దూరంగా కలకలం, కొందరు మనుషులు కేకలు పెడుతూ, డప్పులు కొడుతూ, ఖాళీ డబ్బాలూ, బిందెలూ మోగిస్తూ వస్తున్నారు. ఆ శబ్దాలన్నీ పులిని బెదరగొట్టడానికి.
మరణించిన స్త్రీకోసం వెదకడం ప్రారంభమయిందని అనుకున్నాడు సందీప్.
మరి భూతాలరాజు ఏమయిపోయాడు ? పులి మనిషిని గానీ, జంతువునుగానీ చంపి తింటున్నప్పుడు ఆ కళేబరాన్ని దక్కించుకోవడానికిగానూ, తనని సమీపించిన మరే ప్రాణినైనా చంపుతుంది.
భూతాలరాజు కట్లు విప్పుకొని పారిపోబోతూ పులిని డిస్టర్బ్ చేసి దానివాత పడ్డాడా ?
పొదలలో ఎండుటాకులు గలగల్లాడాయి. సన్నగా విరిగింది ఒక కొమ్మ.చటుక్కున హిప్ పాకెట్ లో నుంచీ చిన్న రివాల్వర్ తీశాడు సందీప్. అది చాలా తక్కువ కాలిబర్ గన్. దానితో కాలిస్తే పులి చస్తుందా అసలు.
పొదలలోనుంచీ బయటికి వచ్చాడు భూతాలరాజు.
అతని వీపుమీద ఒక వల ఉంది.
అందులో ఏమున్నదో చూసేసరికి సందీప్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి.
లేడీ
భూతాలరాజు భుజంమీద వలలో ఒక అందమైన అమ్మాయి ఉంది.
"నేను కుందేళ్ళని గానీ, పిట్టలని గానీ కొట్టుకువద్దాం అని అటుగా వెళ్ళాను. అక్కడ ఈ 'లేడీ' వలలో పడింది" అన్నాడు రాజు, ఆకలిగా స్వప్నవైపు చూస్తూ. "మన ఒల్లండం ప్రకారం ఇది మనిద్దరికీ ఫిఫ్టీ - ఫిఫ్టీ !" అన్నాడు కన్నుగీటుతూ.
భూతాలరాజు వాలకం చూస్తే నిజంగానే అతను అన్నంతపనీ చేస్తాడేమో అని భయమేసింది సందీప్ కి.
అప్పటికి ఆ అమ్మాయిని రక్షించడానికిగానూ ఒక మార్గం ఆలోచించి, "కాదు పార్టనర్ ! ఈ అమ్మాయిని మాత్రం నాకు పూర్తిగా ఇచ్చెయ్యి! ఈసారి ఏం దొరికినా సరే, అది పూర్తిగా నువ్వే తీసేసుకో!" అన్నాడు నచ్చచెపుతున్నట్లు.
అతని మాటలు వినిపించుకునే స్థితిలో లేడు భూతాలరాజు. అప్పటికే కోరికతో అతని కళ్ళు ఎర్రబడ్డాయి. ఊపిరి బుసలాగా వస్తోంది.
ఇతనితో మృదువుగా వ్యవహరిస్తే లాభంలేదని నిశ్చయించుకున్నాడు సందీప్. రాజు ఎడమ చెయ్యి అందుకుని బలంగా మెలిపెట్టాడు.
ప్రాణాలు జలార్చుకు పోయాయి రాజుకి తను సందీప్ కి సమ ఉజ్జీ కాదని తెలుసు అతనికి. తనకి వయసయిపోతోంది. సంవత్సరాల తరబడి జైల్లో ఉండి శరీరం మెత్తబడిపోయింది.
అందుకని గుర్రుగా మూలిగి, భుజం మీది అమ్మాయిని వలతో సహా మోటుగా కిందపడేశాడు. ఆ మూలుగులో, "సమయం చూసి నీ మీద చావుదెబ్బ తీస్తానురా!" అన్న పదాలు ఉచ్చరించకుండానే వినబడుతున్నాయి.
కష్టంమీద లేచి నిలబడింది ఆ అమ్మాయి. కాళ్ళకీ, చేతులకీ చిక్కుకున్న వల తాలూకు తాళ్ళని వదిలించుకుంది. ఆమె మెడలో కెమెరా ఒకటి వేలాడుతోంది.
ఏదో జంతువుని పట్టుకున్నట్లు తనని భూతాలరాజు వలచేసి పట్టుకోవడం, దొంగసొమ్ముని పంచుకున్నట్లు వాళ్ళిద్దరూ తనని పంచుకోవడానికి బేరసారాలు జరపడం ఆ అమ్మాయికి పట్టరానికోపం తెప్పించినట్లున్నాయి. కళ్ళలో ఎర్రజీర కనబడుతోంది. సన్నటి పెదిమలు చిగురుటాకుల్లాగా వణుకుతున్నాయి.
"మిస్! మీరెవరు? ఈ అడవిలోకి ఎందుకొచ్చారు?" అన్నాడు సందీప్.
"నన్ ఆఫ్ యువర్ బిజినెస్ ! నీకు అనవసరం !" అంది కరుస్తున్నట్లు.
భుజాలు ఎగరేశాడు సందీప్. "చూడండి మిస్ ! మీరు సిటీలో ఎక్కడో సినిమా హాలు దగ్గర కనబడితే ఆపి ఇలా కుశల ప్రశ్నలు వేసేవాడ్ని కాను. కానీ ఇది అడవి. నేను మీజోలి పట్టించుకోకుండా వెళ్ళిపోతే ఆ తర్వాత మీరు కీచురాయిలా అరిచి గీపెట్టినా అది అరణ్య రోదనే అవుతుంది."