సామాన్యుని కామన
సామాన్యుని వాస్తవికత
ఈ రోజున సామాన్యుడు
ఏమీ లేనట్టివాడు
కూడూ గూడూ గుడ్డా
ఏమి లేనట్టివాడు
చదువూ సామూ శాస్త్రం
ఏఁవీ యెరుగని వాడు
ఈ రోజున సామాన్యుడు
సగం దేవతాంశ, సగం
రాక్షసాంశ, సగటున ఈ
సామాన్యుడు మానవుడు
అంటే నీవూ నేనూ
ఆమె ఈమె వీడు వాడు
అంతా సామాన్యులమే
సగం వెలుగు సగం నీడ
సగం ఋతం సగం మనృతం
సగం ఆడ సగం ఈడ
సగం పశువు సగం నిసువు
ఈ వెల్తురు ఈ చీకటి
ఈ యిరులూ ఈ వెలుగూ
వేరు వేరు గదులు కావు
ఒకటి రెండూ కూడా
ఇపుడు నిప్పుడు ఇపుడె పువ్వు
ఇప్పుడు దూసిన ఖడ్గం
ఇంతట్లో కౌగిలింత
ఒక నేత్రం కల్హారం
మరో కన్ను కర్పూరం
మూడో కంటి వాడంటూ
లేడంటే నమ్ముతావ్
చూడవోయ్ నీలోకి నీవు
ఒకటి రెండు వెరసి మూడు
నరకం స్వర్గం అన్నవి
ఒక స్థితికే రెండు పేర్లు
ఫోకస్ భేదం అంతే
లోకస్ రెండిటి కొకటే
శ్రీ అనగా లక్ష్మి, సరే
శ్రీ అంటే విషం కూడా
శ్రీశ్రీ సిరి చేదు లేక
సిరీ సిరీ, చేదు చేదు
మీ యిష్టం శ్రీకారం
గుణకారం చేసుకోండి
మీకే అర్థం తోస్తే
ఆ key నే వాడుకోండి
ఒకటే శ్రీ అదే రెండు
అదే చేదు సిరీ అదే
అమరత్వం అసురత్వం
శ్రీశ్రీ ఒక మానవుడు
2. నేపథ్యంలో:
నీ మూసినా పిడికిటిలో
ఏమున్నది కవీ కవీ
ఆ దాచిన పళ్ళెంలో
ఏం తెచ్చావ్ సుకవీ
ఆ మూలని సంచీలో
ఏమున్నది కవీ కవీ
నీ మూసిన గుండెల్లో
ఏం దాచావ్ సుకవీ
నీ పాడని పాటలలో
రాపాడే దేదికవీ
ఆ కొసలో నీడలలో
ఏ సత్యం సుకవీ
ఏ సత్యం ఏ స్వప్నం
ఏ స్వర్గం సుకవీ
మాకోసం నీకోసిన
వే కాన్కల పూలు కవీ
3. సామాన్యుని కామన:
సైన్సు వల్ల ఈ రోజున
సామాన్యుని బ్రతుకుకూడ
సౌందర్యమయం కాగల
సదుపాయం లభించింది.
జన్మం చర్మం వెనుకటి
సంప్రదాయమూ ఇప్పటి
సంఘస్థితులూ నెరపే
అసమానత పనికిరాదు
ఐశ్వర్యం అందరిదీ
అందుచేత అందులోన
సామాన్యుడు తన వాటా
తనకిమ్మని కోరుతాడు
బతకడమే సమస్యగా
పరిణమింప జేసినట్టి
అన్యాయాలన్నిటినీ
హతమార్చాలంటాడు.
ఇదేం పెద్ద గగనమా? మ
రిదేం గొప్ప కోరికా? ఇ
కేం? ఇదొక్క విప్లవమా?
ప్రశ్నిస్తే పాపమా?
యుగసంధిది, సామాన్యుని
శకం దీన్ని కాదనరా
దిది రేపొచ్చే వ్యవస్థ
కివాళనించీ, పునాది
ఇప్పటినుంచీ నాంది.
అంతే, ఇంతే స్వప్నం.
అన్నీ ఒక్కడికి బదులు
అంత మందికీ అన్నీ!
అదే స్వర్గమంటాను.
ఆ స్వర్గం వేరే కడు
దూరంలో లేదు లేదు
ఈడే నేడే వున్నది.
నీలో నాలో వున్నది.
మీ యిష్టం ఈ ధాత్రిని
చేయవచ్చు స్వర్గంగా
చీల్చవచ్చు నరకంగా
ఏం చేస్తారో సరి మరి యిక మీ యిష్టం.
* * *