"సుపుత్రప్రాప్తిరస్తు" అని దీవించారు స్వామి. అది వారికేమీ అర్ధం కాలేదు.
"నేను ఏటికి పొయ్యొస్త. వస్తవుగద" అని సాగిపోయారు నారాయణ స్వామి.
"వస్త కాల్మొక్త..." అని నిలిచిపోయారు గురువయ్య-లచ్చమ్మ.
జనం ఎవరి పనులకు వారు వెళ్ళిపోయారు. గూడెం మామూలు గూడెం అయింది. రోకటి పాటలు వినిపించాయి.
నాంచారమ్మ నీరుకారే చీరెతో మంచినీళ్ళ బిందె తలమీద ఉండగా దూరంనుంచి వాకిట్లో లచ్చమ్మను చూచింది. మట్టెల చప్పుడుతో వడివడిగా వచ్చి "ఉండు బిందె దింపి వస్త" అని లోనికి ఉరికింది. బట్ట మార్చుకునేవరకు లచ్చమ్మ ఉండదేమోనన్నట్లుగా తడిబట్టలతోనే బయటికి ఉరికివచ్చింది.
"ఏం లచ్చమ్మ రావటం బంద్ చేసినవు. వళ్ళెట్లున్నది. పిండం తిరుగుతున్నదా....పచ్చళ్ళు తినాలెననిపించటంలే.....ఊళ్ళోలేరా.....గురువయ్య కూడా కనపట్టంలేదు" తుపాకి గుండ్లలా టపటపా వచ్చాయి మాటలు.
ఉక్కిరి బిక్కిరి అయింది లచ్చమ్మ. "ఈడనే ఉన్నం. యాడికి పోలె. పోవద్దన్నడుండి."
"ఎవరు? గురువయ్యేనా! ఏమయింది వానికి? ఎందుకొద్దన్నడు."
"మీ ఇంటి కొస్తే పురుగులు పడి చస్తమన్నడటనుండి కోంటాయన."
"వాడే చస్తడు పురుగులు పడి. అయ్యగారొచ్చిన్రా! పిలిచిన్రుగద.....ఇగ వస్తుంటవా?"
"వస్తనుండి వస్తుంట రాకుంటే నాకెట్లున్నదనుకున్నరు....మా అవ్వను చూడనట్లున్నది."
"నా కట్లనే ఉన్నదే. బిడ్డను చూడట్లున్నదే.....ఏందో ఎతుక్కున్నట్లున్నది. ఉండు నిన్ననే నూరిన చింతకాయపచ్చడి.....ఇంగువ పోపు పెట్టిన్లే తెచ్చిపెడ్త" అని లోపలికి పోయి కొబ్బరి చిప్పనిండా పచ్చడి తెచ్చి నేలమీద పెట్టి దూరం జరిగి చెంబులో నీళ్ళతో చేయి కడుక్కొని "వంటయినక రా. అన్నం కూరలు పెడతా. ఇవ్వాళ నువ్వు.....గురువయ్య మా అన్నమే తినాలె. ఇన్నవా?" అని లోపలికి పోయింది.
లచ్చమ్మ పచ్చడి తీసుకొని వెళ్ళిపోయింది.
గురువయ్య రాకపోకలు నారాయణస్వామి ఇంటికి సాగేయి. నాంచారమ్మకూ, లచ్చమ్మకూ పరిచయం పెరిగి ఆత్మీయత గా మారింది.
కొన్నాళ్ళు గడిచాయి.
ఒకనాడు రామకిష్ణయ్య నారాయణస్వామి ఇంటికి వచ్చాడు. అది అసాధారణం అనిపించింది స్వామికి. పశ్చాత్తాపం చెంది వచ్చాడేమో ననుకున్నాడు.
వచ్చినవాడు నమస్కరించాడు. రామకిష్ణయ్యకు స్వాగతం పలికి చాపవేసి కూర్చుండబెట్టి "నాంచారూ! చూసినవా ఎవరొచ్చిన్రో, మన రామకిష్ణయ్య వచ్చిండు" అని పిలిచారు స్వామి.
నాంచారమ్మ పయటకొంగుతో చేతులు తుడుచుకుంటూ బయటకు వచ్చి "ఏం రామకిష్ణయ్యా! వూరు మరిచిపోయినవూ ఇటు రానన్న రావటం లేదు" అన్నది. మాటల్లో ఆత్మీయత ఉంది. కాని అది గమనించే స్తోమత లేదు రామకిష్ణయ్యకు.
