Previous Page Next Page 
చెక్ పేజి 13


    గీర్వాణీ అటూ ఇటూ తిరిగి మూడు ఇటుక రాళ్ళు తీసుకొచ్చింది. ఇంతలో బావ రెండు పిడికిళ్ళు ఎండు పుల్లలు ఏరుకొచ్చాడు. గంపలోని పెద్ద చెంబు ఇటుకరాళ్ళమీద పెట్టి, కింద మంట వేశారు. చెంబుతో అన్నం వండి, చివరన బెల్లం వేసి కలియబెట్టారు. ఆ పొంగలి తీసుకుని గంగమ్మ దగ్గర పెట్టి టెంకాయ కొట్టారు.

 

    ఆ కార్యక్రమం అయిపోయాక అందరం ఇంటికి బయల్దేరాం.

 

    ఆ ప్రాంతమంతా పొగ అలుముకుని కళ్ళకు మంటపుట్టిస్తూ వుంది.

 

    మేము ఇంటికొచ్చిన గంటకు బావ పెద్ద కోడి పుంజును గంప నుంచి బయటకు తీశాడు. ఇంటి దగ్గర గంగమ్మకు పెట్టి దాన్ని నరికారు. కోడి మాంసం క్షణాల్లో పొయ్యిమీద ఎక్కింది.

 

    బావా, నేనూ పక్కింటి కెళ్ళాం. ఆ ఇంట్లో మా బావ చెల్లెల్ని ఇచ్చారు. ఇంట్లోని వాళ్లంతా ఎంతో అభిమానంతో నన్ను పలకరించారు. మేమంతా ఓ చిన్న గుడిసెలో కూర్చున్నాం. కాసేపటికి ఒక యువకుడు అక్కడికి కల్లుకుండ తెచ్చాడు. అప్పుడే చెట్టునుంచి దించారేమో పైనంతా నురగలు తేలుతున్నాయి.

 

    మాబావ కాక మరో నలుగురు చేరారు. వాళ్ళతో అంతా ఏదో పిసరంత బంధుత్వమే వుంది. నన్ను రకరకాల వరసలతో పిలుస్తున్నారు.

 

    బావ బలవంతంమీద నేనూ రెండు ముంతల కల్లు తాగాను. నాకేమో కల్లు కుడితి వాసనేసి ఇష్టంగా తాగలేకపోయాను. అయినా మొహమాటంకొద్దీ రెండు ముంతలు కడుపులోకి పోశాను.

 

    నా ఒళ్ళంతా గాలిలో తేలిపోతున్నట్టుంది.

 

    "రాత్రికి బసిలి కాబోయే పిల్లెవరో" ఒక వ్యక్తి కుతూహలంతో అడిగాడు.

 

    "రేపటి నుంచి ఛాన్స్ మీకొస్తుందనా అంత ఆనందంగా అడుగుతున్నారు" అన్నాను నేను.

 

    "అంతే కదా బామర్దీ. రేపటి నుంచి ఆ పిల్ల వూరికంతా పెళ్ళామే కదా" అతను నావైపు చూసి నవ్వుతున్నాడు.

 

    అతనికి నిషా ఎక్కువైందని ఎర్రటి కళ్ళే చెబుతున్నాయి.

 

    ఒంటిగంట ప్రాంతాన ఇంటికెళ్ళాం.

 

    మేం వెళ్ళేసరికి రెడీగా కోడికూర మా కోసం చూస్తోంది.

 

    అందరం భోంచేశాం.

 

    సాయంకాలం వరకు రకరకాల వేషాలు వస్తూనే వున్నాయి.

 

    స్నానం చేసి ఫ్రెష్ గా తయారై గుడికి బయల్దేరాం.

 

    సాయం సంధ్య చివరిసారిగా వూపిరి పీల్చుకుంటోంది. పడమట దిక్కంతా ఎర్రగా, దురదలేసి నలిపేస్తే ఎర్రగా కమిలిన కనుగుడ్డులా వుంది.

 

    గుడి ప్రాంతమంతా గందరగోలంగా వుంది.

 

    డప్పుల శబ్దం రకరకాలుగా విన్పిస్తూ ఏదో దారుణాన్ని సూచిస్తున్నట్టుంది. కిరోసిన్ లో ముంచిన కాగడాలు వెలుగు కంటే పొగనే పైకి చిమ్ముతున్నాయి. ఆకాశం మరీ బోసిగా బ్లాక్ బోర్డులా వుంది. గాలి కల్లు తాగినట్టు ఆ ప్రాంతమంతా కల్లు వాసనేస్తోంది.

 

    కుంకుమ బొట్టు పెట్టిన మేకలు, గొర్రెలు, పొట్టేళ్లు బెదురు కళ్ళతో పరుగెత్తడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. కోళ్లు రక్షించమని దేవుళ్ళను ప్రార్థిస్తున్నట్లు అదే పనిగా అరుస్తున్నాయి. పిల్లల ఏడుపులు, వెల పదాలు, అరుచుకోవడాలతో ఆ ప్రాంతమంతా మూడు బస్టాండ్లలో, రెండు రైల్వే స్టేషన్లను కలిపేసినట్టుంది.

 

    నాకు తలంతా భారంగా వుంది. కల్లు మెదడులో టెంకాయ నీళ్ళలా చేరిపోయినట్టు భావన. అందులోనూ ఏదో తెలియని భయం నన్ను వూపేస్తోంది.

