Previous Page Next Page 
సీతాచరితం పేజి 13


    ఈ ఉంగరాన్ని అభిజ్ఞాన శాకుంతలం నుండి తీసికొని రామాయణంలో యిరికించి వుంటారు. రామాయణం వ్రాసింది కాదు అని తెల్సుకున్నాక, కంఠస్ధం చేసిన రామాయణాన్ని మరొకరికి వినిపించేప్పుడు, పొరపాటునో, కావాలనో కొన్ని మార్పులు, చేర్పులు జరిగి వుంటాయి. ఐతే ఎక్కువ మార్పులు, చేర్పులు వ్రాత వచ్చింతర్వాతనే జరిగాయనే అనుకోవచ్చు.


    వాల్మీకి రాముణ్ణి ఆదర్శపురుషునిగా సృష్టించాడు. మనిషి అంటే జనం బుర్రకెక్కదని, రామునికి దైవత్వం ఆపాదించడానికి కొందరు ప్రయత్నించి వుంటారు. వారే రామాయణంలో ఎక్కువ ప్రక్షిప్తాలను ప్రవేశపెట్టినట్లు కనిపిస్తుంది. రామాయణంలో బాలకాండ, ఉత్తరకాండ అల వచ్చి చేరినవని చాలా ఆధారాలు వున్నాయి.


    ఒకటి :- వాల్మీకి అయోధ్య కాండనుంచి యుద్ధకాండ వరకు గల రామాయణంలో ఉపాఖ్యానాలు ఎక్కడా ఎక్కువ చెప్పలేదు. బాలకాండ, ఉత్తరకాండలో ఎక్కువ ఉపఖ్యానాలు వున్నాయి. ఈ ఉపాఖ్యానాలు చెప్పే పద్ధతి భారతకాలం నాటిది.


    రెండు :- రచనా శైలిలో కూడ ఈ రెండు కాండలకు, మిగిలిన కాండలకు వ్యత్యాసం కన్పిస్తుంది.


    మూడు :- ఉత్తరకాండ రామకథకు ఏ మాత్రం ఉపకరించదు. కాగా రాముని పట్టాభిషేకం తర్వాత ఫలశృతి చెప్పటం జరిగింది. కాబట్టి రామాయణం అంతటితో ముగిసిందని అర్ధం. రాముడు రాజ్యం చేయడాన్ని గురించి వాల్మీకి చెప్పలేదు. అది అతని ధ్యేయం కాదు.


    నాలుగు :- బాలకాండలోని కథ కూడ రామకథకు అంతగా ఉపకరించదు. బాలకాండలో కనిపించిన విశ్వామిత్రుడు, ఆ తర్వాతి ఎక్కడా కనిపించడు. కాబట్టి విశ్వామిత్ర పాత్ర వాల్మీకి సృష్టికాదు. విశ్వామిత్రుడు లేకుండా బాలకాండ లేదు.


    ఐదు :- బాలకాండలో వున్న పాత్రలుగాని, సంఘటనలు గాని, సన్నివేశాలుగాని, ఉత్తరోత్తర వచ్చే కథా గమనానికి ఏమాత్రం ఉపకరించవు. ఒక్క మారీచుడు తప్ప, తర్వాత మనకు కనిపించే పాత్ర వుండదు. ఈ మారీచుణ్ణి బాలకాండలో చాల చక్కగా ఇమడ్చటం జరిగింది.


    ఆరు :- అహల్య కథ వగైరాలు బాలకాండలో ఒకరకంగాను, ఉత్తరకాండలో మరోరకంగాను చెప్పారు.


    ఏడు :- శంబూక వధ వద్దకు వస్తే వాల్మీకి రాముని పాత్ర పూర్తిగా దెబ్బతింటుంది. అక్కడ రాముణ్ని ఒట్టి బండగుండెవానిగా చిత్రీకరించటం జరిగింది. మరొక విషయం ఏమంటే, రామాయణంలో కులమతాల ప్రసక్తి అంతగా రాదు.


    ఎనిమిది :- వాల్మీకి పనికల్పించుకొని రాముణ్ని దేవునిగా ఎక్కడా చెప్పలేదు. కాని ఇటు బాలకాండలోను, అటు ఉత్తరకాండలోను రాముణ్ని పదేపదే దేవుడని చెప్పాల్సి వచ్చింది.


    తొమ్మిది :- వాల్మీకి రామాయణంలోని కాండలకు పేరు పెట్టేప్పుడు స్థలాలు, సంఘటనలు బట్టి పేరుపెట్టాడు. బాల, ఉత్తరకాండలు అందులో ఇమడవు.


    ప్రక్షిప్తాలు సాధారణంగా స్వప్రయోజనం కోసం చేస్తూ వుంటారు. ఇవి నాటి రామాయణంలోనే గాదు, నేటి వీరేశలింగం రచనల విషయంలోనూ జరుగుతుంది. వీరేశలింగం రచనల్లోనూ కొన్ని ప్రగతిశీల భావాలను తొలగించి మళ్లీ అచ్చువేయడం జరిగింది.


