Previous Page Next Page 
దాశరథి రంగాచార్య రచనలు -7 పేజి 15


                                             మోక్షం

    అది రావణుని బొమ్మ తగలపెట్టేరోజు-విజయదశమి.
    నేడు లోకంలోని అన్యాయానికీ, దుష్టత్వానికీ అగ్గిపెట్టడం జరుగుతుంది. నేడు తమ ఆత్మకు మోక్షం లభించనున్నదన్నట్లు, జనుల వదనాల్లో హృదయాల ఉత్సాహం వెల్లివిరిస్తూంది.
    రావణుని పేరు ఇంకా నిలిచి ఉండేందుకు, లోకం చెడును గుర్తించడానికి, శిక్షించడానికి. అగ్గిపెట్టడానికి.
    ఇది పండుగరోజు. వాన పడ్తూంది. అయినా సహిస్తున్నారు జనం - పాతప్రియురాలి టెక్కును సహించినట్లు.
    మేఘాలు, జనుల నిరాశల్లా, కమ్ముకుంటున్నాయి. వేల చూపులు, మళ్ళిపోవాల్సిందని మేఘాల్ని వేడుకుంటున్నాయి. ఊరి జాతరనాడు వాన రావడం సీతారాములమధ్య రావణుడు ఊడిపడ్డట్లుంది.
    చాలాసేపు సుందరం కవితలు చదివాను. కాస్త విశ్రాంతి కోసం కిటికీ ముందు నుంచున్నాను.
    దూరంగా కొండల్లో దేవాలయం ఉంది. అక్కడికి జనుల రాకపోకలు అప్పుడే సాగాయి. అయినా విశేషం ఏమీలేదు. కొత్తదనమూ కనిపించడంలేదు. బురదలో పొర్లేపందులు, కుక్కలు, కోళ్లు, చెత్తకుప్పలు, అత్తాకోడళ్ళ అరుపులు, తోటికోడళ్ళ కేకలు అన్నీ మామూలే. ఊరుదాటి కాలిబాటల పక్కన కూరగాయల తోటలు, తోటలను చుట్టేసిన కొండలు. చిత్రకారుని కేన్వాస్ మీది బొమ్మల్లా చిన్నచిన్నగా కనిపిస్తున్నాయి. కాని వాటికి మనం దగ్గరవుతుంటే నరుని కోరికల్లా పెరిగిపోతుంటాయి. గుడికి వెళ్ళేదోవలో అనేకరాళ్ళకు రంగులు వేసి బంతిపూలూ, దీపాలూ పెట్టారు. ఈ రాళ్ళూ కొన్నిరోజుల్లో గుళ్లయిపోతాయి. ఎంచాతంటే, వాటిచుట్టూ అనేక కథలూ, ఆచారాలూ కూడి ఉన్నాయి. నా వరకూ నా కనిపించేదేమంటే జానపదుల ఆచార వ్యవహారాలూ ఒకదానిమీద ఒకటి పేరుకొని పర్వతాలుగా మారి ఉంటాయని! వీటిలో కొత్త ఏమీలేదు. చూడాల్సిందీలేదు. అయినా కిటికీ దగ్గరికి వచ్చి నుంచుంటాను. అనుకోకుండానే అలా వచ్చి నుంచుంటాను.
    మా ఇంటిముందు రత్తమ్మ గుడిసె ఉందని బహుశా మీకు తెలియదు. రత్నమ్మ ఎవరు? అని మీరు నన్ను అడిగారనుకోండి నేను ప్రపంచ ప్రఖ్యాతమైన రొమాంటిక్ కవుల కవితలన్నీ వినిపించేస్తాను.
    జాతరకు బయలుదేరడానికి ఇంకా సమయం ఉంది. ముందున్న గొందిలో హడావుడిగా ఉంది. పిల్లలు కొత్త బట్టలు కట్టుకొని సంబరపడుతున్నారు. ముక్కుతాడు వేయని ఎద్దుల్లా ఇవ్వాళ వారి ఆనందానికి వ్యవధుల్లేవు. వంటిమీది బట్టవిడిచి ఎరుగని మగాళ్లు సైతం బట్టలు మార్చారు. వాళ్లను చూస్తుంటే అక్కడక్కడా సున్నం కొట్టిన పాత గుడిలా ఉన్నారు. వారు పిల్లల్ని ఎత్తుకొని చంకనేసుకుంటున్నారు, ఆడపిల్లలతో పరాచికాలాడుతున్నారు.
