయకుడ్ని కోల్పోయింది"

 

    "నేరస్థుడు ఎంత గొప్పవవాడైనా వదిలేది లేదు."

 

    "టెర్రరిజం ముక్కుకి తాడేస్తాను."

 

    "యువత యిలా దారి తప్పటం బాధగా వుంది."

 

    "హంతకుడికి మతి స్థిమితం లేదని డాక్టర్స్ నిర్థారించారు... కనుక ఏం చేయలేని పరిస్థితి నాది."

 

    అవన్నీ అహోబలపతిరావిచ్చిన స్టేట్ మెంట్స్.

 

    పళ్ళు పటపటా కొరికాడు.

 

    "తను చేసే హత్య గుర్రం పెద్దబ్బాయి మీదకు పోవాలనే హంతకుడు ఆయన పిస్టల్ ని దొంగిలించాడు..." అని ప్రతిపక్షాలు-

 

    "రాష్ట్రాన్ని తెగ మేస్తున్న ముఖ్యమంత్రి పోవటం ప్రజల మేలుకే" అని ప్రజలు-

 

    "తనకు పాపులారిటీ రావాలనే ఈ హత్య చేశాడు" అని పోలీసులు-

 

    పత్రికల నిండా తన గురించి వార్తలే. క్రమంగా ఆదిత్యకు అహోబలపతి స్ట్రాటజీ అర్ధంకాసాగింది.

 

    సి.ఎమ్.ని చంపమంటే చంపననే, తనని చంపమని వుంటాడు అహోబలపతి. అది నిజమే అయితే తను అహోబలపతిని బతకనివ్వడు.

 

    పొరపాటున ఆ సి.ఎమ్.ని చంపినా...

 

    కావాలనే ఈ సి.ఎమ్.ని చంపుతాడు. ఎస్... ఆ పైన తనకు ఉరిపడ్డా భయపడేది లేదు. సి.ఎమ్. అహోబలపతిని కలవాలనే ప్రయత్నం చేయటం వృధా ప్రయాసే అనుకున్నాడు ఆదిత్య.


                                               *    *    *    *    *


    మరో 18 గంటలు గడిచాయి.

 

    ముషీరాబాద్ జైల్లో సాలిటరీ సెల్ లో వున్నాడు ఆదిత్య.

 

    "ఇక్కడ నీ మీద ట్వంటీఫోర్ అవర్స్ నిఘా వుంటుంది. పిచ్చిపిచ్చి వేషాలేసినా... తప్పించుకోడానికి చూసినా కాల్చి పారేస్తాను. జాగ్రత్త..." దుబ్బు మొహం పెట్టుకున్న జైలు సూపరింటెండెంట్ హెచ్చరించాడు ఆదిత్యను.

 

    "ఎన్నేళ్ళు జైలుశిక్ష వేశారో కనీసం నాకు చెప్పకుండా జైల్లో పెట్టడం... ఇండియన్ పీనల్ కోడ్ కి అవమానం. కనీసం నా కెన్నేళ్ళు జైలుశిక్ష పడిందో చెప్పండి... ప్లీజ్..." అడిగాడు ఆదిత్య.

 

    "చూడు చిట్టి తండ్రీ... నీ కెన్నేళ్ళు జైలుశిక్ష వేశారో పేపర్ లో తాటికాయంత అక్షరాల్తో ప్రింట్ చేశారు. లోకానికంతా తెల్సు... నీకు తెలీపోయినంత మాత్రాన లోకానికి పెద్ద నష్టమేం జరగదు గదా..." జైలు సూపరింటెండెంట్ నవ్వి, వార్డర్, జైలర్ తోటి ఖైదీల్ని హెచ్చరించి... ఆదిత్య విషయంలో ఏ మాత్రం పొరపాటు జరిగినా కొంప కొల్లేరైపోతుందని చెప్పి వెళ్ళిపోయాడు.

 

    ఆదిత్యకు ఒక్కసారి దుఃఖం పొంగుకొచ్చింది. అతని జీవితంలో మొట్టమొదటిసారి కళ్ళంట నీళ్ళొచ్చాయి. తనను టాడా క్రింద జైల్లోకి నెట్టేసుంటారు. సంవత్సరం వరకు కేసు విచారణకు రాదు. హంతకుడికి మతి స్థిమితం లేదని చెప్పి మెంటల్ హాస్పిటల్ కి పంపించకుండా జైలుకి తీసుకురావటమేమిటి...? ఏదో గూడుపుఠానీ జరుగుతోంది తన వెనుక. దాన్ని ఎదుర్కొనాలి... ఎలా?"


                            *    *    *    *    *


    72 గంటలు గడిచాయి.

 

    లాఠీ చప్పుడు వినిపిస్తే తలెత్తి చూశాడు ఆదిత్య. కాలినోప్పి, తగ్గు ముఖం పట్టినా, పై పెదవి యింకా తగ్గలేదు చీము పట్టి, బాధగా, సలుపుగా వుంది.

 

    "నీతో మాట్లాడటానికి హోం మినిస్టర్ వచ్చారు. రా..." జైలు సూపరింటెండెంట్ చెప్పాడు.

 

    ఆదిత్యకు షాక్ మీద షాక్....

 

    హోం మినిస్టర్ అంటే అహోబలపతి ఎమ్.ఎల్.ఏ.నే అయ్యుంటాడు.

 

    ఎందుకొచ్చినట్టు? ఏదైనా మెసేజ్ తీసుకొచ్చాడా? బేరానికొచ్చాడా? రాజీకొచ్చాడా? బెదిరించటానికొచ్చాడా? తనకేదన్నా మేలు చేయడానికి వచ్చాడా? ఏదీ తేల్చుకోలేకపోయాడు ఆదిత్య.

 

    తన జీవితం మీద తనకే ఒక నిర్లిప్తత, నిర్లక్ష్యం ఏర్పడ్డాయి.

 

    "ఎవడా హోం మినిస్టర్?" నిర్లక్ష్యంగా అన్నాడు ఆదిత్య.

 

    "నా దగ్గరన్నావుగానీ ఆయన దగ్గర అనకు... నా ఉద్యోగం పోతుంది. నీకేదైనా కోపం వుంటే తరువాత తేల్చుకుందువుగాని. ముందు రా" అన్నాడు సూపరింటెండెంట్.

 

    హోం మినిస్టర్ ఎవడో, ఎందుకో ముందు తేల్చుకోవాలి. బహుశా హోం మినిస్టర్ ని సి.ఎం. ఆహోబలపతే పంపించి వుండాలి. ఆదిత్యకు అర్ధమవుతూనే వుంది.

 Previous Page Next Page