పక్కకి జరిగాడు సందీప్. తన అయిష్టాన్ని ప్రదర్శిస్తూ ముక్కుతో గుర్రుమని శబ్దం చేశాడు భూతాలరాజు. స్వప్నని అలా వదిలెయ్యడం అతనికి నచ్చలేదు.
సికిందరాబాదులో కింగ్స్ వేలో నడుస్తున్నంత నిబ్బరంగా చకచక ముందుకు సాగింది స్వప్న. వెనుకగా అనుసరించారు సందీప్, భూతాలరాజు.
స్వప్న చెప్పింది నిజమే. తేనెతుట్టి ఉన్న చెట్టుకి దగ్గరలోనే ఉంది ఒక తెల్ల మద్దిచెట్టు. దాని ప్రక్కన ఒక కుంకుడు చెట్టు దానికి కొంచెం దూరంలో మరో చెట్టు, దానికి కట్టి ఉంది మంచి.
కానీ దానిమీద మనుషులెవ్వరూ లేరు.
చెట్టుకింద పులి అడుగుజాడలు కనబడ్డాయి. నోటితో దేన్నో కరిచి పట్టుకుని మోసుకెళ్ళినట్లు కొంచెం లోతుగా పడ్డాయి ముందుకాళ్ళ జాడలు. ఆ నోటిలో ఉన్న కళేబరం తాలూకు కాళ్ళో, చేతులో నేలకు తగులుతూ ఏర్పరచిన చారిక పొడుగ్గా కనబడుతోంది. అడుగుజాడలకి పక్కనే, అక్కడక్కడా రక్తపు చుక్కలు.
వంద గజాల దూరంలో ఒక ముళ్ళ బోరచెట్టుకి వేలాడుతోంది ఒక పేలికలై పోయిన షర్టు.
"ఆ షర్టు రణధీర్ ది !" అంది స్వప్న హీనస్వరంతో.
'పులి తాలూకు రెండో విక్టిమ్!" అనుకున్నాడు సందీప్. స్వప్న తాలూకు మిగతా ఇద్దరు ఫ్రెండ్సూ ప్రాణాలు దక్కించుకుని పారిపోయి ఉండాలి.
భయభ్రాంతురాలై పోయింది స్వప్న. ఇందాకటి నుంచీ ఆమె మొహానికి తగిలించుకున్న 'నిర్లక్ష్యం, నిర్భయం' అనే మాస్కు జారిపోయింది. గొంతు తడి ఆరిపోయింది.
"మిస్టర్ ! నన్ను ఎలాగైనా మా ఇంటిదగ్గర దింపెయ్ ! ఐయామ్ అఫ్రయిడ్ ! ప్లీజ్ !" అంది వణుకుతూ.
ఆలోచనలో పడ్డాడు సందీప్.
ఇందాక దూరంగా వినపడిన పల్లెప్రజల గొంతులూ, శబ్దాలూ క్రమక్రమంగా దగ్గరవుతున్నాయి. ఎవరైనా తనని గుర్తుపడితే, ఇంత ప్రయత్నమూ భగ్నమయిపోతుందని తెలుసు అతనికి.
"మిస్ స్వప్నా !"
"ఐ వాన్నా గో బ్యాక్ ! ఇవాన్నా గోబ్యాక్ !" అంటోంది స్వప్న హిస్టీరికల్ గా. ఏమి చెప్పినా వినిపించుకునే స్థితిలో లేదు ఆమె.
శబ్దాలు దగ్గరవుతున్నాయి.
"ఐవన్నా గోబ్యాక్ ! హెల్ప్ ! ఎనీబడీ ప్లీజ్ హెల్ప్ మీ!" అంది స్వప్న పెద్దగా, ఆమె కనుపాపలు పై రెప్పలలోకి వెళ్ళిపోతున్నాయి.
ఆమెని వారించే వ్యవధి కూడా లేదు సందీప్ కి. బలంగా చెంపమీద కొట్టాడు.
రెండు రోజులనుంచీ సరిగ్గా అన్నం, నీళ్ళు నిద్రా లేకుండా అడవిలోనే గడిపిన నిస్సత్తువ వల్లా, భయంవల్లా తక్షణం స్పృహ తప్పింది స్వప్నకి.
ఆమెని వెనకసీట్లో పడుకోబెట్టి, జీపు స్టార్ట్ చేశాడు సందీప్.
క్షణాల్లో వేగం అందుకుంది జీపు.
అప్పుడు వినబడ్డాయి సామూహికంగా శోకాలూ, ఆక్రందనలూ !
పులి వాతపడ్డ స్త్రీ శవాన్ని పల్లెప్రజలు చూశారన్న మాట !
పుర్రె కొండ
నిర్విరామంగా ఎనిమిది గంటలసేపు డ్రైవ్ చేశాడు సందీప్. రాత్రయిపోయింది. చిమ్మచీకటి చీల్చుకుంటూ పోతోంది జీపు. కప్పల బెకబెకలూ, కీచురాళ్ళ రొదా వినబడుతున్నాయి. అప్పుడప్పుడు పులి గాండ్రింపు వినబడుతోంది దూరంగా.
ఈ నేపథ్యంలో ఎవరో సన్నగా రోదిస్తున్నట్లు భ్రమ కలిగించే శబ్దం.
పక్కన వరసగా వున్న కొండలు దెయ్యాల గుంపుల్లా కనబడుతున్నాయి.
ఆకాశంలో ఏదో అదృశ్య శక్తి కత్తి ఝుళిపించినట్లు ఛక్ మని పెద్ద మెరుపు మెరిసింది. తర్వాత ఫెటీలుమని శబ్దం. ఉరుము ఉరిమింది.