మొలకెత్తుతున్న యవ్వన దశలో ఉన్నాడు అక్రమ్. అతన్ని చూస్తే అస్లమ్ కు మంట. అద్దంలో తన ఉంగరాల జుట్టు చూసుకున్నాడు. అది రోజుకింత రాలిపోతుంది. ఇద్దరూ ఒకే తల్లి సంతానం-అయినా ఎంత వ్యత్యాసం! అస్లమ్ బక్కపల్చగా ఉంటాడు. అక్రమ్ ఆరోగ్యంగా నిర్లక్ష్యంగా ఉంటాడు.
అద్దంలో పొయ్యిదగ్గర కూర్చున్న తల్లి కనిపించింది. తల్లి అమాంతంగా ముసలిది అయిపోయినట్లనిపించింది. పరిగ చేనులా ఆమె వెంట్రుకలన్నీ ఊడిపోయాయి. జనపనారలా తెల్లబడిపోయాయి. ముఖం మీద ముడతలు వచ్చేశాయి. ఇదంతా క్షణంలో జరిగిపోయింది. తల్లి అస్లమ్ ముందు కూర్చొని అవతారం మార్చినట్లనిపించింది.
బత్తాయిలు మాయం అయిన్నాటినుంచి ముసలమ్మ నోరు మూతపడింది. ఆమెకు బత్తాయి ఒకలెక్కా? ఆమె రోజుల్లో ఇలాంటి పళ్లను తొక్కిపారేసి ఉంటుంది. నోరు కదపకున్నా ఫాతిమా ఏమనుకుంటుందో ఆమెకు తెలుసు. నేరం సాంతం అక్రమ్ మీద మోపే ప్రయత్నం జరుగుతూంది.
ఫాతిమా నోరు తల్లి నోరు మూయించిందని అస్లమ్ గ్రహించాడు. ఏమిటిది- ఒక్క బత్తాయి కోసం ఇల్లంతా తలక్రిందు చేస్తుంది అనుకున్నాడు. పగలంతా ఆఫీసులో వళ్లు హోనం చేసుకొని ఇంటికివస్తే ఏముంది? అత్తాకోడలు పోట్లాడీ పోట్లాడీ అలసిపోయి ఉంటారు. పిల్లలు విసిగిపోయి బయటికి వెళ్ళిపోయారు. పప్పూ ఏడ్చీ ఏడ్చీ సొక్కిపోయాడు. అందువల్ల అతని రాకనే ఎవరూ గమనించలేదు. చాలాసేపు ఒళ్లు విరుస్తూ కూర్చున్నాడు. అప్పుడు ఫాతిమా లేచింది. పొరుగింటి నుంచి పేపరు అడిగి తెచ్చింది. పత్రికలో సినిమా ప్రకటనలు మాత్రమే చదవలేదని నిరూపించడానికి, లోకంలోని వార్తలను సమీక్షించింది.
"రోజూ ఈ జగడాల్తో చచ్చిపోతున్నానమ్మా! ఒక్కసారే గొంతు పిసికి నీళ్లుతాగి చల్లబడరాదూ?"
"ఎవరో చంపడం ఎందుకూ. ఎవరు చావాలనుకుంటే వాళ్లు ఉరిపోసుకుంటే సరిపోదూ?" అత్తగారు వక్కలు కత్తిరిస్తూ తాజా యుద్ధానికి తయారయింది.
"ఎందుకూ మీ సందుకా పాందాను వేరేపెట్తెపాయె." ఫాతిమాకు తెలుసు అత్తగారి ప్రాణం వాటిలోనే కొట్టుకులాడుతుందని.
"అవును నా ప్రాణం వాటిల్లోనే దాచుకున్నా కదూ!" అత్తగారికి అనేక పాత స్మృతులు గుర్తుకు వచ్చాయి. ఢిల్లీలో చిన్నకొడుకు గోరీ ఉంది. ఈ ఇంట్లో నేరేడు చెట్టు నాటింది. ఇంకా ఎన్నెన్నో జ్ఞాపకాలు ఆమె ముఖంలో మసలాయి. అర్దరాత్రి అమాంతంగా దివ్వెలు వెలిగించినట్లుంది ఆమె వదనం!
అస్లమ్ అన్నీ విన్నాడు. అన్నీ చూశాడు. అయినా కిమ్మనలేదు. రాత్రి సాంతం మెలుకువతో ఉండి దొంగను పట్టాలని నిశ్చయించుకున్నాడు. అప్పుడు ఫాతిమా అంతు తేల్చాలనుకున్నాడు. నోరుపారేసుకునే ఈ ముండవల్ల తల్లి బానిసలా పడిఉంటుందనుకున్నాడు. ఆమె పాపం విషం మింగి ఊరుకుంటుంది.
రాత్రి పదకొండు దాకా 'మేడమ్ బావరీ' చదువుతూ మేలికతో ఉండడానికి ప్రయత్నించాడు. చిక్కం పక్కనుంచి అద్దం వైపుకు తిరిగాడు. బత్తాయి దొంగిలిస్తున్న అక్రమ్ ను అద్దంలో చూచి పట్టుకోవాలని అతని ప్రయత్నం. తెల్లవారుజామైంది. ఎక్కడో కనిపించే కలల ఊహలు పొద్దుటి సందడిలో కరిగిపోతున్నాయి. అస్లమ్ చప్పున లేచికూర్చున్నాడు. కళ్లుతెరిచి చూశాడు. శరీరం అలసిఉంది. చిరాగ్గా ఉంది. వేళ్లు విరుచుకోడానికి సిద్ధపడుతున్నాడు.
అతడు 'మేడమ్ బావరీ' చదువుతూ పడుకున్నాడు. రాల్ఫ్ స్థానంలో తాను ఎమ్మాను కూర్చోబెట్టుకుని 'కోచ్' నడిపించాడు. మంచులాంటి ఎమ్మా శరీరం అతని చేతుల్లో కరిగిపోతూంది. ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. రాత్రంతా మేలికతో ఉండి దొంగను పట్టాల్సింది గుర్తుకు వచ్చింది. ఉలిక్కిపడి లేచాడు.
అటు తిరక్కుండానే చిక్కాన్ని చూచాడు. గుడ్డి సంజవెలుగులో బలహీనం అయిన ఒక చేయి చిక్కంవైపు సాగింది. పరిగచేనులాంటి జుట్టు వంగింది. అస్లమ్ పరిగముళ్ళల్లో ఇరుక్కున్నాడు. కిమ్మనలేదు.
పదకొండు గంటలకు ఫాతిమా వంటలో ఉంది. అస్లమ్ పొద్దున్నే అద్దం తీసుకొని బయల్దేరాడు. అద్దం అమ్మకుంటే ఆటంబాంబు పేలుతుందన్నంత ఆదుర్దాతో వెళ్ళాడు.
"నాలుగు నెలనుంచి మొత్తుకుంటున్నాను. చెవికెక్కలేదు. అద్దంలో ఏ దయ్యం కనిపించిందో.... ఫాతిమా ఆలోచించలేకపోయింది.
"ప్రతిదానికి ఇలాగే ఏడుస్తుంది. నయం, ఈ గొడవలో దానికి బత్తాయి గుర్తుకురాలేదు" అని ముసిముసి నవ్వుకుంది అత్తగారు. ఎండిపోయిన చేతులకు బలం వచ్చిందేమోనని చికిలించిన కళ్ళతో చూచుకుంది.