Previous Page Next Page 
మైదానం పేజి 13


    "ఆ వూరి తోళ్ళసాయేబు కూతురిమీద అమీర్ కి మనసు కలిగింది. ఆ పిల్ల అతన్ని నిరాకరిస్తోంది. మీరా ఆ అమ్మాయి బంధువుడు. ఇద్దరికి రాయబారం నడుపుతున్నాడు. ఈ సంగతి చెప్పి మీరా నన్ను అక్కడే వొదిలేసి తప్పించుకొన్న లేడిపిల్లలా గంతేసి వెళ్ళిపోయాడు.
    నేను యింటివేపు మళ్ళీ, మెల్లగా యోచిస్తూ నడుస్తున్నాను. భూమి దోవని చీకట్లో దాచుకుంది తాటిచెట్టు పూనిన దానివలె గాలిలో మెల్లిగా వూగుతోంది. కీచుకీచుమనే మైదానపు శబ్దాలతో తాటాకుల చప్పుడు కలిసింది. ఏదో రొద మొదలుపెట్టింది.
    చివరికి నా గతి యిలా అయిందా? యింక యేం కాను? అమీర్ని ఆకర్షించే శక్తి పోయింది నాకు? అనే తలపు నన్ను బాధపెట్టింది. నా ఆనందానికీ, జీవనానికీ వున్న పట్టు వొదిలింది. ఇంక పతనానికి అంతమెక్కడో? ఈ వొక్క కొమ్మనీ నమ్ముకుని, అన్ని ఆశ్రయాలనీ తన్నేశాను. ఇది యిట్లా పెళ్లుమని విరిగింది. నేనేంకాను? ఏది దిక్కు? అమీర్ మీద అమితమైన కోపం కలిగింది. ఇట్లా వొదిలేవాడవు నన్నెందుకు తీసుకొచ్చినట్లు? తన సౌఖ్యమే గాని నట్టేట్లో వొదిలితే, నా జీవితమేం కావాలనుకున్నాడు?
    ఏటినీళ్ళు కాళ్ళన పెనవేసుకుని తమని చూడమని ప్రాధేయపడ్డాయి. నా హృదయారాటాన్ని చల్లార్చాలని సాయంత్రపు గాలి నా పైట కింద నించి రాసుకుంటూ వెంబడించింది. ఏం చెయ్యను?
    మామయ్య అన్నమాటలే నిజమేమో! ఇలా శరీర ఆకర్షణకి లోబడి జీవితాన్ని వప్పగించుకున్న దౌర్భాగ్యుల గతి యింతే గావును! ఉధ్రుతమూ, నిరాటంకమైన మోహానికి అంతమింతేనేమో! ఏ నిగ్రహమూ నియమమూ లేకుండా, యింకొకరి భార్య అని యోచించకుండా నన్నుకోరిన అమీర్, నన్ను వొదిలి యింకోర్ని మోహించడంలో ఆశ్చర్యమేముంది? ఎంత అసహ్యంగా వున్నా సంఘ నిర్మితమైన సంసారంలో, కొంత శాశ్వతత్వం కాలంవల్ల యేర్పడి ఛేదించడానికి సాధ్యంకాని బంధనాలున్నాయి. ఇక్కడా? వెర్రిదాననైనానా? మామయ్యే చివరికి వివేకవంతుడా...." ఇలా అనుకుంటూ గుడిసె చేరుకున్నాను.