    స్త్రీలు మామూలుకన్నా గంభీరంగా ఉన్నారు. అలంకరించుకున్నా అందులో ప్రత్యేకత లేదని కనబరచ ప్రయత్నిస్తున్నారు. డబ్బు ఎక్కువ ఖర్చవుతుందని, పని ఎక్కువ అయిందనీ విసుగుతున్నారు. అంత శృంగారం ఎందుకని అమ్మాయిలను కసురుతున్నారు. అమ్మాయిలూ మామూలే - వాళ్లను పట్టించుకోవడంలేదు. పందాలు వేసుకున్నట్లు ఒకరినిమించి ఒకరు అలంకరించుకుంటున్నారు. అయితే అందరూ కొప్పుల్లో బంతిపూలు తురుముకున్నారు కాళ్లకు పసుపు రాసుకున్నారు, వారు కదలిపోయినా బంతిపూల పచ్చదనం వాతావరణంలో కనిపిస్తూంది. అది క్రమంగా ఆకాశంలో మబ్బులా వ్యాపిస్తుంది. చెమ్మగిల్లిన కండ్లకు అది వర్షంలా కనిపిస్తూంది. గుండెల్లో మబ్బులు చేరుకుంటున్నాయి. ఆ మబ్బుల్లోంచి వడగళ్లు నామీద పడకముందే లోనికి వెళదామనుకున్నాను. అమాంతంగా మెరుపు మెరిసింది.
    కాదు - మెరిసింది మెరుపు కాదు. పరిసరాలు నవ్వాయి. పరిసరాలు కాదు - రత్తమ్మ నవ్వింది. ఆమె తన చిరునవ్వుల వెలుగులు నా కళ్లల్లో కురిసింది. అంతే. ఉత్తరదిశకు తిరిగింది. అయినా అందంగానే ఉంది. తాజ్ మహల్ ను ఏ కోణం నుంచి చూచినా సుందరంగానే ఉంటుంది.
    రత్తమ్మను సంవత్సరంగా చూస్తున్నాను. వంగిన మెడ నాసికపు నీడలో పొడవై ముఖాన్ని అందుకుంటూ నలుపు వెంట్రుకల కొండల్లోని సెలయేటిలాంటి పాపిటను అంటుకుంటాయి. ఆమె కళ్లు అవనతంగా ఉంటాయి. కన్నెత్తదు. చూపు నేలకానించి కూర్చుంటుంది.
    అందుకు విరుద్దంగా నేడు చీకటి గదిలో ఉదయించింది. ఆమె పెదవులు స్వర్గ ద్వారాల్లా ఉన్నాయి. ఆమె గుండెలోనుంచి వచ్చిన చిరునవ్వు చెంపలమీద తాండవమాడింది.
    ఈ రోజు ఆమెకూడా తన చిరునవ్వును కానుకగా అర్పించి తన అందాన్ని కోరికల చూపు తూపుల నుంచి రక్షించుకొని పవిత్రం కాదలచుకుందేమో!
    ఆమె కనురెప్పలు నా దిశగా తెరుచుకున్నాయి-ఒక దేవాలయ ద్వారాలు హరిజనులకు తెరచుకున్నట్లు. నేను ఇందుకు అర్హుడనా? ఒక మాలలా ఆలోచించాను.
    రత్తమ్మ ముఖంమీద నా చూపు గుమ్మరించేముందు, ఎందుకో తెలీదు. బదరీనాథుని పవిత్రదేవాలయం గుర్తుకు వస్తుంది. ఆ దేవాలయంలోని భక్త్యావేశాలను చూచి అక్కడి మెట్లు ఎక్కలేను.
