Previous Page Next Page 
దాశరథి రంగాచార్య రచనలు -7 పేజి 13


    చివరకు అత్తగారు గుండె రాయి చేసుకుంది. కొట్లోనుంచి అద్దం తెచ్చింది బయట పడేసింది. ఆనాడు సాంతం కన్నీటితో కొంగు తడుపుకుంది. సాయంత్రం అస్లమ్ ఆఫీసునుంచి వచ్చాడు. చూస్తే తనముందు నిలువెడు మనిషి నుంచొని ఉన్నాడు. వంగి జుట్టు సవరించుకున్నాడు. షేర్వానీ గుండీలు సవరించుకొని, చిరునవ్వు ఫోజు పెట్టాడు. తన అందానికి తానే మురిశాడు. చెమటతోనూ, సిరాతోనూ తడిసిన చేతుల్తో అద్దపు ఫ్రేమును అంటుకున్నాడు. ఎంత బావుంది అనుకున్నాడు.
    భర్త అద్దంలో చూచుకొని మురిసిపోవడం చూచింది ఫాతిమా. పొయ్యి దగ్గర్నుంచి లేచింది. మసిచేతులు తుడుచుకుంటూ వచ్చేసింది.
    "పాతిక, ముప్పై రూపాయలకు పోవచ్చు...." మాట పూర్తికాకుండానే బెదిరినట్లయి వెనకడుగు వేసింది. అద్దంలో మామిడి వరుగులాంటి ఎండిపోయిన స్త్రీ కనిపించింది, ఎండిన దేహం, పీచువలె రేగిన జుట్టు, మురికి కారుతున్న చీర. అస్లమ్ పక్కన నుంచుంటే భయంకరంగా కనిపిస్తుంది. ఈమె ఎవరు? తన కన్నుల్లో దివ్వెలు దాచుకొన్న ఫాతిమాయేనా? అందంలో పందెం వేసి గెల్చుకున్న ఫాతిమాయేనా? ఏ చీర కట్టినా అద్దినట్లు కనిపించిన ఫాతిమాయేనా? తన పొడవైన కురులను చూచి పొంగిపోయిన ఫాతిమాయేనా?
    లోన కుండ మాడి మసిబొగ్గయింది. అక్కడినుంచి అమాంతంగా పరుగు తీసింది.
    ఆ రాత్రి కుటుంబపు సాంఘిక, ఆర్ధిక, రాజకీయ సమస్యలన్నింటికీ ఒకేఒక పరిష్కారం నిలువుటద్దంగా నిర్ణయించింది. అయినా ఆ విషయం అస్లమ్ బుర్రకు బొత్తిగా ఎక్కలేదు. అతనికి అది మాంత్రికుని అద్దంలా కనిపించింది. అందులో భవిష్యత్తుకు సంబంధించిన అందమైన అప్సరసల నాట్యాలు గోచరించాయి.
    ఫాతిమా చెప్పిన ప్రతిమాటకూ అడ్డు తగిలాడు అస్లమ్. అద్దం అమ్మినా అర్థరూపాయను మించి రాదు. అద్దం అమ్మితే అమ్మ గుండె పగులుతుంది. పప్పూకు ఇప్పుడూ బత్తాయిలు పెట్టినా ప్రయోజనం లేదు. ఫారూఖ్ భాయి ఇచ్చిన అప్పు అడగడం మానేశాడు ఇదీ వరస.
    తల్లి కొడుకునే వెనకేసుకు వస్తుంది. ఆమె ఆ అద్దంలో తన తండ్రి ప్రతిరూపం చూచుకుంటుంది. ఇహ అస్లమ్ ఇంట్లో ఉన్నంతసేపూ అద్దం చుట్టూ తిరుగుతుంటాడు. అక్కడే భోంచేస్తాడు. గడ్డం గీక్కుంటాడు, దువ్వుకుంటాడు. అద్దంలో చూచుకున్నప్పటినుంచి అతనికి వళ్లు పెంచుకోవాలనే రంధి పట్టింది. ఫాతిమా ఏమో అతని ఆరోగ్యం అడుగంటడానికి కావలసిన ప్రయత్నాలన్నీ చేస్తూంది. అస్లమ్ ఇంటికి వస్తాడా పిల్లలంతా స్వరయుక్తంగా ఏడుస్తారు. రోజూ అదే క్యాబేజీ కూర. అస్లమ్ కు అదంటే బొత్తిగా ఇష్టం ఉండదు.
