Previous Page Next Page 
తృప్తి పేజి 14


    "నాకు డాక్టరేట్ రావాలంటే మీ సహకారం కావాలి. అందిస్తారు కదూ!" అంటూ తియ్యగా తన చుట్టూ గిరిగీసుకుంది సింధు. విశ్వనాథ వారి 'వేయిపడగలు' చూసి మొదటిపేజీ చదివి "తలతిరిగిపోతోంది బాబోయ్ నీకెంత ఓపిక" అంటూ పెట్టేసింది. "కృష్ణపాండవీయం" సినిమా కేసెట్లో చూసి "శకునెవరు? ఇంతమంది కొడుకులుంటారా ఎక్కడైనా? ఒక్క మెతుకుతో బతకడం, నూరుగుర్ని కనడం అంతా ట్రాష్, ఇలాంటి పుక్కిటి పురాణాలు అంతలా ఎలా ఎంజాయ్ చేస్తారు?" అంటూ నవ్వింది. తన జీవితంలో చాలా చిన్నకోరిక బహుశా! ఇప్పటి తన పరిస్థితులకు తలకు మించిన కోరికై వుంటుంది. అది తిరుపతి మెట్లు ఎక్కడం. ఏ మొక్కజొన్న పొత్తులో వలుచుకుని తింటూ మధ్యమధ్యలో సేదతీర్తూ, "తిరుపతి వెంకటేశ్వరా దొరా నీకూ నిలబడి మొక్కుతామయా" అనే పాటలు వింటూ, చెయీ చేయీ కలుపుకుని ప్రయాణించి స్వామి సన్నిధి చేరుకోవడం. ఓహ్! ఎంత తియ్యని అనుభూతి!
    దేవుడంటేనే సింధుకంతంతమాత్రం. ఇంక నడిచి కొండెక్కుతుందా?
    సాయంత్రంపూట అన్నంలో అప్పడాలు, వూరపిండితో చేసిన పచ్చి వడియాలు, పెసరట్టులాంటివి నంజుకుని తినడం తనకెంతో ఇష్టం "కడుపు నొప్పొస్తుంది, ఇదేం తిండి?" అంటూ కొట్టిపారేస్తుంది సింధు. కానీ తనకిష్టం లేకపోయినా మసాలా కూరలూ, సలాడ్ లూ చేసి తినిపిస్తుంది. పొద్దుటే "సుప్రభాతం" వింటూ లేస్తే ఎంత బావుంటుంది! రాత్రిపూట 'భగవద్గీత' వింటూ పడుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందీ! ఇవన్నీ సింధుకి విసుగు.  
    "ఏమండోయ్! నేను రెడీ. మీరేమిటలా లాల్చీ, పైజామాలో 'వికట కవిలా' అంది నవ్వుతూ.
    "నాకిలాగే ఇష్టం" చెప్పాడు అరుణ్.
    "సూట్ వేసుకుంటారనుకున్నాను" అంది.
    "సూట్ లో మీరంటే ఇష్టం. ప్లీజ్ వేసుకోండి" అంటే వేసేసుకుందామనుకున్నాడు. కానీ ఆమె మళ్ళీ అడగలేదు. సింధు వాళ్ళ కజిన్ పెళ్ళికెళ్తున్నారు. రాత్రి ముహూర్తం, పిల్లల్ని చిట్టెమ్మ దగ్గరొదిలేశారు. సింధుకి ఇద్దరు అన్నయ్యలు. ఇద్దరూ ఫారిన్ లో సెటిలయ్యారు. సింధుకి కూడా "స్టేట్స్'లో సెటిలవ్వాలని ఉండేది. "అక్కడైతే ఇలా కరెంట్ కీ, పాలకీ, పేపర్ కీ, గ్యాస్ కీ ఇబ్బందిపడి తన్నుకులాడక్కర్లేదు. నాలా వర్క్ చేసేవాళ్ళకి బోలెడంత సుఖం. బయటికెళ్తే ఇంటి గురించి, ఇంటికొస్తే బయటిపని గురించీ మరిచిపోయి హాయిగా ఉండొచ్చు. ఎంత పని చేసుకున్నా కష్టమనిపించదుట. ఎంతో సౌకర్యంగా ఉంటుందిట. ఇలా దోమలూ, మురికీ, గతుకుల రోడ్లూ, పవర్ కట్టూ వుండవుట" అని స్వర్గం గురించి పురాణాల్లో వివరించినట్లు ప్రయత్నించి చెప్తుంది.