"పన్లు ఎక్కువయినయుండి. పుర్సతుంట లేదు. పైసకు శాన కటకట అయితాంది ఇయ్యాల్రేపు."
"అదేమిటి అట్లంటవు. సర్లేగాని మంచి తీర్ధం కావాల్నా" నాంచారమ్మ అడిగింది.
"ఒద్దులేరి. ఇప్పుడే తాగొచ్చిన. ఒక మాట చెప్పేటందుకు వచ్చిన. అయ్యగారితోని ఎట్ల చెప్పుదునా అని విశారిస్తున్న" రామకిష్ణయ్య అన్నాడు.
వింతగా చూశారు రామకిష్ణయ్య ను నారాయణస్వామి-నాంచారమ్మ ఏదో అమాంతంగా శూన్యం ఏర్పడింది. ఏదో అవాంతరం రానున్న సూచనలు గాలిలో కనిపించాయి.
ఎవరూ మాట్లాళ్ళేదు కొన్ని క్షణాలు.
"పైసకు కటకటా ఉన్నదని చెప్పినగద!" రామకిష్ణయ్య ప్రారంభించాడు. మిగతా ఇద్దరూ వింటున్నారు. "యాపారం బాగా సాగుటలేదు. అప్పులు తీసు కొన్నాళ్ళు సరిగ్గా ఇస్తలేరు. ఎట్ల చెప్పాల్నో తెలుస్తలేదు."
కొంతసేపు మళ్ళీ నిశ్శబ్దం.
"ఏమనుకోకండి అయ్యగారు. చెయ్యాల్నని చేస్తలేను. కష్టాలొచ్చినయ్___నష్టమొచ్చింది. మీరున్న ఇల్లు అమ్మాల్సి వచ్చింది అమ్మిన."
పిడుగు పడ్డది ఇద్దరిమీద.
గ్రహించాడు రామకిష్ణయ్య. "ఏం చెయ్యమంటరు చెప్పండి కాలం బాగలేదు. ఇచ్చింది ఇచ్చినట్లే పోతాంది. మల్లిచ్చే టోడు మచ్చుకన్నలేడు. మల్ల మాసావుకారు ఊరుకుంటాడా? బస్తినించి మనిషిని పంపిండు. ఇస్తవా; చస్తవా? అని కూచున్నడు వాడు. ఎల్లకపాయె? ఇల్లే రాసిచ్చిన."
నాంచారమ్మ దిగ్గునలేచి వెళ్ళిపోయింది. వంటింట్లోకి పోయి దేవుని ముందు కూర్చుని ఏడ్వసాగింది.
ఏడ్వలేక నారాయణస్వామి అక్కడే కూర్చున్నారు.
"ఉన్నదున్నట్లు నేనుమాత్రం పొమ్మంటానాగాని జర తర్సతుగనన్న కాళీ చెయ్యండి. నాకే అనటానికి నోరొస్తలేదుగని ఏం చెయ్యమంటరు__తక్లీపొచ్చింది. కొన్నోడు వూరుకుంటాడు. వాడొచ్చి బోడి బొచ్చె బయట పారేస్తే ఏం బాగుంటుంది? అందుకే నే నొచ్చిన, అయ్యగారు గద ఎట్లన్న అని. చెప్పిపోదమని వచ్చిన" అని ప్రశ్నార్ధకంగా చూచాడు నారాయణస్వామిని.
"మంచిది రామకిష్ణయ్య ఖాళీ చేస్తం" అన్నారు నారాయణస్వామి గంభీరంగా.
"అట్లయితే వస్తమరి" అని లేచాడు రామకిష్ణయ్య. సాగనంపటానికి లేచి వాకిలిదాకా సాగారు నారాయణస్వామి. గడప దాటుతూ "జరా జల్దిచేయటం మంచిది" అని వెనక్కు చూడకుండా చరచరా సాగిపోయాడు రామకిష్ణయ్య.
తల కొట్టేసినంత పనైంది నారాయణస్వామికి. అయినా దుఃఖం పొంగలేదు. చరచరా లోనికి వెళ్ళారు.