    సమస్త ప్రపంచమూ అంధకారమైనట్టూ, లోకంలోని విచారమంతా తనని బాధిస్తున్నట్టూ నేనూ, నా వొంటరితనమూ; తనకేమీ సంబంధము లేనట్టూ గుడిసె మూల పడుకున్న అమీర్ని చూసేటప్పటికి నా బాధా, న్యూనతా, భయమూ, నిరాశా-అన్నీ నా మనసుని వుద్రేకింప చేశాయి. రోషంలో నోటికి వచ్చినట్టు తిట్టేశాను. లేచి కూచుని చూస్తున్నాడు. వెంటనే స్ఫురించింది. ఆ తురకవాడు యీ తిట్లు తిని వూరుకోడనీ, నన్ను చచ్చేట్లు తంతాడనీ. కాని నా నాలిక వుద్రుతాన్ని నా భయం ఆపలేక పోయింది. నేనింక తిట్టలేక అతని నిశ్చలత్వాన్ని చూసి ఆశ్చర్యపడి ఆగాను. ఆమీరట్లానే కూచున్నాడు. నేను కూచున్నాను. గాలికి మా గుడిసె ఆకులు గలగలమన్నాయి. ఆరిపోయే నిప్పులు గాలికి రేగి యెర్రగా మెరిశాయి. నక్క కూసింది. నక్షత్రమొకటి జారింది. నా ప్రక్కన యేడుపు గుక్క వినబడ్డది. అమీరేడుస్తున్నాడు. నా మనసు కరిగిపోయి, అతని దగ్గరికి వెళ్ళి అతని తలని నా కదుముకుని "దానిమీద నీకంత మనసా" అన్నాను. మళ్ళీ యేడ్చాడు. ఆ నిమిషాన అతనిమీద యెంత దయ కలిగింది? బలమైన మొగవాడి కఠిన హృదయాశ్రువులలో కరిగి చల్లారింది నా కోపమంతా. ఆ రాత్రంతా అమీర్ని కావిలించుకుని పడుకుని, యేం చెయ్యాలో నిశ్చయించుకున్నాడు.
    మర్నాడు మధ్యాహ్నం మీరా అమీర్ తో మాట్లాడుతూ వుండగా నేను యేరు దాటి జీడిమామిడి పొదలో కూచున్నాను. మీరా అలాగే తిరిగి వెళ్ళాలి. నా దిగులంతా పోయింది. అమీర్ తో ఇదివరకంతా యిచ్చిన ఆనందం-అది నాకూ ఆనందమే. కాని, యిప్పుడు నా బాధని ఆనందంగా మార్చి అతని ఆనందంలో నేను ఆనందపడబోతున్నాను. గొప్ప సంతోషంతో నా వొళ్ళు పులకరించింది. ఆకుల నీడలో వుడతలాడుకుంటున్నాయి. జముడు కాకి మూలుగుతోంది. ఆకుల్లోంచి ఎండ నా గోరుమీద పడి మెరుస్తోంది. మీరా వొస్తున్నాడు. అలా జుట్టు మొహంమీద పడుతో ఏమీ దిగులు నెరగని, కల్మష మెరుగని చూపుతో, ఆకాశాన్నీ, చెట్లనీ, చూసుకుంటూ వెళ్ళే అతన్ని చూస్తే ఎంతో ముద్దొచ్చింది. పిలిచి, పక్కనకూచో పెట్టుకుని, ఆడుకోవాలని పించింది. కాని కిక్కురు మనకుండా కూచున్నాను. దూరానికి పోనిచ్చి వెనకబయలుదేరాను. ఊరుదాపుకు వచ్చేవరకు అతను నన్ను చూడలేదు. అక్కడ ఎందుకో వెనక్కి తిరిగాడు. ఆశ్చర్యంతో నా కోసం ఆగాడు.
    "ఏమిటిది?"
    "పద"
    "ఎక్కడికి!"
    "నా సంగతెందుకు? నువ్వు వెళ్ళు"
    "ఎందుకు వొస్తున్నావు?"
    "నా యిష్టం"
    పాపం. నా గొంతుమార్చి యిలా కఠినంగా మాట్లాడితే చాలా నొచ్చుకున్నాడు. చప్పున వెనక్కి తిరిగి మైదానం వేపు నడుస్తున్నాడు.
    నేను వెనకనే వెళ్ళి అందుకుని "ఎక్కడికి" అన్నాను.
    "నా సంగతెందుకు నువ్వెళ్ళు"
    "ఎందుకు వెడుతున్నావు!"
    "నా యిష్టం."
    "మరి వూళ్ళోకి వెళ్ళవూ?"
    "ఇది మా వూరు కాదు"
    ఇద్దరమూ పకాలున నవ్వాము.
    "రా మరి" అన్నాను గోముగా.
    "ఎందుకో చెప్పు"
    "దాని యింటికి"
    అతని మొహంమీద భయమూ, కోపమూ, కమ్మాయి, తమార పుష్పంమీద దుమ్ము పడ్డట్టు.
    "నీతో చెప్పినందుకు యిట్టా చేస్తావా?" చాలా కష్టంగా అన్నాడు.
    "నేనేమీ చెయ్యను. నీకు గానీ, అమీర్ కి గానీ ఏమీ అపకారం చెయ్యను."
    "అయితే ఎందుకు"
    "చెపుతాగా"

 Previous Page Next Page