    ఒకనాడు అక్రమ్ తల్లి కొంగులోంచి డబ్బు దొంగిలించాడు. లెక్క పెట్టుకుంటున్నాడు చప్పున అద్దం కనిపించింది. బయటవాడికి ఎంత పనో! అయినా లెక్కచేయలేదు. దీక్షగా చూచాడు, అద్దాన్ని చూస్తే ఏం కనిపిస్తుంది? అతడే కనిపించాడు. ముఖం జిడ్డుకారుతూంది, దొంగల్లా వెంట్రుకలు పెరిగాయి, కాళ్లకు చెప్పుల్లేవు, అంగలార్చుకుంటూ నడుస్తున్నాడు, అద్దంలోని గూండాను ఆపాదమస్తకం చూశాడు, ఊశాడు. ఛ అన్నీ పోయినాయి. ఇంకా ఈ అద్దం బద్దలు కాదు అనుకున్నాడు అదృష్టం ఏమంటే, దేనిమీదా అతని ధ్యాస నిముషాన్ని మించి ఉండదు. అదీకాక సిగరెట్లు కోసం మండిపడుతున్నాడు. కాకుంటే అద్దం రెండు తన్నుల్ను మించి తట్టుకోగలదా?
    రెండోరోజు అక్రమ్ సైకిలు ఎత్తుకొచ్చాడు. మల్లేశం దుకాణానికి తెచ్చాడు. మళ్ళీ ఆ అద్దం ముందున్నట్లనిపించింది, అదే జిడ్డుముఖం, దొంగల్లాంటి పొడవైన జుట్టు! మల్లేశం దుకాణంలో అద్దం కాదు వెలుగు ముఖం కనిపించదు. చిమ్మచీకటి. అంతటా సైకిళ్ళ స్పేర్స్ పడిఉన్నాయి. దొంగ సైకిళ్ళను విడదీసి ముక్కలమ్మడం అతని వ్యాపారం.
    ఆ సాయంత్రం అక్రమ్ రిక్షా తెచ్చాడు. అద్దం తీసికెళ్ళి అమ్మేయడానికి సిద్ధపడ్డాడు. మల్లేశం పదిహేను రూపాయలకు కొంటానన్నాడని చెప్పాడు. అస్లమ్ కు అమ్మడం ఇష్టంలేదు. అమ్మ అద్దానికి యాభై రావాలంది. వాళ్ళ నాన్న దాన్ని నూటికి కొన్నాడంది. నుంచుంటే దానిలో నలుగురి రూపాలు కనిపిస్తాయంది.
    అక్రమ్, ఫాతిమా అద్దంవెంట అలా ఎందుకు పడ్డారో అర్థంకాలేదు అస్లమ్ కు. అతనికి అద్దం అంటే గర్వం అలాంటిది. బంగళాల్లో కూడా ఉండదని అతని అభిప్రాయం. అందంగా అమర్చిన గదిలో ఈ అద్దం ఉంచితే వెలిగిపోతుందనుకుంటాడు. రావాలంటే అన్నీ ఒకేసారి వస్తాయా? ఇవ్వాళ అద్దం ఉంది. రేపు సోఫా వస్తుంది. ఆ తరవాత రేడియో, అటుపై ఫర్నీచర్. ఇలాగే అన్నీ, అలా ఊహల్లో ఇంటినంతా తీర్చిదిద్దాడు. అయితే కనిపించింది ఒక్క అద్దం మాత్రమే. దాన్ని తన గదిలో పెట్టుకున్నాడు. చూడగానే తను సాంతం కనిపించేట్టు పెట్టాడు. మంచం దానిపక్కనే వేసి పడుకుంటున్నాడు. ఫాతిమా కేకలు కాస్త తగ్గాయి. ఎంచేతంతే అతని జీతమూ అలవెన్సులూ కాస్త పెరిగాయి. అందువల్ల పప్పూకు బత్తాయిలు లభిస్తున్నాయి.
    అస్లమ్ ఆఫీసునుంచి వచ్చేప్పుడు ప్రతిరోజూ నాలుగు బత్తాయిలు తెచ్చేవాడు. అతని అలికిడి విని పిల్లలంతా పరిగెత్తి వచ్చేవాళ్లు. కాళ్లకు చుట్టేసుకుంటారు. అవి పళ్లు కావు మందు మాత్రలంటాడు. పప్పూ చేదు మందు అందులో ఉందంటాడు. పిల్లలు వినరు ఏడుపు లంకించుకుంటారు. అప్పుడు ఫాతిమా లేచి పిల్లలను నాలుగు బాదుతుంది. పిల్లలు ప్రాణం పోయినట్లే పొర్లిపొర్లి ఏడుస్తారు.
    ఈ పళ్లవల్ల ఒకని ఆరోగ్యం బాగుపడుతుందనుకుంటే పాపం, ఇందరు పిల్లల ప్రాణాలు పోతున్నాయి! ఇందును గురించి అస్లమ్ తప్ప ఎవరూ ఆలోచించేవారు కారు. అందువల్ల పప్పూ దగ్గర కూర్చుని జాగ్రత్తగా వలచిపెట్టేవాడు. వజ్రాలతో చేసిన లేహ్యం తినిపించినట్లు, మరొక బత్తాయి పిల్లలందరికీ పెట్టేవాడు. తాను కష్టపడుతున్నాడు. సంపాదిస్తున్నాడు. తాను ఆరోగ్యంగా ఉండాలి. అద్దం చూసుకుంటే ఆరోగ్యం దిగజారుతున్నట్లుంది. 'పిల్లలకేం- ఎలాగూ ఎదుగుతారు. తినాల్సింది మనం. తానుంటేనే లోకం అనేది అమ్మ. అందువల్ల మూడో బత్తాయి అస్లమ్ తినేవాడు. ఇహ నాలుగోది ఉట్టిలో వేశాడు. తెల్లవారేవరకు ఉండేదికాదు. ముందు ఫాతిమా చూచింది. ఆమె గుండె దడదడలాడింది. భర్తను లేపింది. అస్లమ్ కళ్లు నలుపుకుంటూ లేచాడు.