    "ఛీ! మళ్ళీ జన్మంటూ ఉంటే ఈ పాడు కంట్రీలో పుట్టకూడదు! నా పిల్లల్ని ఇక్కడ సెటిలవ్వనివ్వను" అన్నప్పుడల్లా "వివేకానంద" ఉపన్యాసాలు చదివి వినిపిద్దామనిపిస్తుంది. కానీ తను మౌనంగానే వింటాడు. రమ్య పుట్టినప్పుడు తను ఆడపిల్ల పుట్టిందని చాలా సంతోషించాడు. 'మరుద్వతి' అనే పేరంటే తనకు చాలా ఇష్టం. "అబ్బా! సింపుల్ గా రెండక్షరాల పేరు పెడ్దాం అరుణ్!" అంది. తను కాదనలేకపోయాడు. 'తేజ' పుట్టినప్పుడు అమ్మ నాన్నగారి పేరు కలిసొచ్చేటట్లు పెడదాం అన్నాడు. ఆయన పేరు విశ్వనాథం. తను విశ్వనాథ్ తేజస్వి అని పెట్టాడు. సింధు స్కూల్లో 'తేజ' అని రాయించింది. సహజంగా తల్లి పిల్చే పేరే చలామణి అవుతుంది. అమ్మకీ విషయంలో బాధ కలిగింది. మొదట్నుండీ ఆవిడ అసంతృప్తిగానే ఉంది సింధు విషయంలో. మొదటిసారి శ్రావణమాసంలో నోములు నోపిస్తానంటే, మిన్ను విరిగి మీదపడినట్టు చూసింది సింధు "నాకెక్కడ టైముంది ఈ నోములూ, వ్రతాలు, వాయినాలు ఇవ్వడానికి?" అంది. ఆషాఢం వంకతో అమ్మ వసుధ దగ్గరకెళ్ళి మళ్ళీ రాలేదు. ఆవిడకిక్కడ మడి సాగదు. మాట్లాడడానికి బెరుకుగా ఫీలవుతుంది. అన్నీ తనకు తెలుసు. కానీ ఏం చెయ్యలేకపోతున్నాడు. ఈ మధ్య సింధుతో ప్రతిదానికీ గొడవ పడ్తున్నాడు. తను కూడా అటు కాలేజ్ లో ఇటు ఇంట్లో పనిచేసుకుని సతమతమయిపోతూ కనిపిస్తోంది. తనకే మళ్ళీ జాలేస్తుంది. మళ్ళీ అంతలోనే కోపమొస్తుంది. అందరూ ఇలాగే చేస్తున్నారా? అప్పుడప్పుడూ సెలవు పెట్టుకోరా? రెస్ట్ తీసుకోరా? తనెందుకిలా అతిగా చేస్తుంది? ఏదో సాధించాలనీ, పొడిచెయ్యాలనీ తన జీవితం దుర్భరం చేసుకుంటోంది. పిల్లలకి తల్లి ప్రేమ కరువు చేస్తోంది. సంపాదించినదంతా ఇంట్లోకి ఖర్చుపెడ్తుంది. తన ఎంటర్ టైన్ మెంట్ కూడా చూసుకోదు. చీరలకి, నగలకీ వ్యామోహపడదు కూడా!
    రమ్యకి చక్కగా జడగంటలతో జడేసి, చెవులకి జూకాలు పెట్టి లంగా వేస్తే ఎంత బావుంటుంది! దానికి జడెయ్యడం ఓ పెద్దపనిని చెప్పి బాబ్ చేయించేసింది. ఆ మధ్య "పొద్దుటిపూట జడేసుకోవడం పెద్దపనిగా వుంటోంది. హెయిర్ కట్ చేయించుకుంటాను" అంది. తను ఖచ్చితంగా చెప్పేశాడు "నేను నిన్ను అలా చూడలేను. నాకిష్టముండదు" అని. ఏమనుకుందో ఏమో మళ్ళీ ఆ విషయమెత్తలేదు. ఇంటిముందు పొగడచెట్టు, వెనుక సన్నజాజి, సంపెంగ, పారిజాతం లాంటి చెట్లు వేసుకుందామన్నాడు. సింధు వెగటుగా మొహం పెట్టింది. నర్సరీకి వెళ్ళి రకరకాల క్రీపర్స్, పువ్వు, కాయా, ఇవ్వని ఎటువంటి సుగంధం లేని "క్రోటన్స్" కొనుక్కొచ్చింది. వీధిలో "బలురక్కసి" పెద్దకుండీలో పెట్టింది. ఆ మధ్య తేజా వెళ్ళి దానిమీదపడి ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకుపోయి ఏడుస్తుంటే తనే తీసేసి పైన బాల్కనీలో పెట్టాడు. సింధు వంట చాలా చేస్తుంది. గుత్తివంకాయ కూర చాలా బావుంటుంది. కానీ ఈమధ్య చిట్టెమ్మ వచ్చాక సింధు వంటింట్లోకి రావడం తగ్గించేసింది. చిట్టెమ్మ కూడా బాగానే చేస్తుంది అయినా సింధు చేసినట్టు ఉండదు. పిల్లల్ని తయారుచేయడం, వంటపనీ, ఇల్లు శుభ్రం చెయ్యడం లాంటివే కాకుండా "చిట్టెమ్మ అత్తగారికి కాఫీ ఇవ్వు", "చిట్టెమ్మ ఆయనకి బీరువాలోంచి బట్టలు తీసిపెట్టు", చిట్టెమ్మా ఏం వండాలో అడిగి చెయ్యి" అంటూ ప్రతి పని చిట్టెమ్మకప్పగించేస్తోంది. పోనీ అలాగైనా పని తగ్గించుకుంటోందా అంటే అదీ లేదు. రాత్రి పగలు చదవడం, ఇంటికి స్టూడెంట్స్ వస్తే వాళ్ళతో డిస్కషన్స్. ఆదివారం, పండుగ రోజూ అని కూడా లేకుండా ఎక్కడో కాన్ఫరెన్స్ లూ అవీ. పిల్లలు చిట్టెమ్మ పెడ్తే తిని చిట్టెమ్మతో ఆడుకుని, చిట్టెమ్మ పక్కనే పడుకుంటున్నారు. సింధుకి ఇంటికి రాగానే విసుగ్గా, చిరాగ్గా వుంటుంది. అందుకే తనూ పెద్దగా మాట్లాడటానికి ట్రై చెయ్యట్లేదు.
    "ఏమిటి? మీవారు మితభాషులా?" ఎవరో అడుగుతున్నారు. 

 Previous Page Next Page