"ఏమిటండీ మనకీ కష్టాలు?" కూర్చొనే తల ఎత్తి కన్నీటితో అడిగింది నాంచారమ్మ.
"పిచ్చిదానా!" నాంచారమ్మ పక్కన కూర్చొని కన్నీరు తుడిచి ఓదారుస్తూ "కష్టాలు మనుషులకు రాకుంటే మానులకు వస్తవా? కష్టాలు వచ్చినపుడు ధైర్యంగా ఉండటమే గొప్ప. లేనప్పుడు అందరు ధైర్యంగనే ఉంటరు. లే కండ్లు కడుక్కో చూడు కండ్లెట్ల ఉబ్బినవో?" అన్నారు నారాయణస్వామి అనునయిస్తూ.
"ఎందుకండీ రామకిష్ణయ్య ఇట్లా పరీక్షిస్తున్నడు?" లేవకుండానే అడిగింది నాంచారమ్మ.
"పిచ్చిదానా! రామకిష్ణయ్య ఎవడె మనను పరీక్షించటానికి భగవంతుడు పరీక్షిస్తున్నాడు. మన స్థయిర్యాన్ని పరీక్షిస్తున్నాడు. హరిశ్చంద్రుని, నలమహారాజును, రంతిదేవుని పరీక్షించలేదా? ఎన్నటికైనా ధర్మం గెలుస్తుంది. మనిషి గెలుస్తడు. అధర్మానికి అపజయం తథ్యం. రాక్షసునికి ఓటమి తప్పదు."
"ఇప్పుడేం చేద్దామంటరు?"
"చేసేదేమున్నది? ఇల్లు ఖాళీ చేద్దం. మన జాగ ఉన్నదిగ వూరిబయట. అక్కడ పర్ణశాల వేసుకొని ఉందం."
నాంచారమ్మ మాట్లాడలేదు.
అసలు జరిగిందేమంటే నారాయణస్వామి తండ్రి లక్ష్మీనరసింహాచార్యులవారు పరమపదించినప్పుడు ఇంట్లో ఎర్రని ఏగానీలేదు. లక్ష్మీనరసింహాచార్యులు మహా పండితులు. వారికి సంస్కృత ద్రావిడ ఉభయ వేదాల్లోనూ అఖండమైన ప్రజ్ఞ ఉండేది. వారు ఆర్జించడం బాగానే ఆర్జించారు. ప్రయాణాల్లో పల్లకి దిగలేదు. అయితే వారికి పండిత గోష్టులన్నా, శాస్త్ర చర్చలన్నా ప్రాణం. ఇల్లు ఎల్లప్పుడూ పండితులతో నిండి ఉండేది. రేయింబవళ్ళు శాస్త్ర చర్చలతో గుబాలిస్తుండేది. ఆర్జించినన్నాళ్ళూ అలా కర్చు చేశారు. వార్ధక్యం వచ్చింది. మంచం పట్టారు. ఒక్కడూ గడప తొక్కలేదు. అప్పటికే ఉన్నదంతా తదియారాధనకు కరిగి పోయింది. రామకిష్ణయ్య అత్యంత భక్తి కనబరిచేది. అయినా అయ్యవారి ఆస్తిని హరించకుండా ఉండలేకపోయాడు. ఇల్లు తప్ప అన్నీ రామకిష్ణయ్య ఇంటికి చేరాయి. లక్ష్మీనరసింహాచార్యులు పరమపదించేవరకు ఆ ఇల్లూ, బారెడు భూమి మాత్రం మిగిలాయి వారి తీర్ధతిరువపధ్యయనాలకు ఉదారంగా అప్పు ఇచ్చాడు. రామకిష్ణయ్య ఘనంగానే చేశారు నారాయణస్వామి-వారికి తండ్రి విషయంలో భక్తి మెండు. ఆ తరువాత ఆ యిల్లు రాయించుకున్నాడు రామకిష్ణయ్య. అది లాంచనమే అన్నాడు రామకిష్ణయ్య. నారాయణస్వామిని అందులోనే ఉండమన్నాడు, వారున్నారు. ఇంతకాలంగా బేరం రాలేదు. రామకిష్ణయ్య పలకలేదు. ఇప్పుడు వచ్చిందని కాదు. సాధించాలనుకున్నాడు. కాళీ చేయమన్నాడు.