 

    అంతలో ఒక్కసారి డప్పుల శబ్దం ఎక్కువైంది. ఏవో అర్థంలేని అరుపులు వినపడ్డాయి.

 

    జనం మధ్యకు చీలి దారిచ్చారు.

 

    పూజారి వేప మండలతో పసుపు నీళ్ళు చల్లుతుంటే భుజంగం హుందాగా వస్తున్నాడు. తెల్లటి బట్టల్లో ఆయన కదలివస్తున్న వెండి కొండలా వున్నాడు. కాగడాల వెలుగు ఆయన ముఖాన్ని మరింత ఎరుపు చేసింది.

 

    భుజంగం పందిరి కిందకు వచ్చేసరికి డప్పుల శబ్దం మంత్రించినట్టు ఆగిపోయింది.

 

    యానాదులంతా ఆయన చుట్టూ గుమిగూడారు.

 

    ఆచారం మేరకు ఆయన గంగమ్మకు కొత్త పట్టుచీర ఇచ్చారు. పూజారి దానిని గంగమ్మకు అలంకరించాడు.

 

    అంతలో గుంపులోంచి యానాది పెద్ద భుజంగం ముందుకొచ్చాడు.

 

    ఆ యానాది పెద్దను చూసి నేను జడుసుకున్నాను. ఆయనకు భుజంగం వయసే వున్నా కొంచెం పెద్దగా కనిపిస్తున్నాడు.

 

    పొదుగు భుజాల తెల్లటి చొక్కా ముతకగా వుండే కొత్త నూలు పంచె కట్టుకుని వున్నాడు. ఆయన చేతిలో పొడవాటి కత్తి వుంది.

 

    ఆయన యానాదుల కులానికి పెద్ద. యానాదులకు ఆయన మాట వేదవాక్కు. ఆయన ఎంత చెబితే అంత.

 

    పెద్ద కత్తిని ముఖానికి ఆనించుకుని, భుజంగం ముందుకొచ్చాడు.

 

    "దొరా! బలి కానివ్వండి" అని కత్తిని అందించాడు.

 

    ఆ మాటలంటున్నప్పుడు అతని చప్పిడి ముక్కు మరింత పైకిపోయింది అతని చిన్న కళ్లు ఎర్ర రంగులోకి దిగి నేరేడు పండులో, దొండ పండును కూరేసినట్టు మెరిసాయి. నల్లటి బండ పెదాలు అదిరాయి. అతని పొట్ట చొక్కా లోపల పల్టీ కొట్టింది.

 

    భుజంగం కూడా గంగమ్మ పూనినట్టు ఆవేశంతో ఎగిరిపడ్డాడు.

 

    మౌనంగా కత్తి అందుకున్నాడు.

 

    మరో యానాది యువకుడు అలంకరించిన పొట్టేలును అక్కడికి తీసుకొచ్చాడు.

 

    భుజంగం కళ్ళు మూసుకుని గంగమ్మను ప్రార్థించి కత్తి పైకెత్తాడు. మరు క్షణంలో పొట్టేలు తల తెగి, కింద పడి కొట్టుకుంటోంది. మొండెం వెనక్కి గుంజుకుంటూ వుంది.

 

    రక్తపు చుక్కలు భుజంగం మీద, యానది పెద్దమీద పడ్డాయి. ఆ క్షణంలో వాళ్ళిద్దరూ క్రూరంగా వున్నారు.

 

    "బలులు కానివ్వండి" అని అరిచాడు యానాది పెద్ద.

 

    ఆ ప్రాంతమంతా ప్రాణ భిక్ష పెట్టమని అరుస్తున్న జీవాల రొదతో మార్మోగింది.

 

    భుజంగం పందిట్లో గంగమ్మ బొమ్మ ముందు కొబ్బరి మట్టలతో అల్లిన కుర్చీ మీద కూర్చున్నాడు. ఆయన వాళ్ళ దగ్గర యానాది పెద్ద కూర్చున్నాడు.

 

    ఓ ముసలాయన గంగమ్మ కేసి చూస్తూ రాగ యుక్తంగా బూతులు తిడుతున్నాడు. గంగమ్మకు బూతంటే చాలా ఇష్టమట.

 

    బలులై పోయాయి.

 

    రక్తం మరకలతో, జీవాల మొండేలతో రణరంగంలా వుంది ఆ ప్రదేశమంతా.

 

    "కన్యార్పణం కానివ్వండి" యానాది పెద్ద భుజంగంతో అన్నాడు.

 

    ఆయన వెనకనున్న పాలేరు వైపు చూశాడు. ఆ చూపులను అర్థం చేసుకున్న పాలేరు ఓ స్టీల్ పళ్ళాన్ని ఎంతో వినయంగా ముందుకు తెచ్చాడు. అందులో రవుండ్ గా చుట్టి వున్న తెల్లటి చీటీలున్నాయి.

 

    "పెద్దా! ఇందులో అమ్మాయి పేర్లన్నీ రాశారు. పూజారి కొడుకు ఇవన్నీ తయారుచేశాడు. గంగమ్మ తల్లికి పూజ చేసిన తరువాత చీటీ తీద్దాం" భుజంగం అందరికీ వినపడేట్టు గట్టిగా అన్నాడు.

 Previous Page Next Page