Previous Page
Next Page
ఖడ్గసృష్టి పేజి 14
ఏవి తల్లీ!
(The snows of yestet year - F.Villon అనుసరణము)
చక్రవర్తి అశోకుడెచ్చట?
జగద్గురు శంకరుండెచ్చట?
ఏవి తల్లీ! నిరుడుకురిసిన
హిమ సమూహములు?
కాళిదాస మహా కవీంద్రుని
కవన వాహినిలో కరంగిన
ఉజ్జయిని నేడెక్కడమ్మా
ఉంది? చూపించు?
షాజహాన్ అంతఃపురములో
షట్పదీ శింజాన మెక్కడ!
ఘాన్సి లక్ష్మీదేవి యెక్కిన
సైంధవం నేడేది తల్లీ?
రుద్రమాంబా భద్రకాళీ
లోచనోజ్జ్వల రోచులేవీ
ఖడ్గతిక్కన కదనకాహళ
కహకహ ధ్వను లెక్కడమ్మా?
ఎక్కడమ్మా కృష్ణరాయని
బాహు జాగ్ర ద్బాడబాగ్నులు?
బాలచంద్రుని బ్రహ్మనాయని
ప్రాణవాయువు లేవి తల్లీ?
జగద్గురువులు, చక్రవర్తులు,
సత్కవీశులు, సైన్యనాధులు,
మానవతులగు మహారాజ్ఞులు
కానరారేమీ?
పసిడిరెక్కలు విసిరి కాలం
పారిపోయిన జాడలేవీ?
ఏవి తల్లీ? నిరుడు కురిసిన
హిమ సమూహములు?
- ఆంధ్ర శిల్పి మాసపత్రిక - డిశంబరు 1946 - జనవరి, 1947
Previous Page
Next Page