Previous Page Next Page 
మనీ బాంబ్ పేజి 14

"నువ్వు అకారణంగా అంత అభిమానం ఒలికించెయ్యనఖ్కర్లేదు. నేనేం ఒంటరిగానూ లేను. ఫ్రెండ్స్ తోనే కలిసి వచ్చాను. మా రణధీర్ మంచి వేటగాడు క్రాక్ షాట్ ! ఒక్క బులెట్ తో మీ యిద్దర్నీ కాల్చెయ్యగలడు."
తేలిగ్గా శ్వాస తీసుకున్నాడు సందీప్. 'ఫర్వాలేదు ! ఈ అమ్మాయి వంటరిగా లేదన్నమాట. తనని వాళ్ళ ఫ్రెండ్సు దగ్గర వదిలేసి తాము వెళ్ళిపోవచ్చు.'
"ఎక్కడున్నారు మీ ఫ్రెండ్స్ ?"
"ఇంకెక్కడుంటారు ? మంచె మీద."
"ఎక్కడుంది మంచె ?"
"చెట్టుమీద" అంది గడుసుగా.
"ఎక్కడుంది చెట్టు ?"
ఏదో చెప్పబోయి ఆగింది ఆ అమ్మాయి. ఓటమి కనబడుతోంది తన మొహంలో.
"చెప్పండి ! ఎక్కడున్నారు మీ రణధీర్, అండ్ కంపెనీ ? నేను మీ శత్రువుని కాను. మీకు సహాయం చెయ్యడానికే ప్రయత్నిస్తున్నాను. మీ వాళ్ళెక్కడున్నారో చెబితే అక్కడ దింపేసి వస్తాను. కమ్!"
"నేను దారి తప్పాను" అంది ఆ అమ్మాయి బింకంగా.
అసలేం జరిగింది ? వివరంగా చెప్పండి."
"నా పేరు స్వప్న. నేనూ, రాగిణీ, రణధీర్, ఖయ్యామ్ కలిసి ఫారెస్టుకి వచ్చాం. చెట్టుమీద మంచె కట్టాడు రణధీర్. జంతువులకోసం వెయిట్ చేస్తూ మంచె మీదే నాలుగు గంటలసేపు విగ్రహాల్లా కూర్చున్నాం. అప్పుడు నేను చెట్టు దిగాను."
"ఎందుకు ?"
"చిన్న అవసరం వచ్చింది" అంది స్వప్న మొహం పక్కకి తిప్పుకుంటూ.
సందీప్ పెదిమలమీద లీలగా చిరునవ్వు మెరిసింది. వేటకి వచ్చినవాళ్ళకి అమోఘమైన డిసిప్లిన్ ఉండాలి - మానసికంగా, శారీరకంగా కూడా, శరీరాన్నీ, దాని అవసరాలనీ అదుపులో పెట్టుకునే శక్తి ఉండాలి. ఒక్కోసారి తొమ్మిది పది గంటలసేపు కొయ్యబొమ్మలా చలనం లేకుండా కూర్చోవలసి వస్తుంది వేటలో. ఈ అమ్మాయి 'చిన్న అవసరం' వచ్చి చెట్టు దిగింది. సిగ్గుకొద్దీ చాలాదూరం వెళ్ళి దారితప్పి ఉంటుంది. ఈ అమ్మాయి తన స్నేహితులూ ఉత్సాహమే తప్ప వివేకం అంతగా లేని కాలేజ్ స్టూడెంట్స్ అయి ఉంటారని తెలిసిపోతూనే వుంది. అందుకు మరో ఉదాహరణ ఈ అమ్మాయి డ్రెస్సింగ్. తెల్లటి బ్రోకేడ్ తో ఎంబ్రాయిడరీ చేసిన తెల్ల పట్టుచీరె, తెల్ల పట్టు జాకెట్టు, మెడలో మూడు వరసల ముత్యాల సరాలు, చేతివేలికి వజ్రపుటుంగరం, పాదాలకి వెండి మువ్వల పట్టాలు.   
పెళ్ళికో, పేరంటానికో వెళుతున్నట్లు ముస్తాబయి వచ్చింది !
"దేన్ని షూట్ చెయ్యడానికొచ్చారు ?" అన్నాడు నవ్వుతూ.
"టైగర్ !" అంది స్వప్న. 'అంతకంటే చిన్న జంతువులు నా కంటికి ఆనవు !' అన్నంత దర్పంగా.
"ఓహ్ ! మై ! మై ! టైగర్ ! అవునా ? టైగర్స్ ప్రొటెక్టడ్ యానిమల్స్ - రక్షిత జంతువులు- అని తెలుసా మీకు? 1972లో చేసిన శాసనం ప్రకారం పులులని షూట్ చెయ్యడం..."
"నేను పులిని గన్ తో కాదు, కెమెరాతో షూట్ చెయ్యడానికొచ్చాను."
"గుడ్ ! కానీ ఆ పులి తీరిగ్గా మీచేత ఫోటోలు తీయించుకుంటుందనుకోను. అది 'మాన్ ఈటర్'గా మారింది."
చకితురాలైనట్లు చూసి, అంతలోనే తేరుకుంది స్వప్న. తను ఈ సమాచారాన్ని నమ్మినట్లు లేదు.
"బ్లఫ్ చేసి నన్ను భయపెట్టాలని చూడకు! అడ్డులే! నేను వెళ్ళాలి."
"దారి తప్పానంటున్నారు. ఎలా వెళ్తారు ?"
అతనికి సమాధానం ఇవ్వకుండా తదేకంగా అతని భుజంమీద నుంచీ దృష్టిసారించి చూస్తోంది స్వప్న. ఆమె కళ్ళలోకి కాంతి తిరిగి వచ్చింది. "యా, అదే ! ఆ సగం నరికేసిన చెట్టూ, దానికి ఉన్న జెయింట్ సైజు తేనెతుట్టి - సర్టెన్లీ ఈ ప్రాంతంలోనే ఉండాలి మా మంచె ! దారితప్పి ఒక రోజంతా తిరిగినా తిరిగి కరెక్టు ప్లేస్ కే వచ్చాను. జరుగు !" అంది ముందుకి అడుగేస్తూ.

 Previous Page Next Page