    అస్పృశ్యులు చేసిన పాపం ఏమిటి! వారు ఏ దేవాలయానికి వెళ్ళినా ద్వారాలు తెరుచుకోవు. వారి అపవిత్ర పాదాలు నేలనంటుతే భగవంతుడు ఎందుకలా మూతి ముడుచుకొని పారిపోతాడు? వీరికీ భగవానునికీ మధ్య పాపాల గోడ అడ్డుంది. భగవంతుడు ఆలోచనల అడుగుల సవ్వడి సైతం వినగలడట- హరిజనుల ఆక్రందనలు ఎందుకు వినడు?
    నాకు రత్తమ్మ గుర్తుకు వచ్చినప్పుడల్లా నా మనసులో దాగిన మాల గుర్తుకు వస్తాడు. నయం ఈ విషయం మా అమ్మకు తెలియలేదు. తెలిస్తే నా మనసులో మాలను ప్రవేశపెట్టే రత్తమ్మను ఇంటికే రానిచ్చేది కాదు.
    పట్నంలోని నా మిత్రులు నా మానసిక ప్రేమను అపహాస్యం చేసేవారు. ప్రేమ పిడకలో రగులుకొనవలసిన నిప్పురవ్వ అంటే వారికి గిట్టదు. పెట్రోలు పోసి తగలపెట్టడం వారి అలవాటు. వారు దీన్ని ప్రేమగా భావించరు. నేను క్రమంగా వేదాంతంలోకి దిగజారుతున్నానని వారి నమ్మకం. మూడు నాలుగేళ్లలో నేను భక్తుణ్ణి అయిపోతాననీ ఒక మందిరంలో కూర్చుంటాననీ అప్పుడు తమ వలపుల వరాలు అడగడానికి వస్తామనీ భవిష్యద్దర్శనం చేసేవాళ్లు.
    కాని నేడు పరిసరాల్లోని మానసిక శక్తులు మాట్లాడుతున్నట్లున్నాయి. ఇది భగవానుడు దుష్టత్వాన్ని అంతంచేసేరోజు. అతనికి నా మూగ కోరికల గుసగుసలు వినిపించాయేమో! క్షణంలో ఈ ఆలోచనలన్నీ వచ్చేశాయి. మరుక్షణంలో నిరాశా మేఘాలు తొంగిచూచాయి. మరుక్షణం జాతరకు వెళ్ళేవాళ్ళ గడబడలు ఎక్కువయినాయి నేను తడబడి నలువైపులా చూచాను. నాకూ రత్తమ్మకూ ఉన్నదూరం కొలిచాను. అది ఏడేడు సంద్రాలంత ఉంది.
    మానవుని హృదయం పరితప్తం అయినప్పుడు, పేదవాని ఆలోచనల్లా, చూపు నలువైపులా పరుగుతీస్తుంది.
    విజయదశమి హడావుడి తారాస్థాయిని అందుకుంది. మురికి మీద మక్షికాల్లా సాధువులు సన్యాసులు గుమికూడారు. ద్వారాలకు మామిడి తోరణాలు పచ్చగా కనిపిస్తున్నాయి. మామిడి ఆకుల కొసలకు చేరిన వర్షబిందువులు ముత్యాల మాలలా ఉన్నాయి. కాస్తంత కదలికకు ముత్యాలు వెండితీగ అయి జారుతున్నాయి. వాకిళ్లలో కళ్ళాపి చల్లారు. అంగనలు రంగవల్లులు తీర్చారు. కాని అవి వానకు కొట్టుకుపోయాయి.
    ఆడవారంతా తలంట్లు పోసుకొని, వెంట్రుకలు విరబోసుకున్నారు. వారి దేహాలు పరిశుద్ధములు అయినాయి. ఆత్మల పారిశుద్ధ్యం కోసం చేతుల్లో పళ్ళెరాలతో చెరువు వైపు తరలిపోతున్నారు.
    కాళికా దేవాలయానికి బస్తీ నుంచి సాధువులు వచ్చారట. వారి దగ్గర రకరకాల దేవతల గుర్తులున్నాయట. వారిదగ్గరున్న మంత్రాలలో మహత్యం ఏమోగాని ఆడవారి కోరికల్ని గ్యారంటీగా తీరుస్తారట. సర్వపాప పరిహారానికి బాధ్యత వహిస్తారట, సాధువుల గుంపు దేవాలయపు వెనుక ఉన్న సత్రంలో విడిసిందట.

 Previous Page Next Page