Previous Page Next Page 
ఖడ్గసృష్టి పేజి 13


                          మంచి ముత్యాల సరాలు


        ఎర్రశాలువ కప్పుకొని మా
        ఇంటి కొచ్చిందొక రివాల్వర్
        బాధలో బెంజైన్ సీసా
        ప్రేమలో డైమాన్ రాణి.

 

    మెడకి కాంచనమాల చక్కని
    జడకు చుట్టిన పుష్పవల్లి
    చావుబతుకుల జమిలి దుప్పటి
    కప్పు కొచ్చింది.

 

        ప్రేమగానం మోసుకుంటూ
        మహాశంఖం మాటలాడదు
        ఐంద్రకార్ముక మంత్ర బర్హం
        మబ్బు చాటున మాయమైనది!

 

    పాతపీపా పీతపాపా
    పాడుకుంటూ తిరుగుతాయట
    కొత్త గొంతుక చెవిని పడితే
    గుడ్లు నిప్పులు చెరుగుతాయట.    

 

        నేను వెళ్ళిన నాటినుంచీ
        నీడలోపలి మేడ దిగదట
        కోడిగుడ్డు ప్రమాణకంగా
        కృష్ణశాస్త్రిని చదవలేదట.

 

    నన్ను తిట్టిన తిట్లతోనే
    మల్లెపూవుల మాలకట్టెను
    నాకు వ్రాసిన ప్రేమలేఖలు
    పోస్టుచేయుట మానివేసెను.

 

        వెయ్యిరాచ్చిప్పలని మేసిన
        వెర్రికుక్కకి గాలివాన
        రోలు చెప్పిన కథకి పాపం
        డోలు కంచికి పైనమైనది.

 

    ఓరి కూపస్థ భల్లూకం
    గోడపై రుద్రాక్షపిల్లీ
    ఆటలోపల అరిటిపండు
    పాట లెందుకురా.

 

        ఎగురుతున్నాయ్ ఇనపకోటలు
        పగులుతున్నాయ్ పాతపాటలు
        రగులుతున్నాయ్ రాచబాటలు
        రాజుకోవేరా.

 

    ప్రేమకీ సంఘానికీ ఒక
    జారుముడితో చాలు పోరా
    నిన్ను తిట్టేవాళ్లకోసం
    కళ్ళు విప్పుకు నిద్రపోరా.

 

        ఇదే నా కడసారి సలహా
        ఇలా తే నీ మనీపర్సని
        ఆంధ్రపత్రిక కప్పుకొని కా
        రడవి కేగిం దా రివాల్వర్.

 

    నేడు నా కంట్లో సివంగులె
    నిద్రలో నిలిచే ఫిరంగులు
    కాళ్ళ చుట్టూ కపాలాలే
    కావ్యగీతి కలాపాలు.

 

   _ భారతి, మాసపత్రిక - మార్చి, 1943 - 'చక్కని ముత్యాల సరాలు' పేరుతో

 Previous Page Next Page