"పూర్తిపేరు"
"మోనికా గన్ సాల్వెజ్"
"ఓహ్! ఫ్రం గోవా విత్ లవ్! అవునా?"
"నీకు చాలా తెలుసే!" అని నవ్వింది మోనికా. "ఒంటరిగా జర్నీ చేస్తున్నానని భయపడుతున్నావా? నో ఫియర్ నేనున్నాగా!"
"నో? ఫియర్?" అంది ఆ తొమ్మిదేళ్ళ పాప నిటారుగా నిలబడుతూ. "బిగ్ జోక్! అదిగో లాంజ్ లో ఉండే మా మమ్మీ, తను ఎయిర్ పోర్ట్ నుంచి ఒంటరిగా ఇంటికెళ్ళాలే అని భయపడుతున్నాను. అంతే! నాకేం భయం?"
నిబ్బరంగా మాట్లాడుతున్న ఆ పాపని మురిపెంగా చూసింది మోనికా. "కమ్! నీ సీట్లో కూర్చో!" అంది.
చివరిసారిగా తన తల్లివైపు చూసి హాండ్ వూపింది స్మిత. టెర్రస్ లోనుంచి కూడా ఒక కర్చీపు ఆ తల్లి మనసులా రెపరెపలాడింది.
మోనికా కూడా అటుకేసి చూస్తూ ఒకసారి చెయ్యి వూపి, స్మితతో సహా లోపలికి వచ్చింది.
విమానం తలుపులు మూసుకున్నాయి.
అప్పటిదాకా విమానం దగ్గర బెల్లం చుట్టూ ముసిరిన చీమల్లా ఉన్న వెహికల్స్ దూరంగా పోవడం మొదలెట్టాయి. మెట్లు అమర్చిన ట్రాక్ దూరంగా వెళ్ళిపోయింది. విమానం నేలమీద ఉన్నంతసేపూ దానికి పవర్ సప్లయ్ చేసే జనరేటరు పక్కకి వెళ్ళిపోయింది. సామాన్లు మోసుకొచ్చిన ట్రక్కూ కేటరింగు వ్యానూ టెర్మినల్ బిల్డింగు దగ్గరికి వచ్చేసి తమ స్థానాల్లో నిలబడ్డాయి.
విమానంలో ప్రయాణికుల సీట్లకు పై భాగంలో "నో స్మోకింగ్" ప్లీజ్ ఫాజెన్ సీట్ బెల్ట్స్" అన్న అక్షరాలు ఎర్రగా వెలిగాయి. స్పీకర్ లో నుంచి మోనిక చెబుతున్న మాటలు వినపడటం మొదలెట్టాయి.
"గుడీవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మన్! హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళే ఈ ఫ్లయిట్ లోకి స్వాగతం! ఈ ఫ్లయిట్ ని కమాండ్ చేస్తోంది సవ్యసాచి. ఆయనకు కో పైలట్ వినోద్ రవి, ఫ్లయిటు ఇంజనీరు మిస్టర్ మూర్తి కేబిన్ క్రూగా మోనికా గన్ సాల్వెజ్, అనుపమా గంగూలీ, మీనాక్షీ రావ్, లలిత్ నారాయణ్, జగజీత్ సింగ్ మీ సేవకోసం ఉన్నారు. టేకాఫ్ సమయంలో దయచేసి స్మోక్ చేయవద్దు.దయచేసి సీటు బెల్టులు బిగించుకోండి. మీరు ఈ ఫ్లయిట్ ని ఎంజాయ్ చెయ్యాలని కోరుకుంటున్నాము. థాంక్యూ!"
ఆ తర్వాత మోనికా, అనుపమా కలిసి, ఒకవేళ పాసెంజెరు కేబిన్ లో ప్రజరు తగ్గిపోతే తీసుకోవలసిన చర్యలేమిటో వివరించారు. కేబిన్ లో ప్రజరు తగ్గిపోయి ఊపిరందని స్థితి వస్తే, పైనుంచి ఆక్సిజన్ మా స్కూలు ఆటోమాటిక్ గా కిందికి జరుగుతాయి. వాటిని అందుకని ముక్కు దగ్గర పెట్టేసుకోవాలి ప్రయాణీకులు.