    "కాకి ఎత్తుకపోయిందేమో?" ముఖం కడుక్కుంటూ అత్తగారు అన్నారు.
    "కాకులు పళ్లు తినవమ్మా!"
    "పిల్లలింకా లేవనేలేదు." ఫాతిమా పిల్లల్ని కాపాడుకుంది. ఈ నేరం పిల్లల మీద వేస్తాడేమోనని ఆమె భయం. "పడుకునేపుడు నేను స్వయంగా చూచాను."
    "ఈ ఇంట్లో దేనికీ ఒక పద్ధతి లేదు. అంత కరీదైన పళ్లు అలా ఎందుకు పారేశారు?" అత్తగారు అటూ ఇటూ తిప్పి కోడలు మీద నేరం మోపటానికి చూచింది.
    "ఏమిటి? ఏమన్నావు?" అని కోడలు లేచింది. పప్పూను నాలుగంటించింది. నువ్వెంత అంటే నువ్వెంత అని జగడం సాగింది. దాన్ని ఆపడం అస్లమ్ కు సాధ్యంపడలేదు. అల్లరి విని పిల్లలు లేచారు. చూస్తే చిక్కంలో బత్తాయి కనిపించలేదు పప్పూకు. అతడు ఎక్కెక్కి ఏడుపు సాగించాడు.
    "కాకులు పళ్లు తినవమ్మా!"
    "పిల్లలింకా లేవనేలేదు." ఫాతిమా పిల్లల్ని కాపాడుకుంది. ఈ నేరం పిల్లల మీద వేస్తాడేమోనని ఆమె భయం. "పడుకునేపుడు నేను స్వయంగా చూచాను."
    "ఈ ఇంట్లో దేనికీ ఒక పద్ధతిలేదు. అంత ఖరీదైన పళ్లు అలా ఎందుకు పారేశారు?" అత్తగారు అటూ ఇటూ తిప్పి కోడలు మీద నేరం మోపటానికి చూచింది.
    "ఏమిటి? ఏమన్నావు?" అని కోడలు లేచింది. పప్పూను నాలుగంటించింది. నువ్వెంత అంటే నువ్వెంత అని జగడం సాగింది. దాన్ని ఆపడం అస్లమ్ కు సాధ్యపడలేదు. అల్లరి విని పిల్లలు లేచారు. చూస్తే చిక్కంలో బత్తాయి కనిపించలేదు పప్పూకు. అతడు ఎక్కెక్కి ఏడుపు సాగించాడు.
    రెండోరోజు ఉదయం మళ్ళీ బత్తాయి మాయం.
    అది అక్రమ్ పనేనని ఫాతిమా - అస్లమ్ అనుకున్నారు. అందుకు కారణం లేకపోలేదు. అత్తగారూ తనూ, అక్రమ్ నిర్దోషులమని గంటకొట్టి చెబుతూంది. అక్రమ్ మాత్రం ఉలకడంలేదు. పలకడం లేదు. తనకేమీ పట్టిలేనట్లు ప్రవర్తిస్తున్నాడు. భోజనాలప్పుడు కందగడ్డయిన అన్న ముఖం చూస్తాడు. చెమ్మగిల్లిన వదిన కళ్లు చూస్తాడు. "ఏమైంది? అలా ఉన్నారు." అని అడుగుతాడు అత్తగారు నోరు కదపదు. అన్నం కలుపుకుంటుంది. ఫాతిమా అర్థయుక్తం అయిన చూపుల్తో అస్లమ్ కు చూస్తుంది. అస్లమ్ విషపు చూపుల్తో దుంగలాగా ఉన్న అక్రమ్ ను చూస్తాడు.
    అస్లమ్ భోంచేసి పడుకుంటే అద్దంలో అక్రమ్ కనిపించాడు. నిశ్చింతగా పిల్లలతో ఆడుకుంటున్నాడు. వెధవ ఇంత పెద్దవాడయినాడు - ఆటలాడ్తాడు పనిలేదు పాటలేదు భోజనానికి సిద్ధం. సరే చదివించడానికి డబ్బులేదు నిజమే. ఏదైనా పని చేసుకోవచ్చుగా. వెదికితే భగవంతుడైనా దొరుకుతాడు. వాడికేం పట్టింది. తిండి దొరుకుతూంది. పనికోసం ఎందుకు వెదుకుతాడు! దొరకదని ఇంట్లో కూర్చున్నాడు. పిల్లల్తో ఆడుకుంటున్నాడు బత్తాయిలు తినీ తినీ వళ్లు పెంచుకుంటున్నాడు వెధవ.

 Previous Page Next Page