    వేమన పద్యాలు సేకరించినపుడు బ్రౌన్ దొరకు అనేక పాఠాంతరాలు కన్పించాయి. ఇవన్నీ ఇటీవల వృత్తాంతాలు. మరి రామాయణం వేల సంవత్సరాల క్రితంది. ఎన్ని ప్రక్షిప్తాలు వచ్చాయో చెప్పడం కష్టం.


    రామాయణం - లౌకిక కావ్యం


    కుటుంబ శ్రేయస్సును, తద్వారా సమాజ శ్రేయస్సును కోరి వాల్మీకి రామాయణం రచించాడు. ఆయన ప్రవచించింది ఏకపత్నిత్వము - ఏకపతిత్వము. ఒక స్త్రీకి ఒకే భర్త, ఒక పుఋషునికి ఒకే భార్య అనే సిద్ధాంతాన్ని వాల్మీకి విశ్వసించాడు. అది ఆరోగ్యకరమైందని, సమాజానికి అవసరమైందని ఈనాటికీ గ్రహించడం జరిగింది. నేడు ప్రపంచంలోని నాగరిక సమాజాలన్నింటిలో ఏకపతిత్వమే శ్రేయోదాయకమనే నిర్ణయానికి రావడం జరిగింది. కాబట్టి వాల్మీకి చాల దూరదృష్టితో కుటుంబాన్ని గురించి ఆలోచించాడనుకోవచ్చు. సుఖశాంతులతో కూడిన కుటుంబాన్ని గురించి ఈనాటికినీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నానికి నాంది పలికినవాడు వాల్మీకి మహర్షి అంటే అతిశయోక్తి కాకపోవచ్చు.


    వాల్మీకి అలౌకికుడు. పారలౌకికుడు కాడు. అతడు లౌకికుడు. నేలమీద నివసించేవారిని గురించే ఆలోచించాడు - రచించాడు. అతడు రాజులను గురించి వ్రాశాడంటే, ఆనాటి సమాజ వ్యవస్థ రాజుల గురించేగాని, ప్రజల గురించి వ్రాయడం సమ్మతించదు. అతడు రాముడిని రాజుగా చిత్రించినా అతనికి అంతగా రాచరికపు లక్షణాలు ఆపాదించలేదు. వాల్మీకి సృష్టించిన రాముడు మనకు మామూలు మనిషిగానే కన్పిస్తాడు.


    వాల్మీకి తన రామాయణంలో దేవుని గురించి అంతగా చెప్పలేదు. అక్కడక్కడ దైవం అనిపిస్తాడు తప్ప. స్పష్టంగా నారాయణుని గురించిగాని, శివునిగురించి గాని చెప్పడు. రామాయణం మొత్తంలోను మనకు శివకేశవులు కన్పించరు. మరో ముఖ్యమైన విషయమేమంటే అతి పవిత్రంగా భావించే సుందరకాండలో ఎక్కడా దేవుడు కన్పించడు. వాల్మీకికి  దేవున్ని గురించిన ఆలోచన వున్నట్లు కన్పించలేదు. మరొక కారణం కూడ కావచ్చు. ఆనాటికి శివకేశవులు ఇంత బలపడి వుండరు.


    వాల్మీకి స్వర్గం, ఇంద్రుడు ఇటువంటి పారలౌకిక పదార్ధాలను రామాయణంలో చేర్చలేదు. రామాయణంలో ఒకేచోట ఇంద్రుడు కనిపిస్తాడు అది ప్రక్షిప్తం కావచ్చు. ఎందువలెనంటే దానివలన అంత ప్రయోజనంలేదు. అదేవిధంగా మరోచోట బ్రహ్మ కన్పిస్తాడు. శివుడు, నారాయణుడు ఎక్కడ కన్పించరు. అంతేగాదు? అతడు అద్భుతాలను కూడ ఎక్కడా సృష్టించలేదు. మాయం కావడం, ప్రత్యక్షం కావడంలాంటివి మనకెక్కడా కన్పించవు. మానవనైజాన్ని, మానవ జీవితాన్ని వాస్తవంగా చిత్రీకరించడానికి సాధ్యమయినంత కృషి చేశాడు. శాపాలు పెట్టడం, శాపాలు విమోచనం చేయడం లాంటివి కూడా వినియోగించలేదు. ఒకటి, రెండుచోట్ల తప్ప, పూర్వజన్మ, అపరజన్మల గురించి కూడ వ్రాయలేదు. వాస్తవంగా కథ నడిపించాడు. కాబట్టి రామాయణం లౌకిక కావ్యమేకాని పారలౌకిక కావ్యంకాదు. వాల్మీకి తర్వాత రామాయణానికి పవిత్రతను పారలౌకికతను ఆపాదించి రామాయణాన్ని పూజించడం ప్రారంభించారంటే అది వాల్మీకి దోషంకాదు - పూజించడమంటే అసలు సందేశాన్ని అడుగట్టించడం. ఆ పని మన దేశంలో అందరి విషయాల్లోను జరుగుతున్నది. అందుకు ఉదాహరణం గాంధీజీ బోధనలు? అతడు మన మధ్యన ఉండినవాడు - ఈ మధ్యనే పోయినవాడు. అతని బోధనలు మనమే విధంగా వక్రీకరిస్తున్నామో మనందరికి తెలుసు.

 Previous Page Next Page