విమానం తాలూకు నాలుగు ఇంజనులు స్టార్టు చేశాడు సవ్యసాచి. సన్నగా రొదలాగా మొదలయిన శబ్దం క్షణాలలో ఉరుముల్లా మారింది.
విమానం రెక్కలమీదా, తోకమీదా పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగుల నేవిగేషన్ లైట్లు వెలుగుతూ ఆరుతున్నాయి.
విమానం కదలడానికి పర్మిషన్ వచ్చింది.
అప్పుడు ఎయిర్ పోర్టు బిల్డింగు ముందు ఆగింది రాజేందర్ ఎక్కిన టాక్సీ.
ఒక్క ఉదుటున కిందికి దూకి, లాంజ్ లోకి పరిగెత్తాడు అతను.
ఎయిర్ బస్ విమానంలో సీట్లు మూడు సెక్షన్లుగా, లేదా కంపార్ట్ మెంట్ లలాగా విభజించి ఉంటాయి. మధ్య సెక్షన్ లో సీట్లు విండో దగ్గర రెండు, మధ్యలో నాలుగు, రెండోవైపు విండో దగ్గర మరి రెండు చొప్పున వరసగా ఉంటాయి.
అలా రెండేసి ఉండే విండో సీట్లలో 'డి' వరసలో శతృఘ్నకీ, 'ఇ' వరసలో ఇక్బాల్ కీ, 'ఎఫ్' వరసలో విక్టర్ కీ వచ్చాయి సీట్లు.
ఇక్బాల్ పక్క సీట్లో పాప స్మిత కూర్చుని ఉంది.
విక్టర్ పక్కసీట్లో....
అతను తన కళ్ళని తనే నమ్మలేకపోయాడు. అతని ఆరాధ్య దేవత, శాలిని కూర్చుని ఉంది. చామనఛాయ కంటే ఎక్కువ రంగే. కానీ సినిమాలో కనబడేంత గులాబిరంగు కాదు. చెక్కినట్లు ఉన్న కనుముక్కు తీరు. మామూలుగా చూసినప్పటికంటే, తెరమీద వెయ్యిరెట్లు ఎక్కువ అందంగా కనబడతాయి ఆ ఫీచర్లు. మంచి ఫోటో జెనిక్ ఫేసు తనది.
ఆమె చేతిలో ఫైలు ఉంది. అది చదవడం మొదలెట్టింది శాలిని. తను చాలా బిజీ ఆర్టిస్టు. రోజుకి మూడు షిప్టులు చొప్పున, పద్ధెనిమిది గంటల కన్నా ఎక్కువే పని చేస్తుంది. ప్రతిక్షణమూ విలువైనదే ఆమెకి.
ఆ ఫైలులోకి ఓరగా చూశాడు విక్టర్. ఏదో ఘూటింగ్ స్క్రిప్టు ఉంది దానిలో.
ఆమె అతన్ని అసలు గమనించడంలేదు.
తాగకుండానే కైపు ఎక్కిపోయినట్లుంది విక్టర్ కి.
కొద్దిగా వెనక్కి తిరిగి అతని అవస్థను గమనిస్తున్న శతృఘ్న 'స్టుపిడ్ బాస్టర్డ్' అని మనసులోనే తిట్టుకుంటూ సీట్లో సరిగా కూర్చుని పక్కసీట్లో ఉన్న మనిషివైపు చూశాడు.
అతని గుండె ఒక్క క్షణం సేపు లయ తప్పింది.
పక్కసీట్లో ఒక అమ్మాయి కూర్చుని ఉంది.
సుజాత!
బ్యాంకు క్యాషియరు!
కానీ సుజాత గెడ్డంలేని శతృఘ్నని గుర్తుపట్టలేదు. ఒకసారి యధాలాపంగా అతని మొహంలోకి చూసి, తర్వాత కిటికీలోనుంచి బయటికి చూడడం మొదలెట్టింది సంతోషంతో పరవళ్ళు తొక్కుతోంది తన మనసు. ఇంకో రెండు గంటల్లో ఢిల్లీ చేరిపోతుంది తను. రేపు పెళ్ళి చూపుల తర్వాత....